హక్కుల ఉద్యమంలో పనిచేసే ఒక కార్యకర్తగా జయశ్రీ అన్ని రంగాలలోకి దూసుకుపోయింది. ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావించి పనిచేసింది. నోరులేని గొంతుకలకు తానే గొంతైంది. జీవితకాలమంతా ఇతరుల కోసమే జీవించిన చాలా అరుదైన మానవతామూర్తి జయశ్రీ. ఆమె జ్ఞాపకాలు ఇపుడే కాదు, భవిష్యత్ తరాలకు కూడా స్ఫూర్తిదాయకమే.
సత్యానంతర కాలంలో అబద్ధాలే సత్యాలుగా ప్రచారమవుతున్న రోజుల్లో, అత్యంత బాధ్యత గల పదవుల్లో ఉన్నవాళ్లే అబద్ధాలను పబ్లిక్‌గా చెబుతున్న సందర్భమిది. విలువలన్నీ నిలువునా కూలిపోతున్న ఒక పరిణామ దశలో నిజాయితీగా, నిర్భయంగా, నిర్మొహమాటంగా మాట్లాడి నైతిక విలువలను, ప్రమాణాలను ఆచరిస్తూ ఒక నైతికశక్తిగా ఎదిగిన ఒక సాహస మహిళ కడప జయశ్రీ. హక్కుల కోసం ఆమె పోరాడిన రాయలసీమ ప్రాంతం, ముఖ్యంగా కడప జిల్లా హత్యలు, ప్రతీకార హత్యలు నిరంతరంగా జరిగే హింసాయుత ప్రాంతం. అలాంటి వాతావరణంలో ప్రజల హక్కుల కోసం పనిచేయడం చాలా సాహసంతో కూడుకున్న పని. మూడు దశాబ్దాలుగా అలసట లేకుండా ఎక్కడ సమస్యలున్నా, హక్కుల ఉల్లంఘన జరిగినా, అన్యాయం అనిపించినా అక్కడకు వెళ్ళి వాస్తవాలను సేకరించి తనకు అందుబాటులో ఉన్న అన్ని మార్గాల ద్వారా వాటిని బహిర్గతపరచి, ప్రజల చైతన్యాన్ని పెంచడానికి రాజీ లేకుండా కృషి చేసి తనకంటూ ఒక విశిష్టస్థానాన్ని సంపాదించుకున్న అరుదైన మనిషి జయశ్రీ.
కడప జిల్లాలో ఆమె గురించి తెలియని వారుండరు. కడప సమాజమే కాక, ప్రభుత్వ యంత్రాంగం (పోలీసులతో సహా) జర్నలిస్టులు, ఫ్యాక్షనిస్టు నాయకులు, పార్టీలతో సంబంధం లేకుండా అందరు రాజకీయ నాయకులు ఆమె పట్ల గౌరవభావం కలిగి ఉండేవారు. హక్కులపై మాట్లాడడానికి ఆమెను పోలీసు డిపార్టుమెంటు పిలిచేది. లా చదువుకున్న మనిషిగా లీగల్ కోణం నుంచి కూడా ఆమె హక్కులను వివరించేది.
కడపలో జయశ్రీ తండ్రి చాలా పేరున్న వ్యాపారస్థుడు. ఆమె ఎక్కడకు వెళ్ళినా బంగారయ్య కూతురు అనే గుర్తింపు కూడా ఉండేది. ఆమెకు ముప్పైఏళ్ళ వయసులోనే ఓపెన్‌హార్ట్ సర్జరీ జరిగింది. ఎప్పుడు మాట్లాడినా, తనది పొడిగింపబడిన ప్రాణం అనేది. ఆ దశలోనే బాలగోపాల్‌ను కలవడంతో తన జీవిత లక్ష్యమే మారిపోయిందని చెప్పేది. నిరాడంబరత, అద్భుత మేధస్సు, పని విధానం, ఆయన నమ్మి చిత్తశుద్ధిగా ఆచరించిన విలువలు తనను ఆకర్షించాయని, దాంతో తన ఆరోగ్య సమస్యను మరచిపోయానని, ఇక జీవితాంతం పౌరహక్కుల కోసం పని చేయాలని నిశ్చయించుకున్నానని చెప్పేది. అప్పటి నుంచి ఆగస్టు ఒకటో తేదీన మరణించే దాకా, అంటే జీవిత చివరి క్షణం దాకా హక్కుల కోసం పోరాడింది. మనుషులు ఒక అర్థవంతమైన జీవిత అన్వేషణలో ఎలా పరిణామం చెందుతారనే దానికి జయశ్రీ ఒక సజీవ ఉదాహరణ.
హక్కుల కోసం జయశ్రీ పనిచేసే తీరులో ఒక ప్రత్యేకత ఉండేది. ఎవరినైనా అన్నా, తమ్మీ, చెల్లీ అని సంబోధించేది. చాలామంది ఆమెను అక్కా అని పిలిచేవారు. ఎలాంటి క్లిష్ట సంఘటననైనా హాస్యభరితంగా వివరించేది. ఆమె ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే జర్నలిస్టుల మీద జోకులు వేయడంతో ప్రారంభించేది. పోలీసులను కలిస్తే చాలా చనువుగా మాట్లాడేది. వాళ్లు ఆమె పట్ల చాలా గౌరవంగా ప్రవర్తించేవారు. జైలులో ఎవరినైనా కలవడానికి వెడితే జైలు అధికారులతో మనది ఓపెన్ జైలు కదా అనేది. వాళ్లు కూడా ఆమెతో చాలా స్నేహపూరితంగా మాట్లాడేవారు. ఆమె వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించాలంటే ఇక్కడ రెండు, మూడు ప్రత్యేక అనుభవాలను ప్రస్తావించాలి. బాలగోపాల్, జయశ్రీ, నేను, వైఎస్ రాజశేఖర్‌రెడ్డితో రాయలసీమ ఫ్యాక్షనిజం మీద దాదాపు రెండు గంటలు చర్చించాం. ఆయన జయశ్రీ పట్ల చూపిన గౌరవం, ఆమెను పలకరించిన పద్ధతి చూస్తే ఆశ్చర్యం వేసింది. ఇది ఆమె నైతికబలం అయి ఉంటుంది. ఇక ఆ చర్చలో మేము, ముఖ్యంగా బాలగోపాల్ చాలా సూటిప్రశ్నలే అడిగాడు. రాజశేఖర్‌రెడ్డి చాలా ఓపికగా, నిదానంగా ప్రతి ప్రశ్నకు తనదైన రీతిలో స్పందించారు. తన తండ్రి గురించి, వాళ్ల అబ్బాయి గురించి, వాళ్ల ప్రవర్తన తీరు గురించి చాలా ఆసక్తి కలిగించే విధంగా వివరించారు. రాజశేఖర్‌రెడ్డిని జయశ్రీ విమర్శించినంతగా బహుశా ఎవరూ విమర్శించి ఉండరు.
కడప జిల్లాకు రాజశేఖర్‌రెడ్డి పేరు పెట్టడాన్ని ఆమె బహిరంగంగా వ్యతిరేకించింది. వ్యక్తుల పేర్లు జిల్లాలకు పెట్టడం, అదీ ఒక ఉద్రిక్త వాతావరణం ఉన్నప్పుడు సరియైన సంప్రదాయం కాదని వాదించింది. ఒక బహిరంగ సభ నిర్వహించి నన్ను కూడా పిలిచింది. అందరూ మాట్లాడడానికి జంకుతున్న సమయంలో ఆమే మాట్లాడింది. జిల్లా పేరు మీద కూడా ప్రజలకు హక్కు ఉంటుందని, ఇది రాజశేఖర్‌రెడ్డి మీద వ్యతిరేకత కంటే కూడా ఒక మంచి సంప్రదాయం కాదని ఆమె భావన. ఆమె ఎంత ధైర్యంగా మాట్లాడేదో చెప్పడానికే ఈ ఉదాహరణ.
మరొక సంఘటన. నేను, ప్రొ. డి.ఎన్ (బహుశా 1989లో అనుకుంటాను) రాయలసీమ ఎన్నికల తంతును పరిశీలించడానికి వెళ్లాం. జయశ్రీ మాకు చాలా నమ్మలేని అంశాలను చూపించింది. దొంగ ఓట్లు వేసిన వారిలో ఒకతనిని కలిసి ‘అన్నా! పెద్దసార్లు వచ్చారు, మన దగ్గర దొంగ ఓట్లు ఎలా వేస్తారో కొంచెం వివరంగా చెప్పు’ అని అతని చేత మాట్లాడించింది. దళితవాడకు తీసుకెళ్ళింది. ఏ ఒక్కరూ కూడా ఓటు వేయలేదు. ‘అక్కా! ఈసారి బాంబుల గొడవలు లేకుండా ఎన్నికలు జరిగాయి, మాకు చాలా హాయిగా ఉంది’ అంటూ ఓట్లతో ఏమొస్తది అని అన్నారు. ఏ పార్టీకి ఎన్ని ఓట్లు రావచ్చో అంచనావేసి పరస్పరం అంగీకరించి ఓట్లు వేసుకున్నారని జయశ్రీ మాకు వివరించింది. అలా మనుషుల చేత మాట్లాడించడం ఒక కళే. (అప్పటికింకా ఇవిఎంలను ప్రవేశపెట్టలేదు.)
ఇంకొక మరిచిపోలేని అనుభవం మేడే సెలబ్రేషన్స్. జయశ్రీని కడప ట్రక్ డ్రైవర్స్ గౌరవ సలహాదారుగా ఎంచుకున్నారు. ఆ సందర్భంగా ఒక సభకు నన్ను పిలిస్తే ఆమె మీద గౌరవంతో కాదనలేకపోయాను. తీరా అక్కడికి వెళ్ళాక పౌరహక్కులు, శ్రామికహక్కులు, రాజ్యాంగం లాంటి అంశాలను వాళ్ళకు వివరించే భాష నా దగ్గర లేదని నాకు బోధపడింది. ఆ విషయమే జయశ్రీతో అంటే పర్వాలేదు, మీరు మాట్లాడండి, వాళ్ళు వింటారు అనే ధైర్యాన్నిచ్చింది. మీటింగ్ సమయానికే డ్రైవర్లు పూర్తి నిషాలో ఉన్నారు. సాయంత్రం వాళ్ళ ర్యాలీలో మేం కూడా పాల్గొనాలి. కాని పరిస్థితి చూసి, నన్ను ర్యాలీకి వద్దని, రాత్రికి డిన్నర్ వాళ్ళతో కలిసి తిందామని సలహా ఇచ్చింది. డ్రైవర్ల్లకు ఆమె అంటే చాలా అభిమానం. కాని వాళ్ళ అలవాట్లు వాళ్ళవి. మేడే పండగ అంటే వాళ్ళు అలాగే అర్థం చేసుకున్నారు.
ప్రొద్దుటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహం పెట్టాలని లోకల్ ఎంఎల్‌ఏ ప్రయత్నం చేస్తే, బిజెపి వాళ్ళు దాన్ని వ్యతిరేకించారు. జయశ్రీ వాళ్ళతో మాట్లాడి ఆ విగ్రహం ఎందుకు పెట్టాలో వాదించింది. ఆ పని పూర్తికాక ముందే మరణించింది. పత్రికలలో ప్రొద్దుటూరు వాళ్ళు విగ్రహాన్ని పెట్టడం విరమించుకున్నారన్న వార్త వచ్చింది. జయశ్రీ లేనిలోటు స్పష్టంగా కనిపిస్తోంది.
హక్కుల ఉద్యమంలో పనిచేసే ఒక కార్యకర్తగా తాను అన్ని రంగాలలోకి దూసుకుపోయింది. వాళ్ళ సమస్యలను తన సమస్యలుగా భావించి పనిచేసింది. నిజానికి కడప జిల్లా సమస్యలన్నీ తన సమస్యలే. కడప జిల్లా ప్రజల బాధలతో జయశ్రీ జీవితం ముడిపడింది. ఆమె నోరులేని గొంతుకలకు తానే గొంతైంది. జీవితకాలమంతా ఇతరుల కోసమే జీవించిన చాలా అరుదైన మానవతామూర్తి జయశ్రీ. ఆమె జ్ఞాపకాలు ఇపుడే కాదు, భవిష్యత్ తరాలకు కూడా స్ఫూర్తిదాయకమే.
ప్రొ. హరగోపాల్
Comments
Post a Comment