నెల్లూరులో కమీషన్ల కోసం కక్కుర్తి | సి ఎల్ సి

నెల్లూరులో కమీషన్ల కోసం కక్కుర్తి,

ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నెల్లూరులోని *చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్*

వీరు సూచించిన హాస్పిటల్ కి వెళితే ప్రాణాలు హరీ..

ఓ మహిళ మరణానికి కారణమైన చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్

సాధారణంగా నెల్లూరు జిల్లా ప్రజలు ఎక్కువగా వైద్యం కోసం పొరుగున ఉన్న తమిళనాడు లోని చెన్నై ఆసుపత్రులకు వెళ్తుంటారు. ప్రజల అవసరాలను, వారి నమ్మకాన్ని సొమ్ము చేసుకునేందుకు నెల్లూరులో "చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్"పుట్టుకొచ్చింది. చెన్నైలో ఏ హాస్పిటల్ లో వైద్యం బాగు చేస్తారు, ఎంత ఖర్చు అవుతుంది, మేము సూచించిన ఆసుపత్రికి వెళితే రోగి ప్రాణాలకు మాది గ్యారెంటీ అంటూ నమ్మ పలుకుతూ చెన్నైలో ఊరు పేరులేని ఆసుపత్రులకు చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ నిర్వాహకులు దళారులు లాగా వ్యవహరిస్తున్నారు. కాసులకు కక్కుర్తి పడే ఈ చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ నిర్వాహకులు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఈ సెంటర్ నిర్వాహకుల బాధ్యతారాహిత్యం, కమీషన్ల
కక్కుర్తి కారణంగా ఇటీవల ఓ నిండు ప్రాణం బలైపోయింది. చెన్నైలో లో వీరు సూచించిన హాస్పిటల్ కి వెళ్ళిన ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆమె భర్త ఎలాగో తప్పించుకుని ఆ ఆస్పత్రి నుంచి బలవంతంగా డిశ్చార్జి అయ్యి ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ విషయమై చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ నిర్వాహకులు ని ప్రశ్నించగా బాధితుడు పైనే ఎదురుదాడికి దిగాడు. వివరాలిలా ఉన్నాయి. బాధితుడు పేరూరి ప్రదీప్ ఆదివారం నెల్లూరు లో విలేకరులతో మాట్లాడుతూ చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ నిర్వాహకులు కారణంగా తన భార్య ను ఏవిధంగా కోల్పోయాడో వివరించాడు.
నెల్లూరుకు చెందిన పేరూరి ప్రదీప్, ఆయన భార్య పేరూరి అనిత కు కరోనా సోకింది. ప్రదీప్ కు చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ నిర్వాహకుడు రమేష్ స్నేహితులు. దాంతో ప్రదీప్ చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ నిర్వాహకుడు రమేష్ ను ఆశ్రయించి చెన్నైలో కరోనా చికిత్స కు మంచి హాస్పిటల్ ను సూచించాలని కోరాడు. దాంతో రమేష్ స్నేహితుడు అనే విషయాన్ని కూడా మరచి చెన్నైలో అంతగా పేరు లేని కామాక్షి మెమోరియల్ హాస్పిటల్ పేరును సూచించి మీ ఇద్దరికీ బాగా అయ్యేవరకు నాది పూచీ అంటూ అక్కడికి పంపాడు. చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ నిర్వాహకుడు రమేష్ పై నమ్మకంతో కరోనా బాధితులు అయిన ప్రదీప్, అనిత చెన్నైలోని కామాక్షి మెమోరియల్ ఆస్పత్రికి వెళ్లారు. వీరిద్దరిని చెన్నైకి పంపేందుకు సెంటర్ నిర్వాహకుడు తన వాహనాన్ని ఇచ్చాడు. వీరిద్దరూ చెన్నై వెళ్లేందుకు వాహనం చార్జి కింద తొమ్మిది వేల రూపాయలు వసూలు చేశాడు.
 వీరిద్దరికీ కరోనా కొద్ది పర్సంటేజ్ మాత్రమే ఉంది. నాలుగైదు రోజుల చికిత్స తో వీరిద్దరు కోలుకునే ఛాన్స్ ఉంది. అయితే కామాక్షి హాస్పిటల్స్ లో తొలుత ప్రదీప్ కు చికిత్స ప్రారంభించారు. అవసరం లేకపోయినా పలు రకాల మందులు వేసి ఆయనకు ఆక్సిజన్ పెట్టి చివరకు ఐసియు లోకి మార్చారు. తనకు ఆరోగ్యం బాగుంది.. డిశ్చార్జ్ చేయాలని ప్రదీప్ వేడుకున్నా ఆస్పత్రి నిర్వాహకులు కనికరించలేదు. తనను ఇక్కడికి పంపింది చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ నిర్వాహకుడు రమేష్ కాబట్టి ఆయనకు ఫోన్ చేసి పరిస్థితి వివరించి సరైన వైద్యం చేయించాలని ప్రదీప్ వేడుకున్నాడు. అయితే రమేష్ అక్కడ పంపడం వరకే మా బాధ్యత అంటూ చేతులు దులుపుకొని పక్కకు తప్పుకున్నాడు. ప్రదీప్ ఆసుపత్రి వర్గాలతో వాదనకు దిగి బలవంతంగా డిశ్చార్జి అయ్యి నెల్లూరు వచ్చేసాడు. ఆయన భార్య అనిత అదే హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. ఆమెకు కొద్దిరోజుల చికిత్స అనంతరం కరోనా నెగిటివ్ వచ్చింది. అయినా కూడా ఆమెను ఐసీయూలో ఉంచి చికిత్స చేస్తున్నామంటూ కామాక్షి ఆసుపత్రి నిర్వాహకులు చెప్పారు.
 కరోనా చికిత్స కావడంతో ప్రదీప్ కూడా ఏమీ చేయలేక నెల్లూరుకు వచ్చి రమేష్ ను ఆశ్రయించి తన భార్య విషయం వాకబు చేయాలని వేడుకొన్నాడు. రమేష్ ఈ విషయం నాకు సంబంధం లేదు.. ఆసుపత్రికి పంపి అంత వరకే నా బాధ్యత.. అక్కడ వైద్యం ఎలా చేయాలో ఏమి చేయాలో ఆసుపత్రి వారు చూసుకుంటారు నన్ను ఒత్తిడి చేయవద్దు నాకు సంబంధం లేదంటూ కరాఖండిగా చెప్పాడు. 24 రోజుల పాటు ప్రదీప్ భార్య అనిత కామాక్షి ఆసుపత్రిలో ఐసీయూలో ఉంటూ గత నెల 29న చనిపోయారు. కామాక్షి ఆసుపత్రి వైద్యుల నిర్వాకం, చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ నిర్వాహకుడు రమేష్ కారణంగా తన భార్య చనిపోయిందని బాధితుడు ప్రదీప్ చెప్తున్నాడు. మంచి ఆసుపత్రిని సూచించమని చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ కు వెళితే వైద్యం సరిగా చేయని ఆసుపత్రులకు రెఫర్ చేస్తారని, పేషెంట్ ను పంపిన దానికి ఎవరు ఎక్కువ కమీషన్ ఇస్తే ఆ ఆసుపత్రికి ఇక్కడ నుంచి రోగులను పంపుతున్నారని, బాధితులు చెబుతున్నాడు. కమీషన్లకు కక్కుర్తిపడి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఇలాంటి సెంటర్లపై చర్యలు తీసుకోవాలని పౌర హక్కుల సంఘం నెల్లూరు జిల్లా కమిటీ డిమాండ్ చేస్తున్నది.

Comments