ప్రొఫెసర్ శేషయ్య గారి సంస్మరణ సభ | అనంతపురం జిల్లా

05-12-2021

ఈరోజు ఆదివారం ఉదయం 10.30 గంటలకు అనంతపురం ప్రెస్ క్లబ్ నందు ప్రొఫెసర్ శేషయ్య గారి సంస్మరణ సభ జరిగింది. ఈసభకు పౌరహక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు యం.సురేష్ బాబు అధ్యక్షత వహించారు. ఈ సభలో ఓ.పి.డి.ఆర్ రాష్ట్ర కార్యదర్శి ఆర్. రామకుమార్, మానవహక్కుల వేదిక రాష్ట్ర కార్యదర్శి యస్.అబ్దుల్ రసూల్, పౌరహక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుకా చంద్రశేఖర్, శేషయ్య గారి సహచరి ఆర్.శశికళ, విప్లవ రచయితల సంఘం ప్రసంగించారు.

ఈసభలో ప్రొఫెసర్ శేషయ్య గారి మిత్రులు, సన్నిహితులు, సంఘం సభ్యులు ఆయనతో ఉన్న అనుబంధం పంచుకుంటూ రచించిన " హక్కుల ఉద్యమ ధృవతార - శేషయ్య గారి జ్ఞాపకాలు" అనే పుస్తకాన్ని మానవ హక్కుల వేదిక నాయకులు యస్.యం.బాషా ఆవిష్కరించి, ప్రసంగించారు. తరువాత ప్రొఫెసర్ శేషయ్య గారు అనేక సందర్భాల్లో రచించిన వ్యాసాలను " రాజ్యాంగం- పౌరహక్కులు" విమర్శనాత్మక దృక్పథం అనే పుస్తకాన్ని పౌరహక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుకా చంద్రశేఖర్ ఆవిష్కరించి, ప్రసంగించారు.

సభలో వక్తలు ప్రసంగిస్తూ " దేశంలో రోజురోజుకు హక్కుల ఉల్లంఘనలు పెరిగిపోతున్నాయని, భావ ప్రకటనా స్వేచ్ఛ పూర్తిగా ప్రమాదంలో ఉందని" అన్నారు. మతం పేరుతో దాడులు పెరుగుతున్నాయి అన్నారు. ప్రజల హక్కుల కోసం మాట్లాడుతున్న వారిని " అర్బన్ నక్సల్" పేరిట వేధిస్తున్నారని అన్నారు. జాతీయ దర్యాప్తు సంస్థ ( ఎన్ఐఏ) అక్రమ కేసులు బనాయిస్తూ వేధింపులకు గురిచేస్తున్నారు.

కోర్టులు సైతం అర్నాబ్ గోస్వామి లాంటి వారికి ఒకట్రెండు రోజుల్లో బెయిల్ మంజూరు చేస్తూ, ఆదివాసీ హక్కుల కోసం పోరాడుతున్న ʹ ఫాదర్ స్టాన్ స్వామిʹ లాంటి వృద్ధులైన వారిపై కనీసం కనికరం చూపించలేదని, అందువల్ల ఆయన జైలులో మృతిచెందాడు అన్నారు. కోర్టులు సైతం ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తున్నాయి అన్నారు. 750 మందికి పైగా రైతులు చనిపోయినా స్పందించని కేంద్ర ప్రభుత్వం కేవలం ఉత్తర ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో రాబోయే ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని, రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేశారని అన్నారు. రాజ్యాంగం ఇచ్చిన ప్రాధమిక హక్కులు సైతం ప్రమాదంలో ఉన్నాయి అన్నారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన ప్రభుత్వమే రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాలరాస్తుంది అన్నారు.

రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాపాడుకోవడానికి ఐక్యంగా ఉద్యమించాలి అని వక్తలు పేర్కొన్నారు. ఈ సభలో మానవతా రక్తదాతల సంఘం నాయకులు తరిమెల అమర్నాథ్ రెడ్డి, న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ప్రభాకర రెడ్డి, పౌరహక్కుల సంఘం జిల్లా నాయకులు వి.ఆది నారాయణ, శ్రీ రామమూర్తి, సమాచారహక్కు ఐక్య వేదిక నాయకులు హొన్నూరప్ప, టి.వి.రెడ్డి, ప్రజాకళామండలి నాయకులు రత్న, విజయ్, సాహితీ స్రవంతి జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ ప్రగతి, ప్రముఖ రచయిత్రి నిర్మలా రాణి, కార్మిక సంఘాలు నాయకులు సురేష్, చంద్ర, జిల్లా రచయితల సంఘం నాయకులు శాంతి నారాయణ, బోస్, షేక్ కంబదూరి నబీరసూల్ పాల్గొన్నారు.


Comments