ఎడిట్ పేజి, ఆంధ్రజ్యోతి దినపత్రిక,9 డిసెంబర్,2021........
రాజ్యాంగం హామీ ఇచ్చిన ప్రజల సహజమైన హక్కులను కొల్లగొడుతూ, రాజ్యానికి మితిమీరిన అధికారాలిస్తూ తయారైన చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధ చట్టం (అన్ లాఫుల్ ఆక్టివిటీస్ ప్రివెన్షన్ ఆక్ట్ – యుఎపిఎ) 1967లోని కీలకాంశాలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు ముందర ఒక వ్యాజ్యం దాఖలైంది. అది దాఖలు చేసినవాళ్లు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలలో మూడు దశాబ్దాలకు పైగా పని చేసి పదవీ విరమణ పొందిన పదకొండు మంది మాజీ అధికారులు. ఈ పిటిషన్ వేసిన వారిలో ఐఎఎస్ అధికారులు అమితాభ పాండే, హర్ష్ మందర్, వజాహత్ హబీబుల్లా, కమల్ కాంత్ జస్వాల్, హిందల్ హైదర్ త్యాబ్జి, ఎంజి దేవసహాయం, ప్రదీప్ కుమార్ దేబ్, బలదేవ్ భూషణ్ మహాజన్, అశోక్ కుమార్ శర్మ, పోలీసు అధికారులు జూలియో రెబీరో, డా. ఈష్ కుమార్ ఉన్నారు.
ఆ చట్టం పుట్టుకొచ్చిన చరిత్ర; నేరారోపణ చేయకుండానే ఇష్టారాజ్యంగా నిందితులను నెలల తరబడి, ఏళ్ల తరబడి జైలులో ఉంచే అవకాశం; కేసు పెట్టడానికి ప్రభుత్వానుమతి నిబంధనలలో లొసుగులు; నిందితులకు బెయిల్ మీద మితిమీరిన ఆంక్షలు వంటి అనేక కారణాలతో యుఎపిఎను అప్రజాస్వామిక, అమానుష, దుర్మార్గ చట్టం అని వాళ్లు వాదించారు. ప్రజల హక్కులను కాపాడడానికి, రాజ్యాన్ని నియంత్రించడానికి తనకు వచ్చిన ఈ అవకాశాన్ని సుప్రీంకోర్టు సద్వినియోగం చేసుకుని ఆ చట్టాన్ని మొత్తంగానో, అక్రమ నిబంధనలను కొన్నిటినో కొట్టివేస్తుందా వేచిచూడాలి.
బ్రిటిష్ పాలకులు వంద సంవత్సరాల కింద ప్రజల హక్కులను అణచివేయడానికి ప్రవేశపెట్టిన అత్యంత క్రూరమైన రౌలట్ చట్టానికి యుఎపిఎ వారసురాలు. విస్తృతంగా చెలరేగిన నిరసనకు జడిసో, ఇతర కారణాలవల్లనో దాన్ని పెద్దగా వినియోగించకుండానే మూడు సంవత్సరాల తర్వాత వలస పాలకులు రద్దు చేశారు. తర్వాత వలసానంతర పాలకులు రౌలట్ చట్టంతో సమానమైన క్రూరత్వం, ప్రాథమిక హక్కుల ఉల్లంఘన ఉన్న ఆంతరంగిక భద్రతా చట్టం (మీసా 1971–77), తీవ్రవాద, విచ్చిన్నకర కార్యకలాపాల నిరోధ చట్టం (టాడా 1985–95), తీవ్రవాద కార్యకలాపాల నిరోధ చట్టం (పోటా 2002–04) వంటివి తెచ్చి వేల మందినో, లక్షల మందినో వేధించినప్పటికీ, ఆ చట్టాలను కొనసాగించలేకపోయారు. ఆ దుర్మార్గ చట్టాలలోని క్రూర నిబంధలనలన్నిటికి వారసురాలు యుఎపిఎ. 1967లో ప్రవేశపెట్టిన ఈ చట్టానికి ఆరుసార్లు సవరణలు చేసి, అందులోని కొన్ని నిబంధనల క్రూరత్వానికి, అప్రజాస్వామికతకు కోరలు, పదును పెట్టారు.
‘ఒక వ్యక్తి, సంస్థ తన చర్య ద్వారా, నోటిమాట లేదా రాత లేదా సైగలు లేదా దృశ్యరూపకంగా లేదా మరే విధంగానైనా భారత సార్వభౌమాధికారాన్ని, దేశ సమగ్రతను తప్పుపట్టినా, ప్రశ్నించినా, భంగపరిచినా, లేదా భంగపరిచే ఉద్దేశం ప్రకటించినా, దేశానికి వ్యతిరేకంగా అసంతృప్తి లేవనెత్తడానికి ప్రయత్నించినా, ఆ ఉద్దేశం ఉన్నా, దేశంలోని ఏదైనా ఒక భాగం విడిపోవాలనే ఆలోచనను సమర్థించినా, సమర్థించే ఉద్దేశం ఉన్నా అది చట్టవ్యతిరేక కార్యకలాపం అవుతుంద’ని ఈ చట్టం అంటోంది. చర్యను మాత్రమే కాక, భావ ప్రకటనను, ఆలోచనను, చివరికి ఉద్దేశాన్ని కూడ నేరంగా పరిగణించే ఈ విశాల, నిరంకుశ నిర్వచనం ఎవరినైనా ఇరికించగలిగే అవకాశం ఇస్తోంది.
ఈ చట్టం ప్రభుత్వానికి అపరిమిత నిరంకుశాధికారాలను కట్టబెట్టింది. ప్రభుత్వం అధికారిక గెజెట్ ద్వారా ఏ సంస్థనైనా, వ్యక్తినైనా చట్టవ్యతిరేకిగా ప్రకటించవచ్చు. నిర్బంధించిన వ్యక్తి మీద ఏ నేరారోపణ ఉందో చెప్పకుండా 180 రోజులవరకూ నిర్బంధంలో ఉంచవచ్చు (అంతకు ముందరి భారత నేర విచారణా స్మృతి ప్రకారం ఆ గడువు 60 రోజులు లేదా 90 రోజులు మాత్రమే). ఎవరినైనా నిర్బంధించి, నేరారోపణ చేయకుండా 60 రోజులు లేదా 90 రోజులు గడిస్తే, తక్షణమే బెయిల్ మీద విడుదల చేయవచ్చుననే నిబంధన, ఈ చట్టం కింద 180 రోజుల తర్వాత కూడ వర్తించదు. అప్పుడు కూడ బెయిల్ మీద కఠినమైన ఆంక్షలు విధించడంతో విచారణ లేకుండానే ఏళ్లకు ఏళ్లు జైళ్లలో ఉన్నవాళ్లు, పందొమ్మిది సంవత్సరాలు జైలులో ఉన్న తర్వాత కేసు కొట్టేయబడి, నిర్దోషిగా రుజువైనవాళ్లు, జైళ్లలోనే మరణించినవాళ్లు ఉన్నారు. అంటే యుఎపిఎ కింద కేసు పెట్టి జైలుకు పంపించడమంటే ఎటువంటి విచారణ లేకుండానే యావజ్జీవశిక్ష లేదా మరణశిక్ష విధించడంతో సమానం.
తీవ్రవాద, చట్టవ్యతిరేక చర్యకు ఈ చట్టం ఇచ్చిన నిరంకుశ నిర్వచనం పౌరుల ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడానికి, భిన్నస్వరాలను అణచివేయడానికి రాజ్యానికి మితిమీరిన అధికారాన్ని ఇస్తుందని, అందువల్ల అది రాజ్యాంగ వ్యతిరేకమని ప్రస్తుత పిటిషనర్లు వాదించారు. ఈ చట్టం దానికదిగానే దుర్మార్గమైనది కాగా, దాని దుర్వినియోగం కూడ ఎక్కువగానే జరుగుతున్నదని వారు చూపారు. అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని విమర్శించే వారిని, ప్రభుత్వానికి గిట్టనివారిని యుఎపిఎ కింద నిర్బంధిస్తున్నారు. కవులు, కళాకారులు, రచయితలు, విద్యార్థులు, న్యాయవాదులు, జర్నలిస్టులు, సామాజిక ఉద్యమ కార్యకర్తలు వంటి ప్రజాస్వామిక కార్యకలాపాలలో ఉన్న ఎందరినో అలా ఇరికించారు. ఇటువంటి తప్పుడు ఆరోపణలను న్యాయస్థానంలో రుజువు చేయడం సాధ్యం కాదు గనుక ఈ కేసులకు శిక్షలు పడుతున్న నిష్పత్తి చాల తక్కువగా ఉంది. అధికారిక సమాచారం ప్రకారమే యుఎపిఎ ఆరోపణల కేసుల్లో 2.19 శాతం మాత్రమే దోషులుగా రుజువై శిక్షలు పొందారు. మిగిలిన 97.81 శాతం నిరపరాధులుగానే సంవత్సరాల తరబడి జైళ్లలో గడిపారు. లోక్‌సభలో హోం మంత్రిత్వ శాఖ 2020 మార్చి 24న ఇచ్చిన సమాధానం ప్రకారమే 2015లో 1128 మంది అరెస్టు కాగా 23 మంది మీద, 2016లో 999 మందికి 24 మంది మీద, 2017లో 1554 మందికి 39 మంది మీద, 2018లో 1421 మందికి 35 మంది మీద, 2019లో 1948 మందికి 34 మంది మీద యుఎపిఎ నేరం రుజువైంది.
అయినా పోలీసులు ఈ చట్టం కింద ఎడాపెడా కేసులు నమోదు చేస్తున్నారు. ఇటీవల త్రిపురలో ముస్లింల మీద జరిగిన హింసాకాండ సందర్భంగా నిజనిర్ధారణకు వెళ్లిన నలుగురు న్యాయవాదుల మీద, ఆ హింసాకాండ వివరాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన 102 మంది మీద ఈ చట్టాన్ని వినియోగించారు. అంతకుముందు పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసించిన విద్యార్థుల మీద, సామాజిక కార్యకర్తల మీద ఈ చట్టాన్ని వినియోగించారు. కశ్మీర్‌లో ఒక ఆట సందర్భంగా పొరుగుదేశపు జట్టును సమర్థించారనే కారణం మీద మెడికల్ కాలేజి విద్యార్థుల మీద ఈ చట్టాన్ని వినియోగించారు. జైలు నిర్బంధంలోనే మరణించిన స్టాన్‌స్వామితో సహా పదహారు మంది మేధావుల మీద పెట్టిన భీమా కోరేగాం కేసు ఈ చట్టం కిందనే. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో కనీసం మూడు వందల మంది మీద యుఎపిఎ కేసులున్నాయి. గత ఏడు సంవత్సరాలలో దేశవ్యాప్తంగా 10,552 మంది మీద యుఎపిఎ కేసులు పెట్టగా విచారణ జరిగి, నేరాలు రుజువై, శిక్షలు పడినది కేవలం 253 మందికి మాత్రమే.
యుఎపిఎలో అన్నిటికన్న క్రూరమైన నిబంధన సెక్షన్ 43 డి (5) అనేది. అది నిందితుల బెయిల్ మీద ఆంక్షలు విధిస్తుంది. ఇది కేవలం నిందితులు బైటికి రాకుండా చేయడం కోసం, భిన్నాభిప్రాయాలున్నవాళ్ల గళం బైట వినబడకుండా చేయడం కోసం మాత్రమే తయారైనది. మామూలుగా ‘బెయిల్ సాధారణం, జైలు అసాధారణం’ అనేది భారత న్యాయసూత్రం. ఈ సూత్రాన్ని జస్టిస్ విఆర్ కృష్ణయ్యర్ 1977లో ఒక తీర్పులో స్థాపించారు. నిందితులు విదేశాలకు పారిపోయే అవకాశం ఉన్నప్పుడు, సాక్షులను బెదిరించే, సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశం ఉన్నప్పుడు తప్ప మిగిలిన అన్ని సందర్భాలలోనూ బెయిల్ సాధారణం అని ఆ తీర్పు చెప్పింది. కాని యుఎపిఎలోని 43డి (5) పబ్లిక్ ప్రాసిక్యూటర్ అభిప్రాయం అడగాలని, నిందితులు నేరం చేశారని న్యాయమూర్తి ‘ప్రాథమికంగా’ అభిప్రాయపడితే బెయిల్ ఇవ్వనక్కరలేదని రెండు షరతులు పెట్టింది. ఈ రెండు షరతులూ అర్థరహితమైనవి, అక్రమమైనవి, హాస్యాస్పదమైనవి. ఏ కేసులోనైనా ప్రాసిక్యూషన్ అభిప్రాయం చెప్పడం, మామూలుగా బెయిల్ ఇవ్వవద్దని అనడం ఉండేదే. అది ప్రత్యేకంగా ఈ చట్టంలో రాయవలసిన అవసరమే లేదు. ప్రాసిక్యూషన్ ఈ నిబంధనను అనుమతి అడగడంగా వ్యాఖ్యానిస్తున్నారు. ప్రాసిక్యూషన్ ఎప్పటికీ అనుమతి ఇవ్వదు గనుక బెయిల్ ఎప్పటికీ దొరకదు అనే నిర్ధారణకు వస్తున్నారు.
అంతకన్న ఘోరం, నిందితుల మీద ప్రాసిక్యూషన్ చేసిన ఆరోపణలు ‘ప్రాథమికంగా సరైనవేనని’ న్యాయమూర్తి భావించడం అంటే నేరవిచారణ ప్రక్రియను తలకిందులు చేయడమే. విచారణ జరగకుండానే, నిస్సందేహమైన సాక్ష్యాధారాలతో, వాదనలతో, సకారణమైన అనుమానాలను అధిగమించిన తర్వాతనే ఆరోపణలు రుజువవుతాయి గాని, అదంతా లేకుండానే న్యాయమూర్తికి ఆ అధికారం ఇవ్వడం విచారణ తతంగాన్ని నామమాత్రం చేయడమే. న్యాయమూర్తి దివ్యదృష్టితో నేరస్థులెవరో, కానివారెవరో తేల్చవచ్చు. నవంబర్ 18న దాఖలైన పిటిషన్‌ను అనుమతించిన సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసు పంపింది. ప్రభుత్వం ఇచ్చే జవాబు మీద ఆధారపడి విచారణ జరుగుతుంది. రాజ్యాంగ వ్యతిరేకమైన, దుర్మార్గమైన ఈ చట్టం అమలులో ఉండడం నాగరికతకూ, ప్రజాస్వామ్యానికీ అవమానం. ఇప్పటికైనా సర్వోన్నత న్యాయస్థానం ఈ అన్యాయచట్టాన్ని రద్దు చేసి, తాను ప్రజల వైపు, ప్రజల హక్కుల వైపు నిలబడతానని చాటుకుంటుందా?
ఎన్. వేణుగోపాల్
Comments
Post a Comment