జైలులో ఫాదర్ స్టాన్ స్వామి మరణం.. రాజ్యం చేసిన వ్యవస్థీకృత హత్య.
--------------------------------------
జూలై 5వ తేదిన ముంబై హాస్పిటల్ లో ఫాదర్ స్టాన్ స్వామి మరణించారు. ఆయన బీమాకోరేగావ్ కేసులో ముద్దాయిగా ఉండి, జ్యుడీషియల్ కస్టడీ లో మరణించాడు. ఈ దుస్సంఘటన ను నిరసిస్తూ అనంతపురం జిల్లా పౌరహక్కుల సంఘం 18-7-2021 ఆదివారం, అనంతపురం ప్రెస్ క్లబ్ నందు అన్ని ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలతో ఉదయం 10.30 గంటలకు "రౌండ్ టేబుల్ సమావేశం " నిర్వహించింది.ఈ సమావేశానికి పౌరహక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు యం. సురేష్ బాబు అధ్యక్షత వహించారు.
ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో మానవహక్కుల రాష్ట్ర కార్యదర్శి అబ్దుల్ రసూల్, భారత కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి నారాయణ స్వామి, కులనిర్మూలన పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు శ్రీరాములు, పట్టణ పేదల సంఘం జిల్లా అధ్యక్షుడు వీరనారప్ప, ప్రజాకళామండలి జిల్లా కార్యదర్శి విజయ్, ప్రజాస్వామ్య పరిరక్షణ సంస్థ (ఓ.పి.డి.ఆర్) జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రజాక్, అఖిల భారత కార్మిక సంఘాల సమాఖ్య జిల్లా అధ్యక్షుడు సురేష్, మాదిగ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఓబిలేసు, ప్రగతిశీల విద్యార్ధి సంఘం నాయకుడు ప్రకాశ్, అనంతపురం మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు లోకేష్, గుంతకల్లు ఐ.ఎఫ్.టి.యు నాయకుడు శ్రీరాములు, సి.పి.ఐ యం.ఎల్ న్యూడెమోక్రసీ జిల్లా నాయకుడు పెద్దన్న , పౌరహక్కుల సంఘం జిల్లా సహాయ కార్యదర్శి శ్రీ రామ మూర్తి తదితరులు ప్రసంగించారు.
జార్ఖండ్ రాష్ట్రంలో ఆదివాసీల హక్కుల కోసం గత 50 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. జార్ఖండ్ రాష్ట్రంలో జరుగుతున్న మైనింగ్ మాఫియా కు వ్యతిరేకంగా పనిచేస్తున్నందుకు ఆయనపై రాజద్రోహం, ఉపా చట్టం కింద అక్రమంగా కేసులు నమోదు చేసి, జైలులో ఉంచారు. జార్ఖండ్ రాష్ట్రంలో ఆదివాసీలను అనేకమందిని అక్రమంగా జైళ్లలో ఉంచారు. ఫాదర్ స్టాన్ స్వామి ఈ అక్రమ అరెస్టులను వ్యతిరేకిస్తూ జార్ఖండ్ హైకోర్టులో పిల్ వేశారు. హైకోర్టు ఉ ఆయన వేసిన పిల్ కేసును విచారించి జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో లో ఏర్పడిన ప్రభుత్వం ఆదివాసీలపై ఉన్న ఎనిమిది వేల కేసులను ఎత్తివేసి వారిని విడుదల చేసింది. ఈ పరిణామంతో మైనింగ్ మాఫియా, దాని వెనుక ఉన్న కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు కుమ్మక్కై కుట్రపూరితంగా ఫాదర్ స్టాన్ స్వామిపై రాజద్రోహం, ఉపా కేసులు పెట్టి బీమాకోరేగావ్ కేసులో 16వ ముద్దాయిగా ఇరికించారు. జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్న ఫాదర్ స్టాన్ స్వామి ఏరోజు కూడా మహారాష్ట్ర రాష్ట్రంలోని బీమా కోరేగావ్ ప్రాంతాన్ని కనీసం సందర్శించలేదు.
1908లో బ్రిటీష్ వారు భారతీయులను అణచివేసేందుకు తీసుకుని వచ్చిన ఈ రాజద్రోహ చట్టం ప్రకారం కనీసం 99 ఇది శాతం మందికి శిక్షలు కూడా పడలేదు. ఇలాంటి చట్టాన్ని ఇవాళ కూడా ప్రయోగించడం అవసరమా అని స్వయంగా సుప్రీంకోర్టు ప్రశ్నించడం గమనించాలి. మైనింగ్ పేరుతో జరుగుతున్న అక్రమాలను, ఆదివాసీలపై బనాయిస్తున్న కేసులను వ్యతిరేకిస్తున్న వారిపై అక్రమ కేసులను బనాయించి జైళ్లలో నిర్భందిస్తున్నారు. జాతీయ దర్యాప్తు సంస్థ ( NIA)ను ఉపయోగించి ఈ అక్రమ కేసులను నడిపిస్తున్నారు. 84 సంవత్సరాల స్టాన్ స్వామికి 'పార్కిన్ సన్' వ్యాధి ఉండంతో తినటానికి ఒక స్ట్రా మరియు ఒక సిప్పర్ ను ఇవ్వడానికి 24 రోజుల వ్యవధి తీసుకోవడం తో న్యాయ స్థానాల వైఖరిపై ప్రజలకు నమ్మకం పోతుందన్నారు. ఫాదర్ స్టాన్ స్వామి మరణం పోలీసు, న్యాయ వ్యవస్థలు, ప్రభుత్వాల ఉమ్మడి వైఫల్యానికి నిదర్శనంగా జరిగిన'వ్యవస్ధీకృతమైన' హత్యగా' వక్తలు పేర్కొన్నారు.
చివరగా రౌండ్ టేబుల్ సమావేశం ఈ కింది డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచింది.
(1) ఫాదర్ స్టాన్ స్వామి హత్య పై న్యాయ విచారణ జరిపించాలి.
(2) రాజద్రోహం, ఉపా చట్టాలను రద్దు చేయాలి.
(3) బీమా కోరేగావ్ కేసులో నిందితులందరిని వెంటనే విడుదల చేయాలి.
(4) దేశవ్యాప్తంగా వివిధ జైళ్ళలో మగ్గుతున్న ఆదివాసీలను వెంటనే విడుదల చేయాలి.
యం. సురేష్ బాబు
పౌరహక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు
వి.ఆదినారాయణ
పౌరహక్కుల సంఘం జిల్లా కార్యదర్శి.
Comments
Post a Comment