కామ్రేడ్ ఉప్పు కృష్ణ గుండె పోటుతో ఈ రోజు చనిపోయాడు. కృష్ణన్న అమరుల బంధుమిత్రుల సంఘం వ్యవస్థపక సభ్యుడు. అమరుల రక్తసంబంధికులతో కమిటీ ఏర్పాటు చేసి కన్వీనర్ భాద్యతలు స్వీకరించాడు. కో కన్వీనర్ కొడకంచి నర్సన్న తోడ్పాటుతో అనేక గ్రామాలు తిరిగారు. ఉప్పు కృష్ణకు ఇద్దరు కూతుర్లు. ఒక కొడుకు. కొడుకు పీపుల్స్ వార్ పార్టీలో పని చేస్తూ, పోలీసులకు చిక్కి తీవ్రమైన చిత్ర హింసలతో వీరమరణం పొందాడు. అతని కొడుకును తెచ్చుకోడానికి ఆయన అనేక ఇబందులు పడ్డాడు. అప్పటికే ఆయన 'అఖిలభారత ప్రజాప్రతిఘటన వేదిక ' లో రాష్ట్రస్థాయి నాయకుడు.
కొడుకు శవం తెచ్చుకోడానికి తాను పడ్డ యాతన పగవారికి కూడా రాకూడదని విలపించాడు. తనలాంటి రాజ్యహింస బాధితులతో కల్సి ధిక్కారాన్ని ప్రకటించాడు. శవాల స్వాధీనానికి ముందుకు కదిలాడు.
కొడుకు చనిపోయిన కొంతకాలానికి పెద్ద కూతురు ప్రమీల కూడా బూటకపు ఎన్ కౌంటర్లో అమరురాలు అయ్యింది. ప్రమీల సహచరుడు మావోయిస్ట్ రాష్ట్ర కమిటీ సభ్యుడు అయిన రామచందర్ కూడా అమరుడే. ఇద్దరు పిల్లల్ని, అల్లుడిని కోల్పోయి తనలాంటి ఎందరికో తోడుగా నిలిచాడు. ఒకరోజు ప్రకాశం జిల్లా లో ఎదురుకాల్పులు జరిగాయి. మార్కాపుర్ హాస్పిటల్లో మావోయిస్టు శవాన్ని ఉంచారు. అతని తల్లిదండ్రులతో ఉప్పు కృష్ణ అక్కడికి వెళ్ళాడు. మూత్రవిసర్జనకు పక్కకు వెళ్లిన కృష్ణపై పోలీసులు దాడిచేసి రెండు చేతులు విరగొట్టారు. రెండు నెలలు హాస్పిటల్లో వున్నాడు. దీర్ఘ కాలం నుండి షుగర్ ఉంది. వృధ్యాప్యం. దానితో ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. అప్పటినుండి ఆయన కోలుకోలేదు. ఆ తర్వాత షుగర్ మూలంగా కాలు తొలగించారు.
ప్రతి జూలై 18 అమరుల సంస్మరణకు హైదరాబాద్ వచ్చేవాడు. అరెస్టు ఎవరైనా వారి యోగక్షేమాలు ఆడిగేవాడు. సాయిబాబా, వరవరరావు ల ఆరోగ్యాల కోసం ఆందోళన చెందేవాడు. ఆమరుల ఆశయాలను ఎత్తి పట్టిన వారిలో తన పిల్లల్ని చూసుకునేవాడు. ఆయనకు అమరుల బంధుమిత్రుల సంఘం అశ్రునయనాలతో వినమ్రగా నివాళ్లు అర్పిస్తుంది. రేపు ఉదయం 11 గంటలకు ఆయన స్వగ్రామం ఉయ్యందనలో అంత్యక్రియలు జరుగుతాయి.ఈ ఊరు గుంటూరు జిల్లా సత్తెనపల్లి దగ్గరలో ఉంటుంది.
Comments
Post a Comment