సైన్సు కాలంలో మూఢ నమ్మకాలదే పై చేయా? | అమన్

 

చదువులేవీ వారి అజ్ఞానాన్ని పొగట్టలేకపోయాయి. విద్యాబుద్దులు నేర్పించే ఆ దంపతులు సత్యలోకమంటూ కన్నబిడ్డల్నే పొట్టనపెట్టుకున్నారు. ప్రాణాలు తీస్తే సత్యలోకం రాదు. ఉన్నత విద్యావంతులు ఉన్మాదులెలా అయ్యారని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.

నరబలి ఇచ్చిన ఘటనలు ఎన్నో చూశాం. కానీ కన్నబిడ్డల్నే మూఢనమ్మకాలతో కడతేర్చిన ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. ఇందులో భయంకరమైన నిజం ఏంటంటే, ఆ పిల్లలకూ ఏం జరగబోతుందో  ముందే తెలియడం.

అసలేం జరిగింది

మూఢనమ్మకం మనిషిని ఏస్థాయికైనా తీసుకెళ్తుంది అనడానికి ఉదాహరణ మదనపల్లిలో జరిగిన దారుణం.  మూఢ మత విశ్వాసంతో కన్నబిడ్డల్ని కిరాతకంగా హత్య చేశారు. తాము ఏం చేస్తున్నామో తెలియనంత అంధకారంలో ఉండి ఇద్దరి ప్రాణాలను బలి తీసుకున్నారు. కన్నబిడ్డల్ని చంపుకుంటే సత్యలోకం వస్తుందా.  వారి అంధవిశ్వాసం  చదువుకున్న చదువు, బోధించే పాఠాలు  దేనికీ పనికి రాకుండా పోయాయి. కనిపించని ఆ కొత్త ప్రపంచం కోసం కన్నబిడ్డల్నే బలిచ్చేందుకు సిద్ధమయ్యారంటే వారి నిజంగా పిచ్చి వాళ్ళని సమాజం నమ్ముతోంది. కుటుంబం మొత్తం నగ్నంగా పూజలు నిర్వహించారు. పెద్దమ్మాయికి సగం గుండు కొట్టించారు. పూజగదిలోకి తీసుకెళ్లారు. ఆ అమ్మాయి నోట్లో రాగి చెంబు పెట్టి, అందులో నవ ధాన్యాలు పోశారు. అ తర్వాత డంబెల్‌తో కొట్టి హతమార్చారు. గుడ్డిగా నమ్మిన మూఢ విశ్వాసం  మనిషిని ఎంత పరాకాష్ఠకు చేర్చుతుందో ఈ సంఘటన చెపుతుంది.  సంఘటనకు ముందు తాము ప్రాణ త్యాగం చేయబోతున్నామని పిల్లలకు ముందే తెలుసు. ఇద్దరు అన్నింటికీ సిద్ధమయ్యారు. సత్యలోకమనే భ్రమలో పడి తమకు తాముగా సమిధలయ్యారు.

ఈ ఘటనకు ముందే చిన్నకూతురు ఇన్‌స్టా గ్రామ్  నుండి  శివ ఈజ్‌ కమింగ్‌ అనే పోస్ట్ వచ్చింది. వర్క్‌ ఈజ్‌ డన్‌ అంటూ పోస్టు తర్వాత వచ్చింది. దాని అర్థం ప్రాణ త్యాగానికి సిద్ధమయ్యానని, తాను సత్యలోకానికి వచ్చేందుకు రెడీగా ఉన్నానని ముందే హింట్ ఇవ్వబడింది. పురుషోత్తం దంపతులకు ముందు నుంచి ఆధ్యాత్మిక భావన ఎక్కువ. సంఘటనకు కొన్ని రోజుల ముందు వాళ్ళ భక్తి స్థాయి మూడత్వానికి మించి పోయింది.  ఓ కొత్త ప్రపంచాన్ని ఊహించుకున్నారు. ఆ ప్రపంచానికి వెళ్లేందుకు కలలు కన్నారు. దానికి సత్యలోకమని పేరు పెట్టుకున్నారు. ఐహిక బంధాల నుంచి విముక్తులైతేనే అక్కడికి వెళ్తామని గట్టిగా నమ్మారు. అందులో భాగంగానే నరబలికి సిద్ధమయ్యారు. ముందుగా ఇక్కడ నుంచి పిల్లలకు విముక్తి కల్పిస్తే వారు సత్యలోకానికి వెళ్తారని ఆ దంపతులు భావించారు. అనుకున్నట్లే వారిని హత్యచేశారు. తాము సత్యలోకం వెళ్లిన తర్వాత కలవొచ్చన్నది వారి ఆలోచన.  సంఘంలో గౌరప్రదమైన స్థాయిలో ఉన్నారు. చేతినిండా డబ్బులు ఉన్నాయి. ఉండడానికి మంచి ఇళ్లు ఉంది. ఇద్దరు పిల్లలు బాగా చదువుతున్నారు. దేనికి లోటు లేదు. రిటైర్మెంట్‌కు వచ్చారు. ఎవరికైనా ఇంతకు మించి ఏం కావాలి. ఇక్కడే అన్ని అనుభవించే అవకాశం ఉన్నా, వేరే లోకానికి వెళ్లాలను కూన్నారు. లేని సత్యలోకం కోసం కన్న బిడ్డలనే బలి ఇచ్చారు. 

పూజల తోనే చిన్నకూతురు ఆరోగ్య సమస్య తగ్గించామని పద్మజ చెప్పింది. వారంరోజులుగా అర్ధరాత్రి  బయట ఎన్నో పూజలు చేశామని చెప్పారు. అలాగే పది రోజుల నుంచి తిండి లేకుండానే ఉన్నామని వాళ్లు పేర్కొన్నారు. కలియుగం అంతం అయిందని సత్య యుగం మొదలైంది అని వారు పోలీసులకు చెప్పారు. కరోనా వైరస్‌ చైనా నుంచి రాలేదంటూ పెద్ద పెద్దగా  పద్మజ అరవడాన్ని టీవీ వీక్షకులు చూశారు. ఇక నేనే శివుడ్ని,  కరోనావైరస్ నా నుండే వచ్చిందని ఆమె చెప్పింది.  

ప్రపంచం ఒక వైపు సాంకేతికంగా అభివృద్ధి చెందుతూ ఇంకా అత్యున్నతమైన టెక్నాలజీని సృష్టించేందుకు శాస్త్రవేత్తలు ఎంతో కృషి చేస్తున్నారు. మరోవైపు ప్రపంచాన్ని కరోనా పట్టిపీడిస్తుంటే దానికి వ్యాక్సిన్‌ కనిపెట్టేందుకు పరిశోధకులు చాలా కష్ట పడ్డారు. 

మదనపల్లి ఘటన

తల్లి ఎమ్మెస్సీ గోల్డ్ మెడలిస్ట్, తండ్రి డిగ్రీ కాలేజ్‌ వైస్‌ ప్రిన్సిపాల్‌.  ఇద్దరు ఉన్నత చదువులు చదివారు. పిల్లలిద్దరిని పెద్ద చదువులు చదివించారు. ఎంత చదువుకుంటే ఏం లాభం. వాళ్లను ఆవహించిన మూఢభక్తి. చివరకు కన్న పిల్లలనే బలితీసుకునేలా చేసింది. కలియుగం అంత మైందని, సత్య లోకం వస్తుందని వంటి పిచ్చి నమ్మకాలతో వయసుకొచ్చిన ఇద్దరు ఆడ పిల్లలను అత్యంత దారుణంగా చంపేశారు. ఎన్నో అశలతో, కలలతో ఎదుగుతున్న పిల్లల పాలిట కన్న తల్లే యమపాశంగా మారింది. ఇద్దరి జీవితాల్ని యుక్త వయసులోనే తుంచేసింది.  మూఢభక్తి రెండు నిండు ప్రాణాలను బలిగొంది. అల్లారుముద్దుగా పెంచుకున్న పిల్లలను మూడభక్తికి బలిచ్చారు.

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. పెద్ద చదువులు చదువుకొని, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ మూర్ఖులుగా వ్యవహరించారు. మదనపల్లెలో సంచలనం సృష్టించిన హత్యోదంతంతో విస్తుగొలిపే విషయాలు బయటపడ్డాయి. కన్న తల్లే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు నిర్థారణయింది. ఇద్దరు పిల్లల్ని తల్లి పద్మజనే చనిపోవడానికి ఒత్తిడి చేసింది. వారు నిరాకరించడంతో బలవంతంగా పూజలో కూర్చోబెట్టింది. ఇద్దర్ని నగ్నంగా ఉంచి పూజలు చేయించింది.  ఈ తతంగం జరుగుతున్న సేపంత వారి ఇంట్లో గంటలు మోగుతునే ఉన్నాయి. 

జనవరి 24వ తేదీన, అంటే జాతీయ బాలికా దినోత్సవం రోజున, ఈ సంఘటన  దిగ్భ్రాంతి కలిగించింది.
సంఘటనకు కొద్దిరోజుల క్రితం నాలుగు రోడ్ల కూడలిలో పారవేసిన నిమ్మకాయలు, పసుపు, కుంకాలను తొక్కాననీ, అందువలన తనకేదో దయ్యం పట్టిందని పెద్ద కూతురు  భయపడిందని పోలీసులు చెప్పారు. తల్లిదండ్రులు ఒక మంత్రగాడిని పిలిపించి, దారాలూ తాయెత్తులను కట్టించారు. అంతేకాదు, జనవరి 24వ తేదీతో కలియుగం అంతమౌతుందని వారందరూ నమ్మారు. కాబట్టి ఆ రోజున తమ బిడ్డలను చంపితే, వారు 25వ తేదీతో ప్రారంభమయ్యే కృతయుగంలో, స్వచ్ఛమైన బాలికలుగా పునర్జన్మ ఎత్తుతారని నమ్మారు.

 విద్యాధికులలో మూఢనమ్మకాలు ఎందుకున్నాయి  ?

 విద్యా విధానంలో  శాస్త్రీయ అవగాహనను పెంచే విషయాలు తక్కువగా ఉన్నాయి.   అశాస్త్రీయ అంశాలు విద్యార్థుల మనసుల్ని నింపేస్తున్నాయి. పురాణాలను పాఠ్యాంశాలలో చేరుతున్నారు. వాస్తును, జ్యోతిష్యాన్ని కూడా ఉన్నత చదువుల్లో చొప్పించే  దానికి ప్రభుత్వాలు ప్రయత్నం. చేస్తున్నాయి. అశాస్త్రీయ  అంశాలతో నిండిన పాఠాలను చదువుకున్న  పౌరులు శాస్త్రీయ భావాలను 
చెవికెక్కించు కోవడం లేదు. పిల్లలను విజ్ఞాన యాత్రలకు తీసుకోకపోవటం ఉపాధ్యాయులు కూడా మానివేశారు.  వాళ్లని తీర్థ స్థలాలు తీసుకు వెళ్ళటం జరుగుతోంది. 

టి.వి చానళ్లు ఏం ప్రచారం చేస్తున్నాయి?

జ్యోతిష్యం, వాస్తు, రంగు రాళ్లు, ప్రవచనాల పేరు మీద పురాణాల లోని అశాస్త్రీయ అంశాలు,  ఆధునిక మూఢనమ్మకాలను ప్రచారం చేస్తున్నాయి.  గతంలో అలాంటి కృషిని చేసినవారిలో చార్వాకులు ప్రథములు. ఆ తర్వాతి వారిలో పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి, యోగి వేమన వున్నారు.

రంగు రాళ్లు, వాస్తు, స్వామీజీల జోస్యాలు పెద్ద వ్యాపార సామ్రాజ్యంగా పెరిగిపోతున్నాయి. సినిమాలు, టివి సీరియళ్లు, ఇటీవల పెరిగిన ఒటిటి లో కూడా పారలౌకిక అంశాలు, మానవాతీత శక్తులకు సంబంధించినవే ప్రధానాంశాలుగా ఉంటున్నాయి

మూఢహత్యలు ఆగేదెప్పుడు?

 ప్రభుత్వం రాజ్యాంగం లోని 51ఎ (హెచ్‌) ప్రకరణాన్ని అనుసరించి శాస్త్రీయ భావాలను, శాస్త్రీయ ఆలోచనా విధానాన్ని ప్రజలలో పెంచే ప్రయత్నాలు చేయాలి. 1వ తరగతి నుంచి పాఠ్యాంశాలలో శాస్త్రీయ అవగాహనను పెంచే అంశాలను పెట్టాలి. అశాస్త్రీయ అంశాలను తీసివేయాలి. విద్యార్థుల విజ్ఞాన యాత్రలను ప్రోత్సహించాలి. సాక్షాత్తు ప్రధానమంత్రే వినాయకుడి కథ వాస్తవమనీ, ఆ కాలంలోనే మనకు ప్లాస్టిక్‌ సర్జరీ తెలుసుననే విషయాన్ని ఆ కథ నిరూపిస్తుందని చెబుతాడు. జ్యోతిష్యం, వాస్తులను కొంత కాలం క్రితమే ప్రభుత్వాలు డిగ్రీ కోర్సుల్లో ప్రవేశ పెట్టాయి. ఇటీవల ప్రఖ్యాత బనారస్‌ హిందూ యూనివర్సిటీ 'భూతవిద్య'ను ఒక కోర్సుగా ప్రవేశ  పెట్టింది. తిరుపతి లోని వేదిక్ యూనివర్సిటీలో అన్ని ఆశాస్త్రీయ కోర్సులు ప్రవేశ పెట్టారు.

 మూఢనమ్మకాల నిర్మూలన చట్టం కోసం ఉద్యమించాలి. అప్పుడే మూఢనమ్మకాల ప్రచారానికి అడ్డుకట్ట పడుతుంది. చివరగా తల్లిదండ్రులు శాస్త్రీయ భావాలను పెంచుకొని, తమ బిడ్డలకు శాస్త్రీయ అంశాలను వివరించాలి. అలా జరగని పక్షంలో మదనపల్లి ఘటనలూ, ఘాతుకాలు  జరుగుతూనే వుంటాయి. అందువలన ప్రజలందరూ శాస్త్రీయ ఆలోచనా విధానం వైపు అడుగులు వేయాలి.

 ఇరవై ఒకటో శతాబ్దంలో శాస్త్ర సాంకేతిక పురోగతితో రాకెట్లను మించిన వేగంతో అభివృద్ధి చెందుతోంది. కాని మూఢ మత విశ్వాసాలు రాకెట్ ని మించి వేగంతో ముందుకు వెళుతున్నాయి.

 గత దశాబ్ద కాలంగా కొన్ని శక్తులు పథకం ప్రకారం విస్తరింపజేస్తున్న మూఢత్వాలను గురించి సైతం పరిశీలించడం అవసరం. ఒకవైపు చంద్రయాన్‌ గురించి గొప్పగా చెబుతూనే మరోవైపు గోమూత్రం దివ్యత్వాన్ని వివరించి చెపుతారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన విద్యా విధానంలో ప్రజల వాడుకలో లేని సంస్కృత భాషను జనంపై రుద్దుతున్నారు.

 కేంద్ర ప్రభుత్వం మతతత్వ భావజాలాన్ని పెంచి పోషిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వమూ హోమాలు, పూజలు నిర్వహిస్తోంది. స్వామీజీలు, బాబాలు చుట్టూ రాజకీయ నాయకులు, ప్రభుత్వాధికారులు తిరుగుతున్నారు. విప్లవ యోధుడు చేగువేరా స్ఫూర్తితో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారు. ఇప్పుడు అది మతతత్వ పార్టీ అయిన బీజేపీతో పొత్తు పెట్టుకుంది.
 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు,  పార్టీలూ తాయెత్తులు, మొక్కుబడుల చుట్టూ రాజకీయాలు చేస్తున్నాయి. 

మూఢత్వ అంశాలను  పౌర సమాజం హేతువాద దృక్పథంతో తిరస్కరించాలి. శాస్త్రీయ భావాల వ్యాప్తితోనే సమాజ పురోగతి ఆధారపడి ఉంది

 నరమేధం

పురుషమేధ (నరమేధ) అనేది మానవ త్యాగంగా పురాణాలలో  కీర్తించబడింది.  ఇది అశ్వమేధతో దగ్గరి సంబంధం కలిగి ఉంది.  వేద గ్రంథాలు, పురాణాలలో నరబలి ప్రస్తావన ఉంది. 1805 లో కోల్‌బ్రూక్ ఈ సమస్యపై దృష్టి కేంద్రీకరించాడు. నిజంగా    మానవ త్యాగం జరుగుతుందా అనేది ఆ తర్వాత చర్చనీయాంశమైంది. అతను దీనిని ఒక సంకేత కర్మగా భావించారు.  పురుషమేధ  శాసనాత్మక  రికార్డులు ఇప్పటివరకు లేనందున, కొంతమంది పండితులు దీనిని త్యాగ అవకాశాలను సృష్టించడం  కోసం ఏర్పాటు చేసినట్టు భావిస్తున్నారు. ఐతరీయ బ్రాహ్మనీయంలోను నరబలి గురించి ప్రస్థావించ బడింది.

 హరిశ్చంద్ర రాజు చేసిన త్యాగం కథ మానవ త్యాగంగా చెప్పబడింది. సంతానం లేని రాజు తనకు ఒక కొడుకును ఇవ్వమని వరుణుడు కోరతాడు. దానికి బదులుగా వరుణుడు ఆ పిల్లవాడిని తనకు బలి ఇవ్వమని అడుగుతాడు. ఈ కథ భాగవత పురాణంలోను వుంది.

10 వ శతాబ్దం నాటికి, నరమేధం  కాశీ-వర్జ్యాల జాబితాలలోను,  కలియుగానికి నిషేధించబడిన చర్యలలోను చేర్చబడింది. ఏదేమైనా, పురుషమేధ కొన్ని సందర్భాల్లో మానవుని వాస్తవ త్యాగంతో సంపూర్ణంగా కూడి ఉండవచ్చునని కూడా ఇది సూచిస్తుంది.   ఒక కర్మ అభ్యాసకుడు కర్మ  వర్ణనను నైతిక లైసెన్స్‌గా తీసుకుంటాడు.  అఘోరాలు    ఒక మనిషిని వధించడంలోను, వారి మాంసాన్ని తినేటప్పుడు శివుని ఆజ్ఞతో చేస్తున్నట్లు చెబుతారు.   దాని వల్ల కలిగిన ప్రయోజనం ఏదీ భౌతికంగా కనపడదని చెపుతారు.  శాంతి, మానసిక సంతృప్తి మాత్రమే ఇస్తుందని నరబలి సిద్ధాంతాలు నమ్మేవాళ్ళు భావిస్తారు.

దేశంలో నరబలులు 

భారతదేశంలో నరబలి చట్టవిరుద్ధం. పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లో 2003 లో నరబలి  సంఘటన జరిగింది.  దేవత అయిన కాళి అనుచరులు 2006 లో అర్ధ సంవత్సర కాలంలో "డజన్ల కొద్దీ నరబలులు  చేశారని ఖుర్జాలోని పోలీసులు నివేదించారు.

2015 లో తమిళనాడు గ్రానైట్ కుంభకోణం దర్యాప్తు సందర్భంగా మదురై ప్రాంతంలో అక్రమ గ్రానైట్ వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి నరబలి జరిగింది.  శక్తి దేవతను శాంతింపచేయడానికి నరబలి జరిగినట్లు  వార్తలు వచ్చాయి. మద్రాస్ హైకోర్టు నియమించిన ప్రత్యేక న్యాయ అధికారి సమక్షంలో ఆరోపించిన ప్రదేశాల నుండి ఎముకలు, పుర్రెలను కనుగొన్నారు.

2020లోను  ఒడిశాలో దారుణం చోటు చేసుకుంది. కరోనా తరిమికొట్టాలంటూ ఓ పూజారి ఏకంగా నరబలి ఇచ్చారు. ఈ ఘటన తీవ్ర సంచలనంగా మారింది. ఆలయంలో ఓ వ్యక్తి తల నరికి అమ్మవారికి బలిచ్చాడు. ఒడిశాలోని కటక్‌ జిల్లా నర్సింగ్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బందాహుడా గ్రామంలో ఈ ఘటన జరిగింది.

సన్సారి ఓజా (75) అనే వ్యక్తి 'బంద మా బుద్ద బ్రాహ్మణిదేవి' ఆలయంలో పూజారిగా పని చేస్తున్నాడు. దేశంలో కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో నేపథ్యంలో ఈ పూజారికి బ్రాహ్మణిదేవత కలలోకి వచ్చి కరోనాకు పరిష్కారం చెప్పిందట. దీంతో ఆలయంలో నరబలి ఇచ్చేందుకు సరోజా‌ కుమార్‌ ప్రదాన్‌ అనే వ్యక్తిని ఎంచుకున్నాడు ఆ పూజారి. ఇంకేముంది అతనికి లేనిపోని మాయ మాటలు చెప్పి ఆలయంలో నరబలి ఇచ్చేందుకు  రాత్రి సమయంలో ఆలయం వద్దకు తీసుకెళ్లాడు. ఇక నరబలి విషయంలో ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వెంటనే పూజారి గొడ్డలి తీసి సరోజ్‌ (53) తలపై నరికాడు. వెంటనే అతడు అక్కడికక్కడే మృతి చెందాడు

సమాజంలో వ్యక్తులు,  చిన్న సమూహాలు చేసే కర్మ హత్యలను సాధారణ హత్యగా ఖండించడం సరైంది కాదు.  "మానవ త్యాగం" పేరిట జరుగుతున్న నరబలులు  తీవ్రమైనవి. అంటే వారు చెప్తున్న మానవ త్యాగం  అనేది సమాజానికి ఏ మాత్రం ఉపయోగపడేది కాదు. 

అనుమానాలు

డంబెల్ కాకుండా ఎదో పదునైన ఆయుధంతో నుదుటిపై కొట్టినట్లు ఉంది. పోస్టుమార్టం అనంతరం బంధువుల సందర్శనార్థం ఇంటికి శవాలను తీసురాలేదు.  అటే దహనవాటికకు తరలించి శవాలను దహనం చేశారు.  చనిపోయిన పెద్దఅమ్మాయిపై నెపమంతా నెట్టేయడానికి ప్రయత్నించారు. ఆలేఖ్య ఇష్టాగ్రామ్ పేస్ బుక్ అకౌంట్లు ఆమె మరణించేవరకు ప్రైవసీలో ఉన్నాయి. చనిపోయాక పబ్లిక్ అయ్యాయి. ఆమె ఓషో ఫాలోవర్ అని ఆమె పోస్టులను బట్టి తెలుస్తోంది. కానీ సాధారణ అమ్మాయిలకు మల్లే ఆమె అభిప్రాయాలు, ప్రవర్తన ఉంది.  అతిగా ఉన్మాద భావాలతో ఉన్నట్లు తెలియడం లేదు.  ఆమె సంప్రదాయంగా కన్పించడానికి గుడికి వెళ్ళిన సందర్భ పోస్టులు ఫేస్బుక్ లో లేవు. ఆగస్టు  2020లో కొత్త ఇంటిలో చేరిన సందర్భంగా ఇంటిలో గృహాప్రవేశ పూజలలో పాల్గొన్నట్లు కూడా పోస్టులు లేవు. పెంపుడు జంతువుల పట్ల ప్రేమ ఉన్నట్లు వాళ్లు గోవుతో తీసుకున్న ఫోటోలు స్పష్టం చేస్తున్నాయి.   గృహాప్రవేశం రోజు గోమాత పూజ జరిగినట్లుంది. కానీ గోవుతో అక్క చెల్లెలు బయట ఫోటో దిగారు.  దాన్ని పూజిస్తున్నట్లు, వాళ్ళు సంప్రదాయ దుస్తులలో కనపడలేదు. అసలు సంప్రదాయ కట్టుబొట్టుల్లో ఇద్దరు అక్కచెల్లెల్లు ఉన్నట్టు ఏ సోషల్ మీడియా  పోస్టులలోను కనపడలేదు.  సార్వజనీన ఓషో ప్రేరిత ప్రేమవైపు ఆమె ఆమె చెల్లెలు కూడా ఆకర్షితులైనట్లు ఆమె ఇష్టాగ్రామ్ పోస్టులను బట్టి అర్థం అవుతోంది.

ఆమె పోస్టులలో ఎక్కడ రాముడు కృష్ణుడు శివుడు, వేరే మత దేవుళ్ళ గురించి వ్యాఖ్యానించలేదు. ఆమె  మరణానికి ముందు మాత్రమే ఆమె పేస్ బుక్ ఇష్టాగ్రామ్ అకౌంట్లలో శివ ప్రస్తావన ఉంది.

చిన్నమ్మాయి సాయి దివ్య ఫేసు బుక్ అకౌంట్ డిలిట్ కాబడింది. ఇంస్టా గ్రామ్ అకౌంటులో ప్రొపైల్ నేమ్   మారడం,  పోస్టులన్ని డిలిట్ కావడం కూడా పలు అనుమానాలును రేకెత్తిస్తుంది.  

ముగింపు 

 యోగ ద్వారా ఆరోగ్యాన్ని, కషాయాలతో కరోనాను, దీపాలు,  చప్పట్లతో అభివృద్ధిని  సాధించవచ్చని    దేశాధినేతే చెబుతున్నారు. సమాజంలో  శాస్త్రీయ దృక్పథాన్ని, వైజ్ఞానిక స్పూర్తిని పెంచే  కృషి ఆగిపోయింది. ప్రజలే తమ మూఢత్వాన్ని,  అంధకారాన్ని వదిలించుకోవాలి. 

అంతరిక్షంలోకి పంపే రాకెట్ నమూనాను తిరుపతి వెంకన్న పాదాల ముందు పెట్టి పూజ చేస్తారు.   పేరు మారిస్తే భవిష్యత్తు బాగా ఉంటుందని నమ్మే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు. జాతకాలు చూసి పెళ్లి చేసుకునే సైంటిస్టులు ఉన్నారు. వాస్తు లేదని పార్లమెంట్ భవనాలను, అసెంబ్లీ భవనాలను కూల్చే ప్రభుత్వాలు వున్నాయి. అందుకే సమాజం వైరుధ్యాలతో వుండిపోయింది. 

 పాలకవర్గాలు సామ్రాజ్యవాద, కార్పొరేట్ అనుకూల విధానాలను అమలు చేస్తున్నాయి. అందువల్ల  పేదరికం, ఆకలిచావులు, నిరుద్యోగం,నిత్యావసర ధరలు,  ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. దేశంలోని సంపద 20 మంది  వ్యక్తుల చేతుల్లోనే ఉంది. ధనిక పేద మధ్య భేదం పెరుగుతోంది. ప్రజల్లో అశాంతి రాజుకుంటోంది.   ప్రజల కష్టాలను దేవుళ్ళు పరిష్కరిస్తారని నమ్మిస్తున్నారు. మూఢ విశ్వాసాలు, మతఛాందస విషయాలే, మత వ్యాపార సామ్రాజ్యం పెరుగుతోంది.    అందుకే ప్రజాస్వామిక వాదులు,  హేతువాదులు శాస్త్రీయ అవగాహనను ప్రజల్లో పెంపొందించే విధంగా ప్రయత్నాలు ఆరంభించాలి.

- అమన్

Comments