భారతబంద్ కు సంఘీభావం తెలియచేయండి | పౌర హక్కుల సంఘం

*పౌరహక్కుల సంఘం* *పత్రికా ప్రకటన*
-----------------------
*భారతబంద్ కు సంఘీభావం తెలియచేయండి*.

*ఢిల్లీ సరిహద్దులో రైతుల నిరసన 300 రోజులు దాటింది*. రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకునేదాకా తమ పోరాటం ఆగదని వాళ్ళు స్పష్టంగా చెబుతున్నారు. ఇప్పటికి వందలాది రైతులు చలికి, ప్రతికూల వాతావరణానికి అనారోగ్యంతో చనిపోయారు. ఇటీవలే హర్యానాలో రైతు ఉద్యమకారులపై పోలీసుల దాడిలో సుశీల్ కాజల్ అనే రైతు తల పగలి చనిపోయాడు. ఉద్యమాన్ని విచ్చిన్నం చేయడానికి ప్రభుత్వం చేయని కుతంత్రం లేదు. ప్రపంచ చరిత్రలోనే కనీ వినీ ఎరగని రీతిలో లక్షలాదిగా మన రైతులు వ్యవసాయాన్ని కార్పొరేట్ల పరం కాకుండా కాపాడటానికి ఉద్యమిస్తే ప్రభుత్వం అత్యంత *అమానవీయంగా వ్యవహరిస్తోంది. ఈ స్థితిలో సంయుక్త కిసాన్ మోర్చా *దేశవ్యాప్త బందుకు* పిలుపునిచ్చింది. 

 పోలీసులు, ప్రభుత్వ అనుకూల గూండాలు, మరియు కరోనా,, కమ్ముకున్నా వెనుదిరగని ఉద్యమానికి జేజేలు . 
కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిద్దాం. 
రైతుల పక్షాన నిలబడదాం.

కరోనా కాలాన్ని అవకాశంగా తీసుకొని దేశ ప్రజానీకంపై కేంద్ర ప్రభుత్వం మరో దాడికి తెగబడింది. సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని ఆదుకొని రైతు జీవితాలకు భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వం దానిని మొత్తంగా కార్పొరేట్ సంస్థలకు అప్పగించేస్తోంది. ఇందుకోసం జూన్ లో హడావిడిగా మూడు ఆర్డినెన్స్ లు జారీ చేసి వాటినిప్పుడు పార్లమెంట్ లో బిల్లులుగా ప్రవేశపెట్టి చర్చకు కూడా అవకాశం ఇవ్వకుండా మందబలంతో ఆమోదింపజేసుకుంది. 
పెద్ద నోట్ల రద్దు సమయంలో ఎట్లయితే అది దేశ ప్రయోజనాల కోసమని నమ్మబలికారో ఇప్పడు ఈ చట్టాలు కూడా రైతుల ప్రయోజనాల కోసమే అని ప్రభుత్వం బుకాయిస్తోంది. రైతులు తమ సరుకును ఎక్కడికైనా వెళ్లి అమ్ముకోడానికి వెసులుబాటు కల్పిస్తున్నామని అంటోంది. మనదేశంలో మెజారిటీగా ఉన్న చిన్న, సన్నకారు రైతులకు ఎక్కడికైనా వెళ్లి సరుకును మార్కెటింగ్ చేసుకోవడం దుర్లభం. ఆచరణలో ఇది వ్యాపారులు ఎక్కడికైనా వెళ్లి కొనుగోలు చేసేవిధంగా ఉంటుంది. పంట వేయడానికి ముందే రైతులతో కార్పోరేట్ సంస్థలు ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం కూడా కొత్త చట్టాలు కల్పిస్తున్నాయి. అంతే కాదు, సరుకులను అపరిమితంగా నిలువచేసుకొని ధరలను నియంత్రించే శక్తి వ్యాపారవర్గాలకు వస్తుంది. ఆహార పదార్థాల ధరలు కూడా కార్పొరేట్లు నిర్ణయిస్తారు. *అంటే రైతులకే కాదు, మొత్తంగా సామాన్య ప్రజానీకానికి ఇది నష్టదాయకం*. సారాంశంలో రైతులు శ్రమించి పండించే పంటను, ప్రజల నోటికాడి ముద్దను కార్పోరేట్ గద్దలు తన్నుకుపోయేలా చట్టాలు రూపొందించారన్నమాట.

ఈ దుర్మార్గమైన చట్టాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా రైతు సంఘాలు, ప్రజాసంఘాలు, ప్రజాస్వామికవాదులు, వివిధ పార్టీలు 27వ తేదీన భారత్ బంద్ కు పిలుపిచ్చాయి. ఈ బంద్ కు *పౌరహక్కుల సంఘం* సంపూర్ణ మద్దతు తెలియజేస్తోంది. రైతు వ్యతిరేక బిల్లులను ఉపసంహరించుకోవాలని, ఉపా, మరియు ప్రజా వ్యతిరేక నల్లచట్టాలను రద్దు చెయ్యాలని,ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది.

చిలుక చంద్రశేఖర్,
రాష్ట్ర కార్యదర్శి,
పౌరహక్కుల సంఘం.
ఆం. ప్ర. రాష్ట్ర కమిటీ.

Comments