నర్రా ప్రభాకర్ సంస్మరణ సభ ఈ నెల 7వ తేదీన హైదరాబాద్ లో | తెలంగాణ



05-12-2021

30 సంవత్స‌రాల క్రింద డిసెంబర్ 7, 1991 నాడు హత్యకు గురైన వరంగల్ జిల్లా పౌరహక్కుల సంఘం నాయకుడు నర్రా ప్రభాకర్ సంస్మరణ సభ ఈ నెల 7వ తేదీన హైదరాబాద్ లో జరగనుంది. ఈ మేరకు పౌరహక్కుల సంఘం ప్రచురించిన కరపత్రం....

1970 మొదటి దశకంలో ఉవ్వెత్తున ఎగిసిపడిన రైతాంగ పోరాటాల మీద జరిగిన ప్రభుత్వ అణచివేతకు వ్యతిరేకంగా ప్రజల యొక్క ఉద్యమించే రాజ్యాంగ హక్కును ప్రభుత్వం గౌరవించాలని పౌరహక్కుల సంఘం 1973లో ఆవిర్భవించింది. పౌర హక్కుల సంఘం ఏర్పడ్డ‌ కొంత కాలానికే ఎమర్జెన్సీలో నిర్బంధాన్ని ఎదుర్కొంది. ప్రజా ఉద్యమకారులు, నక్సల్బరీ గ్రూపుల మంచి మొదలుకుంటే చివరికి సంఘ్ పరివార్ కార్యకర్తల వరకు అందరి మీద నిర్బంధాన్ని ప్రయోగించినపుడు ఈ పౌర హక్కుల సంఘం వారి అందరి రాజకీయ స్వేచ్ఛను గౌరవించాలని భావ ప్రకటన స్వేచ్ఛను అణచివేయకూడదని వారందరి పక్షాన పోరాడింది.

సంఘ్ పరివార్ రాజకీయాల పై ప్రస్తావన లేకుండా, వారికున్న వ్యక్తీకరించే స్వేచ్చమ గౌరవించాలనే నేపధ్యంలో కన్నాభిరాన్ లాంటి పార హక్కుల సంఘం నాయకులు వారి తరపున వ్యాయస్థానాల్లో కూడా పోరాడారు. ఈ నేపథ్యంలో పౌర హక్కుల సంఘం రాజ్యం చేత ఎన్నో భౌతిక దాడులకు సైతం గురికాబడింది. ఇదే క్రమంలో వరంగల్ జిల్లాలో డాక్టర్ రామనాథాన్ని రాజ్యం హత్య చేసింది. అయినప్పటికి ఈ సంస్థ లక్ష్యాలు ఆశయాల ప్రభావం వలన జిల్లా నిర్మాణాన్ని లేకుండా చేయడం సాధ్యం కాలేదు. ఈ క్రమంలో నర్రా ప్రభాకర్ లాంటి వాళ్ళు సంస్థను ముందుకు తీసుకెళ్ళారు.
సరిగా 30 సం॥రాల క్రిందట డిసెంబర్ 7, 1991 నాడు తెల్లవారుజామున నలుగురు ఏపి పోలీసులు, పారహక్కుల సంఘం వరంగల్ జి ల్లా కన్వీనర్ న‌ర్రా ప్రభాకర్ ఇంట్లోకి ప్రవేశించి తుపాకులతో కాల్పులు జరిపి చంపారు.

30 సంవత్సరాల క్రిందట టాడా, పోటా చట్టాలకు వ్యతిరేకంగా పౌరహక్కుల సంఘం ఎన్నో కార్యక్రమాలను నిర్వహించింది. అందులో భాగంగా ఆ కేసుల్లో ఆరెస్ట్ అయిన వారి కోసం పౌరహక్కుల సంఘం న్యాయవాదిగా వర్రా ప్రభాకర్ వాదించాడు. ఈ క్రమంలో డిసెంబర్ 1990లో, న‌ర్మెట్ట మండలం ఆగిపేట గ్రామానికి చెందిన పీపుల్స్ వార్ నాయకుడు చంద్రమౌళిని నర్మెటలో అరెస్ట్ చేశారు. అతని అరెస్టుకు వ్యతిరేకంగా వేలాదిమంది గ్రామస్తులు ప్రదర్శన జరిపారు. నిరసన తెలుపుతున్న వారిపై కాల్పులు జరిపి పోలీసులు ఇద్దరిని చంపారు. టాడా చట్టం కింద సూమారు 450 మందిపై కేసులు పెట్టారు. న‌ర్రా ప్రభాకర్ వరంగల్ జిల్లా భాద్యుడిగా ఆ దమన కాండకు వ్యతిరేకంగా పోరాటం చేసాడు. న్యాయవాదిగా వారందరి పక్షాన‌ బెయిలు పొందే రాజ్యాంగ హక్కు కోసం న్యాయస్థానాల్లో పోరాడాడు.

ఆ క్రమంలో తను ఎన్నో బెదిరింపులకు గురైనా, ఏ మాత్రం వెనకడుగు వేయకుండా పౌరహక్కుల సంఘం వరంగల్ జిల్లా భాద్యుడిగా కొనసాగుతూ రాజ్యం చేతిలో హత్య గావించబడ్డాడు.
అప్పటి టాడా, పోటా చట్టాలను ప్రయోగించి ప్రభుత్వం ఎలా ప్రజా ఉద్యమాలపై నిర్భందం ప్రయోగించిందో, ఇప్పటి UAPA చట్టం ద్వారా ప్రజా ఉద్యమాలపై అదే స్థాయిలో నిర్భందాన్ని ప్రయోగిస్తుంది. లా అండ్ ఆర్డర్ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న అంశం అయినప్పటికీ, UAPA చట్టం ప్రకారం NIA ద్వారా రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండానే ఈ కేసులను కేంద్ర ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకోవచ్చు. ఈ క్రమంలో ప్రజా సంఘాలపైన, పౌరహక్కుల సంఘంలోని భాద్యుల ఇండ్లపై దాడులు చేయటం, ఇంటరాగేషన్ల పేరిట NIA ఆఫీస్ కు పిలవటం ఈ మధ్య తరుచుగా జరుగుతూనే ఉంది. ఈ దాడులు ఈ సంఘానికి కొత్త కాదు. ఆ నాడు నర్రా ప్రభాకర్ కి కొత్త కాదు. అప్పటికే ముగ్గురు అయరులున్న ఈ సంఘానికి తను నాలుగవ వ్యక్తి అయ్యాడు. ఆ తర్వాత పురుషోత్తం, అజాం అలీ లను కూడా రాజ్యం హత్య చేసింది.

NIA ఈ పౌరహక్కుల సంఘంలోని సభ్యులను విచారణలో, పోలీసులకు వ్యతిరేకంగా మీరు మాట్లాడుతున్నారని ప్రశ్నిస్తున్నారు. ఈ హక్కుల సంఘం పోలిసులను వ్యతిరేకించదు. వారి యొక్క చట్టవ్యతిరేక చర్యల మీద స్పందిస్తుంది. చట్టం పోలీసులకు కొన్ని హద్దులను నిర్దేశిస్తుంది. పోలీసులకున్న చట్టపరమైన అధికారాల ద్వారా పౌరహక్కులను హరించేలా ఉంటే అటువంటి చట్టాలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది.

అదే చట్టం పెట్టిన హద్దులను దాటి పోలిసులు హక్కులను కాలరాస్తే, పోలీసులు చేసే చర్యలకు వ్యతిరేకంగా హక్కుల సంఘం పోరాడుతుంది. ఇక్కడ హక్కులను ధ్వంసం చేసే చర్యలపట్ల మాట్లాడటం జరుగుతుంది. ఆ చర్యలు చట్టపరమైనవి అయితే ఆ చట్టానికి వ్యతిరేకంగా, చట్టాన్ని అతిక్రమించి పోలీసులు ప్రవర్తిస్తే పోలీసుల పైన నిరసనను వ్యక్తం చేస్తుంది.

పౌరహక్కుల సంఘం ప్రజా ఉద్యమాల ద్వారా సాధించుకున్న చట్టపరమైన హక్కులను ప్రభుత్వాలు ఉల్లంఘిస్తే దానికి వ్యతిరేకంగా హక్కుల ఉద్యమ స్పందన ఉంటుంది. చట్టపరమైన హక్కులను సవ్యంగా అమలు జరపాలని, చట్టాలపట్ల మీరెంత భాద్యతతో ఉన్నారని ఈ ప్రభుత్వాలను అడుగుతుంది. ఏ చట్టాలు హక్కులను కాలరాస్తాయో, వాటికి వ్యతిరేకంగా మాట్లాడుతుంది. ఆ చట్టాలను ఉపసంహరించుకునే వరకు దానిపై ఉద్యమిస్తుంది. తిరిగి ఏవైతే హక్కులు చట్టపరంగా గుర్తించలేదో వాటిని చట్టపరం చేయాలని చెప్తుంది. హక్కుల ఉద్యమం అవసరమైతే హక్కుల కోసం చట్టాలకు వ్యతిరేకంగా మాట్లాడుతుంది.

రాజ్య హింసకు వ్యతిరేకంగా చేసే పోరాటాల్లో ఈ పౌరహక్కుల సంఘాన్ని నిర్బంధాలతో, నిషేదాలతో ఆపలేరు.

డిసెంబర్ 7న సాయంత్రం 6 గం॥ లకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం మినీ హాల్ లో జరిగే సభకు మిత్రులు, ప్రజాస్వామిక వాదులు అందరూ హాజరై సభను విజయవంతం చేస్తారని పౌర హక్కుల సంఘం రాష్ట్ర కమిటి విజ్ఞప్తి చేస్తున్నది.

డిమాండు: * ఊపా చట్టాన్ని రద్దు చేయాలి
* అక్రమ కేసులను ఎత్తివేయాలి
* ఎన్ ఐ ఏ దాడులను తక్షణమే నిలిపివేయాలి.
* అక్రమంగా ఖైదు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలి.

పౌర హక్కుల సంఘం,
రాష్ట్ర కమిటి, తెలంగాణ




Comments