ఆదివాసీ సంతాల్ గ్రామస్తులపై సీ ఆర్ పి ఎఫ్ దాడులు | సీ డి ఆర్ ఓ

జార్ఖండ్ రాష్ట్రంలోని గిరిడి జిల్లాలో కేంద్ర ప్రభుత్వ నెలకొల్పుతున్న కొత్త సి ఆర్ పి ఎఫ్ క్యాంపులకు వ్యతిరేకంగా నిరసన తెలియచేస్తున్న ఆదివాసీ సంతాల్ గ్రామస్తులపై జరుగుతున్న దాడులు, అణిచివేతలకు సంబంధించి CDRO 2021 మార్చి 5, 6, & 7వ తేదీలలో జరిపిన నిజ నిర్ధారణ రిపోర్ట్

7 మార్చి 2021

2021 మార్చి 5-6 తేదీల్లో, సిడిఆర్ఓ(CDRO), హెచ్ఆర్ఎల్ఎన్(HRLN) మానవ హక్కుల నిజనిర్ధారణ బృందం గిరిడీ జిల్లాలోని - మధుబన్, డుమ్రీ, పిర్తాండ్ అనే మూడు పోలీస్ స్టేషన్ల పరిధిలోని ప్రాంతాలకు వెళ్ళి, అక్కడ కొత్తగా కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న పారా మిలిటరీ క్యాంప్‌లకు వ్యతిరేకంగా జరుగుతున్న భారీ ప్రజా నిరసనకు సంబంధించి గ్రామస్తులను కలిసి పూర్తి సమాచారాన్ని సేకరించింది.

గిరిడీ జిల్లాలో అనేక సిఆర్పిఎఫ్ శిబిరాలు నిర్మాణమవుతున్నాయనీ, వాటిని గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారనీ దేశంలోని ప్రధాన వార్తాపత్రికలలో 2020 డిసెంబర్, 2021 జనవరిలలో వార్తలు వచ్చాయనే విషయం తెలిసిందే. ఈ విషయంపై గ్రామస్తులు, ప్రభుత్వానికి మధ్య చాలా ఘర్షణలు జరిగాయి, చాలా మందిపై ఎఫ్‌ఐఆర్‌లు పెట్టారు, అరెస్టులు కూడా జరిగాయి.

ఈ ప్రదేశంలో నివసించేవారు ప్రధానంగా ఆదివాసీలు, ఈ ప్రాంతంలో అధిక అటవీప్రాంతం, కొండలతో పాటు, ఆహార, ఖనిజ సంపద పుష్కలంగా ఉంది; స్థానిక ప్రజలకు వున్న అటవీ, భూ హక్కులను, గ్రామసభ హక్కును కూడా ప్రభుత్వం మొదటి నుండి పట్టించుకోలేదు; ఈ రోజు వరకు, అటవీ హక్కుల చట్టం 2006 ప్రకారం వ్యక్తిగత, సాముదాయిక హక్కు పత్రాలు యివ్వలేదు. అలాగే, ఇక్కడ స్థానికంగా నివసించేవారికి ఎలాంటి ఉపాధి మార్గాలు లేవు; గుణాత్మక వైద్యం, విద్య పూర్తిగా అంతరించిపోయింది అనే విషయాలు విచారణ క్రమంలో తెలిసాయి.

నక్సలైట్‌లకు వ్యతిరేకంగా పోలీసులు, సిఆర్‌పిఎఫ్ ఈ ప్రాంతంలో చేపట్టిన ప్రచారం వల్ల, ఇప్పటికే ఆర్థిక, సాంస్కృతిక, సామాజిక సమస్యలను ఎదుర్కొంటున్న ఈ ప్రజల జీవితాలు మరింత నరకంగా మారాయి. ఇక్కడి అమాయక గిరిజన గ్రామస్తులపై ప్రభుత్వం ఎందుకు ఈ విధమైన అణచివేతను నడుపుతోందో తమకు తెలియదని, ఈ కారణంగా తాము, రాబోయే తరం నిరంతరం భయ, భీభత్సం జీవితాన్ని గడపవలసి ఉంటుంది అని ఇక్కడి ప్రజలు అంటున్నారు.

చింగియాపహరి, టెస్ఫులి, బారియార్పూర్, జీత్పూర్, భన్పురా, కరిపహరి, బెలథాన్, తరాతాండ్ ప్రాంతాలలోని మొత్తం 16 గ్రామాల నుండి మహిళలు, పిల్లలతో సహా గ్రామస్తుల నుండి నిజనిర్ధారణ బృందం సేకరించిన సమాచారంలో ఈ క్రింది విషయాలు తెలిసాయి:

1. అత్యాచారం - టెస్‌ఫులి ప్రాంతంలో భద్రతా దళాలు ఒక అత్యాచారం చేశారు.

2. లైంగిక వేధింపులు - భన్పురాలో 7 మంది మైనర్ బాలికలను భద్రతా దళాలు లైంగిక వేధింపులకు గురిచేశాయి

3. బూటకపు ఎన్‌కౌంటర్ –డోల్‌కట్టాలో జరిపిన ఒక బూటకపు ఎన్‌కౌంటర్‌లో ఒక కార్మికుడిని హత్య చేసారు.

4. కస్టడీలో మరణం - పిర్తాండ్ పోలీస్ స్టేషన్‌లో ఝర్హా గ్రామ నివాసిని పోలీసు కస్టడీలో హత్య చేశారు. ఈ వ్యక్తికి పీర్టాండ్ పోలీస్ స్టేషన్ ప్రక్కనే హోటల్ ఉందని, పోలీస్ స్టేషన్, భద్రతా సిబ్బందికి అక్కడే ప్రతిరోజూ టీ, అల్పాహారం తయారవుతుందని తెలిసింది.

5. కస్టడీలో చిత్రహింస – తార్‌టాండ్ గ్రామానికి చెందిన ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని గిరిడీలోని ఎస్పీ బంగ్లాలో అమానుషంగా కొట్టారు. కరీఫారి గ్రామానికి చెందిన మన్‌రేగా కార్మికుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని దారుణంగా కొట్టారు. అతని మొబైల్, బైక్, బ్యాంక్ పాస్‌బుక్, 15 మంది ఎంఎన్‌ఆర్‌ఇజిఎ సిబ్బంది జీతం జాబితాను పోలీసులు లాక్కున్నారు. ఈ సంఘటన కారణంగా, 15 మంది ఎంఎన్‌ఆర్‌ఇజిఎ కార్మికులకు ఇప్పటి వరకు 2 వారాల జీతం అందలేదు.

6. మహిళలు, పిల్లలు, అమాయక గ్రామస్తులను కొట్టిన ఘటనలు దాదాపు అన్ని గ్రామాల్లో జరిగాయి. కొంతమంది గ్రామస్తుల ఇళ్లను కూడా కూలగొట్టేశారు. అప్పుడప్పుడు భద్రతా దళాలు రాత్రి- పగలూ కూడా దాడి చేశాయి. ఇళ్ల నుంచి డబ్బు, నగలు దోచుకెళ్లిన సంఘటనలు కూడా ఉన్నాయి. తరచుగా ఇళ్లలో ఉంచిన, పంట, ధాన్యాలు వుంచిన గాదెలను కూడా దాడుల సమయంలో నాశనం చేశారు. ఈ రకమైన దాడులలో మహిళా పోలీసులు వుండరు, దాదాపు ప్రతి దాడిలోనూ మహిళలను వేధింపులకు గురిచేస్తారు, అసభ్యంగా ప్రవర్తిస్తారు.

7. అమాయక గ్రామస్తులపై తప్పుడు కేసులు – తప్పుడు కేసుల్లో 6 మంది ఇప్పటికీ జైలులో ఉన్నారు; ఇద్దరు తెలియని వ్యక్తులపై తప్పుడు కేసులు ఉన్నాయి, కాని ఇప్పటివరకు అరెస్టులు జరగలేదు; తప్పుడు కేసులో జైలుకు పంపిన ఒక వ్యక్తి ప్రస్తుతం బెయిలు పైన బయట ఉన్నాడు.

UAPA, CLA చట్టాలను ఈ ప్రాంతాలలో దుర్వినియోగం చేసారు; అమాయక గ్రామస్తులపై అణచివేత ప్రయోగించి భయ వాతావరణాన్ని సృష్టించారు. పియర్టాండ్ పోలీస్ స్టేషన్ ముందు కూరగాయలు అమ్ముకునే వ్యక్తి పోలీస్ స్టేషన్ సిబ్బందికి తాను అమ్మిన కూరగాయలకు డబ్బు అడిగినందుకు, పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి వెంటనే UAPA కింద తప్పుడు కేసు పెట్టి జైలుకు పంపాడనే దిగ్బ్రాంతి కలిగించే కేసు కూడా ఒకటి వుంది. ప్రస్తుతం ఈ వ్యక్తి బెయిల్‌పై ఉన్నారు.

భద్రతా దళాలు చేస్తున్న ఈ నిరంతర హింసను దృష్టిలో ఉంచుకునే సిఆర్‌పిఎఫ్ శిబిరాన్ని అన్ని వర్గాల వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిసింది. తమ డబ్బుతోనే ప్రభుత్వం తమపై దారుణాలు, దోపిడీలు చేస్తోందని వారు అంటున్నారు.

సిఆర్‌పిఎఫ్ క్యాంపు వద్దని, ఆసుపత్రి, పాఠశాల, ఉపాధి, అభివృద్ధి కావాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు . తమ ప్రార్థనా స్థలం, స్మశానం, మైదానాల్లో బలవంతంగా సిఆర్‌పిఎఫ్ క్యాంపుని నిర్మించిందని గ్రామస్తులు తెలిపారు. ఐదవ షెడ్యూల్ ప్రాంతం అయినప్పటికీ, క్యాంపు ఏర్పాటు చేయడానికి గ్రామసభ నుండి అనుమతి తీసుకోలేదు.

బాధితులకు ఎలాంటి చట్టపరమైన, న్యాయ సేవలు అందవు. ఇక్కడి అడవుల్లో నివసించే గ్రామస్తులకు కట్టెలు కొట్టడం లేదా పండ్లు, పువ్వులు కోసుకోవడం లేదా చిన్న జంతువులను వేటాడటం వంటి అటవీ హక్కులన్నింటినీ నిరాకరించారు.

ఈ కేసులే కాకుండా, మధుబన్‌లోని కూలీల సమస్యలు కూడా ముందుకొచ్చాయి. అంతకుముందు తమకు యూనియన్ ఉండేదని, ప్రజలందరికీ ఉచిత చికిత్స అందించడానికి యూనియన్ ఆసుపత్రులను నడిపేదనీ, కార్మిక హక్కులు పరిరక్షించబడేవి అని; కానీ ఆ యూనియన్‌పై తప్పుడు ఆరోపణలు చేసి నిషేధించారని కార్మికులు అంటున్నారు. నేడు, అన్ని చోట్ల కూలీలకు తక్కువ వేతనాలు ఇవ్వడం గురించి చర్చ జరుగుతోంది. ఈ సమస్యకు సంబంధించి ఒక ధర్మశాల కార్మికులు 21 మంది ధర్నా కు కూర్చున్నారు. ఈ కార్మికులను వారి ఉద్యోగాల నుండి తీసేస్తున్నారు, వీరికి ఎలాంటి సామాజిక భద్రత లేదు.

గిరిడికి చెందిన ఒక సాంస్కృతిక సంఘం ʹజార్ఖండి ఎవన్ʹ కూడా నిషేధానికి గురైంది. ఈ సంస్థ తన పాటలు, నాటకాల ద్వారా వరకట్న వ్యవస్థ, మంత్రగత్తె వ్యవస్థ, మూఢనమ్మకం, విద్య మొదలైన వాటిపై ప్రజలకు అవగాహన కల్పించేది. నేడు, చాలా మంది సాంస్కృతిక కార్యకర్తలపై కేసులు పెట్టారు, అనేక మందిని అరెస్టు చేశారు.

ఈ విషయాలన్నీ దృష్టిలో ఉంచుకుని, నిజనిర్ధారణ బృందం ఈ క్రింది డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచుతుంది:

1. అమాయక గ్రామస్తులపై నమోదు చేసిన తప్పుడు కేసులన్నింటినీ ఎత్తివేసి, వారందరినీ వెంటనే బేషరతుగా విడుదల చేయాలి.

2. అదుపులోకి తీసుకున్న వారిపై జరుపుతున్న హింసను వెంటనే ఆపాలి. కస్టోడియల్ మరణాన్ని సుప్రీంకోర్టు, జాతీయ మానవ హక్కుల కమిషన్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఒక స్వతంత్ర ఏజెన్సీతో దర్యాప్తు చేయించాలి.

3. ఐక్యరాజ్యసమితిలో ప్రభుత్వం ఆమోదించిన సామాజిక అభివృద్ధిని పూర్తి చేయడం ద్వారా ఇక్కడి సముదాయపు అభివృద్ధి పనులు పూర్తి చేయాలి.

4. అటవీ హక్కుల చట్టం ప్రకారం, అడవుల్లో నివసించే ప్రజలకు అడవిపై సాముదాయిక హక్కులను ప్రభుత్వం వెంటనే యివ్వాలి.

5. ఐదవ షెడ్యూల్ ప్రాంతాలలో, గ్రామసభ అనుమతి లేకుండా ఎటువంటి పని చేయకూడదు, పెసా చట్టంలో ఇచ్చిన నిబంధనలను ప్రభుత్వం పాటించాలి.

6. బాధితులందరికీ ఉచిత న్యాయ సేవ అందించాలి.

7. న్యాయమూర్తి డి.కె బసు సూచనలను ఖచ్చితంగా పాటించాలి.


నిజనిర్దారణ బృందం

నిజ నిర్దారణలో పాల్గొన్న సభ్యులు, సంఘాలు
Participants..
1.Tapas Chakraborthy.APDR.West Bengal.
2.Probhas(Babudaa),APDR.West Bengal.
3.Samir Saha Paddaru.APDR.West Bengal.
4.J.Lix,JCDR, Jharkhand Counsil For Democratic Rights, Ranchi.
5.Rohit, Advocate,JCDR, Jharkhand Counsil For Democratic Rights, Ranchi.
6.Anup Agarwal, Advocate, High Court,Ranchi.HRLN.(Human Fights Law Network).
7.Sonal,Advocate, High Court,Ranchi.HRLN.(Human Fights Law Network).
8.Raju Hebron,Advocate, High Court,Ranchi.HRLN.(Human Fights Law Network).
9.Madana Kumaraswamy,Joint Secretary,CLC (Civil Liberties Committee, Telangana State)
10.Deepak Bara Social Activist and Film maker.Ranchi,Jharkhand.
11.Varsha, Social Activist,Jharkhand.
12.Rajni, professor,Social Activist,Jharkhand.
13.Jaideep, Journalist Times of India.Ranchi.
14.Mukesh,Journalist Times of India.Ranchi.
15.Sanjay Varma, Journalist,Tana Kabar.
16.Bhagwan, Social activist and Santhal Tribal Leader, Madhuban, Giridih,Jharkhand.

Keywords : jarakhand, crpf, santal, tribal, police, attacks, CDRO, HRLN
(2021-03-08 20:17:17)

Comments