భూమి కోసమే దళిత రైతు హత్య | ప గో జిల్లా

ప్రెస్ నోట్, ఏలూరు. ది 6. 8.2021. (పౌర హక్కుల సంఘం నిజ నిర్ధారణ బృందం నివేదిక) *భూమి కోసమే దళిత రైతును హత్య చేశారు. భీమడోలు వీర రాఘవులు ను హత్య చేసిన హంతకులను కఠినంగా శిక్షించాలి. తక్షణం దోషులను అరెస్టు చేయాలి. అరెస్ట్ లో ఆలస్యం వెనుక కారణం పోలీసులు వెల్లడించాలి. *పౌర హక్కుల సంఘం నిర్ధారణ కమిటీ డిమాండ్* ఈరోజు ది 6. 8. 2021 న పౌర హక్కుల సంఘం పెదవేగి మండలం మో0డూరు గ్రామంలో హత్యకు గురి కాబడిన భీమడోలు వీర రాఘవులు కుటుంబాన్ని పరామర్శించినది. పరామర్శించిన బృందంలో పౌర హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, హైకోర్టు న్యాయవాది శ్రీమన్నారాయణ జిల్లా ప్రధాన కార్యదర్శి, న్యాయవాది కే .వి. రత్నం జిల్లా ఉపాధ్యక్షులు, న్యాయవాది శ్యాం బాబు తదితరులు ఉన్నారు

 ఈ నిజనిర్ధారణ బృందం ముందు వీర రాఘవులు భార్య సరోజనమ్మ మాట్లాడుతూ ఎండిపోతున్న వరి పొలం అర ఎకరం అరగంటలో నీళ్లు పెట్టవచ్చని అరగంట ఆగలేక దళితుల మైనందున చిన్నచూపుతో నా భర్త పై దాడి చేసి హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నా భర్తను హత్య చేసిన ఆరు మల్ల వల్లిరావు, ఆరుమల్ల గోపాలం ని చట్టపరంగా కఠినంగా శిక్షించాలని అన్నారు. పోలీసులు ఇంతవరకు హంతకులను అరెస్ట్ చేయలేదని ఆమె ఆవేదన చెందింది. పెద్ద కుమారుడు మాణిక్యాలరావు పౌరహక్కుల సంఘం బృందం తో మాట్లాడుతూ నీళ్ల గురించి హంతకులు పంటలు వేసుకునే సమయంలో తరచుగా గొడవ పడేవారని మనిషిని చంపుతారు అని ఊహించలేదని అన్నారు. దళితుల మైన మాకు వారి పక్కన భూమి ఉండటం గిట్టక అగ్రకుల దురహంకారంతో మా నాన్న పై దాడి చేసి చంపేశారు అని ఆరోపించారు జిల్లాస్థాయి అధికారులు అందరికీ ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు దోషులను ఎందుకు అరెస్టు చేయడం లేదో అర్థం కావడం లేదని ఆవేదన చెందారు. రెండో కుమారుడు రాటాలు మాట్లాడుతూ దళితులను కొట్టి చంపడం చంపిన తర్వాత హంతకులను వెంటనే అరెస్టు చేయకుండా వారికి మద్దతుగా నిలబడటం పోలీసులు నిందితులతో కలిసి ఆడుతున్న నాటకమని అన్నారు. ఇంతవరకు హంతకులను అరెస్ట్ చేయకపోవడం పంచనామా చేయకపోవడం మాకు రక్షణగా రెవెన్యూ పోలీసు అధికారులు స్పందించక పోవడం చూస్తుంటే చాలా ఆవేదన కలుగుతుందని వాపోయారు.

 రెవెన్యూ అధికారులు వచ్చి మా వద్ద ఏ విధమైనటువంటి స్టేట్మెంట్ తీసుకోలేదని బాధ పడ్డారు. మా దళితుల ప్రాణాలు కి విలువ లేదా అని ప్రశ్నించారు. పలువురు గ్రామస్తులు నిజనిర్ధారణ బృందంతో మాట్లాడినారు. భీమడోలు వీర రాఘవులు హత్య ఆందోళన కలిగిస్తోందని అత్యంత దుర్మార్గమని బృందానికి తెలిపారు. దళితుల భూమి కలిగి ఉండటం నేరం అయిపోయిందని గ్రామంలోని పలువురు దళితులు ఆందోళన చెందారు. *పౌరహక్కుల సంఘం నిర్ధారణ* దళిత రైతు భీమ డోలు వీర రాఘవులు తనకున్న కొద్దిపాటి భూమితో ఆత్మగౌరవంతో బతకటం అగ్ర కులాల మధ్య భూమి ఉండటం దానిని సాగు చేయడం హంతకులకు గిట్టని కారణంగానే దాడి చేసి చంపేశారని పౌర హక్కుల సంఘం నిజనిర్ధారణ బృందం నిర్థారించింది. ఈ దాడి దళితుల ఆత్మ గౌరవం పైన జీవించే హక్కు పైన జరిగిన దాడిగా నిజనిర్ధారణ బృందం భావించింది. మనిషిని పొలంలో వేసి కొట్టి చంపడం వారి కర్కశత్వానికి నిదర్శనమని తెలిపింది. దళితులు భూమి కలిగి ఉండటం అది అగ్రవర్ణాల పక్కన సాగు చేసుకోవటం ఈ దేశంలో నెరమై పోయింది అని బృందం ఆవేదన చెందింది. 75 సంవత్సరాల ల భారత్ సాధించిన సమానత్వం ఇదేనా? ప్రభుత్వాల అభివృద్ధి ఇదేనా? అని ప్రశ్నించింది. భూమిపై హక్కు కోసం ఎస్సీ ఎస్టీలు తరతరాలుగా పోరాడుతున్నారని వారికి న్యాయం జరగడం లేదని 75 సంవత్సరాల స్వతంత్ర భారతావని లో మనువాదులు అగ్రవర్ణ దురహంకారులు ప్రభుత్వాలు దళితులకు మృత్యువునే బహుమతిగా ఇస్తు నారు అని బృందం ఆవేదన చెందింది. పోలీసులు రెవెన్యూ వారు సంఘటన స్థలంలో శవ పంచనామా నిర్వహించకపోవడం పట్ల బృందం తప్పుబట్టింది. కేసు నమోదు చేసి దోషులను అరెస్టు చేయడంలో జాప్యం ప్రదర్శించటం వెనక హంతకు లకు పోలీసులు మద్దతుగా నిలబడ్డారని ప్రజలు భావిస్తున్నారు.

 దీనిపై ప్రజలకు పలు సందేహాలు ఉన్నాయి హంత కులలో ఒకరిని దాచిపెట్టడం ఒకరిని హాస్పటల్లో చేర్చటం పలు అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయి. నిందితులకు సంఘటనా స్థలంలో ఏ విధమైన గాయం లేదని ప్రజలు తెలియజేస్తున్నారు. అలాంటప్పుడు ఒక హంతకుడు హాస్పిటల్లో ఏ విధంగా జాయిన్ అయ్యాడు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. స్టేషన్లోనే హంతకులు అదేరోజు లొంగిపోతే వారిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించకుండా ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రజలు అడుగుతున్నారు. దీనిపై సమగ్ర విచారణ పోలీసు ఉన్నత అధికారులు చేపట్టాలని బృందం నిర్ణయిస్తూ తీర్మానించింది. కేసు లో నిందితులను అరెస్టు చేయకుండా జాప్యం చేసినటువంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని బృందం డిమాండ్ చేస్తున్నది.
 *డిమాండ్స్* 1.తక్షణం దోషులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలి (2). భీమడోలు వీర రాఘవులు బాధిత కుటుంబానికి 50 లక్షలు రూపాయలు ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించాలి. (3)కుటుంబంలో అర్హులైన ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి.(4) ఆ కుటుంబానికి ఐదెకరాల భూమిని ప్రభుత్వం మంజూరు చేయాలి. (5)కుటుంబానికి రక్షణ కల్పించాలి.(6) దళితులపై దాడులు జరగకుండా కఠిన చర్యలు చేపట్టాలి.

 ఇట్లు . నిజనిర్ధారణ బృందం. పౌర హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, హైకోర్టు న్యాయవాది నంబూరి శ్రీమన్నారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి న్యాయవాది కేవీ రత్నం, జిల్లా ఉపాధ్యక్షులు, న్యాయవాది బి శ్యాం బాబు

Comments