Feb 14 2021 @ 00:52AM
మనప్రభుత్వాలు ఏటా సుమారు 60 లక్షల మంది పౌరులను వివిధ నేరారోపణలతో నిర్బంధిస్తున్నాయి. వాళ్లంతా ఏళ్ల తరబడి న్యాయస్థానాల చుట్టూ తిరగవలసిరావడం తెలిసిన విషయమే. అయితే న్యాయ వ్యవస్థతో చాలా వరకు సంబంధం లేకుండానే నిర్బంధితులు అవుతున్నవారు అనేకమంది ఉన్నారు. వీరి గురించే ఈ వ్యాసం.
2019లో మన ప్రభుత్వాలు లక్షా ఆరు వేల మంది పౌరులను ఎలాంటి విచారణ లేకుండా ఏడాది పాటు నిర్బంధించాయి. రాజ్యాంగం లోని అధికరణ 22 పరిధిలో చేసిన 25 ముందస్తు నిర్బంధ చట్టాలు న్యాయస్థానాల జోక్యానికి అతీతంగా ఈ నిర్బంధాన్ని అనుమతిస్తాయి. పత్రికలు ఈ చట్టాలను క్లుప్తంగా పీడీ (ప్రివెంటివ్ డిటెన్షన్) చట్టాలు అని అంటాయి. గత ఆరేళ్లలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక్క పీడీ చట్టం కింద 150 మందిని నిర్బంధిస్తే, అదే చట్టాన్ని సవరించి తెలంగాణ సర్కార్ సుమారు 2000 మందిని నిర్బంధించింది. చట్ట పరిభాషలో ఈ నిర్బంధితులను రాజ్య ఖైదీ (డిటెన్యూ)లు అని వ్యవహరిస్తారు. చట్టం ప్రకారం వాళ్ళపై మోపిన అభియోగాలలో నిజాలు ఎంత, సాక్ష్యాలు ఎంత అని తెలుసుకునే హక్కు, అవకాశం న్యాయవ్యవస్థకు గాని, పౌర సమాజానికి గాని లేదు. అది పూర్తిగా రాజ్య రహస్యం. ఈ నిర్బంధ కారణాలను బహిరంగపరచడం పబ్లిక్ ఆర్డర్ (ఈ మాటను ప్రజాభద్రత అనికూడా ఎందుకు వ్యవహరిస్తారో తెలియదు)కు ప్రమాదకరం అని పీడీ చట్టాలు ప్రకటించాయి. ఈ మార్గం ద్వారా ప్రభుత్వాలు తమకు గిట్టని వాళ్ళను, సహజ న్యాయ సూత్రాల ప్రకారం న్యాయ విచారణకు అనర్హులు అని అవి భావించే వారిని ఏడాది నుంచి రెండు సంవత్సరాల పాటు పాటు నిర్బంధిస్తున్నాయి. 1818లో వచ్చిన బెంగాల్ రెగ్యులేషన్ చట్టం నుంచి ప్రభుత్వాలకు ఈ అధికారం సంక్రమించింది. అధికరణ 22, ఈ వలస పాలనా యుగ చట్టాలకు సాధికారతను ఇచ్చింది. నిందితుల్లో ఒక వర్గానికి (రాజ్యానికి, పబ్లిక్ ఆర్డర్‌కు భంగం కలిగించే వారు) సహజ న్యాయ సూత్రాలను నిరాకరించడానికే 22వ అధికరణ పుట్టుకొచ్చింది. అంబేడ్కర్ మాటల్లో చెప్పాలంటే వ్యక్తి స్వేచ్ఛ, జీవించే హక్కుకు అధికరణ 21లో జరిగిన నష్టాన్ని పూడ్చడానికి అధికరణ 22ను తీసుకువచ్చారు. ఈ మాటా నిజం కాదు. ఈ అధికరణలో ఏడు క్లాజులు ఉంటే, వాటిలో రెండు మాత్రమే సగటు పౌరుడికి, సహజ న్యాయ సూత్రాలకు సంబంధించినవి. మిగిలినవి దేశ భద్రత (రాజ్య భద్రత అని చదువుకోవాలి), పబ్లిక్ ఆర్డర్‌కు భంగం కలిగించే ప్రత్యేకమైన పౌరులు ఎప్పుడూ ఉంటారని, వారిని నిర్బంధించడానికి సహజ న్యాయ సూత్రాలకు వ్యతిరేకంగా, న్యాయస్థానాల పర్యవేక్షణ లేకుండా, ఎటువంటి చట్టాన్ని అయినా చేసేందుకు పార్లమెంటు (ప్రభుత్వం అని అర్థం చేసుకోవాలి)ను అనుమతిస్తాయి. వలస పాలకుల హయాంలో నిర్బంధం అనుభవించిన వాళ్లలో కొందరు, ఈ అధికరణ వల్ల రాబోయే ప్రమాదాన్ని శంకించి, దానికి వ్యతిరేకంగా రాజ్యాంగ సభలో గట్టి పోరాటమే చేశారు.
కానీ, నిందితుడికి న్యాయవాది సహాయాన్ని తీసుకొనే హక్కు, నేరారోపణను తెలుసుకునే హక్కు, ప్రభుత్వ ఆరోపణల్ని ప్రశ్నించే హక్కును ప్రసాదించే సహజ న్యాయసూత్రాలు ప్రవేశికలో ఎందుకు లేవని డిసెంబర్ 18, 1946 నాటికే నెహ్రూను అంబేడ్కర్ ప్రశ్నించారు. ప్రాథమిక హక్కులకు చేసిన చిత్తుప్రతిలో సహజ న్యాయసూత్రాలు చేర్చాలని ఏప్రిల్ 23, 1947 నాటికే అంబేడ్కర్ ప్రయత్నించారు. ఆ తర్వాత ఆ అభిప్రాయాన్ని పూర్తిగా పక్కన పెట్టేసారు.
అధికరణ 22కు మద్దతుగా అంబేడ్కర్ చివరివరకు నిలబడ్డారు. ఆ క్రమంలో ఆయన ద్వంద్వ వైఖరి అవలంబించారనే ఆరోపణలను ఎదుర్కొన్నారు. ఏనాడూ నిర్బంధాన్ని అనుభవించకపోవడం వల్లే అధికరణ 22కు అంబేడ్కర్ కారణమౌతున్నారని మహావీర్ త్యాగి విమర్శించారు. హక్కులకు మద్దతుగా నిలవడానికి జైలు నిర్బంధం అవసరం లేదని అంబేడ్కర్ వాదించారు.
రాజ్యాంగ సభ సభ్యుడు జెడ్‌హెచ్ లారీ (ఈయన న్యాయవాది. 1956లో పాకిస్థాన్‌కు వలస వెళ్లారు, అక్కడి అధికార చట్రంలో ఇమడలేకపోయారు) 1948 డిసెంబర్ 13న అధికరణ 22కు వ్యతిరేకంగా తిరుగులేని వాదన వినిపించాడు. రాజ్యానికి ఉన్న ఏకపక్ష అధికారానికి వ్యతిరేకంగా జరిగిన చారిత్రక పోరాటాల నుంచి ప్రభవించిన సహజ న్యాయ సూత్రాలను నిరాకరించడం ద్వారా రాజ్యాంగ సభ ప్రజలందరినీ కుట్రదారులుగా చూస్తున్నదని లారీ వాదించారు. సహజ న్యాయ సూత్రాల ద్వారా విచారణ చేయండి అని అడగడమే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర చేయడం అవుతుందా? సగటు పౌరులు కుట్ర చేస్తే పడిపోయేంత బలహీనంగా రాజ్యం ఉంటుందా? ఇదంతా జవాబుదారీ తనం లేని అధికారాన్ని చేజిక్కించుకోడానికి చేస్తున్న ప్రయత్నమే అని అల్లాడి కృష్ణస్వామి అయ్యర్‌ను, అంబేడ్కర్‌ను ఆయన తప్పు పట్టారు. ఈ అధికరణను తీసేస్తే తప్ప భావి తరాల కృతజ్ఞతను మీరు సంపాదించుకోలేరు అని ఆ ఇరువురినీ లారీ హెచ్చరించాడు. ప్రజల హక్కులకు, ప్రభుత్వాల నిరంకుశ అధికారాలకు మధ్య ఉన్న వైరుధ్యాన్ని తెలివిగా ప్రభుత్వానికి, (ఎటువంటి చట్టాన్ని అయినా చేయడంలో) దానికి అడ్డుపడే న్యాయ వ్యవస్థకు మధ్య వైరుధ్యంగా మార్చి, స్వతంత్ర భారత తొలి ప్రభుత్వం రాజ్యాంగ సభలో తన మాటను నెగ్గించుకుంది. గొప్ప సంస్కరణ వాదులుగా సుప్రసిద్ధులైన కాంగ్రెస్ వాదులు ఆనాడు నెహ్రూకు అనుకూలంగా వ్యవహరించి, అధికరణ 22ను సమర్ధించారు.
కానీ ప్రజాస్వామ్య లక్షణాలు లేని పార్టీల నాయకత్వంలో ఏర్పడే ప్రభుత్వాలు, చట్టసభల ప్రమేయం లేకుండా ఆర్డినెన్సుల ద్వారా చట్టాలను తెస్తాయి; అధికార పార్టీ ఎంపీలు వాటిని పార్లమెంటులో అనివార్యంగా ఆమోదించాలి. లేదంటే ప్రభుత్వం మీద అవిశ్వాసం ప్రకటించినట్టవుతుంది. అదే జరిగితే ప్రభుత్వాలు పడిపోతాయి. ఎన్నికలు అనివార్యమవుతాయి. ఈ పరిస్థితిని చట్టసభల సభ్యులు కోరుకోరు కాబట్టి తప్పనిసరిగా ఆమోదిస్తారు. ఎన్నిక కాబడని న్యాయస్థానం అదుపులో చట్టసభలు ఉండడానికి వీలులేదు అనే వాదన, చట్టాలు చేసే ప్రక్రియలో ప్రజాస్వామ్యానికి ప్రతీక అయిన పార్లమెంట్ ఎక్కడ ఉంది అని జెడ్.హెచ్. లారీ చేసిన వాదన ముందు నిలవలేకపోయింది. సహజ న్యాయ సూత్రాలను ఎత్తిపట్టే బాధ్యత కలిగిన న్యాయస్థానాల ముందు ప్రభుత్వం తలవంచాల వద్దా అనే మీమాంసలో అంబేడ్కర్ తటస్థంగానే ఉండిపోయారు. అధికరణ 22ను వెనక్కు తీసుకోలేదు. అయినా అప్పటికే చాలా ఆలస్యమైపోయింది. జవాబుదారీ తనం లేని ముందస్తు నిర్బంధ అధికారం ఉండాలని నెహ్రు కమిటీ అప్పటికే షెడ్యూళ్లలో రాసేసుకుంది. ఫలితంగా పదివేల మంది కమ్యూనిస్టులు విచారణ లేకుండా జైళ్లలో మగ్గిపోవలసివచ్చింది.
ఇదంతా చరిత్ర. దేశ విభజనతో ప్రజ్వరిల్లిన హింసాకాండ, నెలకొన్న విషమ పరిస్థితులు ఒక సాకు మాత్రమే అనిపిస్తుంది. తాత్కాలిక అత్యయిక పరిస్థితుల ఆధారంగా స్వతంత్ర భారత రాజ్య వ్యవస్థ శాశ్వతమైన నిరంకుశ అధికారాలను రాజ్యాంగబద్ధంగా సమకూర్చుకుంది. అందువల్లే గత 75 ఏళ్లలో 25 ముందస్తు నిర్బంధ చట్టాలు వచ్చాయి. దేశం నిరంతరం క్లిష్ట పరిస్థితిలో ఉండడం పాలకులకు అవసరం కావచ్చు. ప్రజాస్వామ్యంలో న్యాయస్థానాలు సహజ న్యాయ సూత్రాల ద్వారా పాలనకు అడ్డుపడతాయని కల్పించిన వాదనలో పసలేదు. ఇప్పుడున్నంత బహిరంగంగా కాకపోయినా, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ రెండూ ఒక దానితో ఒకటి అంటకాగుతున్నాయనే విషయం చాలా కాలంగా అందరికీ తెలుసు. అయినా నాటకం నడవాలి కదా!
కులసమాజంలో పౌర సమాజమే లేదని అంబేడ్కర్ భావించారు. ఉదారవాద భావజాలం ఈ దేశంలో ప్రభావ వంతంగా పని చేయాలంటే, దానికి రాజ్యం ఇరుసుగా ఉండాలని 1919 లోనే సౌత్ బరో కమిటీ ముందు ఆయన వాదనలు వినిపించారు. కులం పునాదులను కూల్చివేసేందుకు రాజ్యం పనికి వస్తుందని ఆయన భావించి ఉండవచ్చు. రాజ్యాన్ని వ్యవస్థీకరించడంలోనే దానికి అంతర్గత అదుపును సృష్టించాలని అంబేడ్కర్ భావించారు. ఈ ప్రతిపాదనను రాజ్యం అంగీకరిస్తుందని అంబేడ్కర్ ఎందుకు, ఎలా భావించారో తెలియదు. అయితే ఆధిపత్య కులమే రాజ్యమైతే ఏమౌతుంది? ముందస్తు నిర్బంధ చట్టాలకింద నిర్బంధితులవుతున్న వారందరూ నిమ్నకులస్తులు, నిరక్షరాస్యులు అవుతారని (కావాలంటే క్రైమ్స్ ఇన్ ఇండియా రిపోర్టు: 2019 చూడండి) అంబేడ్కర్ ఊహించి ఉండరు. పైన ప్రస్తావించిన లక్షా ఆరువేల మందిలో అత్యధికులు చిల్లర చోరీలు చేసిన వారు. పబ్లిక్ ఆర్డర్‌ను నిర్వహించడానికి ప్రమాదకరంగా మారారని నిర్బంధితులయినవారు. వారిలో భారీ ఆర్థిక నేరాలకు పాల్పడి బ్యాంకింగ్ రంగంలో సంక్షోభానికి కారకులైన వారు ఒక్కరూ లేరు. పైన చెప్పిన మొత్తం డిటెన్యూలలో 458 మందిని మాత్రమే రాజ్యానికి ప్రమాదకరం అనే అభియోగంతో నిర్బంధించారు. ప్రస్తుతం పౌరహక్కుల చర్చంతా వారిలోని పదిమంది మేధావుల నిర్బంధం గురించి మాత్రమే జరుగుతోంది. మిగిలిన లక్షమంది నిర్బంధానికి, వారిపై ప్రయోగించిన న్యాయవిరుద్ధ చట్టాలకు, ప్రజామోదం మాత్రమే కాదు, హక్కుల చర్చ చేసేవారి ఆమోదం కూడా ఉన్నట్టే భావించాలి. నిర్బంధంలో ఉన్నవారు సామాన్యులైనా, మేధావులైనా జవాబుదారీ తనం లేని అధికారం కింద నిర్బంధితులు అయిన వారే అనే స్పృహ లేని హక్కుల చర్చ, వర్గ స్పృహనే ప్రతిఫలిస్తుందనుకోవాలి. కనీసం హక్కుల చర్చయినా న్యాయ సమ్మ తం కావాలంటే ఈ వర్గ, కుల పరిమితులను అధిగమించాలి.
కె. మురళి
Comments
Post a Comment