ప్రజా సంఘాల నిషేధ లక్ష్యం ఏమిటి | ఎన్. వేణుగోపాల్

వీక్షణం జూన్ 2021 సంచిక కోసం

ప్రజా సంఘాల నిషేధ లక్ష్యం శ్మశాన శాంతి స్థాపన

పదహారు ప్రజా సంఘాలను చట్టవ్యతిరేకమైనవిగా ప్రకటిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల అప్రజాస్వామికతనూ రాజ్యాంగ వ్యతిరేకతనూ విశ్లేషిస్తున్నారు ఎన్ వేణుగోపాల్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో పనిచేస్తున్న పదహారు ప్రజాసంఘాలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని ఏప్రిల్ 24 పత్రికల్లో వార్తలు వెలువడ్డాయి. ఆ వార్తలకు మూలం అప్పటికి 24 రోజుల కింద విడుదలైనప్పటికీ, ఆ ముందు రోజే పత్రికలకు అందిన ప్రభుత్వ ఉత్తర్వులు. మార్చ్ 30 తేదీతో సాధారణ పరిపాలనా శాఖ విడుదల చేసిన జి. ఓ. నం. 73 అనే ఆ ఉత్తర్వులు, తెలంగాణ ప్రజా భద్రతా చట్టం 1992 కింద “నిషిద్ధ భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) అనుబంధ సంస్థలైన పదహారు కొత్త ప్రజా సంఘాలను 2021 మార్చ్ 30 నుంచి ఏడాది పాటు చట్టవ్యతిరేక సంస్థలుగా ప్రకటిస్తున్నట్టు” చెప్పాయి.

“తెలంగాణ ప్రజా ఫ్రంట్ (టిపిఎఫ్), తెలంగాణ అసంఘటిత కార్మిక సమాఖ్య (టిఎకెఎస్), తెలంగాణ విద్యార్థి వేదిక (టివివి), డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ (డిఎస్ యు), తెలంగాణ విద్యార్థి సంఘం (టివిఎస్), ఆదివాసి విద్యార్థి సంఘం (ఎఎస్ యు), కమిటీ ఫర్ రిలీజ్ ఆఫ్ పొలిటికల్ ప్రిజనర్స్ (సిఆర్ పిపి), తెలంగాణ రైతాంగ సమితి (టిఆర్ ఎస్), తుడుం దెబ్బ (టిడి), ప్రజా కళా మండలి (పికెఎం), తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్ (టిడిఎఫ్), ఫోరం అగెనెస్ట్ హిందుత్వ ఫాసిస్ట్ అఫెన్సివ్ (ఎఫ్ ఎఎచ్ ఎఫ్ ఓ), సివిల్ లిబర్టీస్ కమిటీ (సిఎల్ సి), అమరుల బంధు మిత్రుల సంఘం (ఎబిఎంఎస్), చైతన్య మహిళా సంఘం (సిఎంఎస్), విప్లవ రచయితల సంఘం (విరసం) అనే నిషిద్ధ భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) అనుబంధ సంస్థలైన పదహారు కొత్త సంస్థలు ప్రజలను హింసాత్మక, బెదిరింపు చర్యలకు ప్రోత్సహిస్తున్నాయి, సహకరిస్తున్నాయి. ఈ కింద పేర్కొన్న హింసా చర్యలకు పదేపదే పాల్పడుతున్నాయి” అని ఈ జి. ఓ. లో మొదటి పేరాలో ఉపోద్ఘాతం చెప్పింది.

ఆ తర్వాత వరుసగా ఐదు రకాల “హింసా చర్యల” జాబితా రాశారు. ఆ జాబితాలో,
“1. రాజ్యానికి వ్యతిరేకంగా యుద్ధం చేయాలనే వ్యూహం – ఎత్తుగడలు డాక్యుమెంట్ ప్రకారం ఈ అనుబంధ సంస్థల కార్యకర్తలు పట్టణ గెరిల్లా చర్యల ఎత్తుగడలను చేపట్టి, వేరు వేరు ముసుగులతో పట్టణ ప్రాంతాలలో తిరుగుతున్నారు.
2. కొత్త ఎత్తుగడలను చేపట్టి తమ కార్యకలాపాలను మరింతగా పెంచుతూ, వివిధ సంస్థలతో చేతులు కలుపుతూ, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వేరువేరు సమస్యలను లేవనెత్తుతూ రెచ్చగొట్టే ప్రకటనలు, సభలు, ప్రదర్శనల ద్వారా సభ్యులను తమ వైపు ఆకర్షిస్తున్నారు.
3. ఈ అనుబంధ సంస్థల కార్యకర్తలు ఛత్తీస్ గడ్ అటవీ ప్రాంతాలలోని మావోయిస్టు నాయకత్వంతో నిరంతర సంబంధాలలో ఉన్నారు, కలుస్తున్నారు. సిపిఐ (మావోయిస్టు) ఆదేశాల మేరకు వీరు బీడు భూముల సమస్యల మీద, అనుబంధ సంఘాల కార్యకర్తలపై రాజ్య నిర్బంధం అనబడే సమస్య మీద వేరువేరు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. వీటితోపాటు భీమా కోరేగాం కేసులో అరెస్టు చేయబడిన విరసం స్థాపకుడు వరవరరావు, ప్రొ. జి ఎన్ సాయిబాబా (శిక్షపడిన తీవ్రవాది), రోనా విల్సన్, తదితర వివిధ అనుబంధ సంఘాల నాయకులను విడుదల చేయాలనీ, ఊపా చట్టాన్ని, వ్యవసాయ చట్టాలను, సిఎఎ/ఎన్ ఆర్ సి వగైరాలను రద్దు చేయాలనీ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు.
4. ఈ అనుబంధ సంఘాల కార్యకర్తలలో కొందరు చట్టబద్ధంగా స్థాపించబడిన ప్రభుత్వాలకు వ్యతిరేకంగా యుద్ధం చేసేందుకు సిపిఐ (మావోయిస్టు) అజ్ఞాత కార్యకర్తలుగా మారుతున్నారు.
5. పైన చెప్పిన పదహారు అనుబంధ సంఘాలు తమ లక్ష్యాలు, ఆశయాలు, సభ్యులు, పనితీరులతో, సిపిఐ (మావోయిస్టు) ఆదేశాల మేరకే ఏర్పడ్డాయి.”

ఈ పదహారు సంఘాలూ ప్రజా పాలనలో జోక్యం చేసుకునే ఉద్దేశంతో పని చేస్తున్నాయనీ, సామాజిక జీవనానికి అవసరమైన సరఫరాలనూ సేవలనూ అందించడానికి ఆటంకంగా ఉన్నాయనీ, శాంతిభద్రతలకు భంగకరంగా ఉన్నాయనీ, తద్వారా ప్రజాశాంతికి ప్రమాదకరంగా ఉన్నాయనీ, అందువల్ల వీటిని చట్టవ్యతిరేక సంస్థలుగా ప్రభుత్వం భావిస్తున్నదనీ రెండో పేరా చెప్పింది.

ఈ పదహారు సంఘాల కార్యకలాపాల రీత్యా వీటిని తక్షణమే చట్టవ్యతిరేక సంస్థలుగా ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తున్నదని మూడో పేరా చెప్పింది.

అందువల్ల, తెలంగాణ ప్రజా భద్రతా చట్టం, 1992 సెక్షన్ 3 లోని సబ్ సెక్షన్లు 1, 4 ప్రకారం ఒనగూరిన అధికారాలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ పదహారు సంస్థలనూ రాష్ట్రంలోని 33 జిల్లాలలో చట్టవ్యతిరేక సంస్థలుగా ప్రకటిస్తున్నట్టు నాలుగో పేరా చెప్పింది.
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ఆదేశాల మేరకు, గవర్నర్ పేరు మీద ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ సంతకం చేశారు.

ఈ ఉత్తర్వులు ఏ చట్టం కింద వెలువడ్డాయో కనీసం ఆ చట్ట నిబంధనలను కూడా పాటించకుండా వెలువడినందువల్ల చట్టవ్యతిరేకమైనవి. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల నేపథ్యంలో చూసినప్పుడు అనైతికమైనవి. వెలువడిన సమయం రీత్యా అసందర్భమైనవి. రాజ్యాంగం హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నాయి గనుక రాజ్యాంగ వ్యతిరేకమైనవి. మౌలికమైన మానవ నైసర్గిక హక్కులకు, సంఘ జీవితానికి వ్యతిరేకమైన చర్యలను ప్రతిపాదిస్తున్నందువల్ల అప్రజాస్వామికమైనవి.

ఇటువంటి ఉత్తర్వులు జారీ చేయడానికి ప్రభుత్వానికి తెలంగాణ ప్రజా భద్రతా చట్టం 1992 ప్రకారం పూర్తి అధికారం ఉంది గాని, ఉత్తర్వులు జారీ చేయడంలో, వాటిని విడుదల చేయడంలో, ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత పాటించవలసిన పద్ధతులలో ఏ ఒక్క విషయంలోనూ ప్రభుత్వం తాను చెప్తున్న చట్టాన్ని కూడా పాటించలేదు. ఆ చట్టం లోని సెక్షన్ 3 ప్రకారమే ప్రభుత్వం ఏదైనా సంస్థను చట్టవ్యతిరేక సంస్థగా ప్రకటించ దలచుకున్నప్పుడు ఒక నోటిఫికేషన్ ద్వారా ఆ పని చేయవచ్చు. ఆ సంస్థ రిజిస్టర్డ్ సంస్థ అయితే ఆ సంస్థ రిజిస్టర్డ్ కార్యాలయానికి రిజిస్టర్డ్ పోస్టులో ఆ నోటిఫికేషన్ పంపాలి. లేదా ఆ సంస్థ బాధ్యుల చేతికి అందించాలి. వారు లేకపోయినా, అది తీసుకోవడానికి నిరాకరించినా, ఆ రిజిస్టర్డ్ కార్యాలయ గోడకో, తలుపుకో అంటించాలి. ఆ సంస్థ రిజిస్టర్డ్ సంస్థ కాకపోతే, దాని దృష్టికి తేవడానికి ఒక స్థానిక దినపత్రికలో ఆ నోటిఫికేషన్ ను ప్రచురించాలి. అంటే నోటిఫికేషన్ ను పత్రిక రాసిన వార్తగా కాదు, నోటిఫికేషన్ ను యథాతథంగా వాణిజ్య ప్రకటనగా ఇవ్వాలి.
ఆ నోటిఫికేషన్ తమ కార్యాలయానికి అందిన రోజు నుంచి, లేదా తమ కార్యాలయ గోడకు అంటించబడిన రోజు నుంచి లేదా పత్రికలో ప్రకటన అచ్చయిన రోజు నుంచి, ఏది చివరిదైతే ఆరోజు నుంచి రెండు వారాలలోగా ఆ సంస్థ తమ అభ్యంతరాలు తెలియజేస్తూ ప్రభుత్వానికి లేఖ పంపుకోవచ్చు. ఇదే చట్టం సెక్షన్ 5 ప్రకారం ప్రభుత్వం వెంటనే ముగ్గురు న్యాయమూర్తులతో ఒక సలహా మండలిని కూడా ప్రకటించాలి. చట్టవ్యతిరేక సంస్థగా ప్రకటించిన నోటిఫికేషన్ ను, ప్రభుత్వ వాదనలను, సంస్థ వాదనలను విని, విచారణ జరిపే అధికారం ఈ న్యాయమూర్తుల సలహా మండలికి ఉంటుంది. నోటిఫికేషన్ నుంచి ఆరు వారాలలోగా ప్రభుత్వం ఆ సలహా మండలిని నియమించి, సంబంధిత పత్రాలను దాని ముందు ఉంచాలి. ఆ సలహా మండలి అవసరమైతే ప్రభుత్వ పక్షంతో, సంస్థతో మౌఖిక విచారణ కూడా జరిపి తన తుదితీర్పు ప్రకటిస్తుంది. ఈ ప్రక్రియను చట్టమే నిర్దేశించినందువల్ల తుదితీర్పు వెలువడే వరకూ నిషేధం అమలు లోకి రావడానికి అధికారం లేదని అనుకోవచ్చు. కాకపోతే చట్టం ఈ మధ్యంతర కాలం గురించి స్పష్టత ఇవ్వలేదు గనుక ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదలైన తేదీ నుంచే అమలు లోకి వస్తుందని వాదిస్తున్నది.

ఇప్పుడు పదహారు సంఘాల నిషేధం విషయంలో నోటిఫికేషన్ లేదు. ఒకవేళ జి. ఓ. నే నోటిఫికేషన్ అనుకుంటే దాన్ని ఆయా సంఘాల బాధ్యులకు ఇవ్వలేదు. ఈ పదహారు సంఘాలలో రెండు మూడు రిజిస్టర్డ్ సంస్థలు కూడా ఉన్నాయి. వాటి కార్యాలయాలకు రిజిస్టర్డ్ పోస్ట్ లో పంపించడమో, గోడకు అతికించడమో చేయలేదు. అన్నిటికన్నా ఘోరంగా పత్రికలో వెంటనే ప్రకటన ఇవ్వలేదు. జి.ఓ. విడుదల అయిన 23 రోజుల తర్వాత, ఒక వార్త లాగా పత్రికలకు లీక్ చేశారు. సలహా మండలి నియామకం గురించి ఇది రాస్తున్న సమయం వరకూ ప్రకటన లేదు. (ఇప్పటికి జి.ఓ. వెలువడి ఏడు వారాలు దాటింది, పత్రికల్లో వార్త వెలువడి నాలుగు వారాలు దాటింది). అంటే ఏ రకంగానూ ప్రభుత్వం కనీస చట్టబద్ధతను పాటించలేదు.

నిషేధం విధించడంలో, దాన్ని ప్రకటించడంలో జరిగిన చట్ట ఉల్లంఘనను అలా ఉంచి, అసలు తెలంగాణలో ఈ చట్టానికి నైతికత ఉన్నదా అనే ప్రశ్న కూడా ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉనికిలోకి వచ్చిన ఈ చట్టపు చరిత్రే హాస్యాస్పదమైనది. రాజీవ్ గాంధీ మొదటి వర్ధంతి రోజున ఏదైనా సంచలనాత్మక ప్రకటన చేయదలచిన అప్పటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన రెడ్డి విశాఖపట్నంలో బహిరంగసభలో సిపిఐ ఎం ఎల్ పీపుల్స్ వార్ మీద, రాడికల్ విద్యార్థి సంఘం, రాడికల్ యువజన సంఘం, రైతు కూలీ సంఘం, సింగరేణి కార్మిక సమాఖ్య, విప్లవ కార్మిక సమాఖ్య, ఆల్ ఇండియా రెవల్యూషనరీ స్టూడెంట్స్ ఫెడరేషన్ ల మీద నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించారు. ఈ నిషేధం క్రిమినల్ లా అమెండ్ మెంట్ ఆక్ట్ 1908 కింద ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో, ప్రజా రక్షణ చట్టం 1348 ఫసలీ కింద తెలంగాణ ప్రాంతంలో అమలవుతుందని అన్నారు. ఆ రెండు చట్టాలూ అసలు ఉనికిలోనే లేవని, వాటిని సుప్రీంకోర్టు ఎప్పుడో కొట్టివేసిందని, పౌరహక్కుల సంఘం అధ్యక్షులు, న్యాయవాది కె జి కన్నబిరాన్ ముఖ్యమంత్రి ప్రకటనలోని అసంగతాన్ని వెంటనే బహిర్గతం చేశారు. దానితో మల్లగుల్లాలు పడిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దలు, పోలీసు పెద్దలు హడావిడిగా తయారుచేసి జూన్ 21న అమలు లోకి తెచ్చిన కొత్త చట్టమే ఆంధ్రప్రదేశ్ ప్రజా భద్రతా చట్టం 1992.

అప్పటి నుంచి 2014 వరకూ తెలంగాణలో వేలాది మంది ఈ అక్రమ చట్టం కింద నిర్బంధానికి గురయ్యారు. తెలంగాణ ఉద్యమ క్రమంలో మొత్తంగా రాజ్య నిర్బంధం మీద వచ్చిన వ్యతిరేకతలో ఈ చట్టం పట్ల వ్యతిరేకత కూడా భాగమే. అంటే ఈ చట్టాన్ని కొనసాగించకపోవడం తెలంగాణ ప్రజల ఆకాంక్ష. అదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కర్తవ్యం అయి ఉండవలసింది. కాని 2016 జూన్ 1న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెలువరించిన జి. ఓ. నం. 45 (తెలంగాణ అడాప్టేషన్ ఆఫ్ లాస్ ఆర్డర్ 2016) లో అంతకు ముందరి ఆంధ్రప్రదేశ్ లోని 177 చట్టాలనూ, 12 రెగ్యులేషన్లనూ అక్షరం కూడ మార్చకుండా, పేరులో ఆంధ్రప్రదేశ్ తీసేసి తెలంగాణ అని పెట్టినప్పుడు, ఆంధ్రప్రదేశ్ ప్రజా భద్రతా చట్టం 1992, తెలంగాణ ప్రజా భద్రతా చట్టం 1992 అయిపోయింది! ఇది తెలంగాణ ప్రజా ఆకాంక్షల ప్రకారం, ఉద్యమ క్రమంలో వెల్లువెత్తిన నినాదాల ప్రకారం, “అంతర్గత వలసవాద పాలన అవశేషాలను తొలగించి స్వపరిపాలనను ఏర్పరుస్తామ”ని తెలంగాణ రాష్ట్ర సమితి చేసిన వాగ్దానాల ప్రకారం అనైతికం, అర్థరహితం.

ఇక ప్రస్తుత నిషేధ ఉత్తర్వులు వెలువడిన సమయం చూస్తే, అది మార్చ్ 30 అయినా, ఏప్రిల్ 24 అయినా, దేశమంతటిలోనూ, ప్రత్యేకించి తెలంగాణలోనూ కరోనా వైరస్ రెండో అల భయానకంగా విజృంభిస్తున్న సమయం. ఆస్పత్రుల్లో పడకలు లేక, ఆరోగ్య సౌకర్యాలు లేక, ఆక్సిజన్ అందక, ఆరోగ్య వ్యాపారుల మితిమీరిన లాభాపేక్షతో మనుషులు పిట్టల్లా రాలిపోతున్న సమయం. ఈ భయానక స్థితిలో ప్రజల ఆరోగ్య సంరక్షణ తప్ప మరేదీ ప్రభుత్వానికి ప్రాధాన్యతాంశంగా ఉండడానికి వీలు లేదు. కాని మహా ఘనత వహించిన తెలంగాణ పోలీసు పాలకులు కరోనా బారి నుంచి ప్రజలను కాపాడే పని కన్న భిన్నస్వరాల, ప్రత్యామ్నాయ ఆలోచనల ప్రచారాన్ని అడ్డుకోవడమే తమ ప్రధాన కర్తవ్యంగా భావించారు. తెలంగాణ ప్రజల హక్కులు కాపాడతామనే వాగ్దానాలతో అధికారం లోకి వచ్చిన పాలకులకు ఇంతకన్నా సిగ్గు చేటు పని మరొకటి ఉండదు.

అభిప్రాయాలు కలిగి ఉండడం, వాటిని వ్యక్తీకరించడం, తమ లాంటి అభిప్రాయాలున్నవారితో సమష్టిగా ఆలోచనలు పంచుకోవడానికీ, కార్యాచరణలోకి దిగడానికీ సంఘటిత నిర్మాణాలు రూపొందించుకోవడం మనిషి నైసర్గిక లక్షణాలు, అంటే జన్మహక్కులు. ఆ జన్మహక్కులను రాజ్యం గాని, ఆధిపత్య శక్తులు గాని కొల్లగొట్టకుండా, ఉల్లంఘించకుండా హామీ ఇస్తున్నానని రాజ్యాంగం ప్రకటించింది. భారత రాజ్యాంగ అధికరణం 19 ఈ వాక్సభా స్వాతంత్ర్యాలను, భావ ప్రకటనా స్వేచ్ఛను, సంఘాలు పెట్టుకునే హక్కును, ఎక్కడికైనా ప్రయాణించే హక్కును హామీ ఇచ్చింది. అధికరణం 19 హామీ ఇచ్చిన హక్కుల మీద “సకారణమైన, హేతుబద్ధమైన పరిమితులు, ఆంక్షలు” విధించడానికి మాత్రమే ప్రభుత్వానికి అధికారం ఉంది గాని, మొత్తంగా ఆ హక్కులను రద్దు చేసే అధికారం లేదు. అందువల్ల అసలు తెలంగాణ ప్రజా భద్రతా చట్టమే రాజ్యాంగ వ్యతిరేకమైనది. రాజ్యాంగం హామీ ఇచ్చిన హక్కులను ఆ చట్టాన్ని ఉపయోగించి రద్దు చేయడం రాజ్యాంగ వ్యతిరేకం.

మనిషి సహజంగా సంఘ జీవి. తప్పనిసరిగా సంఘ జీవితంలో మానవ సంబంధాలు ఆలోచనల వినిమయంలో, సంఘర్షణలో అభివృద్ధి చెందుతాయి. ఆట, పాట, మాట, కలయిక నిషేధం అని నిరంకుశ ప్రభుత్వాలు శాసనాలు చేయవచ్చు గాని ఆట, పాట, మాట, కలయిక లేకుండా మనిషి ఉనికే అసాధ్యం. తోటి మనుషులతో ఆట, పాట, మాట పంచుకునే క్రమంలో తప్పనిసరిగా మనుషులు కలుసుకుంటారు, బృందాలవుతారు, సంఘటితమవుతారు, సంఘంగా ఒక నిర్మాణంలోకి వస్తారు. అందుకే రాజ్యాంగం భావప్రకటనా స్వేచ్చతో పాటే సంఘాలు నిర్మించుకునే హక్కుకు కూడా హామీ ఇచ్చింది. సంఘాలను నిషేధించడం, వారి ఆట, పాట, మాటలను, రచనను, కార్యాచరణను నిషేధించడం అంటే మనుషులను మనుషులు కాకుండా చేయడమే. అది ఒక అమానవీయ ప్రయత్నం. అప్రజాస్వామిక ప్రయత్నం. నిరంకుశ ప్రయత్నం. అది చట్టబద్ధమైనదిగా, తాత్కాలికంగా సాధ్యమైనట్టుగా, బలప్రయోగంతో, భయోత్పాతంతో అమలైనట్టుగా కనబడ వచ్చు గాని వాస్తవంగా అది ఎక్కువ కాలం సాగదూ. సత్యాన్ని చాటే పుస్తకాన్ని నిషేధించగలవు గాని సాక్ష్యంగా బతికే ప్రపంచాన్ని ఏం చేస్తావు అన్న కవి వాక్కు ఐదు దశాబ్దాలుగా గడిచినా అక్షర సత్యంగానే ఉంది.
ఈ స్థూల, తాత్విక, సామాజిక, రాజకీయ, చట్టపరమైన వాదనలు అలా ఉంచి, అసలు జి.ఓ. నం. 73 ఎంత తప్పుల తడకగా తయారయిందో, ఎన్ని అబద్ధాలను వాదనలుగా, ఎన్ని అపోహలను వాస్తవాలుగా ప్రచారం లోకి తెచ్చిందో కూడా చూడాలి.

తాము నిషేధించదలచుకున్న పదహారు సంస్థలను పాలకులు ఏ తేడాలు లేని ఒకే కుప్పగా, అదీ ఒక సాయుధ, అజ్ఞాతవాస, నిషిద్ధ పార్టీ ఆదేశాల ప్రకారం నడిచే సంఘాలుగా చూశారు గాని ఆ ఆలోచనే హాస్యాస్పదం, అవాస్తవం. ఆ పదహారు సంఘాల నిర్మాణాలలో, ఆశయాలలో, కార్యక్షేత్రాలలో, పనితీరులో ఎంతో వైవిధ్యం ఉంది. తమకు భిన్నాభిప్రాయాలు ప్రకటించేవాళ్లూ, తమ రాజకీయ విధానాలను విమర్శించేవాళ్లూ అందరూ ఒకటే అనే జార్జి బుష్ తరహా అజ్ఞానం, అహంకారం ఉన్నవాళ్లు మాత్రమే ఇటువంటి వాదన చేయగలరు. ఈ పదహారు సంఘాల్లో విద్యార్థి సంఘాలు నాలుగున్నాయి. విద్యార్థి రంగం అనే ఒకే కార్యక్షేత్రంలో నాలుగు సంఘాలు ఉన్నాయంటేనే వాటి ఆశయాలలో, పనితీరులో తేడాలున్నాయని అర్థం. అటువంటప్పుడు ఆ నాలుగు సంఘాలూ ఒకే పార్టీ ఆదేశాల మేరకు పని చేస్తున్నాయని ఊహించడానికి అతి తెలివో, అజ్ఞానమో ఉండాలి.

ఈ పదహారు సంఘాలలో ప్రతి ఒక్క దానికీ విభిన్నమైన, విశిష్టమైన స్వభావం ఉంది. ఒకటి ఆదివాసుల సంఘం, ఒకటి మహిళల సంఘం, ఒకటి రైతు కూలీల సంఘం. ఒకటి అసంఘటిత కార్మికుల సంఘం. నాలుగు విద్యార్థి సంఘాలు. ఒకటి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో భాగంగా పుట్టిన సంఘం. ఒకటి తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రజల హక్కుల పరిరక్షణ కోసం అనేక సంఘాలతో కలిసి ఏర్పడిన సమాఖ్య. ఒకటి రచయితల సంఘం, ఒకటి సాంస్కృతిక కార్యకర్తల సంఘం, రెండు రాజ్యాంగ బద్ధమైన హక్కులు సాధించడం కోసం ఏర్పడిన సంఘాలు, ఒకటి హిందుత్వ ఫాసిజానికి వ్యతిరేక ప్రచారం కోసం ఏర్పడిన సంఘం, ఒకటి రాజ్యహింసలో అమరులైన వారిని స్మరించుకోవడానికి బంధువులూ మిత్రులూ పెట్టుకున్న సంఘం. ఈ వైవిధ్యమే వాటి మధ్య ప్రభుత్వం చెపుతున్న ఏకసూత్రత, ఎవరో ఒకరి ఆదేశాల మేరకు ఏర్పడి పనిచేస్తున్న స్వభావం లేదని చూపుతుంది. ఈ సంఘాలన్నీ వేర్వేరు కాలాల్లో ఏర్పడ్డాయి. వీటన్నిటికీ వేరువేరు ప్రణాళికలున్నాయి. వీటన్నిటికీ ఉమ్మడి స్వభావం ఉండే అవకాశం పాలకుల బుర్రలో తప్ప వాస్తవంలో లేదు.

1970లో పుట్టిన నాటి నుంచీ నక్సల్బరీ రాజకీయాలను, మార్క్సిజం-లెనినిజం-మావో ఆలోచనా విధానం అనే భావజాలాన్ని మార్గదర్శకంగా పెట్టుకున్నానని విప్లవ రచయితల సంఘం బహిరంగంగానే ప్రకటిస్తున్నది. ఆ సంఘ సభ్యులు తమ రచనల్లో, ఉపన్యాసాల్లో ఆ భావజాలాన్ని వ్యక్తీకరిస్తూనే ఉన్నారు. ఇక 2002 లో పుట్టిన అమరుల బంధు మిత్రుల సంఘం నక్సల్బరీ పంథాలో అమరులైన తమ కుటుంబ సభ్యులను, స్నేహితులను సంస్మరించుకోవడమే తన లక్ష్యమని ప్రకటించుకుంటున్నది. ఈ భావజాలాన్ని కలిగి ఉండడం, సమర్థించడం, వ్యక్తీకరించడం నేరాలు కావు. అసలు నిషిద్ధ మావోయిస్టు పార్టీ సభ్యులు కావడం కూడా దానికదిగా నేరం కాదని, ఏదైనా ప్రత్యేక చర్యలో పాల్గొన్నట్టు సాక్ష్యాధారాలు చూపవలసిందేనని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. కనుక ఆ ఆరోపణతో ఈ సంఘాలను నిషేధించడం అర్థరహితం, చట్టవ్యతిరేకం. ఇక మిగిలిన పద్నాలుగు సంఘాల ఆశయాలు, లక్ష్యాలు, ప్రణాళికలు, పనితీరు చూస్తే వారి మీద ఆ ఆరోపణ బట్ట కాల్చి మీద వేయడం మాత్రమే.  

వీటిలో రెండు సంస్థలు కేవలం రాజ్యాంగం హామీ ఇచ్చిన హక్కుల కొరకు, చట్టబద్ధ పాలన కొరకు, ‘చట్టం ఎదుట అందరూ సమానమే’, ‘బెయిల్ సాధారణం, జైలు అసాధారణం’, విచారణలో తేలేవరకూ నిందితులను నిర్దోషులుగా చూడాలి’ వంటి న్యాయసూత్రాల కొరకు పని చేస్తున్న సంస్థలు. నిజానికి ఈ అన్ని సంస్థలూ కూడా బహిరంగంగా, ఈ వ్యవస్థలోపల పని చేస్తున్నవే. ఈ వ్యవస్థ పట్ల, ఈ వ్యవస్థలో అమలవుతున్న “ప్రజాస్వామ్యం” పట్ల, రావలసిన మార్పుల పట్ల ఆయా సంఘాలకు ప్రత్యేకమైన అభిప్రాయాలు ఉండవచ్చు. అవే అభిప్రాయాలు ఉన్న సంస్థలూ పార్టీలూ దేశంలోనో రాష్ట్రం లోనో మరెన్నో ఉన్నాయి. అభిప్రాయాలు ఒకటైనంత మాత్రాన ఒక సంస్థకు మరొక సంస్థ అనుబంధ సంస్థ అయిపోదు. ఆ మాటకొస్తే నక్సల్బరీ రాజకీయాలను సమర్థించే, నక్సల్బరీ రాజకీయాలకు తామే వారసులమని చెప్పుకునే పార్టీలూ సంస్థలూ దేశంలో వందకు పైనే ఉన్నాయి. అవన్నీ ఏదో ఒకానొక సంస్థకు అనుబంధ సంస్థలే అని ఏ ఆధారంతో నిర్ణయిస్తారు? ఒకే భావజాలంతో నడిచే, ఒకే భావజాలాన్ని తమ మార్గదర్శకంగా చెప్పుకునే సంస్థలు, పార్టీలు అనేకం ఉన్నాయని సమకాలీన సమాజాన్ని చూస్తే ఎవరికైనా అర్థం అవుతుంది. వాటిలో దేన్ని మాతృసంస్థ అంటారు, వేటిని అనుబంధ సంస్థలని అంటారు? ఆ సంబంధాన్ని ఎలా నిర్ణయిస్తారు? ఇక్కడ ప్రభుత్వం, పోలీసులు ఏది అనుకుంటే అదే చెల్లుతుందని అనడానికి వీలు లేదు. కచ్చితమైన, నిస్సందేహమైన సాక్ష్యాధారాలు అవసరం అవుతుంది. మరీ ముఖ్యంగా ఆ ఆరోపణతో ఒక సంఘాన్ని నిషేధానికి గురి చేస్తున్నప్పుడు, ఆ ఆరోపణను నిరూపించవలసి ఉంటుంది.

చివరిగా, ఈ చట్టం అమలులో ఒక హాస్యాస్పదమైన పరిస్థితి కూడా తలెత్తుతుంది. ముప్పై సంవత్సరాల కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిషేధించిన సంస్థలలో ఆల్ ఇండియా రెవల్యూషనరీ స్టూడెంట్స్ ఫెడరేషన్ కూడ ఉండింది. అది అప్పటికే ఒక్క ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే కాక అనేక రాష్ట్రాలలో ఉన్న సంస్థ. 1992 జూన్ లో ఆ సంస్థ మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిషేధం విధిస్తే, 1993 జనవరిలో ఆ సంస్థ జాతీయ మహాసభలను బొంబాయిలో జరుపుకుంది. ఒక రాష్ట్ర సరిహద్దులోపల నిషిద్ధమైన సంస్థ, సరిహద్దు అవతల తన కార్యకలాపాలు జరుపుకోవచ్చునన్నమాట. సరిగ్గా అలాగే, ప్రస్తుత నిషేధంలో కూడా ఈ సంఘాలలో కొన్ని రెండు రాష్ట్రాలలోనూ, దేశవ్యాప్తంగానూ ఉన్నవి. అటువంటి సంఘాలను రాష్ట్రంలో నిషేధించడం, చట్టవ్యతిరేక సంస్థలుగా ప్రకటించడం అసమంజసం, దాన్ని అమలు చేయడం అసాధ్యం.

ప్రస్తుత నిషేధంలో మరొక తెలివితక్కువ అసమంజసత్వం కూడా ఉంది. విప్లవ రచయితల సంఘం మీద ఇదే చట్టం లోని ఇదే సెక్షన్ కింద 2005 ఆగస్ట్ లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిషేధం విధించింది. చట్ట ప్రకారం ఏర్పాటయిన ముగ్గురు న్యాయమూర్తుల సలహా మండలి (జస్టిస్ టి ఎల్ ఎన్ రెడ్డి, జస్టిస్ ఎస్ నీలాద్రి రావు, జస్టిస్ ఎ గోపాల్ రావు) ఇరుపక్షాల వాదనలనూ విని, విచారణ జరిపి నిషేధం చెల్లదని ప్రకటించింది. దానితో ప్రభుత్వం నవంబర్ లో మరొక జి.ఓ. జారీ చేసి నిషేధాన్ని ఉపసంహరించుకోవలసి వచ్చింది. పదహారు సంవత్సరాల తర్వాత అదే చట్టం లోని అదే సెక్షన్ కింద అదే సంఘాన్ని నిషేధించడం అర్థరహితం, చట్టవ్యతిరేకం. సహజ న్యాయ సూత్రాల ప్రకారమైనా, భారతదేశంలో అమలవుతున్న న్యాయశాస్త్రం రీత్యానైనా ఒకే నేరానికి రెండు సార్లు విచారించడం చెల్లదు. ఒకసారి రుజువు కాని నేరాన్ని రెండోసారి విచారించడం చెల్లదు. అసాధారణ సందర్భంలో అలా విచారణకు తీసుకున్నప్పటికీ కొత్త సాక్ష్యాధారాలు ప్రవేశపెట్టడం అవసరం అవుతుంది. ప్రస్తుత నిషేధపుటుత్తర్వులు ఒక్కటంటే ఒక్కటైనా కొత్త సాక్ష్యాధారాలను చూపలేదు.  

ఈ సాధారణ ప్రశ్నలు మాత్రమే కాదు, తెలంగాణ ప్రజా భద్రతా చట్టం సెక్షన్ 3 (2) ప్రకారం “ఒక సంస్థను చట్టవ్యతిరేక సంస్థగా ప్రకటించడానికి తగిన కారణాలు చూపాలి”. అందువల్ల జి.ఓ. లో కొన్ని కారణాలు చెప్పారు గాని అవన్నీ పచ్చి అబద్ధాలు, అర్ధసత్యాలు, ప్రభుత్వపు సొంత అపోహలు, పోలీసుల కట్టుకథలు. పదహారు సంఘాలకూ కలిపి ఉమ్మడిగా ఐదు కారణాలు చూపడమే పెద్ద అసంగతం. కాగా, ఆ ఐదు కారణాలలో ఒక్కటంటే ఒక్కటి కూడా వాస్తవం కాదు. ఈ సంస్థలను చట్టవ్యతిరేక సంస్థలుగా ప్రకటించడానికి అవి కారణాలనడం హాస్యాస్పదం. ఈ సంఘాలు “ఈ క్రింద తెలిపిన హింసాచర్యలకు పాల్పడుతున్నాయి” అని ఆ ఐదు “చర్యల” జాబితా రాశారు గాని, కనీసస్థాయిలో భాష వచ్చిన ఎవరికైనా వాటిలో ఒక్కటంటే ఒక్కటి కూడా “హింసా చర్య” కాదని అర్థమవుతుంది. మామూలు అర్థంలో చర్య అంటే క్రియ. హింసా చర్య అంటే శారీరకంగానో, ఆయుఢ సహాయంతోనో గాయపరచడం, ధ్వంసం చేయడం, చంపివేయడం, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వంటి క్రియలు. ఈ ఐదు కారణాలలోనూ ఎక్కడా ఒక్క చోటనైనా ఒక క్రియ లేదు, భావ ప్రచారం మాత్రమే ఉంది. అది “హింసా చర్య” ఎలా అవుతుంది?  

ఈ జి.ఓ. లో రాసిన ప్రకారమే మొదటి “హింసా చర్య” పట్టణ ప్రాంతాలలో తిరుగుతుండడం. తిరగడం హింసా చర్య ఎలా అవుతుందో ఈ జి.ఓ. రచయితల మహా మేధావిత్వానికే తెలియాలి. ఈ సంఘాల కార్యకర్తలు పట్టణ గెరిల్లా చర్యల ఎత్తుగడలను చేపట్టారని ఈ పేరా ఆరోపిస్తుంది. ఈ జి.ఓ. రాసిన వారికి “పట్టణ గెరిల్లా చర్యలు” అనే మాటకు అర్థం తెలిసినట్టు లేదు. ఐరిష్ జాతి విముక్తి ఉద్యమంలో ఇరవయో శతాబ్ది తొలిరోజుల్లో ప్రారంభమై లాటిన్ అమెరికన్ ప్రజా పోరాటాల్లో 1960ల్లో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చిన ఈ మాటకు చాలా చరిత్ర ఉంది. పట్టణ గెరిల్లా చర్యలు అనే మాటలో బాంబు దాడులు, విధ్వంసాలు, కీలక వ్యక్తుల అపహరణలు, ఆయుధ స్వాధీనాలు, బ్యాంకులపై దాడులు, హత్యలు వంటివి ఉంటాయి. అటువంటి పట్టణ గెరిల్లా చర్యలు 1969-70ల్లో కలకత్తాలో మినహా దేశంలో ఎక్కడా ఎప్పుడూ జరగలేదు. జరిగే అవకాశం కూడా లేదు. ఈ పదహారు సంఘాలలో ఏ ఒక్కటైనా అటువంటి చర్యలకు పాల్పడిన ఉదాహరణ గత ఐదు దశాబ్దాల చరిత్రలో ఒక్కటి కూడ లేదు.

జి. ఓ. చెప్పిన రెండో “హింసా చర్య” “రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వేరు వేరు సమస్యలు లేవనెత్తుతూ రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం, సభలు, ప్రదర్శనలు జరపడం.” వీటిలో రెచ్చగొట్టే అనే మాటను పక్కనపెట్టి, మిగిలిన పనులన్నీ రాజ్యాంగబద్ధమైనవి, చట్టబద్ధమైనవి. ప్రతి పౌరుడూ, పౌరురాలూ చేయదానికి హక్కు ఉన్నవి, చేయవలసినవి. పౌరుల సంగతి అలా ఉంచి, కేంద్ర ప్రభుత్వ విధానాలనూ చర్యలనూ ఖండిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలనూ, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలనూ చర్యలనూ ఖండిస్తున్న కేంద్ర ప్రభుత్వాన్నీ మనం చూస్తూనే ఉన్నాం. 

అటువంటప్పుడు ప్రజలకు, పౌరులకు ఆ హక్కు ఇంకా ఎక్కువ ఉంటుంది. ప్రకటనలు, సభలు, ప్రదర్శనలు ప్రజల హక్కు. రాజ్యాంగం హామీ ఇచ్చిన హక్కు. ఆ హక్కును వినియోగించుకుంటున్నందుకు నిషేధం విధిస్తామని నిస్సిగ్గుగా చెప్పడం దుర్మార్గం, నియంతృత్వం. ఒకవేళ ఆ ప్రకటనల్లో, సభల్లో, ప్రదర్శనల్లో ఈ జి. ఓ. చెపుతున్నట్టు “రెచ్చగొట్టే” అంశాలుంటే భారత శిక్షా స్మృతి, నేర శిక్షా స్మృతి కింద విచారించడానికి ప్రభుత్వానికి అన్ని అవకాశాలూ ఉన్నాయి. అందుకోసం నిషేధం విధించనక్కర లేదు.

జి. ఓ. చెప్పిన మూడో “హింసా చర్య” ఈ సంఘాల కార్యకర్తలు మావోయిస్టు పార్టీ నాయకత్వంతో సంబంధంలో ఉండడం, కలుస్తూ ఉండడం. వారి ఆదేశాల మేరకు బీడు భూముల సమస్య మీద పని చేయడం. రాజ్య నిర్బంధానికి వ్యతిరేకంగా, ప్రత్యేకించి భీమా కోరేగాం కేసులో అరెస్టయినవారిని విడుదల చేయాలని ప్రదర్శనలు జరపడం, ఊపా చట్టాన్ని, వ్యవసాయ చట్టాలను, సిఎఎ/ఎన్ ఆర్ సి లను రద్దు చేయాలని నిరసన కార్యక్రమాలు చేపట్టడం. ఇలా ఇంత బహిరంగంగా ఈ కారణం చెపితే ప్రజలు నవ్వుకుంటారనే కనీస ఇంగితం కూడా ఈ జి. ఓ. రాసినవారికి లేనట్టుంది. బీడు భూముల వంటి ప్రజా సమస్యల మీద పోరాడడం రాజకీయ పార్టీలూ, సామాజిక సంస్థలూ, కార్యకర్తలూ దశాబ్దాలుగా చేస్తున్నారు. అదేమీ నేరం కాదు. అందుకు ఏదో ఒక పార్టీ ఆదేశించనక్కర లేదు. ఇక అరెస్టులకు, అక్రమ కేసులకు వ్యతిరేకంగా పోరాడడం న్యాయస్థానం లోపలా, బైటా జరగడానికి రాజ్యాంగమే అవకాశం ఇచ్చింది. రాష్ట్రంలో దేశంలో వేలాది కేసుల విషయంలో అవి అక్రమ కేసులు అంటూ న్యాయస్థానం లోపల డిఫెన్స్ న్యాయవాదులు వాదిస్తారు. అవి తప్పుడు కేసులు అంటూ బాధిత సమూహాలు బైట నిరసన ప్రదర్శనలు జరుపుతాయి. పోలీసులు చేసిన ఆరోపణలనూ పెట్టిన కేసులనూ ఎన్నో స్థాయిలలో కోర్టులు కొట్టి వేశాయి. కనుక కేసులకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు జరపడం నేరమూ కాదు, కొత్త విషయమూ కాదు. నిషేధించడానికి కారణమూ కాదు.
అంతకన్నా హాస్యాస్పదం ఊపా, వ్యవసాయ చట్టాలు, సిఎఎ/ఎన్ ఆర్ సి వంటి చట్టాల రద్దును కోరుతూ ప్రదర్శనలు జరపడాన్ని “హింసా చర్య”గా అభివర్ణించడం. ప్రభుత్వాలు చేసే ఏ చట్టాన్నయినా వ్యతిరేకించే, నిరసన తెలిపే అధికారం ప్రజలకు ఉంటుంది. ప్రజల నిరసనల వల్ల ప్రభుత్వాలు ఎన్నో చట్టాలను రద్దు చేసుకున్న చరిత్ర కూడ ఉంది. సరిగ్గా ఊపాతో సమానమైన టాడా, పోటాల మీద కూడా పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి. నిరసనల వల్లనే పది సంవత్సరాల తర్వాత టాడాను కొనసాగించకుండా సహజ మరణానికి వదిలేశారు. తాము అధికారంలోకి వస్తే పోటాను రద్దు చేస్తామని యుపిఎ 2004 ఎన్నికల వాగ్దానంగా ప్రకటించి గెలిచాక నిజంగానే రద్దు చేసింది. కాకపోతే, అదే ప్రభుత్వం 1967 నాటి ఊపాను తవ్వి తీసి, టాడా, పోటాలలోని దుర్మార్గ అంశాలు కూడ జోడించి, ప్రస్తుత ఊపా తయారు చేసింది. అటువంటి చట్టాన్ని వ్యతిరేకించే, నిరసన ప్రదర్శనలు జరిపే, రద్దు చేయమని కోరే అధికారం ప్రజలకు తప్పనిసరిగా ఉంటుంది. ఇక వ్యవసాయ చట్టాల విషయంలోనైతే, ఆ చట్టాలను ఎన్నో రాజకీయ పార్టీలు వ్యతిరేకించాయి, నిరసనలు తెలిపాయి. ఆ చట్టాలను వ్యతిరేకిస్తూ జరిగిన భారత్ బంద్ కు ఈ నిషేధం విధించిన ప్రభుత్వాన్ని నడిపే తెలంగాణ రాష్ట్ర సమితి కూడా మద్దతు తెలిపింది. తర్వాత మాట మార్చినప్పటికీ కొన్నాళ్లు ఆ చట్టాలను రద్దు చేయాలని కోరింది. ఇవాళ్టికీ ఎన్నో రాష్ట్ర ప్రభుత్వాలు, ఎన్నో రాజకీయ పార్టీలు ఆ వ్యవసాయ చట్టాల రద్దు కోరుతున్నాయి. ఆ మూడు వ్యవసాయ చట్టాలు తప్పనిసరిగా వ్యతిరేకించవలసినవే. వాటిని వ్యతిరేకించడం నిషేధించవలసిన విషయం కాదు. ఇక సిఎఎ - ఎన్ ఆర్ సి లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా విస్తారమైన ఆందోళన జరిగింది. ఈ నిరసన “హింసా చర్య” కాకపోవడం మాత్రమే కాదు, పౌరుల తప్పనిసరి కర్తవ్యం. ఆ కర్తవ్యం నెరవేర్చడమే నిషేధించడానికి కారణమని ప్రభుత్వం అంటున్నదంటే ఇది ఎటువంటి నిరంకుశ, అసహన, అప్రజాస్వామిక ప్రభుత్వమో ఎవరికి వాళ్లు అంచనా వేసుకోవలసిందే.

ఇక జి. ఓ. చెప్పిన నాలుగో “హింసా చర్య” ఈ సంఘాల కార్యకర్తలలో కొందరు మావోయిస్టు పార్టీ అజ్ఞాత కార్యకర్తలుగా మారుతున్నారనేది. ఎవరైనా తమకు నచ్చిన సంస్థలో చేరితే అది “హింసా చర్య” ఎలా అవుతుంది? అలా ఒకరో, ఇద్దరో, కొందరో సభ్యులు ఒక సంస్థను వదిలి మరొక సంస్థలో చేరితే అందుకు మొదటి సంస్థ ఎలా బాధ్యురాలవుతుంది? ఈ వ్యక్తిగత ఎంపికను సంఘానికి ముడిపెట్టి దాన్ని ఒక కారణంగా, “హింసా చర్య” గా చూపే చౌకబారు ఆరోపణను చేసినందుకు పాలకులు సిగ్గు పడాలి.

ఇక జి.వో. చెప్పిన ఐదో “హింసా చర్య” ఈ సంఘాలు మావోయిస్టు పార్టీ ఆదేశాల మేరకే ఏర్పడ్డాయనేది, ఈ సంఘాల లక్ష్యాలు, ఆశయాలు, సభ్యులు, పనితీరు ఆ పార్టీ ఆదేశాల మేరకే ఉన్నాయనేది. ఇది మరింత హాస్యాస్పద అంశం. ఎందుకంటే ఈ సంఘాలలో కనీసం సగం మావోయిస్టు పార్టీ పుట్టడానికి దశాబ్దాల ముందు నుంచీ, ఎన్నో సంవత్సరాల ముందు నుంచీ ఉనికిలో ఉన్నాయి. 1970లో పుట్టిన విప్లవ రచయితల సంఘం, 1974లో పుట్టిన పౌరహక్కుల సంఘం, 1995లో పుట్టిన చైతన్య మహిళా సంఘం, 1996 లో పుట్టిన ఆదివాసీ హక్కుల పోరాట సమితి – తుడుం దెబ్బ, 1997లో పుట్టిన ప్రజా కళా మండలి వంటి సంస్థలు 2004 లో ఏర్పడిన సిపిఐ మావోయిస్టు ఆదేశాల మేరకు ఏర్పడ్డాయని ఈ జి. ఓ. చెపుతున్నదంటే పాలకుల హాస్యాస్పదమైన కాలక్రమ అవగాహనకు ఆశ్చర్యపోవడం కన్న చేయగలిగింది లేదు.

మరొకసారి చెప్పాలంటే ఈ కారణాలన్నీ నిజమైన కారణాలే అని వాదన కోసం అంగీకరించినా ఇవేవీ “హింసా చర్యలు” కావు. నిషేధం విధించడానికి కారణాలు కాజాలవు. ఈ సంఘాలు పాల్గొన్న హింసా చర్యలు ఏవైనా ఉంటే, వాటిని నిర్దిష్టంగా పేర్కొంటే, భారత శిక్షా స్మృతి, నేర శిక్షా స్మృతి కింద కేసులు పెట్టడానికి, విచారణ జరపడానికి ప్రభుత్వానికి అధికారమూ అవకాశమూ ఉన్నాయి. అంటే ఇవేవీ నిషేధానికి, చట్టవ్యతిరేక సంస్థలుగా ప్రకటించడానికి సరిపోయేవి కావు.

మరి ఇంత స్పష్టంగా నిషేధం చెల్లదని తేటతెల్లమవుతున్నప్పుడు తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ పాలకవర్గాలు ఈ పనికి ఎందుకు పూనుకున్నాయి? తెలంగాణ ప్రజా ఆకాంక్షలనూ, ఉద్యమ ఆకాంక్షలనూ నెరవేర్చలేకపోయిన తెలంగాణ పాలకులు తమ వైఫల్యాలను ప్రజలకు వివరించే స్వరాలన్నిటినీ మూసివేయదలచారు. తమ నిరంకుశ పాలన గురించి ప్రజలకు నిజాలు చెప్పే గొంతులేవీ ఉండగూడదనుకున్నారు. పార్లమెంటరీ ప్రతిపక్షాల నుంచి ఎంతో మందిని ఆకర్షించి, కొనివేసి, వాటిని బలహీనం చేసి, వాటికి గొంతు లేకుండా చేశారు. ప్రచార సాధనాలన్నిటినీ తమ కుటుంబ పెట్టుబడులతో, తమ సన్నిహితుల పెట్టుబడులతో కొనివేసి పత్రికల్లో, టీవీలో భిన్నస్వరాలు, వాస్తవాలు వినిపించకుండా చేశారు. ఈ నేపథ్యంలోనే ఇక ప్రజలలో పనిచేస్తున్న వివిధ ప్రజా సంఘాలను, ముఖ్యంగా పాలక పార్టీ దుర్మార్గాల గురించి ప్రజలకు వివరించే శక్తి ఉన్న సంఘాలను పని చేయకుండా చేయాలనేది పాలక పార్టీ లక్ష్యం. ఈ సంఘాల మీద, వాటి నాయకత్వం మీద, కార్యకర్తల మీద ఎంత నిర్బంధం ప్రయోగించినా ఎక్కడో ఒకచోట ఏదో ఒక కార్యక్రమం, ఏదో ఒక సభ, ఏదో ఒక ప్రదర్శన, ఏదో ఒక పత్రిక, ఏదో ఒక కరపత్రం ఇంకా సాగుతూనే ఉన్నాయి. అది సాగకుండా చేయాలంటే ప్రత్యామ్నాయ, ప్రజా రాజకీయాల స్వరం వినిపించకుండా చేయాలంటే, కేవలం ప్రభుత్వ బాకా మాత్రమే వినిపించేలా చేయాలంటే ఆ భిన్నస్వరాల ఉనికినే నిషేధించాలి. తెలంగాణలో నిశ్శబ్దం నింపాలి, శ్మశాన శాంతి వ్యాపింపజేయాలి. ఆ శ్మశాన శాంతి నెలకొల్పే ప్రయత్నమే ఈ నిషేధపుటుత్తర్వులు.  

అయితే నిజాం ప్రభువుల నుంచి భారత ప్రభుత్వ సైనిక పాలన నుంచి, వెల్లోడి పాలన నుంచి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలన దాకా తెలంగాణ సమాజం ఇటువంటి నిషేధాలనూ నిర్బంధాలనూ ఆంక్షలనూ ఎన్నిటినో చూసింది. ఎదిరించి పోరాడింది. అదునుకోసం వేచిచూస్తూ మౌనంగా భరించింది. అవకాశం వచ్చినప్పుడు లేచి నిలిచింది. తెలంగాణ చరిత్ర నేర్పుతున్న పాఠమిదే. ఆ చరిత్రను పరిశీలించి చూస్తే, ఆ నిరంకుశ పాలకులూ వారి శాసనాలూ మిగలలేదు గాని, తెలంగాణ మిగిలింది. తెలంగాణ ప్రజలు మిగిలారు. ప్రజల ఉద్యమాలు మిగిలాయి. ఇది చరిత్ర చెప్పిన సత్యం. ఇదే చరిత్ర చెప్పనున్న సత్యం.

(రచయిత వీక్షణం సంపాదకులు)

Comments