పాదయాత్ర భగ్నం వెనుక కుట్ర | తెలంగాణ కమిటి


పౌరహక్కుల సంఘం పాదయాత్రను ప్రభుత్వం ఎందుకు భగ్నం చేసింది

కేంద్రం తీసుక వచ్చిన వ్యవసాయ చట్టాలకు రైతులు చేస్తున్న  పోరాటానికి మద్దతుగా పౌరహక్కుల సంఘం చేపట్టిన పాదయాత్రను భగ్నం చేయడమే కాక ఆ సంఘం నాయక్లను అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ... అసలు మొత్త వ్యవహారం జరిగిన తీరును వివరిస్తూ పౌరహక్కుల సంఘం విడుదల చేసిన మీడియా ప్రకటన పూర్తి పాఠం...

రైతులు పండించే మెతుకు మీద బ్రతుకుతున్న మనుషులుగా ఢిల్లీలో రైతులు ఎముకలు కొరికే చలిలో రాజ్యం పెడుతున్న హింసను కళ్ళుండి చూసి భరించలేక పౌర హక్కుల సంఘం వారికి మద్దతుగా నిలవాలని నిర్ణయించింది. నలభై ఐదు రోజులుగా అష్టకష్టాలకు ఓర్చుకొని చేస్తున్న చారిత్రాత్మక పోరాటానికి తన వంతు బాధ్యతను గుర్తించి నూతన వ్యవసాయ సవరణ చట్టాలను రద్దు చేయాలనే డిమాండు ప్రభుత్వంపై వత్తిడి పెంచాలనే లక్ష్యంతో పాదయాత్ర తల పెట్టింది.

ఈ ప్రజా చైతన్య యాత్ర బీర్ పూర్ మండలం జగిత్యాల జిల్లా, కోల్వాయి గ్రామం నుండి ఈ నెల 10వ తేదీన మొదలై మరుసటి రోజు 11న జగిత్యాలలో జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం అందజేయడంతో ముగుస్తుందని నిర్ణయించాం. ఈ మేరకు జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌కు సమాచార పత్రం వ్రాతపూర్వకంగా ఈ నెల 7న అందజేసాము. మా విన్నపం ఎడల మొదట సానుకూలతను ప్రదర్శించిన పోలీసులు తర్వాత తమ ధోరణి మార్చుకొని ఖఠిన వైఖరిని అవలంబించి అరెస్టులకు దిగారు.

ఈ నెల 9న మా కరీంనగర్ జిల్లా నాయకులు మాదన కుమారస్వామి, రాష్ట్ర సహాయ కార్యదర్శి, ఏనుగు మల్లారెడ్డి, రాజేశం, వెంకట్,రాజేంద్రలను అరెస్టు చేశారు. వారిని ఏ పోలీస్ స్టేషన్లో నిర్బంధించినారో కూడా తెలుపలేదు. పాదయాత్రకు అనుమతి ఇవ్వాల్సిన వారే ఇవ్వకుండా నిరాకరించారు. నిరాకరించిన వారే అనుమతి లేదనే నెపంతో పాదయాత్రను భగ్నం చేశారు. పైగా అక్రమ అరెస్టులకు పూనుకోవడం చట్టవ్యతిరేకం. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం సమస్తం డిసెంబర్ 8వ తేదీన రాష్ట్ర రహదారులన్నీ బైటాయించి దిగ్బంధం చేశారు. దానికి ఎవరు అనుమతి యిచ్చారు? మరి మేము తలపెట్టిన చిన్న కర్యాక్రమానికి పోలీసుల అనుమతి కావాలనడం ఏ చట్టం నిర్దేశించింది?

పోలీసులు అరెస్టు చేసిన మా కార్యకర్తలను విడుదల చేయాలని, పాదయాత్రను యధావిధిగా సాగనివ్వాలని అడగడం కోసం జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ను కలుద్దామని రాష్ట్ర నాయకత్వం జగిత్యాలకు ఈ నెల 10న ఉదయం హైదరాబాదు నుండి బయలుదేరింది. అయితే కొడిమ్యాల పోలీసులు చెక్ పోస్టు వద్ద వారి వాహనాన్ని అడ్డగించి అధ్యక్షులు ప్రొ॥ గడ్డం లక్ష్మణ్, ఉపాధ్యక్షులు రఘునాధ్, సహాయ కార్యదర్శి గుంటి రవితో పాటు కార్యవర్గ సభ్యులు జెల్ల లింగయ్యల‌ ను అరెస్టు చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో పౌర ప్రజాస్వామిక కార్యాచరణకు అవకాశం లేకుండా దారులన్నిటిని మూసేస్తున్నారు. ప్రత్యామ్నయ గొంతులను ప్రగతిశీలమైన విమర్శలను ప్రభుత్వం భరించలేక పోతున్నది. అన్ని వర్గాల ప్రజలు ఏకీకృత అభిప్రాయానికి వస్తే తమ ఉనికికి ప్రమాదం ఏర్పడుతుందని భయపడుతున్నది. ప్రజలు సమూహంగా కదలి రోడ్ల మీదికి రావడాన్ని తమ అధికారం తృణ ప్రాయమవుతుందని జంకుతున్నది.

కేవలం పొగడ్తలను మాత్రమే ప్రోత్సహిస్తున్నది.అదే సమయంలో తమకిష్టమైన రాజకీయ పార్టీలు, అకస్మాత్తుగా ఆందోళనకు దిగి హైవేలను దిగ్భందించినా, పబ్లిక్ సర్వీసు కమీషన్ కార్యాలయాన్ని, ఎలక్షన్ కమీషన్ కార్యాలయాల లాంటి అత్యున్నత ప్రభుత్వ యంత్రాగాన్ని దిగ్భందించి విధులకు అంతరాయం కలిగించినా ఎలాంటి కేసులు నమోదు చేయడం కాని, భగ్నం చేయడం కాని జరగడం లేదు. ప్రజలకెంత ఇబ్బంది కలిగించినా పట్టనట్లు మిన్నకుండా ఉంటుంది.

ప్రజా సంఘాలు శాంతియుతంగా నిర్వహించ తల పెట్టిన ప్రతీ కార్యక్రమానికి అనుమతి నిరాకరించి భగ్నం చేస్తూ ద్వంద వైఖరిని చాటుకుంటుంది. ఈ విధమైన ప్రభుత్వ నిరంకుశ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాము. ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజలను, ప్రజా సంఘాలను టార్గెటు చేసి కక్ష పూరితంగా వ్యవహరించడం మానుకోవాలి. అక్రమ అరెస్టులకు స్వస్తి పలకాలి. పోలీసు యంత్రాంగాన్ని చట్ట ప్రకారంగా, పారదర్శకంగా, నిస్పక్షపాతంగా వ్యవహ‌రించేలా కట్టడి చేయాలి. నూతన వ్యవసాయ చట్టాల ఆమోదాన్ని పార్లమెంటు సాక్షిగా వ్యతిరేకించిన వైఖిరికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉండాలని పౌర హక్కుల సంఘం డిమాండు చేస్తుంది.

లక్ష్మణ్ గడ్డం రాష్ట్ర అధ్యక్షులు
ఎన్. నారాయణ రావు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
రఘునాధ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు
మాదవ కుమార స్వామి రాష్ట్ర సహాయ కార్యదర్శి
జల్ల లింగయ్య రాష్ట్ర కార్యవర్గ సభ్యులు
మల్లారెడ్డి ఎ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు
పి.యం. రాజు సిటి కమిటి అధ్యక్షులు

Comments