ప్రొ.సాయిబాబా ప్రాణాలు కాపాడండి | పౌర హక్కుల సంఘం


 

నాగపూర్ కేంద్ర కారాగారంలో జీవిత ఖైదు అనుభవిస్తున్న ప్రొ.సాయిబాబాకు *కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది*. ఇప్పటికే 19 రకాల వ్యాధులతో కదలలేని స్థితిలో ఉన్న సాయిబాబా పరిస్థతి ఇప్పుడు అత్యంత ఆందోళకరంగా మారింది. కోవిడ్ వ్యాపిస్తున్న తొలి రోజుల్లోనే ఈ ప్రమాదాన్ని ఊహించి బెయిల్ కోసం చేసిన విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. బైట కరోనా ప్రమాదం ఉంది కాబట్టి ఆయనకు బెయిల్ ఇవ్వలేము అని విచిత్రమైన వాదన చేసింది. కాన్సర్ తో బాధపడుతున్న సాయిబాబా తల్లిని చివరి చూపు చూడ్డానికి కూడా ఈ కారణం చెప్పే అనుమతించలేదు. ఇదంతా ఇక ఎత్తైతే కోవిడ్ నిబంధనల పేరు మీద ఆయన తన కుటుంబ సభ్యులను గాని, లాయర్లను కలవనివ్వలేదు, వారి నుండి ఉత్తరాలు, అత్యవసరమైన మందులు, బట్టలు వంటివి కూడా అందనివ్వలేదు. చివరికి ఆయన తన జీవించే హక్కు కోసం, జీవితాన్ని రిస్క్ చేసి నిరాహార దీక్షకు దిగారు. జైలు అధికారులు ఆయన డిమాండ్లకు ఒప్పుకున్నట్లే ఒప్పుకుని తర్వాత ఆయనకు అందాల్సిన కనీస వైద్యం కూడా అందివ్వలేదు. చివరికి కోవిడ్ లక్షణాలు తీవ్ర స్థాయిలో బైటపడి ఆయన తన కుటుంబ సభ్యులకు ఫోన్ లో తెలియజేస్తే గాని ఆయనకు కోవిడ్ టెస్ట్ కూడా చేయలేదు. కరోనా బైట పడ్డాక ఆయన్ను నాగపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆయనకున్న ఇతర ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా గుండె, కిడ్నీ సంబంధమైన వ్యాధులు, తొంబై శాతం అంగవైకల్యం వంటి ప్రత్యేకతలకు చికిత్స చేసే సదుపాయాలు ఆ ఆసుపత్రికి లేవని, కాబట్టి ఆయన్ని వెంటనే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించి ఆయన ప్రాణాలు కాపాడాలని కుటుంబ సభ్యులు మహారాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు వారికి సాయిబాబాను చూసే అనుమతి కూడా లభించలేదు. 
కొన్ని నెలల క్రితం ఇదే పరిస్థితి వరవరరావు విషయంలో చూసాం. ఇప్పటికీ ఆయనకు బెయిల్ రాలేదు. మరోవైపు భీమాకోరేగాం కేసులో డిజిటల్ దొంగ సాక్షాలను ఎంత పకడ్బందీగా తయారు చేశారో ఇప్పుడు బైట పడింది. సాయిబాబాకు శిక్ష విధించడానికి కూడా ఇటివంటి ఎలెక్ట్రానిక్ డేటా పైనే అధారపడ్డారన్నదాన్ని గుర్తు చేసుకుంటే.. రాజ్యం అనుకుంటే ఏమైనా చేయగలదు అన్న సందేశాన్ని ఇవ్వాలనుకున్నారని అర్థమవుతోంది. దేశంలో నేర విచారణ, న్యాయం వంటి మౌలిక విషయాల మీదే ప్రశ్నలు తలెత్తుతున్నప్పుడు ప్రజాస్వామ్యం చాలా పెద్ద మాటే అవుతుంది. 
తక్షణం సాయిబాబాను అన్ని ఆధునిక సౌకర్యాలున్న ఆసుపత్రికి తరలించాలని, ఆయన ప్రాణ రక్షణ బాధ్యత ప్రభుత్వానిదేనని అందరం గట్టిగా మాట్లాడదాం. ఆయన్ను ప్రాణాంతక స్థితిలోకి నెట్టిన రాజ్య క్రూరత్వాన్ని నిరసిద్దాం. ఊపా వంటి అప్రజాస్వామిక, తీవ్రవాద చట్టాలతో రాజ్యం ప్రజలపై, ప్రజామేధావులపై అమలుచేస్తున్న హింసను నిలదీద్దాం. 

Comments