రాష్ట్రంలో గత నాలుగు దశాబ్దాలుగా పనిచేస్తున్న హక్కుల, దళిత, సాహిత్య, కార్మిక, కళా సంస్థల బాధ్యులు సుమారు 30 మందిపై గత నెల 23, 24 వ తేదీల్లో మావోయిస్టు పార్టీతో సంబంధాలు అంటగడుతూ రెండు అక్రమ కేసులు బనాయించారు. నవంబర్ 23న విశాఖ జిల్లా ముచింగ్ ఫుట్ పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నెంబరు 47/2020 గా ఒక కేసు పెట్టారు. రెండో కేసు గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నెంబరు 66/2020 గా నమోదు చేశారు. ఈ కేసుల్లో మావోయిస్టు పార్టీ నాయకులతో పాటు ప్రజా సంఘాల బాద్యులపై దేశద్రోహం లాంటి తీవ్ర ఆరోపణలతో చట్టవ్యతిరేక కార్యకలాపాలు నిరోధక చట్టం (UAPA) తో వివిధ సెక్షన్ల క్రింద వివిధ విధ్వంస కేసులు అక్రమంగా పోలీసులు బనాయించారు.
ఈ రెండు కేసుల్లో ప్రజాసంఘాల బాధ్యులపై పోలీసులు చేసిన ఆరోపణలు పచ్చి అబద్ధాలు. ఈ సంఘాలు తమ ప్రణాళికల్లో భాగంగా ప్రజల హక్కుల కోసం ఆయా రంగాల్లో బహిరంగంగా, రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా పనిచేస్తున్నాయి. పోలీసులు ఆరోపించినట్లు ఈ సంస్థలు మావోయిస్టు పార్టీ అనుబంధ సంఘాలుగా గానీ, ముసుగు సంస్థలు కానేకాదు. ఇటువంటి ఆరోపణలతోనే గత తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో విశాఖ జిల్లా బి. మాడుగుల పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నంబరు 47/2018 కేసు బనాయించి అనేకమంది ప్రజాసంఘాల కార్యకర్తలను "UAPA" కింద జైళ్ళలో నిర్బంధించింది. ఆ వారసత్వాన్ని మళ్లీ ఈ రెండు కేసుల ద్వారా పోలీసులు కొనసాగించదలచినట్లు భావిస్తున్నారు.
హక్కుల, ప్రజాసంఘాల కార్యక్రమాలను అడ్డుకోవాలనే ప్రభుత్వ విధానంలో భాగంగానే పోలీసుల ద్వారా తప్పుడు ఆరోపణలతో ఈ కేసులు బనాయించారని భావిస్తున్నాము. ఆయా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా, ప్రజాస్వామిక పద్ధతుల్లో పనిచేస్తున్న ఈ సంఘాల బాద్యుల పై అక్రమ కేసులు బనాయించడమంటే రాజ్యాంగంలో వ్రాసుకున్న భావ ప్రకటన స్వేచ్ఛను హరించడమే.
పౌరహక్కుల సంఘం, మానవ హక్కుల వేదిక, విప్లవ రచయితల సంఘం, కుల నిర్మూలన పోరాట సమితి, ప్రజా కళా మండలి, ప్రగతిశీల కార్మిక సమాఖ్య, చైతన్య మహిళా సంఘం, దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం తదితర సంస్థల ప్రధాన రాష్ట్ర బాద్యులపై ఈ కేసులు బనాయించడం ద్వారా ఈ రాష్ట్రం లో ప్రజా హక్కుల కోసం ఎవరూ గొంతెత్తి మాట్లాడకుండా ఉండాలనే విధానంలో భాగంగానే ఈ అక్రమ కేసులు బనాయించారని భావిస్తున్నాం.
ఈ 15 రోజుల్లో ఐదుగురు ప్రజా సంఘాల బాధ్యులను (అమరుల బంధుమిత్రుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు బి. అంజమ్మ, చైతన్య మహిళా సంఘం రాష్ట్ర నాయకురాలు రాజేశ్వరి, ప్రగతిశీల కార్మిక సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. కొండారెడ్డి, ప్రగతిశీల కార్మిక సమాఖ్య చిత్తూరు జిల్లా శాఖ కార్యదర్శి ఆంజనేయులు, విశాఖ నాయకురాలు అన్నపూర్ణ ను అరెస్టు చేశారు. ఇందులో నలుగురిని జైళ్ళలో నిర్బంధించారు. ఈ పద్ధతుల్లోనే మిగతా హక్కుల, ప్రజాసంఘాల బాధ్యులపై కూడా పైన పేర్కొన్న తప్పుడు కేసుల్లో అరెస్టులు చేసి జైళ్లకు పంపుతారేమోనని ఆందోళన చెందుతున్నారు.
గత ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాల వల్ల అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం కూడా ప్రజల్లో బహిరంగంగా వారి సమస్యల సాధన కోసం పనిచేస్తున్న హక్కుల, ప్రజాసంఘాల బాధ్యులైన న్యాయవాదులు, ఉపాధ్యాయులు, కార్మిక,కర్షక, ప్రతినిధులను నిర్బంధించడం న్యాయ సమ్మతం కాదు.
ఈ విషయంలో ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని హక్కుల, ప్రజాసంఘాల బాధ్యులపై బనాయించిన అక్రమ కేసులు ఎత్తివేయాలని, ఇప్పటికే జైళ్ళలో నిర్బంధించిన ప్రజాసంఘాల బాద్యులను విడుదల చేయించే ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేయాలి.
- నంబూరి శ్రీమన్నారాయణ
హై కోర్టు న్యాయవాది
ఆంధ్రప్రదేశ్
Comments
Post a Comment