నల్లమల మండుతూనే ఉన్నది
ప్రొఫెసర్ లక్ష్మణ్ గడ్డం.అధ్యక్షులు, పౌర హక్కుల సంఘం తెలంగాణ
18 ఆగస్ట్,2021,బుధవారం,ఎడిట్ పేజి, ఆంధ్రజ్యోతి దినపత్రిక
ప్రతిసంవత్సరం వర్షాకాలం ప్రారంభంలో తెలంగాణ ప్రభుత్వం చెట్లు నాటే కార్యక్రమాన్ని హరితహారం పేరుతో అటవీ అధికారులకు అప్పజెబుతోంది. ఎక్కడా జాగ దొరకనట్లుగా వారు నేరుగా ఆదివాసీలు సాగుచేసుకునే భూమిలో ప్రవేశించి కేసీఆర్ ఇచ్చిన మొక్కలు నాటుతున్నారు. 2021 జూలై 2న నల్లమల అటవీ అధికారులు నాగర్‌కర్నూల్ జిల్లా, అమ్రాబాద్ మండలం, మాచారం గ్రామంలోని 23 చెంచు కుటుంబాలు సాగు చేసుకుంటున్న వ్యవసాయ భూమిలో హరితహారం దించడానికి వచ్చారు. ఏనాడూ లేని విధంగా అధికారులు ఈ సంవత్సరం ఈ ఖరీఫ్ సీజన్‌లో వ్యవసాయం చేయకూడదని గత నెల రోజులుగా ఇబ్బంది పెడుతున్నారు. ఈ క్రమంలోనే అటవీ అధికారులు ఆ రోజు పోడు భూములలో బేస్‌లైన్ వేయడానికి వచ్చారు. ఆదివాసీలు అధికారులను అడ్డుకున్నారు. వాగ్వివాదాలు మొదలై ఆవేశాలకు లోనయ్యారు. ఉన్న ఒక్క జీవనాధారం దూరమవుతుందని భయాందోళనకు గురైన ఆదివాసీలు తీవ్ర మనోవేదనకు గురైనారు. ఈ భూములే మా జీవనాధారం ప్రభుత్వం వాటిని తీసుకుంటే మేము ఎలా బతకాలనే ఆలోచన వారిని తీవ్ర మానసిక ఆందోళనకు గురిచేసింది. ఎన్నో ఏళ్లుగా తాము ఈ భూములు సాగు చేసుకొని బతుకుతున్నామని ఇవి లేకపోతే మాకు జీవనం లేదని, వీటిని కాపాడుకోవడానికి ఇదే గడ్డమీద మేము చావడానికి సిద్ధమని అంటూ పార్వతి అనే చెంచుమహిళా రైతు ఆవేశానికి లోనై పక్కనే ఉన్న మరో మహిళ చేతిలోని పెట్రోల్ బాటిల్ లాక్కొని అటవీ అధికారిపై పోసింది. తగల బెట్టడానికి యత్నించింది. టిల్లరులో నింపడానికి పొలంలోకి తీసుకువచ్చిన బాటిల్ అది. తెలిసో తెలియకో క్షణికావేశంలో జరిగిన ఈ చర్య వల్ల ఉడుతనూరు పార్వతితో పాటు మల్లమ్మ, నిరంజన్, మల్లయ్యలు చట్టం ఉచ్చులో చిక్కుకున్నారు.
గత నెల రోజులుగా అటవీ అధికారులు పెడుతున్న బాధలతో గుండెల్లో గూడు కట్టుకున్న ఆగ్రహం ఒక్కసారిగా బద్దలైంది. ఈ దావానలానికి ఎవరు బాధ్యత వహించాలి? రాజ్యం ఆధునిక తెలివితేటలున్న అధికారులకు అక్షరజ్ఞానం లేని అమాయకపు ఆదివాసుల మధ్య నిప్పులు పెట్టి సెగ కాచుకుంటోంది. ఆనాడు అక్కడ జరిగిన దృశ్యమంతా తమ సెల్‌ఫోన్‌లో చిత్రీకరించిన అధికారులు పెట్రోలు చల్లిన దృశ్యం వరకు మాత్రమే మీడియాకు రిలీజ్ చేయడంతో అది విస్తృతంగా వైరల్ అయ్యింది. అమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో మొత్తం 55 చెంచు ఆదివాసీ కుటుంబాలున్నాయి. అందులో భూమి లేని 23 కుటుంబాలు దాదాపు 70 ఎకరాల భూమిని 2001 నుంచి సాగు చేసుకొని జీవనం కొనసాగిస్తున్నారు. ఒక ఆదివాసీ రైతు చెమట కక్కే శరీరాన్ని హూనం చేసుకొని రోజుల తరబడి గుబురైన పొదలు, చెట్లు, ముళ్లకంపలు నరికి వేసి భూమిని చదును చేసి వ్యవసాయానికి అనుగుణంగా చేస్తాడు. ఇదంతా రహస్యంగా జరిగే పనికాదు. బహిరంగంగానే జరుగుతుంది. ఈ ప్రక్రియ కొనసాగుతున్నప్పుడు ఏనాడు ఏ అధికారి ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. ప్రభుత్వం ఆనాడే అడ్డుపడితే అప్పుడే ఆగిపోయే వారంకదా అని ఆదివాసీలు వాపోతున్నారు. అప్పుడు అడవిలో అన్నలు అండగా ఉన్నారు మాకు. కనుక సాహసం చేయని అధికారులు ఇప్పుడు అనాధలమయ్యాక దాడులు చేస్తున్నారని గుర్తు చేసుకుంటున్నారు. అన్నలుంటే అధికారులు మా పొలాలలో కాలు మోపేవారా? అని ప్రశ్నిస్తున్నారు.
2015 నుంచి అమలుపరుస్తున్న హరితహారం కార్యక్రమం ఆదివాసీల జీవించే హక్కుకు విఘాతం కలిగిస్తోంది. హరితహారం కార్యక్రమం రోడ్డు సరిహద్దు స్థలాలలో, నదులు, కాలువల వడ్డున బీడు గుట్టలలో సంస్థాగత ఆవరణలో, మత సంబంధ స్థలాలలో, నివాస కాలనీలలో, ఉమ్మడి ఖాళీ స్థలాలలో, పార్కులలో మాత్రమే మొక్కలు నాటాలని సూచిస్తోంది. ఆదివాసి పోడు వ్యవసాయ భూములలో చెట్లునాటాలని ఎక్కడా లేదు. అటవీ అధికారులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. చట్టాల ఉల్లంఘనకు పాల్పడుతున్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగస్టు 9న పోడుభూముల సమస్యను త్వరలో పరిష్కరిస్తానని ప్రకటించిన రోజునే నాగర్ కర్నూలు జిల్లా, అమ్రాబాద్ మండలం సార్లపల్లి గ్రామానికి చెందిన అయిదుగురు ఆదివాసీ చెంచులు రాములు, పెద్దయ్య, సైదులు, మాసయ్య, అంజయ్యలు అడవిలోకి వెళ్లి ఆత్మహత్యాయత్నం చేశారు. సమయానికి వచ్చిన ప్రజలు వారిని కాపాడగలిగారు. తాత, ముత్తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న రామలేటి పెంట సర్వే నెంబరు 1459/ 19/1లోని రెండెకరాలకు రెవెన్యూ అధికారులు హక్కు పత్రాలిచ్చినప్పటికీ అటవీ శాఖ అధికారులు అడ్డుపడుతూ దౌర్జన్యం చేస్తున్నారని, ఆవాసాలను కూల్చి వేస్తున్నారని సూసైడ్ నోట్‌లో తెలిపారు. పోడు భూములు సాగు చేసుకుంటున్న ఆదివాసీలను జైలుపాలు చేస్తున్నారని కలత చెందారు.
ఏదైనా నిర్దేశిత భూమి అటవీభూమిగా ప్రకటించాలంటే అధికారులు ఒక పద్ధతి పాటించాలి. తొలుత ఆ భూమికి సంబంధించిన వివరాలను ప్రకటించాలి. సదరు భూమిపైన ఎవరైనా పూర్వంనుంచే హక్కుదారుడు ఉంటే విచారణ జరిపి అతని వాదనలు విని సామరస్యపూర్వకంగా పరిష్కరించాలి. ఆదివాసీలకు సంబంధించిన అంశాలపై మానవతాదృక్పథంతో వ్యవహరించాలి. సాధారణంగా ఆదివాసీ రైతు ఆ ‘సారెడు’ భూమిని తన కుటుంబాన్ని పోషించడం కోసం సాగు చేస్తున్నాడని గ్రహించాలి. ఏ పరిశ్రమనో స్థాపించడానికి కాదు. ఆ భూమికి పాసుపుస్తకం కూడా ఏళ్ల తరబడి సాగు చేస్తున్నా కాని అందని పరిస్థితి ఉంది ఆ భూమికి రైతుబంధు రావడం కాని, బ్యాంకులు రుణాలు మంజూరు చేయడం కాని జరగదు. ఈ సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వాలు పూనుకోవాలి. సాగు చేసుకుంటున్న వారికి పట్టాలివ్వాలి. ఈ చెంచుజాతి అంతరించి పోకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ప్రపంచంలోని అన్ని జాతులలో జనాభా పెరిగిపోతుండగా చెంచుల జనాభా మాత్రం ఏటేటా తగ్గిపోతున్నది. దానికి కారణం దుర్భరమైన అనారోగ్యం, దారిద్య్రం, అవిద్య, అజ్ఞానం. వర్షాకాలం ఆరంభమయ్యే సమయంలో వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల మలేరియా, డయేరియా, తదితర వ్యాధులు విజృంబించి వందలాది మంది అసువులు బాయటం ఏటా ఇక్కడ సర్వసాధారణం. ఈ ఎండాకాలం మార్చిలో నల్లమల అడవికి మంటలు అంటుకుని కాలిపోతున్నప్పుడు ఆ మంటల్లో చిక్కుకుని మల్లాపూర్ పెంటకు చెందిన నలుగురు ఆదివాసులు మరణించారు. వారికి ఇప్పటివరకు ఎలాంటి ఎక్స్‌గ్రేషియా అందలేదు. అంతకు పూర్వమే ఇదే గ్రామానికి చెందిన ఎనిమిదేళ్ల శ్రావణి అనే బాలిక అడవిలో తప్పిపోయింది. ఇప్పటివరకు ఆ అమ్మాయి ఆచూకి ప్రభుత్వం కనుగొనలేదు. కాని ఆదివాసులు ఎక్కడ భూములు సాగు చేసుకుంటున్నా ఆ విషయం మాత్రం అధికారులు ఆలస్యంగా నైనా సరే కనుక్కుంటున్నారు. అస్తిత్వపు అంచుల్లో కొట్టుమిట్టాడుతున్న ఈ తెగ కాలగర్బంలో కరిగిపోకుండా కాపాడుకోవాల్సింది పోయి, బతకడానికి దున్నుకుంటున్న భూమిని అధికారులు మీకు యాజమాన్యపు హక్కు పత్రాలు లేవనే నెపంతో స్వాధీనపరుచుకోవడం అత్యంత అమానుషం. సంప్రదాయ ఆదివాసీ విశ్వాసాల ప్రకారం వీళ్లు దేనిని యాచించరు. భద్రపరుచుకోలేరు. తమ పూర్వీకుల కాలం నుంచి ఇక్కడే నివసిస్తున్నాం, అటవీ భూములు సాగు చేసుకుంటున్నాం. ఇక ఆధారాలెందుకు? అనే పూర్వీకుల సంస్కృతితోనే నేటితరం యువ ఆదివాసీలు కూడా ఉంటున్నారు. రాతపూతలు మాకెందుకు అనే భావనకు, రాతపూర్వక ఆధారాలు లేకపోతే కుదరదంటున్న ఆధునిక రాజ్యవ్యవస్థకు మధ్య ఘర్షణ జరుగుతుంది. పరిష్కారం మాత్రం రాజ్యం చేతుల్లోనే ఉంది. ఈ అభయారణ్యంలోని పులుల సంరక్షణ కోసం ప్రభుత్వం చూపే తపనలో అణువంతైనా అమాయకపు మనుషులపైన చూపెడితే ఒక మానవ తెగను కాపాడుకున్నవాళ్లమవుతాం. కానీ రాజ్యానికి వీరి మనుగడకన్నా కార్పొరేట్ శక్తుల లాభాలు ముఖ్యం. ఇక్కడ నిక్షిప్తమై ఉన్న వజ్రాలు, వైఢూర్యాలు, యురేనియం నిల్వలు వెలికితీసి వారికి అప్పజెప్పడం అత్యంత ప్రాధాన్యం. వీరి ఉనికి ఇక్కడ కనుమరుగైతే తలపెట్టిన కార్యం సులభమవుతుంది కనుక ఈ వేధింపుల పర్వం కొనసాగుతుంది.
జూలై 2న జరిగిన ఘటనలో పార్వతిని అటవీ అధికారులు కింద పడదోశారు. తోపులాటలో జాకెట్ చిరిగి పోయింది. వాతావరణం ఉద్రిక్తంగా మారిపోయిందని తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకొని ఇరువర్గాలను శాంతింప చేశారు. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ సీజనులో వ్యవసాయానికి ఆటంకం కల్పించవద్దని అధికారులను హెచ్చరించారు. పోలీసు కేసులు నమోదు చేసుకోవద్దని కూడా సూచించారు. అయినా కాని ఈ సూచనను బేఖాతరు చేస్తూ అటవీ అధికారులు ఆదివాసీలపై కేసులు నమోదు చేశారు. మరోవైపు చెంచులు కూడా ఫిర్యాదు చేశారు. చిరిగిన జాకెట్ కూడా పోలీసులకు సాక్ష్యంగా అందజేశారు. చెంచు మహిళల ఫిర్యాదును పట్టించుకోని పోలీసులు, అధికారులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా హత్యాయత్నం కేసులు, ఇతర కేసులు బనాయించి ఉడుతనూరు పార్వతి, లింగమ్మ, నిరంజన్, లింగయ్యలను అరెస్టు చేసి రిమాండ్ చేశారు. తిట్టినందుకు, పడదోసినందుకు, వేధించినందుకు ఏ కేసులు నమోదు కాలేదు. ఇది మనవ్యవస్థలో అణగారిన వర్గాలకు తరతరాలుగా జరుగుతున్న అన్యాయం. అయితే ఈ చర్య అసలు సమస్యను పరిష్కరిస్తుందా? ఉద్రిక్తతలను తగ్గిస్తుందా? పెంచుతుందా? ఆదివాసీలు తమ భూములను సాగు చేసుకోవాలా? వద్దా? ఆదివాసులు మాత్రం ఏలాగూ జైలుకు వెళ్లి వచ్చినాం కనుక యిక మీదట ఎవ్వరు ఆటంకపరిచినా మా విల్లంబులను బయటికి తీస్తామని ఖండితంగా చెబుతున్నారు. అటవీ అధికారులు ఆదివాసీల శాంతియుత జీవితానికి విఘాతం కలిగిస్తున్నారు. నల్లమల ఎల్లకాలం అగ్నిగుండంలా మండాల్సిందేనా! ఆదివాసీల భూములకు వెంటనే పట్టాలివ్వాలి....
..
లక్ష్మణ్ గడ్డం
అధ్యక్షులు పౌర హక్కుల సంఘం
Comments
Post a Comment