పోలీసుల చిత్రహింసలతో ఆత్మహత్య చేసుకున్న నాగరాజు ఘటనపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి చే న్యాయవిచారణ జరిపించాలి. పౌర హక్కుల సంఘం తెలంగాణ
పోతారం గ్రామం,సారంగపూర్ మండలం, జగిత్యాల జిల్లాకు చెందిన కటికెన పెల్లి నాగరాజు అనేట్రాక్టర్ డ్రైవర్ మరియు వ్యవసాయ కూలిగా పనిచేస్తున్న 22 సంవత్సరాల యువకుణ్ణి, గంజాయి అక్రమ రవాణా చేస్తున్నాడని ఆరోపణపై పోలీసులుచిత్రహింసలకు గురి చేస్తే, ఆత్మహత్య చేసుకున్న ఘటనపై పౌరహక్కుల సంఘం తెలంగాణ,ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పోతారం గ్రామంలో నాగరాజు కుటుంబ సభ్యులను, గ్రామస్తులు మరియు సారంగపూర్ పోలీస్ స్టేషన్ SHO ను ,22 ఫిబ్రవరి,2022నాడు కలిసి సేకరించిన నిజానిర్దారణ వివరాలు.....
పోతారం గ్రామంలో 22 సంవత్సరాల కటికెనపెల్లి నాగరాజు ట్రాక్టర్ డ్రైవర్ గా,ఎలెక్ట్రిషన్ హెల్పేర్ మరియు వ్యవసాయ కూలిగా పనిచేస్తూ,తన అమ్మ-వెంకమ్మ,నాన్న-నర్సయ్య, చెల్లె-శ్రీలత, నాయనమ్మ-సుబ్బమ్మ, తాతయ్య-రాజలింగు లతో కలిసి జీవించుతున్నాడు.వీరిది కడు పేద కుమ్మరి కులానికి చెందిన కుటుంబం,ఎలాంటి వ్యవసాయ భూమిలేదు . తండ్రి నర్సయ్య కొద్ది గా మేషన్ పనులు చేస్తాడు,నాగరాజే ప్రధాన ఆధారం.
ఆదివారం,6 ఫిబ్రవరి,2022 ఉదయం7 గంటల సమయంలో, ఇద్దరు పోలీసులు(27,30సంవత్సరాల వయసు) యూనిఫార్మ్ లేకుండా,సివిల్ దుస్తుల్లో,నాగరాజు ఇంటికి వచ్చి, నిద్రపోతున్న నాగరాజును,కుటుంబ సభ్యుల ద్వారా లేపి,పాస్పోర్ట్ కోసం అప్లై చేసిన విషయమై ఫార్మ్ పై సంతకం చేయాల్సి ఉందని ఇంటినుండి బయటికి కొద్దిదూరం అతన్ని తీసుకెళ్లి, తమ వెంట ఇదివరకే తీసుకొచ్చిన బుగ్గారం యువకుని ద్వారా,నాగరాజు ను కన్ఫర్మ్ చేసికొని, నాగరాజును బుగ్గారం పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి పోలీసులు దాదాపు రెండు గంటలు బెదిరింపులతో చిత్రహింసలు చేసి గంజాయి అక్రమ రవాణా చేస్తున్నావంటూ ఒప్పుకోవాలని నాగరాజు ద్వారా అతని మిత్రుడైన చందును పోతారం గ్రామానికి రప్పిచ్చు కొని,చందును తీసుకొని, నాగరాజు ను మళ్ళీ పిలుస్తామని చెప్పి పోలీసులు వదలి వెళ్లినారు.
మధ్యాహ్నం 2 గంటల సమయంలో నాగరాజును పోతారం గ్రామానికి కొద్దిదూరం లో ఉన్న భీర్పూర్ గుట్టల్లోకి పోలీసులు తీసుకుపోయి కిందపడేసి బూటు కాళ్లతో తన్ని,లోపలి అవయాలు దెబ్బతినేవిదంగా బాగా చిత్రహింసలు చేసి నారు.లంచంగా డబ్బులు ఇస్తే వదలి పెడుతాం లేకుంటే గంజాయి రవాణాపెద్ద కేసుపెడ్తామని లేదా మళ్ళీ పిలిచి నీ అంతు తెలుస్తామని తీవ్రంగా హెచ్చరించి వదలినారు పోలీసులు. నాగరాజు ఇంటికి సాయంత్రం రెండవ సారి పోలీసులు పోయి, అతని బైక్ ప్లగ్ తీసుకొని కుటుంబ సభ్యులను తీవ్రంగా బెదిరించి మేం పోలీస్ లమని ఐడి కార్డులు చూయించి,మమ్మల్ని ఎవరని అడుగుతారా?మీవాడు చాలా పెద్ద కేసులో ఉన్నాడు జాగ్రత్త అంటూ హెచ్చరించారు.
పోలీసుల చిత్రహింసలకు, కేసులో ఇరికిస్తారని హెచ్చరించిన నేపపద్యం,తమ కుటుంబం అంత లంచం ఇవ్వలేదని, తీవ్ర మనస్తాపం చెంది న నాగరాజు, ఆ చిత్రహింసల అనంతరం రాజులచేరువు వద్ద గడ్డి మందు తాగిండు.
సాయంత్రం రెండవసారి పోలీసులు ఇంటికి వచ్చి హెచ్చరికల అనంతరం ఉదయం నుండి నాగరాజు ను పోలీసులు తీసుకపోయినారని ఆర్డ్సమైన తర్వాత,గ్రామసర్పంచ్, ఇతర అధికార ప్రతినిధులు మధ్యవర్తుల ద్వారానాగరాజు ఆచూకీ కోసం చాలాసేపు వెతికిన కూడా జాడ దొరకలేదు.సెల్ స్విచ్చ్ ఆఫ్ అయిఉంది.. నాగరాజు ఒకమిత్రుడు,అపస్మారక స్థితిలో రాజుల చేరువువద్ద ఉన్న పడిపోయిన నాగరాజును బైకుపై ఇంటికి తీసుకు వచ్చాడు. పోలీసుల హెచ్చరిక నేపధ్యంలో నాగరాజు, పోలీసుల చిత్రహింసలు,గంజాయి రవాణా పేరిట అక్రమ కేసు బనాయింపు, డబ్బుల లంచం మరియు గడ్డిమందు తాగిన విషయం కుటుంబ సభ్యులకు చెప్పుకోలేదు.
వాంతులు,విరేచనాలతో రెండు రోజులు తీవ్రమైన అనారోగ్యానికి లోనైనాడు.9 ఫిబ్రవరి,2022 బుధవారం జగిత్యాల Hanshi అనే ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లి జాయిన్ చేసినారు కుటుంబసభ్యులు. ఆ ఆసుపత్రి మేనేజ్మెంట్ టెస్టులు చేసి రెండు లక్షల రూపాయల డిపాజిట్ చేయమన్నారు, మావద్ద అంత డబ్బులేదంటే కనీసం యాభై వేల రూపాయల అయినా కట్టమంటే, డబ్బులు లేవని స్థానిక జగిత్యాల TRS పార్టీ కి చెందిన MLA ,డాక్టర్ సంజయ్ వద్దకు పోయి మీ ఆసుపత్రిలో మావాన్ని అడ్మిట్ చేసుకొని బ్రతికించండని వేడుకొన్నారు. ఆ ఆసుపత్రికి ఎందుకెళ్లారని చేసిన రిపోర్ట్స్ పట్టుకొని తన వద్దకు రమ్మన్నాడు MLA ,డాక్టర్ సంజయ్ కుమార్.Hanshi హాస్పిటల్ వాళ్ళు రిపోర్టులు ఇవ్వలేదు సరికదా, సీరియస్ కండీషన్ ఉంది డబ్బులు కట్టమన్నారు. తప్పని పరిస్థితుల్లో డబ్బులు కట్టలేనందున, అక్కడ డిశ్చార్జ్ చేసుకొని అదే రోజు సాయంత్రం కరీంనగర్ లోని వన్ అనే ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ చేసినారు.అక్కడ రెండు రోజుల ట్రీట్మెంట్ అనంతరం నాగరాజు పరిస్థితి విషమించినందున11 ఫిబ్రవరి,2022 శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ NIIMS హాస్పిటల్ తీసుకపోయినారు అక్కడ NIIMS హాస్పిటల్ వాళ్ళు అడ్మిట్ చేసుకోలేదు.
తిరిగి అదే రోజు రాత్రి 11 గంటలకు సికింద్రాబాద్ లోని గాంధీ హాస్పటల్ వద్ద తెల్లవారిఉదయం 4 గంటల వరకు(12-2-2022) వేచిఉంటే గాంధీ ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకున్నారు. నాలుగురోజులు చావు బ్రతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతున్న సందర్భంలో చివరికి నాగరాజు కుటుంబసభ్యులకు పోలీసుల చిత్ర హింసలు, లంచం డబ్బులు ఇవ్వకపోతే గంజాయి అక్రమ రవాణా కేసులో ఇరికిస్తారని హెచ్చరించిన విషయాలు, మందు తాగిన విషయం చెప్పినాడు.నాగరాజు,16 ఫిబ్రవరి,2022 బుధవారం సాయంత్రం 4:30గంటలకు చనిపోయినాడు . సారంగపూర్ పోలీసులకు నాగరాజు మరణం పై గాంధీ ఆసుపత్రి వాళ్ళు సమాచారమిస్తే వెంటనే స్పందించకుండా ఆలస్యంచేసి దాదాపు ఒక రోజు టైం తీసుకొని మరుసటి రోజు 17 ఫిబ్రవరి 2022 సాయంత్రం వరకు సికింద్రాబాద్ చేరుకొని, పోస్ట్ మార్టం పూర్తి చేయించినారు. కుటుంబ సభ్యులు,అదే రాత్రి బాడీ ని పోతారం తరలించి,,18.ఫిబ్రవరి 2022 శుక్రవారం ఉదయం10 గంటలకు అంత్యక్రియలు పూర్తి చేసినారు.
బుగ్గారం పరిధిలోని పోలీసులు, తమ పరిధి కాని నాన్ జ్యురిడిక్షన్ ఏరియా అయిన సారంగపూర్ పోలీస్ స్టేషన్లో ని పోతారం గ్రామం నాగరాజు ను అక్రమంగా అదుపులోనికి తీసుకొని ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా దౌర్జన్యం గా ,బుగ్గారం పోలీస్ స్టేషన్లో మరియు బీర్పూర్ గుట్టలో నాగరాజు పై చేసిన చిత్ర హింసలపై, సారంగపూర్ పోలీసులను అడిగితే సమాచారం లేదు అన్నారు. గాంధీ ఆసుపత్రి వాళ్ళు నాగరాజు మరణం పై 16 ఫిబ్రవరి,2022 నాడు రాత్రి ఇచ్చిన సమాచారము మాత్రమే తమకు తెలుసన్నారు, అంతకు మించి ఏ సమాచారం లేదన్నారు సారంగపూర్ పోలీస్ స్టేషన్ SHO.నాగరాజు కుటుంబ సభ్యులు వైద్యానికి, ప్రైవేట్ హాస్పత్రిల్లో దాదాపు మూడున్నర లక్షలు అప్పు చేసినారు. బియ్యాల పృద్విదర్ రావు అనెవ్యక్తి ఆ గ్రామ పెద్ద మనిషి,యాబై వేల రూపాయలునాగరాజు వైద్యానికి లోనుగా ఇచ్చినాడని యశ్వంత్ పూర్ అనేగ్రామం లొ 14 ఫిబ్రవరి 2022 సోమవారం న మంత్రి కొప్పుల ఈశ్వర్ పర్యటన సందర్భంగా బందోబస్తు లో ఉన్న బుగ్గారం పోలీస్ స్టేషన్ SI సందీప్ కు నాగరాజు అనారోగ్యం కోసం మెరుగైన వైద్యం కోసం సహాయ పడాలని చేపితే,ఈరోజే,14 ఫిబ్రవరి,2022 సోమవారం తను ఛార్జ్ తీసుకున్నాను అని చెప్పి ఏమి స్పందించలేదని పోలీసుల బాధ్యతా రాహిత్యాన్ని బియ్యాల పృద్విదర్ రావు వెల్లడించారు. పోతారం గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ మరియు అధికార పార్టీ TRS జగిత్యాల MLA సంజయ్ కుమార్ లకు కుటుంబ సభ్యులు విన్నవించుకున్నప్పటికి,నాగరాజుకు మెరుగైన వైద్యం అందక న్యాయం జరగలేదని నాగరాజు చనిపోయాడని కుటుంబ సభ్యులు,పోతారం గ్రామస్తులు తీవ్ర నిరసనను వెలిబుచ్చారు పౌర హక్కుల సంఘం నిజానిర్దారణ బృందంతో.
బుగ్గారం పోలీసులు,చట్ట విరుద్ధంగా,అప్రజాస్వామికంగా వ్యవహరించడమే నాగరాజు ఆత్మహత్యకు ప్రధాన కారణం. ఇది పోలీసుల హత్య గా పౌర హక్కుల సంఘం భావిస్తోంది.
పోలీసులు అక్రమంగా,బలవంతంగా ఇంటి నుంచి ఎత్తుకెళ్లడం, డబ్బులు వసూలు చేయడం కోసం బెదిరించడం, చట్ట విరుద్ధంగా విచారణ చేయడాన్ని పౌర హక్కుల సంఘం తెలంగాణ తీవ్రంగా ఖండిస్తోంది.
ఈ మొత్తం ఘటన పై హై కోర్టు సిట్టింగ్ జడ్జి చే న్యాయ విచారణ జరిపించాలని,పౌర హక్కుల సంఘం డిమాండ్ చేస్తున్నది.
చిత్రహింసలకు గురైన నాగరాజు ఆత్మహత్యకు కారకులైన పోలీసులపై హత్యానేరం నమోదు చేసి, చట్టపరంగా శిక్షించాలి.
నాగరాజు కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం, యాబై లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి. వైద్యానికి చేసిన మూడున్నర లక్షల రూపాయల అప్పును తిరిగి ఇవ్వాలి.
జగిత్యాల జిల్లా ప్రైవేట్ ఆసుపత్రిలల్లో జరుగుచున్న వైద్యం దోపిడీని అరికట్టాలి. మెరుగైన ప్రభుత్వ వైద్యం ప్రజలకు అందుబాటులోకి తేవాలి.
జగిత్యాల జిల్లా సారంగపూర్, బుగ్గారం, ధర్మపురి మండలాల్లో పోలీసులు గంజాయి పేరున చేస్తున్న దాడులు బెదిరింపులు వీరికి అండగా ఉంటున్న అధికార పార్టీ మాఫియా పై జిల్లా మంత్రి కొప్పుల ఈశ్వర్ ముఖ్యమంత్రి కేసీఆర్ తక్షణమే స్పందించాలి.
గ్రామాల్లో గంజాయి రవాణా పేరున చేస్తున్న వ్యాపారాని అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలని పౌర హక్కుల సంఘం తెలంగాణ డిమాండ్ చేస్తుంది.
నిజానిర్దారణ లో పాల్గొన్న వారు..
1.మాదన కుమారస్వామి, సహాయకార్యదర్శి, పౌర హక్కుల సంఘం,తెలంగాణ.
.2..GAV ప్రసాద్,అధ్యక్షుడు, పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ.
3.శ్రీపతి రాజగోపాల్, ఉపాధ్యక్షుడు, పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ.
4.నార వినోద్, కోశాధికారి,పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ.
5.యాదవనేని పర్వతాలు,EC మెంబర్,పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ.
6.పోగుల రాజేశం,EC మెంబర్,పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ.
7.కడ రాజన్న,EC మెంబర్,పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ.
8.బొడ్డుపెళ్లి రవి,EC మెంబర్,పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ.
9.మోటపలుకుల వెంకట్,EC మెంబర్,పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ.
4:35 సాయంత్రం,22 ఫిబ్రవరి,2022.
సారంగపూర్, గ్రామం &మండలం.
జగిత్యాల జిల్లా, తెలంగాణ రాష్ట్రం..
Comments
Post a Comment