ఎల్లన్న నగర్ పోడు రైతులపై అటవీ అధికారుల దౌర్జన్యం | ఖమ్మం జిల్లా

ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం ఎల్లన్న నగర్ పోడు రైతుల పై అటవీ అధికారుల దౌర్జన్యాన్ని పౌర హక్కుల సంఘం తెలంగాణ తీవ్రంగా ఖండిస్తోంది...

 ఖమ్మం జిల్లాలో జైలుపాలైన 19 మంది మహిళలు..చంటి పిల్లలతో ముగ్గురు తల్లులను బేషరతుగా విడుదల చెయ్యాలి......

 పోడు సాగు దారులపై కేసీఆర్ ప్రభుత్వం మోపిన ఉక్కుపాదం అప్రజాస్వామికం మరియు రాజ్యాంగ విరుద్ధం...

హక్కుల ఉల్లంఘనకు చిరునామాగా మారిన ఎల్లన్న నగర్..........

పౌర హక్కుల సంఘం తెలంగాణ నిజ నిర్దారణ బృందం ఎల్లన్న నగర్ పర్యటన నివేదిక...

పౌర హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ మరియు ఖమ్మం జిల్లా పౌర హక్కుల సంఘం ఉమ్మడిగా ఆగస్టు 8న,ఆదివారం,2021న ఎల్లన్న నగర్ సందర్శించి , ప్రజలను కలిసి సేకరించిన నిజనిర్ధారణ నివేదిక వివరాలు...

ఎల్లన్న నగర్ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో హక్కుల ఉల్లంఘనకు చిరునామాగా మారింది .తెలంగాణ KCR ప్రభుత్వం తలచుకుంటే ఎవరినైనా జైలుపాలు చేయగలదని నిరూపించే ఘటనల నేపథ్యంలో ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలోని ఎల్లన్న నగర్లో కూడా జరుగుతున్నాయి. 19 మంది మహిళలను ఎటువంటి కనికరం లేకుండా ఒకే కేసులో రాత్రికి రాత్రి అరెస్టు చేసి జైలుపాలు చేశారు అరెస్టయినవారిలో 10 మంది చిన్న పిల్లల తల్లులు కావడం విశేషం. అంతేకాక ముగ్గురు తల్లులు తమ 3 ,8 ,11 నెలల చంటి పిల్లలను చంకలో వేసుకుని జైలుకు వెళ్లాల్సి వచ్చింది. తల్లులు జైలు పాలవడంతో 2 నుంచి 10 సంవత్సరాల వయసున్న 15 మంది పిల్లలు రెక్కలు విరిగిన పక్షుల్లా ఇళ్ల వద్ద అల్లాడిపోతున్నారు. వారి ఆహాకారాలతో ఊరంతా తల్లడిల్లి పోతుంది.ఊరంతా వారికి తల్లిదండ్రులుగా ఆదరణ ఇస్తున్నా వారిని ఊరడించడం ఎవరి తరం కావడం లేదు. మా అమ్మ ఎక్కడ ? ఎప్పుడొస్తుందని పిల్లలు అడిగే ప్రశ్నలకు ఎవరి వద్ద జవాబులు లేవు. పిల్లలు తల్లుల కోసం తల్లడిల్లుతుంటే వారిని ఓదార్చలేక , ఆలనా పాలనా చూడలేక తండ్రులు పడే బాధ వర్ణనాతీతం. పిల్లలు మెతుకు ముట్టడం లేదని ,నిద్ర కూడా పోవడం లేదని గ్రామస్థులు వాపోతున్నారు.

 బ్రెయిన్ లో గడ్డలు ఉండి పిట్స్త్ తో బాధపడుతున్న 11 సంవత్సరాల గోపాలకృష్ణ ను వారించడం ఎవరి వల్ల కావడం లేదు.
కరెంట్ షాక్ తో 90 శాతం ఒళ్లంతా కాలి, కిడ్నీలు పోయిన తండ్రి లేని 14 సంవత్సరాల చరణ్ , ఉన్న తల్లి జైలు పాలవడంతో గ్రామంలో దిక్కులేని వాడిగా పడి ఉన్నాడు.
మానవత్వం లేని ప్రభుత్వ అమానుష చర్యకు గ్రామమంతా నిర్వేదంతో మునిగిపోయి ఉంది.

150 కుటుంబాలున్న ఈఎల్లన్న నగర్ గ్రామస్తులు చేసిన నేరమేంటి ?వారి నేపథ్యం ఏమిటి ? మూడు దశాబ్దాల వెనక్కి వెళితే, ఖమ్మం చుట్టుపక్కల మండలాలలో ఉండే వీరికి ఎటువంటి బతుకు తెరువు లేక వెట్టి పనులు , జీతాలు చేస్తూ బతుకులీడ్చుకునేవారు. కులం, మతం, ఊరూ, వాడా పట్టింపు లేకుండా కొణిజర్ల మండలం గుబ్బగుర్తి గ్రామ సమీపంలో నాగార్జున సాగర్ ఎడమ కాలువ వెంట ఉన్న అటవీ భూమిని సేద్యం చేసుకునేందుకు సిద్ధపడ్డారు. ఆనాడు వీరే కాదు, వందలాది మంది నిరుపేదలు ఇదే నాగార్జునసాగర్ ఎడమ కాలువ వెంట దాదాపు 15 కిలోమీటర్ల పొడవున ఉన్న అటవీ భూమిని తమ బతుకు తెరువు కోసం జీవనాధారంగా ఎంచుకున్నారు. 

1992-95 సంవత్సరాల కాలంలో ఎన్నో నిర్బంధాల నడుమ C P I (M-L న్యూ డెమోక్రసీ) పార్టీ నేతృత్వంలో సుమారు 2500 ఎకరాల అటవీ భూమిని కొట్టుకొన్నారు.పోడు వ్యవసాయంతో తమ కాళ్లపై తాము నిలబడి స్వతంత్ర జీవనం మొదలుపెట్టారు. ఆ క్రమంలోనే పార్టీ ఆధ్వర్యంలో రామనర్సయ్య నగర్ ,విక్రమ్ నగర్,జంపాల నగర్ క్రాంతి నగర్ ,ఎల్లన్న నగర్ గ్రామాలను నిర్మించుకున్నారు. ఈ ఐదు గ్రామాల్లో నివసిస్తున్న 850 కుటుంబాల గిరిజన ,గిరిజనేతర పేదలు తాము సాగు చేసుకుంటున్న భూమికి అటవీ హక్కుల చట్టం 2006 ప్రకారం పట్టాలు ఇవ్వమని ఎన్నో సంవత్సరాలుగా ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నా , ఒక్కరికి కూడా పట్టా ఇవ్వలేదు.

 అలా ఏర్పడ్డ గ్రామమే ఈ ఎల్లన్న నగర్. అటవీ అధికారులు తమ ఇళ్లను నాలుగైదుసార్లు కాల్చి బూడిద చేసినా ఆ పేదలు ఆ ప్రాంతాన్ని వదల్లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఈ గ్రామంపై ప్రభుత్వం కన్ను పడింది. హరితహారం పేరుతో అధికారులు గద్దల్లా వాలారు. భవిష్యత్తులో మీ జోలికి రామని నమ్మించి వారు సాగు చేసుకునే 70 -80 ఎకరాల వ్యవసాయ భూమిని మూడేళ్ల క్రితం గుంజుకున్నారు. తిరిగి మళ్లీ ఇప్పుడు అదే హరితహారం పేరుతో అటవీశాఖ అధికారులు రాబందుల్లా వాలారు. పచ్చని పంట పొలాలను ధ్వంసం చేయడం మొదలుపెట్టారు. హరితహారానికి భూమి వదలకుంటే మీ గ్రామాన్ని నామరూపాలు లేకుండా చేస్తామని శపథం చేశారు. గతంలోనే మోసపోయిన పేదలు ఈసారి అటవీ అధికారులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదని నిశ్చయించుకున్నారు. తమ కళ్లముందే పత్తి మొక్కలను పీకి, హరితహారం మొక్కలను నాటేందుకు సిద్ధపడ్డ అటవీ అధికారుల చర్యలను అడ్డుకున్నారు. తమ ఆక్రమణలకు అడ్డు వచ్చిన పేద రైతులపై ఆడా, మగా అనే తేడా లేకుండా అధికారులు దాడులు చేశారు. జూలై చివరి వారం నుండి ఆగస్టు మొదటి వారం వరకు క్రమం తప్పకుండా అటవీ అధికారులు పంట పొలాలను నాశనం చేస్తూ హరితహారం మొక్కలు నాటేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అటవీ అధికారులకు అవకాశం ఇవ్వలేదన్న కోపంతో గ్రామస్తులపై కక్షగట్టి ఈనెల నాలుగో తేదీన హత్య ప్రయత్నం కేసు నమోదు చేశారు. 23 మందిని అరెస్టు చేశారు. అందులో 19 మంది మహిళలు ఉన్నారు. వీరిలో ముగ్గురు మహిళలు చంటి పిల్లలతో జైలుకెళ్లడంతో ప్రభుత్వం తీవ్ర విమర్శల పాలైంది. దీంతో దిక్కుతోచక ఐపిసి 307 హత్యాయత్నం సెక్షన్ ను ఉపసంహరించుకుంది.

ప్రస్తుతం ఖమ్మం జైల్లో ఉన్న మహిళలు, ఇంటి వద్ద ఉన్న పిల్లలు వివరాలు:
1. ఎత్తర మౌనిక
    * జైలుకు తీసుకెళ్ళిన 3 నెలల పాప.
    * 3 సం. జగదీష్
2. ఆళ్లకుంట కవిత
   * జైలుకు తీసుకెళ్లిన ఎనిమిది నెలల పాప
    * 3 సం. యశ్వంత్
3. ఆళ్లకుంట రాణి 
* జైలుకు తీసుకెళ్ళిన 11 నెలల పాప
 * 2 సం. పాప 
 * 3 సం. బాబు...
4. గండికోట లలిత
 * 2 సం. ఈశ్వర్
 * 5 సం. నాని
5. ఎత్తర సత్యవతి.
 * 3 సం. యోగిత
 * 5 సం.రాజు
6. గోగుల స్వప్న (కోడలు).
7. గోగుల వెంకటమ్మ (అత్త)
* 3 సం. మానస
 * 5 సం. కార్తీక్
8. ఎత్తర విజయ
 * 8 సం. చెర్రి 
 * 10 సం. గాయత్రి
9. కుంచపు పద్మ
 * 9 సం. సింధు
10. సంపంగి రేణుక
    * 10 సం. రమ్య
     *12 సం. గోపాలకృష్ణ (పిట్స్ రోగి)
11. గండికోట నాగేంద్ర
   * భర్త లక్ష్మణరావు కూడా జైల్లో ఉన్నాడు.
   * 13 సం. చరణ్
   * 15 సం.లోకేష్
12. భూక్యా సునీత
    * 14 సం. చరణ్ (కాలిన గాయాలు).

 గత నెల రోజులుగా అటవీ అధికారులు ఎన్ ఎస్ పి కాలువ కిరువైపులా ఉన్న గూడాల మీద దాడులు కొనసాగిస్తున్నారు. అవి ఈనెల ఆగస్ట్ 3 ,4,2021 తేదీల్లో పరాకాష్టకు చేరుకున్నాయి. ఆగస్టు 3న ఎల్లన్న నగర్ రైతుల భూమిలో సాగు చేసుకున్న పత్తి చేను ధ్వంసం చేస్తుండగా రైతులు అడ్డుకున్నారు. ప్రతిగా అటవీ అధికారులు రైతులను దూషించారు . భౌతిక దాడులకు ఒడిగట్టారు. మగ అధికారులు రైతు మహిళలను ముట్టుకొని జాకెట్లు చిరిగిపోయేలా ప్రవర్తించారు .ప్రతిగా 4 వ తేదీ నుంచి అరెస్టులకు పాల్పడ్డారు. మొదట్లో ఐపీసీ 307, 148 సెక్షన్లు నమోదు చేసి ,తర్వాత ఉపసంహరించడం నిదర్శనం వారు ఏ నేరం చేయలేదని. మిగతా కేసులు కూడా ఉపసంహరించుకోవాలి. జైలుపాలు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలి.....
N S P పక్కల వెలసిన గ్రామాలు, భూములు 1992 నుండి సాగు చేసుకుంటున్నారు.2005, డిసెంబర్ 13 కు ముందు నుంచే భూములు సాగుచేస్తున్నారు. ఆ గ్రామాలకు మౌలిక వసతులు లేవు. విద్య ,వైద్యం ,సమాచారం, రవాణా సౌకర్యాలు లేవు. భూములకు పట్టాలు ఇవ్వలేదు. KCR అసెంబ్లీ సాక్షిగా,2019 అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికల మీటింగ్ లలో పోడు భూములకు పట్టాలిస్తామని వేదింపులు కేసులుండవని చెప్పి ఇప్పుడు హరితహారం పేరున, ఫారెస్ట్ అధికారులతో పోడు భూముల్లో విధ్వంసం మరియు అక్రమ అరెస్టులు జైల్లో నిర్బందిచడం చేస్తున్నారు.ఇప్పటికైనా ఈ దాడులు నిర్బందాలు ఆపాలని తెలంగాణ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము.ప్రజలు, ప్రజాస్వామిక వాదులు మేధావులంతా ఈ అక్రమ అరెస్టులను ఖండించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.

*పోడు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలి...
* ఖమ్మం జిల్లాలో జైలుపాలైన 19 మంది మహిళలు..చంటి పిల్లలతో ముగ్గురు తల్లులను బేషరతుగా విడుదల చెయ్యాలి....

*దుర్మార్గంగా గిరిజన మహిళలపై దాడులు చేసిన ఫారెస్ట్ అధికారులపై S C ,S T కేసులు నమోదు చేయాలి.
*రైతుల పై నమోదు చేసిన కేసులు ఉపసంహరించాలి.

ఎల్లన్న నగర్ నిజనిర్ధారణ పర్యటనలో పాల్గొన్న పౌర హక్కుల సంఘం బృందం:

  1.ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ అధ్యక్షులు, పౌరహక్కుల సంఘం,తెలంగాణ రాష్ట్రం..

2. ఎన్. నారాయణ రావు ప్రధాన కార్యదర్శి, పౌరహక్కుల సంఘం,తెలంగాణ రాష్ట్రం..

3.k. రవి,vice president,
పౌరహక్కుల సంఘం,తెలంగాణ రాష్ట్రం.

4.మాదన కుమారస్వామి ,రాష్ట్ర సహాయ కార్యదర్శి, పౌరహక్కుల సంఘం తెలంగాణరాష్ట్రం.

5.అల్గోటే రవీందర్,కోశాధికారి,
పౌరహక్కుల సంఘం,తెలంగాణ రాష్ట్రం

6.విప్లవ్ కుమార్,ప్రధాన కార్యదర్శి,
ఉమ్మడి ఖమ్మం జిల్లా పౌర హక్కుల సంఘం.

7.కె.శ్రీనివాస్.నాయకులు,ఉమ్మడి ఖమ్మం జిల్లా పౌర హక్కుల సంఘం.


9.శీరిషా,ఉపాధ్యక్షురాలు,ఉమ్మడి ఖమ్మం జిల్లా పౌర హక్కుల సంఘం.

10.ఉదయ్ రాఘవేంద్రరావు, మెంబర్,ఉమ్మడి ఖమ్మం జిల్లా పౌర హక్కుల సంఘం.

11.ప్రవీణ్,నిజామాబాద్ జిల్లా నాయకులు, నిజామాబాద్ పౌర హక్కుల సంఘం.

8 ఆగస్ట్,2021,ఆదివారం,12:40 pm.
ఎల్లన్న నగర్, గ్రామం, కొణిజెర్ల,మండలం, ఖమ్మం జిల్లా..తెలంగాణ రాష్ట్రం...

Comments