నవ్‌దీప్ కౌర్ అరెస్టును ఖండించండి | పౌర హక్కుల సంఘం


నవ్‌దీప్ కౌర్  అరెస్టు, కస్టోడియల్ లైంగిక హింసను ఖండించండి! *
* నవ్‌దీప్ కౌర్‌ను వెంటనే విడుదల చేయాలని, కుండ్లి ఇండస్ట్రియల్ ఏరియాలోని కార్మికులను లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్న హర్యానా పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాజ్య  అణచివేత వ్యతిరేక ప్రచారోద్యమం డిమాండ్ చేస్తోంది!
17 జనవరి  2021
జనవరి 12 న, సింఘు సరిహద్దు దగ్గర నిరసన  చేస్తున్న రైతులకు సంఘీభావంగా నిర్మించిన మజ్దూర్ అధికార్ సంఘటన్ (మాస్) టెంట్ లోకి చొచ్చుకు వచ్చిన హర్యానా పోలీసులు 24 ఏళ్ల దళిత మహిళ, కార్మికురాలు, ట్రేడ్ యూనియన్ కార్యకర్త  నవ్‌దీప్ కౌర్‌ను అరెస్టు చేసి, కుండ్లి పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి, రెండు ఎఫ్‌ఐఆర్  25/2021,  26/2021లను నమోదు చేశారు.
ఒకటి, భారత శిక్షాస్మృతిలోని 148, 149, 186, 332, 352, 384, 379 బి, 307 సెక్షన్ల క్రింద, మరొకటి 148, 149, 323, 452, 384, 506 సెక్షన్ల క్రింద; మారణాయుధాలతో అల్లర్లలో పాల్గొనడం, చట్టవిరుద్ధంగా సమావేశమవడం, ప్రభుత్వ సేవకుడికి హాని కలిగించడం, దాడి,  నేరపూరిత బలాన్ని ఉపయోగించడం, అతిక్రమణ, దోపిడీ, లాక్కోవడం, క్రిమినల్ బెదిరింపు, హత్యాయత్నం వంటి అనేక సెక్షన్లు పెట్టారు.
ఈ ఎఫ్ఐఆర్ లు ఒక పోలీసు ఇన్స్పెక్టర్,  ఎం / ఎస్ ఎలెక్మెక్ ప్రైవేట్ లిమిటెడ్‌లో (కార్మికుల వేతనాలు చెల్లించడంలో విఫలమైన సంస్థ) పని చేసే ఒక అకౌంటెంట్ యిచ్చిన ఫిర్యాదుపై నమోదు చేశారు.
పోలీసు కస్టడీలో ఉన్నప్పుడు, మగ పోలీసు అధికారులు ఆమెను  దారుణంగా కొట్టారు. జననాంగాలపై  కొట్టి లైంగిక హింసకు కూడా పాల్పడ్డారు.
 ఇటీవలి కాలంలో జరుగుతున్న అతిపెద్ద రైతు ఆందోళనకు సంఘీభావం తెలుపుతున్న కార్మికుల, రైతాంగ  ఐక్యతను విచ్ఛిన్నం చేయడానికి పదేపదే ప్రయత్నాలు చేసిన తరువాత,  హర్యానా పోలీసులు పంజాబ్‌లోని భూమిలేని పేద రైతు కుటుంబానికి చెందిన ఈ  దళిత యువతి పైన జరిపిన దారుణ లైంగిక హింసకు పాల్పడి తమ క్రూరత్వాన్ని ప్రదర్శించారు. 
కర్నాల్ జైలుకు పంపిన నవ్‌దీప్ కౌర్‌కు  రెండు వారాల పాటు జైలు రిమాండ్ విధించారు.
కుండ్లి పారిశ్రామిక ప్రాంతంలో మరింత ఎక్కువ మంది కార్మికులను అరెస్ట్ చేసే ప్రమాదం ఉంది.
నవ్‌దీప్ కౌర్‌ కుండ్లి ఇండస్ట్రియల్ ఏరియాలో  కార్మికురాలు. మజ్దూర్ అధికార్ సంఘటన్ (MAS) కార్యకలాపాల్లో భాగంగా,  ఫ్యాక్టరీ  మేనేజ్‌మెంట్ చేస్తున్న కార్మికుల వేధింపులు, కార్మికులకు చెల్లించని బకాయిలు, పెండింగ్‌లో ఉన్న వేతనాలు, మహిళా కార్మికులను అధిక దోపిడీ చేయడం వంటి  సమస్యలపైన పని చేస్తున్నారు. 
యూనియన్లు లేదా కార్మిక ప్రాతినిధ్యం లేని ఆ పారిశ్రామిక ప్రాంతంలో, అధిక సంఖ్యలో కాంట్రాక్టు కార్మికులుగా  పనిచేస్తున్నారు.  40-3/2020-DM-I (A) 2020 మార్చి 29 నాటి గృహ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉత్తర్వు వున్నప్పటికీ లాక్డౌన్ సమయంలో యిక్కడ కార్మికులకు వేతనాలు చెల్లించడం లేదు. 
ఫ్యాక్టరీ యజమానులు, మేనేజ్‌మెంట్‌ల సంస్థ అయిన, కుండ్లి ఇండస్ట్రియల్ అసోసియేషన్ (KIA)  ఏర్పాటు చేసుకొన్న క్విక్ రెస్పాన్స్ టీం (QRT) అనే  సాయుధ బలగం  ప్రతి రోజు కార్మికులపై హింస, బెదిరింపులు, దాడులు చేస్తూంటుంది. 
కార్మికులను భయపెట్టడం, ప్రతి కార్మికుడికి రాజ్యాంగం హామీ ఇచ్చిన యూనియన్లను నిర్మించుకునే ప్రయత్నాలను క్రూరమైన బలప్రయోగం, హింసల ద్వారా విఫలం చేయడమే QRT కున్న ఏకైక ఉద్దేశ్యం.
గత రెండు సంవత్సరాలుగా, మేనేజ్మెంట్,  వారి ప్రైవేట్ సాయుధ బలగాల దురాగతాలకు కుండ్లిలోని పూర్వ,  ప్రస్తుత స్త్రీ పురుష కార్మికుల సంఘం MAS సభ్యులు గురవుతున్నారు.
లాక్డౌన్ సమయంలో,  హర్యానా రాష్ట్ర ప్రభుత్వం ఆహార ధాన్యాల రూపంలో తగిన సహాయం అందించాలనే డిమాండ్‌తో కార్మికులు సమీ జకృతమయ్యారు. వారిలో అత్యధికులు వలస కార్మికులు. ఈ కృషి తరువాత వారిని లక్ష్యంగా చేసుకొన్న  భూ, ఫ్యాక్టరీ యజమానుల హిందూ జాగృతి మంచ్ అనే స్థానిక బలగం MAS సమావేశంపై హింసాత్మక దాడి చేసింది. 
లాక్డౌన్ ఎత్తివేసిన తరువాత, వేతనాలు దొరకని కుండ్లిలోని కార్మికుల పరిస్థితి దయనీయంగా ఉంది.  కార్మికుల కేసులను చేపట్టడం ద్వారా, చాలా మంది విశ్వాసాన్ని గెలుచుకున్న MAS తన కృషిని రెట్టింపు చేసింది.
 ఢిల్లీ సరిహద్దులో కుండ్లి సమీపంలోకి వచ్చిన రైతుల ఉద్యమం  కిసాన్-మజ్దూర్ ఏక్తా నినాదాలను తెచ్చింది.
రైతు పోరాటానికి మద్దతుగా కుండ్లీలోని కార్మికులు ర్యాలీలు, కార్యక్రమాలను నిర్వహించారు.
అదేవిధంగా, చాలా మంది రైతులు, కార్మికుల నిరంతర మద్దతుకు స్పందనగా,  వారి పోరాటంలో సహాయం చేయడానికి ముందుకు వచ్చారు.
రైతుల సహాయంతో,  300 మందికి పైగా కార్మికులకు వేతనాలు ఇప్పించడంలో MAS విజయవంతమైంది .
ఈ ఐక్యతను భగ్నం చేయడం లక్ష్యంగా  ఫ్యాక్టరీ యాజమాన్యం, మేనేజ్ మెంట్ కార్మికులపై QRT ని వదులుతోంది. దాంతో ఈ దాడులు మరింత తరచుగానూ, హింసాత్మకంగానూ  జరుగుతున్నాయి. 
తమ కఠినమైన షిఫ్టుల పని గంటల తరువాత కూడా సరిహద్దు వద్ద వుంటున్న రైతులకు సహాయం చేయడానికి ముందు కొచ్చిన కార్మికులను  QRT తన ప్రత్యేక లక్ష్యంగా చేసుకోవడం ప్రారంభించింది.
జనవరి 2 న, కార్మికులు తమకు బాకీ వున్న  వేతనాలు చెల్లించాలనే డిమాండ్‌తో  కంపెనీకి వెళ్ళినప్పుడు, QRT వారిపై కాల్పులు జరిపింది.
వెంటనే వెళ్ళిన MAS సభ్యుల ఫిర్యాదును నమోదు చేయడానికి కుండ్లి పోలీసులు  నిరాకరించడంతో వారు సోనీపత్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ పోలీసులు ఏ చర్యా చేపట్టడానికి తిరస్కరించడమే కాకుండా కార్మికుల పైననే దౌర్జన్యం చేశారనే కేసు పెట్టారు.
 తాము "ఆత్మరక్షణ" కోసం కాల్పులు జరిపినట్లు QRT అంగీకరించినప్పటికీ, కాల్పులు జరగనే లేదని పోలీసులు అంటున్నారు.
మళ్ళీ, జనవరి 12 న, కార్మికులు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఫ్యాక్టరీకి వెళ్ళినప్పుడు వేతనాలకు బదులు వారు క్రూరమైన లాఠీ-ఛార్జ్,  కాల్పులను ఎదుర్కోవాల్సి వచ్చింది. కొంత మంది మహిళా కార్మికులతో చేసిన దుష్ప్రవర్తనలో, వారి దుస్తులు కూడా చిరిగిపోయాయి.
వివిధ రకాల ఒత్తిడి తీసుకు వచ్చే ఎత్తుగడలతో కార్మికుల దృఢత్వాన్ని, రైతు ఉద్యమంతో వారికి గల ఐక్యతను విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలు విఫలమవడంతో, పోలీసులు నవ్‌దీప్ కౌర్‌ను అరెస్టు చేసి, ఆమెపై హాస్యాస్పదమైన ఆరోపణలు చేశారు.
తమకు న్యాయంగా రావలసిన వేతనాలు అడిగినందుకు లైంగిక వేధింపులకు గురిచేసి, పోలీసు కస్టడీలో దారుణంగా కొట్టారు.
అంతేకాకుండా,  కార్మికుల న్యాయమైన డిమాండ్ల కోసం గొంతెత్తడానికి ధైర్యం చేసిన ఒక యువ దళిత మహిళను లక్ష్యంగా చేసుకోవడం, లైంగిక హింసకు పాల్పడడం యూనిఫాంలో ఉన్న పురుషుల అత్యంత క్రూరమైన, స్త్రీ ద్వేష నాగరికతను ఎత్తి చూపుతోంది.
 బ్రాహ్మణీయ, పితృస్వామిక, హిందుత్వ అధారంపై పోలీసులకున్న శిక్ష మినహాయింపు దృఢంగా నిలుస్తుంది.
ఫ్యాక్టరీ యజమాన్యం, మేనేజ్ మెంట్, వారి సాయుధ దళం, హిందూ జాగృతి మంచ్ వంటి స్థానిక సమూహాలు, హర్యానా పోలీసులు మిలాఖత్తు అవడం అందరికీ స్పష్టంగా కనపడుతోంది.
నవ్‌దీప్ కౌర్ లాంటి కార్మిక-కార్యకర్తలను అరెస్టు చేసి లైంగిక వేధింపులకు గురిచేస్తుండగా, వారికి వ్యతిరేకంగా మీడియాలో ఒక క్రమబద్ధమైన దుష్ప్రచారం మొదలైంది.
 కార్మిక-రైతాంగ ఐక్యత సంకేతం అందితే చాలు, కార్పొరేట్ - రాజ్య కూటమిలో నిరాశ నెలకొంటుంది.
బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్ట్ శక్తులకు తమ మహిళా, దళిత, కార్మిక, రైతు వ్యతిరేక ఎజెండాలో వున్న ప్రయత్నాలన్నీ విఫలమైనప్పుడు పోలీసుల సహాయ, సహకారంతో నేరుగా రాజ్య అణచివేతకు పూనుకొంటాయి.
 కార్మికుల-రైతు ఐక్యత వల్ల ఈ శక్తులు ఎదుర్కొంటున్న ముప్పు వెలుగులో కార్మికులను లక్ష్యంగా చేసుకోవడంలో KIA ఫ్యాక్టరీ యాజమాన్యం, మేనేజ్‌మెంట్, వారి ప్రైవేట్ సాయుధ బలగాలు,  హర్యానా పోలీసుల పాత్రను చూడాలి.
పోరాటానికి పెరుగుతున్న మద్దతు నేపథ్యంలో రైతు ఉద్యమాన్ని కించపరచడానికి,  అపకీర్తిపాలు చేయడానికి చేస్తున్న ఎడతెగని ప్రయత్నాల్లో ఇది ఒక భాగం.
* నవ్‌దీప్ కౌర్ తదితర కార్మికులపై హర్యానా పోలీసుల నీచకృత్యాలను రాజ్య అణచివేత వ్యతిరేక ప్రచారోద్యమం (CASR) ఖండిస్తుంది, ఆమెను వెంటనే విడుదల చేయాలని కార్మికులను లక్ష్యంగా చేసుకోవటానికి వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తుంది.
* నవ్‌దీప్ కౌర్ ఎదుర్కొన్న కస్టోడియల్ లైంగిక హింసను CASR నిర్ద్వందంగా ఖండిస్తుంది.  అందుకు కారకులైన యూనిఫారంలో వున్న నేరస్తులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది.
* అన్ని ప్రజాస్వామిక శక్తులు ఐక్యమై  హర్యానా పోలీసుల ఈ చర్యలను ఖండించి, వారి జవాబుదారీతనాన్ని డిమాండ్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
*Campaign Against State Repression*
(Organising Team: AISA, AISF, APCR, Bhim Army, Bigul Mazdoor Dasta, BSCEM, CEM, CRPP, CTF, Disha, DISSC, DSU, DTF, IAPL, IFTU, IMK, Karnataka Janashakti, KYS, Lokpaksh, LSI, Mazdoor Adhikar Sangathan, Mazdoor Patrika, Mehnatkash Mahila Sangathan, Morcha Patrika, NAPM, NBS, NCHRO, Nowruz, NTUI, PDSU, People’s Watch, Rihai Manch, Samajwadi Janparishad, Satyashodak Sangh, SFI, United Against Hate, WSS)

Comments