తెలంగాణ అస్తిత్వం ఏమైంది | ప్రొ. జి. హరగోపాల్‌.


ఎడిటోరియల్ పేజీ, ఆంధ్రజ్యోతి, దినపత్రిక,22డిసెంబర్,2020.
కేవలం ఒకే అస్తిత్వం తప్ప ఏ ఇతర అస్తిత్వాలను గుర్తించని రాజకీయాలు దేశంలోనూ, తెలంగాణలోనూ  ఇవ్వాళ వేగంగా బలాన్ని పుంజుకుంటున్నాయి. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవాలంటే ఉద్యమ స్ఫూర్తిని పునర్నిర్మించుకోగలగాలి. లేకపోతే ఒక సమున్నత అస్తిత్వ చరిత్ర ప్రశ్నార్థకమైపోతుంది.
రాజకీయాలలో ఆర్థిక రాజకీయ భావజాలాలతో పాటు అస్తిత్వాలు బలంగా పని చేస్తున్న ఒక సామాజిక పరిణామం ఉధృతమవుతున్న సందర్భంలో తెలంగాణ సమాజమూ, విశాల భారతీయ సమాజమూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రసమితికి ప్రాంతీయ అస్తిత్వం ఆక్సిజన్‌ లాంటిది. అలాగే భారతీయ జనతాపార్టీకి హిందుత్వ ఒక బలమైన ఆధారం. అస్తిత్వాన్ని కాపాడుకోవడమనేది ఎవరైనా తమిళుల నుంచే నేర్చుకోవాలి. దాదాపు అర్ధ శతాబ్దం తమిళనాడులో తమిళ అస్తిత్వం నిలవడానికి, సమున్నతమవడానికి విస్తృత సంక్షేమ కార్యక్రమాలతో పాటు ద్రవిడియన్‌ సంస్కృతి పట్ల అవాజ్యానురాగాలు విశేషంగా తోడ్పడ్డాయి. అవే తమిళ రాజకీయ పార్టీలను నిలబెట్టాయి. తమిళ పార్టీల మధ్య తీవ్ర బేధాలున్నా, అవి విడిపోయినా, విభజింపబడ్డా తమిళ అస్తిత్వమే అన్ని రకాల తమిళ పార్టీలకు ప్రాణం లాంటిది. మరి తెలంగాణ విషయమేమిటి? కేవలం ఆరు సంవత్సరాలలోనే తెలంగాణ అస్తిత్వం బలహీనపడిందంటే, తెలంగాణ ప్రజలు క్రమంగా తమ అస్తిత్వం, దాని జ్ఞాపకాల నుంచి దూరమయ్యారంటే అందుకు కారణాలు ఏమై ఉంటాయి అనేది విశ్లేషించాలి.
తెలంగాణ అస్తిత్వం ఇవ్వాళ్టిది కాదు. దానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. తెలంగాణ జ్ఞాపకాలలో సమ్మక్క సారక్క తిరుగుబాటు, కొమరం భీం పోరాటం, భారత స్వాతంత్య్రోద్యమ కాలంలోనే జరిగిన సాయుధ పోరాటం సజీవంగానే ఉన్నాయి. దొడ్డి కొమురయ్య, ఐలమ్మ, బందగీ, షోయబుల్లా ఖాన్‌, భాగ్యరెడ్డి వర్మ, సురవరం ప్రతాపరెడ్డిల స్ఫూర్తి తెలంగాణ చైతన్యంలో మిగిలి ఉంది. తెలంగాణ ఉద్యమాలలో వచ్చిన అద్భుత సాహిత్యముంది. నిజానికి ఈ పోరాటాల చరిత్రే ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ప్రాణవాయువులా పని చేసింది. ప్రత్యేక తెలంగాణ కోసం చివరి ఉద్యమం దాదాపు రెండు దశాబ్దాలు జరిగింది. స్వాతంత్య్రానంతరం ఒక్క అస్సాంలో తప్పించి, అస్తిత్వం కోసం అంత పెద్ద ఉద్యమం మరెక్కడా జరగలేదు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమాలు జరగలేదని కాదు కానీ ప్రజల ప్రత్యక్ష భాగస్వామ్యం గ్రామీణస్థాయి దాకా విస్తరించి గ్రామ గ్రామంలో ధర్నా టెంటులు నెలల తరబడి నిర్వహించబడడం అరుదైన సంఘటనే.
తెలంగాణ పౌర సమాజం ఒక అరుదైన నిర్మాణం. ఉద్యమకాలంలో ప్రధాన స్రవంతి రాజకీయాలకు బయట కవులు, కళాకారులు, రచయితలు, ప్రభుత్వ ఉద్యోగులు.. ఒక్క రంగం అని కాదు, అన్ని రంగాలలో జెఎసిలు ఏర్పడ్డాయి. ఎక్కడ చూసినా ఒక ఉత్సాహభరిత ఉద్విగ్న వాతావరణం నెలకొంది. తెలంగాణ విద్యార్థులు నిర్వహించిన పాత్ర అసాధారణమైంది. ఎంత నిర్బంధం ఉన్నా, ఉస్మానియా, కాకతీయ విద్యార్థులు లక్షల మంది చాలా క్రమశిక్షణతో కోర్టు ఆజ్ఞలకు లోబడి సదస్సులు నిర్వహించారు. అలాగే నాకు తెలిసి దేశంలో ఎక్కడ కూడా పొలిటికల్‌ జెఎసి ఒక విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌ని అధ్యక్షుడుగా నియమించుకోవడం జరగలేదు. ఇక జయశంకర్‌ ఉద్యమ సారథిగా తెలంగాణ సింబల్‌గా గౌరవింపబడ్డాడు. కాళోజీ నిర్వహించిన పాత్ర, ఆయన ఇచ్చిన స్ఫూర్తి ఎప్పుడూ స్ఫూర్తిదాయకమే. ఆరుగురు పౌరహక్కుల నాయకులు ప్రాణాలు ఇచ్చినటువంటి ప్రాంతం మరొకటి లేదు. తెలంగాణ ఒక సజీవ పౌర సమాజం అనే దానికి వేరే సాక్ష్యాధారాలు అవసరం లేదు
ఒక బలమైన అస్తిత్వంలో నుంచి తాము పుట్టామని, ఆ అస్తిత్వ ఉద్యమంలో తాము పెరిగామని, ప్రజలు తమ మీద విపరీతమైన ఆశలు పెట్టుకున్నారనే ఎరుకను తెలంగాణ రాష్ట్రసమితి అతి తొందరగా మరచిపోయింది! తెలంగాణ వస్తూనే తెలంగాణ పునఃనిర్మాణమనే స్ఫూర్తితో పాలన ప్రారంభం కావలసింది. ఒక రెండు దశాబ్దాల విజన్‌ డాక్యుమెంట్‌ ఉండవలసింది. ప్రాధాన్యతలు చాలా స్పష్టంగా నిర్వచించవలసి ఉండే. ప్రొఫెసర్ చెన్నమనేని హన్మంతరావు, జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి, ప్రొఫెసర్‌ విఎస్‌ ప్రసాద్‌,  ప్రొఫెసర్‌ రేవతి, మల్లేపల్లి లక్ష్మయ్య మొదలైన తెలంగాణ ధీమంతుల భాగస్వామ్యంతో ఒక విజన్‌ని రూపొందించవలసింది. పునర్నిర్మాణం అనే నినాదం తెలంగాణలో మారుమోగవలసింది. ఈ పునర్నిర్మాణంలో తెలంగాణ యువతను, జెఎసిలను, ఎన్‌జిఓలను, ఉద్యమానికి మద్దతు ఇచ్చిన అందరినీ భాగస్వాములు చేయవలసింది. తెలంగాణలోని ప్రతి మనిషి పునర్నిర్మాణంలో భాగస్వాములం అని భావించగలిగే వాతావరణాన్ని సృష్టించవలసింది.
పునర్నిర్మాణం అనే స్వప్నం లేకపోవడంతో దెబ్బలు తిని, త్యాగాలు చేసిన వాళ్లు ఏమీ కాకుండాపోయారు. తెలంగాణ యువత చాలా ఆశయ సాధకులు. ఎంత కాదన్నా పోరాట స్ఫూర్తి ఉన్నవాళ్ళు. వాళ్ళందరూ కేవలం భద్రత కలిగిన ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయనే ఆశతో కుంచించుకుపోయారు. ఉద్యోగాలతో బాటు తాము నూతన తెలంగాణ నిర్మాణంలో కార్యకర్తలమనే ఉత్సాహం ఉండవలసింది. అలా కాక, చాలా ఉద్యోగాలు వస్తాయనే ఆశ కల్పించడంతో, లక్షల మంది యువత సర్వీస్‌ కమిషన్‌ ప్రకటన వస్తుందని పరీక్షల కోసం సన్నద్ధం కావడంలో మునిగిపోయారు. ఈ పరీక్షకు టివిలో లెక్చర్‌ ఇస్తే వాటి ముందు కూర్చుని వేలాది మంది నోట్స్‌ రాసుకున్నారు. హైద్రాబాద్‌లోని ప్రతి లైబ్రరీలో వందల మంది యువత పరీక్షల కోసం చదువులో పడిపోవడంతో వాళ్లు దాదాపు తెలంగాణ అస్తిత్వాన్ని పూర్తిగా మరచిపోయారు. పోనీ ఆ ఉద్యోగాలు ఏమైనా వచ్చాయా అంటే గత ఆరు సంవత్సరాలలో 30వేల ఖాళీలు భర్తీ చేశామంటున్నారు. అంటే, సంవత్సరానికి ఐదు వేల చొప్పున సర్వీస్‌ కమిషన్‌ నియామకాలు చేసింది. తీవ్ర నిరాశకు గురైన తెలంగాణ యువత ఏమీ తోచని స్థితిలో పడిపోయారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర తెలంగాణ ఆస్తిత్వం గురించి మాట్లాడడమే కష్టమైపోయింది. ఇతర ఏ రాజకీయాలకైనా మద్దతు ఇచ్చే యువతగా మారిపోయారు.
ప్రజాస్వామ్య సంస్కృతి తెలంగాణకు మరో గర్వకారణం. దేశంలో ఎక్కడా లేనంత సంఖ్యలో ప్రజాస్వామ్యవాదులు అన్ని రంగాల్లో ఉన్నారు. మాలాంటి వాళ్ళం దేశంలో ఎక్కడకు వెళ్ళినా ఈ అంశం ప్రస్తావించి గర్వపడే వాళ్ళం. ఆ సంస్కృతి మీద తెలంగాణలో పెద్ద దాడే జరిగింది. తెలంగాణ ఉద్యమానికి నీరు పోసి పెంచిన ఇందిరాపార్క్‌ వేదికను రద్దు చేశారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి తాళాలు వేశారు. ఉమ్మడి రాష్ట్ర నిర్బంధ సంస్కృతి మరింత ఉధృతంగా తెలంగాణకు వచ్చేసింది. జయశంకర్‌ నాతో ‘మన ముఖ్యమంత్రి, మన హోంమంత్రి అందరూ అందుబాటులో ఉంటారు’ అని పదే పదే అనేవాడు. ఇప్పుడు మంత్రులు కలవరు, కలిసినా నిస్సహాయులమని తేల్చి చెబుతున్నారు. కనీసం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నంత అందుబాటులో కూడా వీళ్ళు లేకుండా పోయారు. ఇక ఇది మన తెలంగాణ, వీళ్ళంతా మా వాళ్ళు అని ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఎలా భావిస్తారు. ఉద్యమంలో కీలక పాత్ర నిర్వహించిన కోదండరాంను కదలనివ్వకుండా మెదలనివ్వకుండా చేశారు. తెలంగాణ ఉద్యమానికి నిజాయితీగా, ఏం ఆశించకుండా మద్దతు ఇచ్చిన దాదాపు 70 మందిపై ఉపా కేసులు పెట్టారు. ఇట్లా గతంలో ఎప్పుడూ జరగలేదు. భవ్య తెలంగాణను స్వప్నించిన వరవరరావును అరెస్టు చేశారు. ఆయన ఆరోగ్యం దయనీయంగా ఉందని, తెలంగాణ ప్రభుత్వం కొంత చొరవ తీసుకోవాలని వందలాది కవులు, కళాకారులు, రచయితలు, విద్యావంతులు, జర్నలిస్టులు దాదాపు అన్ని వర్గాలవారూ విజ్ఞప్తి చేసినా ఉలుకు పలుకు లేదు. అదే జార్ఖండ్‌లో స్టాన్‌స్వామిని అరెస్టు చేస్తే అక్కడి ముఖ్యమంత్రి, హోంమంత్రి బహిరంగంగా అభ్యంతరం చేయడమే కాక టీవీ ఛానెల్స్ ప్రత్యక్ష ప్రసారాలలో పాల్గొని ఖండించారు.
తెలంగాణ వస్తే విద్యా, వైద్య రంగాలకు పూర్వవైభవం వస్తుందని ఆశించాం. గతంలో ఎన్నడూ లేని దీనస్థితిలోకి ఈ రంగాలు దిగజారాయి. విశ్వవిద్యాలయాలు వికాసం చెంది విలసిల్లి ఉంటే తెలంగాణ పరిస్థితి ఇలా పరిణమించేది కాదు. తెలంగాణ సిద్ధిస్తే ఉస్మానియా యూనివర్సిటీ, ఉస్మానియా జనరల్‌ హాస్పిటల్‌కు మునుపటి ప్రశస్తి లభిస్తుందని, అవి తెలంగాణ అస్తిత్వానికే గౌరవప్రదమైన చిహ్నాలుగా అభివృద్ధి చెందుతాయని ఉద్యమకాలంలో ఆశించాం.
అన్నిటికి మించి సాంస్కృతిక రంగంలో బాగా దెబ్బతిన్నాం. తెలంగాణకు గర్వకారణమై ఈ ప్రాంతాన్ని ఉర్రూతలూగించిన పాటలు ఏమయ్యాయి? తెలంగాణ అస్తిత్వాన్ని అద్భుతంగా పలికించిన అందెశ్రీ ‘జయ, జయహే తెలంగాణ’ పాట ఏమయ్యింది? అందెశ్రీ గేయం ప్రతి స్కూల్లో, ప్రతి సదస్సులో పాడించవలసింది. అందెశ్రీని మా గ్రామానికి తెలంగాణ వచ్చిన కొత్తలో తీసుకెళితే స్కూలు పిల్లలు, జూనియర్‌ కాలేజి విద్యార్థులు ఎంత ఉత్సాహంతో ఆ పాట పాడారో ఆ స్ఫూర్తిని కొనసాగించవలసింది. గోరటి వెంకన్న, గద్దర్‌, జయరాజ్‌, నందిని సిద్దారెడ్డి లాంటి కవుల పాటలు ఏవీ? కంచుకంఠంతో మాట్లాడే దేశపతి శ్రీనివాస్‌ ఏమయ్యాడు? ఆర్థికవ్యవస్థ దెబ్బ తింటే కోలుకోవచ్చు, రాజకీయాలను సరిదిద్దవచ్చు కాని ‘సాంస్కృతికంగా ప్రత్యేక గుర్తింపు’ను కోల్పోతే జాతికి భవిష్యత్తు ఉండదని జయశంకర్ పదే పదే ప్రతి సభలో అలసట లేకుండా చెప్పేవాడు. 


తెలంగాణలో అధికారంలోకి వచ్చిన పెద్ద మనుషులు తెలంగాణ అంటే గర్వపడి పులకించి పోయేవాళ్లు కాదు. పునర్నిర్మాణం చేసి చరిత్రపుటల్లో నిలిచిపోదాం అనే చారిత్రక స్పృహ ఉన్నవాళ్లు కాదు. తెలంగాణ భూములను ప్రేమించారు కానీ, తెలంగాణ ప్రజలను కాదు. భూములు, గుట్టలు, చెట్లు ఎక్కడ ఉన్నాయి, ఆ వ్యాపారం ఎలా చేద్దాం అని ఆలోచించే వాళ్లే చాలామంది ఉన్నారు. హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం దారిలో వెళ్తుంటే అందమైన చిన్న గుట్టలున్నాయి. శిలలు మనుషులు అమర్చినట్టుగా ఉంటాయి. వీటి అందం గురించి కలాం తన ఆత్మకథలో పేర్కొన్నారు. తెలంగాణ వచ్చిన మరునాడే ఎవరో మహిళ ‘ఈ గుట్టలు నావి’ అనే బోర్డు పెట్టేసింది. వీళ్లంతా అవకాశమొస్తే వేరే పార్టీలోకి దూకేవాళ్లే. సరే, తెలంగాణ రాష్ట్రసమితికి ఇంకా మూడేళ్ల సమయముంది. ఈ మూడేళ్లలో ఈ దిశలో ఏమైనా చేస్తారా అనేది వాళ్ల ఇష్టం. కేవలం ఒకే అస్తిత్వం తప్ప ఏ ఇతర అస్తిత్వాలను గుర్తించని రాజకీయాలు దేశంలోనూ, తెలంగాణలోనూ ఇవ్వాళ వేగంగా బలాన్ని పుంజుకుంటున్నాయి. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవాలంటే ఉద్యమ స్ఫూర్తిని పునర్నిర్మించుకోగలగాలి. లేకపోతే ఒక సమున్నత అస్తిత్వ చరిత్ర ప్రశ్నార్థకమైపోతుంది.
ప్రొఫెసర్ జి. హరగోపాల్‌

Comments