పౌరహక్కుల సంఘంతో సహా 16 ప్రజా సంఘాలపై తెలంగాణ ప్రభుత్వం విధించిన నిషేధం ఎత్తి వేయాలని కోరుతూ ఈ రోజు (17-06-2021) ఆ సంఘం నాయకులు భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ ను కలిశారు. హైదరాబాద్ లో ఉన్న ఛీఫ్ జస్టిస్ ను కలిసిన పౌరహక్కుల సంఘం నాయకులు ఆయనకు ఓ నివేదికను సమర్పించారు.
ఈ సందర్భంగా పౌరహక్కుల సంఘం (CLC) విడుదల చేసిన మీడియా ప్రకటన..
ప్రభుత్వాలు చాలా కాలంగా పౌర హక్కుల సంఘాన్ని నిషేధించాలని అనుకుంటూ వస్తూ చివరికి తెలంగాణ ఏర్పడి తెలంగాణ వాసులు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మార్చి 30, 2021 న తెలంగాణ పౌర హక్కుల సంఘాన్ని నిషేదించింది. అదనంగా మరో 15 ప్రజా సంఘాలను కూడా నిషేధించారు. గతంలోనే పీపుల్స్ వార్ పార్టీని అనుబంధ సంఘాలను కూడా నిషేధించారు. దీంతో ఉద్యమాలను పూర్తిగా తుడిచి పెట్టామని సంబరపడిపోతున్నారు.
నిర్భంధాలు, నిషేదాలు, ఉద్యమాలను ఆపలేవని మరీ ముఖ్యంగా ప్రస్తుత పాలకులకు బాగా తెలుసు. అయినా కాని ఈ నిరర్దక చర్యలకు పాల్పడి మరింత అబాసుపాలవుతుంది. తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) ని ఆనాడు కాంగ్రెసు ప్రభుత్వం ఇదే రకంగా నిషేదించినట్లయితే తెలంగాణ రాష్ట్రం సాకారమయ్యేనా? తెలంగాణ సాధన కోసం పౌరహక్కుల సంఘం మిగిలిన 15 సంఘాలు టిఆర్ఎస్ తో పాటు బహిరంగ, ప్రజాస్వామిక ఉద్యమాలు చేశారు. ఆనాడు తెలంగాణ సాధనోద్యమంలో పౌర హక్కుల సంఘం పాత్రను ప్రశంసించిన నేతలే, ఈ సంఘం వేదికలో ప్రసంగించిన నేతలే యిపుడు అధికారంలో వుండి అదే సంస్థను నిషేదానికి గురి చేయడం విస్మయానికి గురి చేస్తుంది.
ఈ నిషేదానికి సంబంధించి ఈ రోజు (17-06-2021) ఉదయం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి. రమణ గారిని కలిసి నివేదికను సమర్పించాం. వెంటనే నిషేదాన్ని ఎత్తివేయాలని, సదరు జీవో నెంబరు 73ను రద్దు చేయాలని విన్నవించాం. ప్రధాన న్యాయమూర్తి సానుకూలంగా స్పందించి తగు చర్యలు చేపడ్తామని హామీ ఇచ్చారు.
పౌర హక్కుల సంఘం తన 48 సం||ల ప్రస్థానంలో ఎక్కడ కూడా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదు. సహకరించలేదు. ప్రజలను రెచ్చగొట్టలేదు. అలాంటి ప్రసంగాలు చేయలేదు. పైగా రాజ్యాంగ హామీ యిచ్చిన హక్కులను అమలు పర్చమని నిత్యం చట్టబద్ధంగా ప్రభుత్వాలను అడుగుతున్నాం. మా మొత్తం కార్యాచరణ ఎంత చట్టబద్ధంగా వుందో చూడమంటున్నాం.
నక్సలైటు ఉద్యమ సందర్భంగా ప్రభుత్వాలు సంక్షోభంలో కూరుకుపోయినపుడు ప్రభుత్వాలకు సహకరించాము. ఎన్టీ రామారావు పదవి కోల్పోయినపుడు ఆయనకు అండగా నిలబడి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని డిమాండు చేసాం. ప్రభుత్వం నక్సలైట్ల తో చర్చల జరిపిన సందర్భంగా మధ్యవర్తులుగా గణనీయమైన పాత్ర పోషించినాం. అన్నీ మర్చిపోయిన ప్రభుత్వం ఎందుకు కక్ష పూరితంగా వ్యవహరిస్తుందో వారి మనస్సాక్షికి వారు సమాధానం చెప్పుకోవాలి.
16 ప్రజా సంఘాలపై నిషేదాన్ని ఇప్పటికైనా ఎత్తివేయాలి. పౌర ప్రజా స్వామిక హక్కుల వాతావరణాన్ని రాష్ట్రంలో తిరిగి నెలకొల్పాలి.
ప్రొ. లక్ష్మణ్ గడ్డం,
అధ్యక్షులు,
నారాయణ రావు,
ప్రధాన కార్యదర్శి,
పౌర హక్కుల సంఘం
Comments
Post a Comment