ఎడిటోరియల్ ఆంధ్రజ్యోతి దినపత్రిక,18 డిసెంబర్,2020.
ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల ప్రజాహక్కుల, మానవ హక్కుల నాయకులపై కేసులు పెట్టడం, నిర్బంధానికి గురిచెయ్యడం పెద్దఎత్తున సాగుతోంది. ప్రజాసంఘాల కార్యకర్తల అరెస్టులు, అక్రమ కేసుల బనాయింపు ఎక్కువైనాయి. అమరుల బంధుమిత్రుల సంఘం, చైతన్య మహిళా సంఘం నాయకులను ఇటీవల అరెస్టు చేసిన సందర్భంలోనే సుమారు డెబ్బైమంది ప్రజాసంఘాల కార్యకర్తలపై పోలీసులు కేసులు పెట్టారు. మధ్యమధ్యన కాస్తంత విరామం ఇస్తూ ఒక క్రమపద్ధతిలో వివిధ కార్మిక సంఘాలు, మానవహక్కుల సంఘాల నాయకుల వేట కొనసాగిస్తూ, వారిపై ఏకంగా చట్ట వ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టాన్ని (ఉపా) ప్రయోగిస్తున్నారు.
వివిధ ప్రజాసంస్థలు, వ్యక్తులు లక్ష్యంగా సాగుతున్న ఈ ఏరివేతకు సమర్థనగా వీరంతా మావోయిస్టు పార్టీ సమర్థకులూ, సహాయకులూ అని పోలీసులు ఓ అడ్డగోలు వాదన చేస్తున్నారు. తాము కేసులు పెడుతున్న వారంతా మావోయిస్టు నేతల మార్గదర్శకంలో పనిచేస్తున్నవారేననీ, తెరవెనుక శక్తులను తవ్వితీయాలంటే కంటికి కనిపిస్తున్న వారందరినీ కటకటాల్లో నెట్టాల్సిందేనని పోలీసుల వాదన. ఉపా, ఆర్టికల్ 370 రద్దు, మతోన్మాద దాడులు ఇత్యాది అంశాలపై ఉద్యమించిన, వివిధ ప్రజాందోళనల్లో చురుకుగా పాల్గొంటున్న వారు లక్ష్యంగా పోలీసుల నిర్బంధం జరుగుతున్నది. తెలుగు రాష్ట్రాల్లో మావోయిస్టులు లేరని కేంద్రహోంమంత్రి ఒక పక్క ప్రకటిస్తారు, పోలీసులు మాత్రం తాము అరెస్టు చేసినవారికి మావోయిస్టులతో సంబంధాలున్నాయని అంటారు. దళిత హక్కులనేతలు, ప్రజా ఉద్యమకారులు, ప్రజాస్వామికవాదులు, కళాకారులు, రచయితలు, మేథావులు, సాహిత్యకారులపై ఉపాని ప్రయోగించడం, వారికి ఏమాత్రం సంబంధం లేని కేసుల్లో ఇరికించడం విచిత్రం. మావోయిస్టు అంటూ ఒకరిని అరెస్టు చేయడం, అతడు ఇచ్చిన సమాచారం మేరకు అంటూ ఆ తరువాత పెద్ద సంఖ్యలో అనేకమంది మీద ఉపా మోపడం ఓ క్రమపద్ధతిన సాగిపోతున్నది. పన్నెండేళ్ళ నాటి వాకపల్లి ఘటనలో బాధితులకు అండగా ఉన్నందుకు మానవహక్కుల వేదిక నాయకులు విఎస్ కృష్ణపైనా, కడపజిల్లా తుమ్మలాపల్లిలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగానూ, గండికోట రిజర్వాయర్ విస్థాపకుల పక్షానా ఉద్యమిస్తున్న ఇదే సంఘం ఉపాధ్యక్షురాలిపైనా ఉపా కేసులు పెట్టడం విచిత్రం. డెబ్బైనాలుగేళ్ళ వయసులో ఉన్న పౌరహక్కుల నేత శ్రీరామమూర్తి కూడా ఉపా బాధితులు కావడం నివ్వెరపరచే అంశం.
తమను ప్రశ్నించినవారిపై నల్లచట్టాలను ప్రయోగిస్తున్న కేంద్రపెద్దలను జగన్ అదే తీరున అనుసరిస్తున్నట్టు ఉన్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు ఉపా ఇస్తున్న నిర్వచనం ప్రకారం చూసినా ఈ హక్కుల నేతలపై కేసులు బనాయించడం ఏమాత్రం అర్థంలేనిది. అత్యాచారానికి గురైన ఆదివాసీ మహిళలకు అండగా ఉండటమూ దేశసమగ్రతను దెబ్బతీసేదేనా? ఉగ్రవాద నిరోధానికి అనేక చట్టాలున్నా, వరుస సవరణలు, చేర్పులతో ఉపాను పాలకులు బలోపేతం చేశారు. ఈ నేరాల పరిశోధన బాధ్యతను ఎన్‌ఐఏకు అప్పగించడంతో, రాష్ట్రాల పరిధిలోకి చొరబడేందుకు మార్గం సుగమం అయింది. ముందు జాగ్రత్త పేరిట అరెస్టు, విచారణంటూ లేకుండా దీర్ఘకాలం జైల్లో పడేయగలగడం పాలకులకు బాగా ఉపకరిస్తున్నది.
ఉపా కేసులు అత్యధికం న్యాయస్థానాల్లో నెగ్గవన్నది తెలిసిన రహస్యమే. గత పదేళ్ళకాలంలో ఒకే ఒక్క కేసు నిలబడింది. ఇప్పుడు ద్రోహులూ, దోషులూ అంటూ కేసులు పెట్టినవారంతా ఎప్పటికైనా నిర్దోషులుగా తేలవలసిందే. కానీ, ఇంతలోగా పాలకుల అప్రజాస్వామిక నిర్ణయాలను ప్రశ్నించే, ప్రతిఘటించే సంఘాలను నిర్వీర్యం చేయడమనే లక్ష్యం నెరవేరుతుంది. ప్రభుత్వాలు ప్రదర్శించే నిరంకుశత్వానికి ఇక హద్దే ఉండదు. ప్రశ్నించే, నిరసించే గొంతులను నొక్కే కుట్ర ఇది. ప్రజా ఉద్యమాలను బలహీనపరచే ప్రయత్నం. ప్రజాసంఘాల నాయకులపై ఏకంగా రాజద్రోహం కేసులేమిటని సామాన్యులు సైతం ఆశ్చర్యపోతున్నారు. హక్కుల రక్షణకు కట్టుబడినవారికే సంక్షేమ నినాదాలు ఇచ్చే అర్హత ఉంటుంది. రాష్ట్ర పాలకులు ఇప్పటికైనా ఈ అక్రమ కేసులకు స్వస్తిపలకాలి.
Comments
Post a Comment