భీమా కోరేగావ్ కేసులో బయటపడ్డ నిజాలు | ఎన్. వేణుగోపాల్


వరవరరావుతో సహా పదహారుమంది ప్రజా ఉద్యమ సమర్థకులైన మేధావులపై బనాయించిన భీమా కోరేగాం కేసు అబద్ధారోపణలపై, కూటసృష్టి ఎలక్ట్రానిక్ ‘సాక్ష్యాధారాలపై ఆధారపడిందని రెండున్నర సంవత్సరాలుగా వెలువడుతున్న విమర్శలకు మరొక బలమైన ఆధారం దొరికింది. అమెరికాలోని మసాచుసెట్స్‌కు చెందిన ఆర్సెనాల్ కన్సల్టింగ్ అనే డిజిటల్ ఫోరెన్సిక్స్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ సంస్థ సోమవారం నాడు విడుదల చేసిన నివేదిక అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో, తిరుగులేని సోదాహరణమైన వాదనలతో ఆ అబద్ధపు సాక్ష్యాధారాలను ఎక్కడ, ఎట్లా, ఎప్పుడు సృష్టించడం జరిగిందో తేటతెల్లం చేసింది.

న్యాయ సంస్థలకు, వ్యాపార సంస్థలకు, ప్రభుత్వ సంస్థలకు అవసరమైన సేవలు అందిస్తున్న ఆర్సెనాల్ కన్సల్టింగ్ 2009 నుంచి ఈ రంగంలో సుప్రసిద్ధమైన నిపుణ సంస్థ. న్యాయ, నేర పరిశోధనా సంస్థలు, సైనిక బలగాలు, ప్రైవేట్ సంస్థలు ఉపయోగించే ఫోరెన్సిక్ పరికరాలను, సాధనాలను కూడ ఈ సంస్థ అభివృద్ధి చేసింది. అమెరికాలోనూ అంతర్జాతీయంగానూ ఫోరెన్సిక్ శాస్త్ర పరిజ్ఞానాన్ని, పరికరాలను ఉపయోగించిన అనేక న్యాయ, చట్టపరమైన వివాదాలలో నైపుణ్య సహకారం అందించింది. భీమా కోరేగాం కేసులో నిందితుడైన రోనా విల్సన్ దగ్గర స్వాధీనం చేసుకున్నామని పోలీసులు చెపుతున్న కంప్యూటర్ హార్డ్ డిస్క్ మీద ఈ సంస్థ అనేక సాంకేతిక పరీక్షలు జరిపి పదహారు పేజీల నివేదిక తయారు చేసింది. భీమా కోరేగాం కేసు తానింతవరకూ చూసినవాటిలోకెల్లా ‘అత్యంత తీవ్రమైన సాక్ష్యాధారాల తారుమారు ఘటనల్లో ఒకట’ని ఆ సంస్థ వ్యాఖ్యానించింది. తాము పరిశీలించిన హార్డ్ డిస్క్ లోకి 2016 జూన్ 13న ఒక మాల్ వేర్ ద్వారా ఆగంతుకులు జొరబడి, రిమోట్ ఆక్సెస్ ట్రోజన్‌ను ప్రవేశ పెట్టారని ఆ సంస్థ కనిపెట్టింది. మాల్ వేర్ అంటే మెయిల్ ద్వారా ఉద్దేశపూర్వకంగా పంపే చొరబాటు సాఫ్ట్ వేర్. అది మెయిల్‌లో అటాచ్‌మెంట్ రూపంలో వస్తుంది. సాధారణంగా గ్రహీత కుతూహలాన్ని పెంచే పేరుతో ఉండే ఆ అటాచ్ మెంట్ మీద క్లిక్ చేయగానే ఆ మాల్ వేర్ కంప్యూటర్‌లో ప్రవేశిస్తుంది. ఆ కంప్యూటర్‌కు సంబంధించిన యూజర్ నేమ్ లను, పాస్‌వర్డ్‌లను, ప్రోగ్రాంలను తన అదుపులోకి తీసుకుంటుంది. తద్వారా చొరబాటుదారు సుదూరం నుంచి కూడ ఈ కంప్యూటర్ మీద పని చేయడానికి, కంప్యూటర్‌లో మార్పులు, చేర్పులు చేయడానికి, సొంతదారు చేసిన పనులను వీక్షించడానికి వీలు కలుగుతుంది. అటువంటి రిమోట్ ఆక్సెస్ ట్రోజన్ సహాయంతో రోనా విల్సన్ కంప్యూటర్‌లో ఒక రహస్య ఫోల్డర్‌ను తయారుచేసి అందులో ఆయన మీద, సహ నిందితుల మీద నేరారోపణలకు వీలు కల్పించే డాక్యుమెంట్లను ప్రవేశపెట్టారని ఆ సంస్థ నిర్ధారించింది. 

ప్రధానమైన నిర్ధారణలు ఏమిటో చూద్దాం. రోనా విల్సన్ సహనిందితుడైన వరవరరావు నుంచి 2016 జూన్ 13 మధ్యాహ్నం 3.07 నుంచి ఒక ప్రత్యేక డాక్యుమెంటును తెరవమని పదే పదే కోరుతూ అనుమానాస్పద ఈ-మెయిళ్ల వరుస సాగింది. చివరికి 6.18కి తానది తెరిచానని, కాని అందులో ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం లెటర్ హెడ్, కింద గజిబిజి అక్షరాలు తప్ప మరేమీ లేదని రోనా విల్సన్ జవాబిచ్చాడు. (అంటే సాంకేతిక పరిజ్ఞానం అంతగా లేని వరవరరావు కంప్యూటర్ లోకి మొదట ప్రవేశించి, ఆయన ఈ- మెయిల్ ఉపయోగించి రోనా విల్సన్ కంప్యూటర్ లోకి చొరబడే ప్రయత్నం జరిగిందన్నమాట).

నిజానికి ఆ డాక్యుమెంటు అనదర్ విక్టరీ.రార్ పేరుతో ఉన్న ఒక్ మాల్ వేర్ (నెట్ వైర్ రిమోట్ ఆక్సెస్ ట్రోజన్). అలా చొరబడిన మాల్ వేర్ వల్ల రోనా విల్సన్ లాప్‌టాప్ 22 నెలల పాటు, 2016 జూన్ 13 నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న 2018 ఏప్రిల్ 17 వరకు, చొరబాటుదారుల అదుపాజ్ఞలలోనే కొనసాగింది. చొరబాటుదారుల చేతుల్లో తమ లక్ష్యం ఇంత సుదీర్ఘ కాలం ఉండే అవకాశం మాత్రమే కాక విస్తారమైన సాంకేతిక పరిజ్ఞాన వనరులున్నట్టు అనిపిస్తున్నది. ఈ కంప్యూటర్ మీద నిరంతర నిఘా ఉంచడం, ఈ కంప్యూటర్ లోకి నేరారోపక డాక్యుమెంట్లను ప్రవేశపెట్టడం చొరబాటుదారుల ప్రధాన లక్ష్యాలని అనిపిస్తున్నది. మాల్ వేర్ సహాయంతో చొరబాటుదారులు రోనా విల్సన్ కంప్యూటర్ మీద అదృశ్యంగా ఉండే ఒక కొత్త ఫోల్డర్‌ను సృష్టించారు. ఆ కొత్త ఫోల్డర్‌లో పది డాక్యుమెంట్లు చేర్చారు. ఆ డాక్యుమెంట్లను గాని, ఆ ఫోల్డర్‌ను గాని రోనా విల్సన్ తెరిచారనడానికి ఎటువంటి ఆధారాలు లేవు. ఈ చొరబాటుదారులు చేర్చిన డాక్యుమెంట్లన్నీ మైక్రోసాఫ్ట్ వర్డ్ 2010 లేదా ఆ తర్వాతి వర్షన్లలో టైప్ చేసినవి కాగా, రోనా విల్సన్ లాప్‌టాప్‌లో ఉన్నది 2007 వర్షన్ మాత్రమే కావడం ప్రత్యేకంగా గమనించాలి. 

2018 మార్చ్ 14న రోనా విల్సన్ తన పెన్ డ్రైవ్‌ను వాడుతున్నప్పుడు లాప్‌టాప్ లోని అదృశ్య ఫోల్డర్‌ను చొరబాటుదారులు ఆ పెన్‌డ్రైవ్‌లోకి బదిలీ చేశారు. ఆ పది ఉత్తరాలలో ఎనిమిది ఇంగ్లిష్‌లో రాసినవి, రెండు హిందీలో రాసినవి, ప్రధాని హత్యాప్రయత్నం, ప్రభుత్వ కూల్చివేత, ఆయుధ సేకరణ, ధన సేకరణ వంటి ఆరోపణలున్నవి ఉన్నాయి. 

సహ నిందితులందరి కంప్యూటర్ హార్డ్ వేర్‌లను కూడ పరీక్షిస్తే ఈ చొరబాటు ఎంత విస్తృతంగా, ఎంత లోతుగా జరిగిందో మరిన్ని వివరాలు తెలుస్తాయి. ఈ సందర్భంలో, నిందితులు, నిందితుల తరఫు న్యాయవాదులు, స్వతంత్ర పరిశీలకులు, పత్రికా రచయితలు ఎందరో ఈ కేసులో సాక్ష్యాధారాలుగా చూపుతున్నవి అబద్ధమనీ, పోలీసుల సృష్టి అనీ గతంలో చేసిన వాదనల చరిత్ర చూడాలి. 

మొట్టమొదట 2018 జూన్ 6న పత్రికా సమావేశంలో పుణె పోలీసులు రోనా విల్సన్ లాప్‌టాప్‌లో దొరికాయని చెప్పి, మూడు ఉత్తరాల భాగాలు చదివి వినిపించి, ఆ ఉత్తరాలే తమ సాక్ష్యాధారాలన్నారు. తర్వాత క్రమంలో మరొక ఏడెనిమిది ఉత్తరాల భాగాలు, ఉత్తరాలు బయటపెట్టారు. కంప్యూటర్ హార్డ్ డిస్కులలో, పెన్ డ్రైవులలో దొరికిన ఈ ఉత్తరాలలో ఈ నిందితులకు మావోయిస్టులతో ఉన్న సంబంధాలు, ప్రభుత్వాన్ని కూల్చడానికీ, ప్రధానమంత్రిని హత్య చేయడానికీ వారు చేస్తున్న కుట్రలు, ఆయుధ సేకరణకు, ధన సేకరణకు వాళ్లు చేస్తున్న ప్రయత్నాలు మొదలైనవాటికి సాక్ష్యాధారాలున్నాయన్నారు.

ఈ ఉత్తరాల మొదటి విడత వెలువడగానే నిందితులు మాత్రమే కాక, ఎందరో విశ్లేషకులు, మాజీ పోలీసు, ఫోరెన్సిక్ అధికారులు, నక్సలైట్ ఉద్యమాన్ని దశాబ్దాలుగా చూస్తున్న పత్రికా విలేకరులు ఆ ఉత్తరాలు మావోయిస్టులవి అయి ఉండడానికి ఎంతమాత్రం వీలు లేదని సోదాహరణంగా వివరించారు. వాటిలో వాడిన భాష, సంబోధన, సంతకం లేకపోవడం, మావోయిస్టులు ఎన్నడూ వాడని పదజాలం వాడడం, హిందీ ఎన్నడూ రాయని వరవరరావు హిందీలో ఉత్తరం రాశారనడం, సుధా భరద్వాజ్ రాసినట్టుగా చెపుతున్న హిందీ ఉత్తరంలో ఆమెకు ఎంతమాత్రమూ రాని మరాఠీ పదాలుండడం వంటి ఎన్నో అసంగతాలను ఎత్తి చూపారు. నక్సలైట్ల అతి పెద్ద చర్య అయిన అలిపిరి దాడికి సంబంధించి అప్పటికి పద్నాలుగు సంవత్సరాలైనా ఒక్కటంటే ఒక్కటైనా అక్షర రూపపు ఆధారం దొరకలేదని, వారు ప్రధానమంత్రి హత్యకు పథకం రచించి ఉత్తరాలు రాసుకుని ఇంత బహిరంగంగా తమ కంప్యూటర్లలో పెట్టుకుంటారనడం హాస్యాస్పదమని టివి చర్చలో ఒక సైనిక వ్యవహారాల నిపుణుడు అన్నారు. ఆ చర్చ నేపథ్యంలోనే ఆగస్ట్ 28న దేశవ్యాప్త దాడులు, అరెస్టులు జరిగినప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించిన రొమిలా థాపర్ తదితరులు, ఈ కేసులో పోలీసులు చూపుతున్న ఎలక్ట్రానిక్ సాక్ష్యాధారాలు అనుమానాస్పదంగా ఉన్నాయని, అందువల్ల సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఒక స్వతంత్ర పరిశీలనా బృందాన్ని నియమించాలని కోరారు. 

ఆ తర్వాత పుణె కోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు ఆ ఎలక్ట్రానిక్ సాక్ష్యాధారాల విషయంలో పాటించవలసిన నియమ నిబంధనలను పాటించకుండా, సాక్ష్యాధారాలని తారుమారు చేస్తూ పోలీసులు ఎన్ని అక్రమాలు చేశారో న్యాయవాదులు ఎత్తిచూపారు. జప్తు చేసిన ఎలక్ట్రానిక్ పరికరాల క్లోన్ కాపీలను నిందితులకు, న్యాయవాదులకు ఇచ్చి, వారి వాదన వినిపించుకోవడానికి చట్టప్రకారం అవకాశం ఇవ్వవలసి ఉండగా, క్లోన్ కాపీలను ఇవ్వడానికి మొదట నిరాకరించారు. ఏడాది వాదనల తర్వాత ఇవ్వడానికి అంగీకరించి ఇప్పటికీ పూర్తిగా ఇవ్వలేదు. (అలా ఇచ్చిన రోనా విల్సన్ క్లోన్ కాపీ మీదనే ఇప్పుడు పరిశోధన జరిగింది). 

సురేంద్ర గాడ్లింగ్, రోనా విల్సన్‌ల క్లోన్ కాపీలను పరీక్షించిన ది కారవాన్ పత్రిక 2019 డిసెంబర్, 2020 మార్చ్‌లలో ఈ ఎలక్ట్రానిక్ సాక్ష్యాధారాలలోని అసంగతాలను ఎత్తి చూపుతూ ఇవి అబద్ధమైనవో, తారుమారు చేసినవో కావచ్చునని సవివరమైన నివేదికలు రాసింది. 

ఈ మధ్యలో మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు జరిగి, కొత్త ప్రభుత్వ అధికార కూటమిలో భాగస్వామి అయిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు శరద్ పవార్ ఈ కేసు విచారణాధికారుల పట్ల, చూపుతున్న సాక్ష్యాధారాల పట్ల అనుమానాలున్నాయని, అందువల్ల సాక్ష్యాధారాలను విచారించడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని బహిరంగ ప్రకటన చేశారు. ఆ పార్టీకే చెందిన హోం మంత్రి ఈ కేసు విచారణాధికారులను ముంబాయికి పిలిపించి చర్చిస్తుండగానే, మొదటి విడత చర్చలు జరిగి, మరొకసారి జరగాలని అనుకుంటుండగానే, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కింద నేరుగా పనిచేసే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి కేసును బదిలీ చేశారు. 

ఇన్ని మలుపులు తిరిగినా ‘సాక్ష్యాధారాల’ విశ్వసనీయత అనే అసలు సమస్య మళ్లీ మొదటికే వచ్చింది. ఆర్సెనాల్ కన్సల్టింగ్ నివేదిక మళ్లీ ఈ ప్రశ్ననే మరింత పకడ్బందీగా, అత్యున్నత సాంకేతిక పరికరాల సహాయంతో వేస్తున్నది. చొరబాటుదారు కావడానికీ, సాక్ష్యాధారాలు తారుమారు చేయడానికీ బాధ్యత వహించవలసి ఉన్న మహారాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, ఎన్‌ఐఎ ఈ ప్రశ్నకు ఏ జవాబు చెప్పినప్పటికీ, ఎలక్ట్రానిక్ పరికరాలు వాడుతున్న కోట్లాదిమంది తమకు తాము వేసుకోవలసిన ప్రశ్న ఒకటి మిగిలే ఉంటుంది. ప్రభుత్వ సంస్థలు లేదా ప్రైవేట్ సంస్థలు ఇలాగే మన ఎలక్ట్రానిక్ పరికరాల్లోకి చొరబడి, మన మీద చేయనున్న నేరారోపణలకు సాక్ష్యాధారాలను మన పరికరాల్లోనే దూరిస్తే, ఇక దిక్కెవరు? చిట్టచివరికి అదంతా అబద్ధమని రుజువైనా ఇప్పటికే రెండున్నర, మూడు సంవత్సరాల జీవితాన్ని జైళ్లలో కోల్పోయిన, అనారోగ్యం పాలయిన భీమా కోరేగాం నిందితులకు సంభవించిన విధంగానే మనలో ప్రతి ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగదారుకూ జరగదని హామీ ఉందా?

ఎన్. వేణుగోపాల్

Comments