పోరాడే వారు దేశద్రోహులా | గుంటూరు జిల్లా

ప్రజాస్వామ్య హక్కుల పై పోరాడే వారిని దేశద్రోహులుగా చిత్రీకరిస్తున్నారు.

పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు ఉపా రద్దు పోరాట కమిటీ కన్వీనర్ చిలుక చంద్రశేఖర్ ఆరోపణ.

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం సాక్షిగా పాలన చేస్తున్నామని చెప్పుకుంటున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగబద్ధంగా ప్రజలకిచ్చిన హక్కులపై ప్రశ్నించే వారిపై దేశ ద్రోహులుగా ముద్ర వేస్తూ సంవత్సరాల తరబడి జైలు పాలు చేస్తున్నారని ప్రభుత్వ నియంత్రిత విధానాలపై వారిపై ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఉద్యమించాలని ఉపా రద్దు పోరాట కమిటీ కన్వీనర్ మరియు పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుకా చంద్రశేఖర్ ధ్వజ మెత్తారు.



ఉపా రద్దు పోరాట కమిటీ ఆధ్వర్యంలో శనివారం స్థానిక బ్రాడీపేట కొరటాల భవన్ లో ఉద్యమ సభ నిర్వహించారు.




తొలుత గత రాత్రి ఆకస్మిక మృతి చెందిన జిల్లా పౌర సంఘం కార్యదర్శి ఎం వెంకటేశ్వర్లు మృతి కి నివాళులు అర్పించిన అనంతరం ముఖ్య వక్తగా పాల్గొన్న కన్వీనర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ రాజ్యాంగబద్ధ హక్కులపై ప్రశ్నించే వారిపై బిజెపి ప్రభుత్వం యుద్ధాన్ని ప్రకటించిందని విమర్శించారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వ విధానాలని తప్పుబట్టే పౌరసమాజాన్ని ప్రమాదకరంగా చిత్రీకరించటం మోడీ ప్రభుత్వ విధానంగా మారిందని ఆరోపించారు. మన్మోహన్ సింగ్ సరళీకృత ఆర్థిక విధానాల వల్ల బహుళజాతి కంపెనీలు దేశ అటవీ సంపదను, ఖనిజాలను దోచుకు వెళుతుంటే ఆదివాసులు పోరాడి సాధించుకున్న చట్టాలను తుంగలో తొక్కి లక్షల కోట్ల విలువైన సంపద కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతున్నారని తద్వారా అడవిని నమ్ముకుని బతుకుతున్న ఆదివాసులు కోట్లాది మంది నిర్వాసితులయ్యారని చెప్పారు. ఆదివాసీల ప్రాథమిక జీవించే హక్కులపై చైతన్య పరిచే పౌరహక్కుల, ప్రజాస్వామ్య సంఘాల నేతలపై వుపా చట్టం ద్వారా దాడి చేయటం దుర్మార్గమన్నారు.



కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి దుడ్డు ప్రభాకర్ మాట్లాడుతూ సముద్రతీర ప్రాంతంలో ప్రాణాంతక రసాయనిక పరిశ్రమలు ధర్మల్ పవర్ ప్లాంట్ లు జలవిద్యుత్ ప్లాంట్ల వెదజల్లే విషవాయువుల ప్రభావం వల్ల నీరు కలుషితమై ప్రజలు రోగాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వాతావరణ కాలుష్యానికి కారణమైన ఫ్యాక్టరీ నిర్మాణాలను వ్యతిరేకించిన ప్రజలపై కాల్పులు జరిపిన జరుపుతూ కార్పొరేట్లకు రక్షణగా నిలుస్తున్నాయి ఆరోపించారు. ప్రజలకు అండగా నిలబడే వారిని అర్బన్ మావోయిస్టులను టెర్రరిస్టులు అని ఆరోపిస్తూ దేశద్రోహులుగా చిత్రీకరిస్తున్నారని తీవ్రంగా విమర్శించారు.

ప్రగతిశీల కార్మిక సమాఖ్య బి కొండా రెడ్డి సభకు అధ్యక్షత వహించగా కార్యక్రమంలో హైకోర్టు న్యాయవాది సురేష్, ఊ పా రద్దు పోరాట కమిటీ కో కన్వీనర్ శ్రీమన్నారాయణ, వై వెంకటేశ్వరరావు, ఓ పి డి ఆర్ నాయకులు హనుమంతరావు, రవిచంద్ర, విప్లవ రచయితల సంఘం సి ఎస్ ఆర్ ప్రసాద్, పలు ప్రజా, పౌరహక్కుల సంఘాల నాయకులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు

Comments