ఏలూరు
30-11-2020
*ప్రెస్ నోట్*
*"ఉపా" చట్టం రద్దు చేయాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద ధర్నా*
అన్ లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్(UAPA)"ఉపా" చట్టాన్ని రద్దు చేయాలని, ప్రశ్నించే వారిని, న్యాయం కోసం పోరాడే వారిని "ఉపా" చట్టం కింద అక్రమ కేసులు బనాయించి, అరెస్టు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్ వద్ద. *ఉపా(UAPA) రద్దు పోరాట కమిటి*
ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఉగ్రవాదులు, తీవ్రవాదులు, దేశద్రోహులు, దేశ రహశ్యాలను బట్టబయలు చేసే వారు తదితర తీవ్రమైన నేరాలు చేసే వారిపై ప్రయోగించవలసిన *చట్ట విరుద్ధ కార్యకలాపాల నిషేధ చట్టాన్ని* సామాన్యులపైన, ప్రశ్నించే వారిపైన, న్యాయం కోసం పోరాడే వారిపైన ప్రయోగించడాన్ని వ్యతిరేకిస్తూ వివిధ ప్రజాసంఘాలతో ఏర్పడిన "ఉపా" రద్దు పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఈధర్నా జరిగింది.
పౌర హక్కుల సంఘం,ఐ ఎఫ్ టి యు, కె.ఎన్.పి.ఎస్., ఏ ఐ కె ఎమ్ ఎస్, పి.కె.ఎస్., పి.డి.ఎస్.యు., పి. డి.ఎం. తదితర సంఘాలతో ఏర్పడిన పోరాట కమిటీ చేపట్టిన ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో పౌరహక్కుల సంఘం(సి.ఎల్.సి.) రాష్ట్ర ఉపాధ్యక్షులు,ఉపా రద్దు పోరాట కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ ఎన్.శ్రీమన్నారాయణ, ఐ.ఎఫ్.టి.యు జిల్లా ప్రధాన కార్యదర్శి,ఉపా రద్దు పోరాట కమిటీ జిల్లా కన్వీనర్ యు. వెంకటేశ్వరరావు(యు.వి), కె.ఎన్. పి.ఎస్. జిల్లా అధ్యక్షుడు జాన్ రాజు, ఎఐకెఎమ్ ఎస్ జిల్లా కార్యదర్శి తలారి ప్రకాష్,పికెఎస్ జిల్లా కార్యదర్శి మస్తాన్, పి.డి.ఎస్.యు. జిల్లా అధ్యక్షులు కె. నాని, పౌర హక్కుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె.వి రత్నం, ఐ.ఎఫ్.టి.యు. జిల్లా సహాయ కార్యదర్శి బద్దా వెంకట్రావు తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ "కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వల్ల ప్రజలకు అనేక సమస్యలు ఏర్పడుతున్నాయని, ఆయా సమస్యలపై వివిధ ప్రజా సంఘాలు పోరాటాలు చేయడం సహజమని పేర్కొన్నారు. రాజ్యాంగం కల్పించిన పౌర స్వేచ్ఛ ఉపయోగించుకుని ప్రజా సంఘాలు తమ కార్యకలాపాలు నిర్వహిస్తుంటే వాటిని నిషేధించి, ఆ సంఘాలకు నాయకత్వం వహించే వారిని అక్రమంగా అరెస్టు చేయడం దారుణమని విమర్శించారు. భీమా కోరేగావ్ కేసును అడ్డంపెట్టుకుని ఇప్పటికే 16 మంది మేధావులను వివిధ జైళ్ళలో నిర్బంధించారని వివరించారు. మన రాష్ట్రంలో కూడా ఇప్పుడు ఈచట్టం కింద విశాఖ, గుంటూరు జిల్లాల్లోనూ రెండు కేసులు నమోదు చేసి, 21 మందిని అక్రమంగా కేసుల్లో ఇరికించారని వారు పేర్కొన్నారు. చైతన్య మహిళా సంఘం నాయకులు రాజేశ్వరి, అమరుల బంధుమిత్రుల సంఘం నాయకురాలు అంజమ్మలను అక్రమంగా అరెస్టు చేయడాన్ని వారు ఖండించారు. పౌరహక్కుల,ప్రజా సంఘాల నాయకులపై ఈ చట్టం కింద కేసులు పెట్టడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇప్పటికే జైళ్ళలోవున్న ప్రొఫెసర్ సాయిబాబా, వరవరరావు తదితరులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మన రాష్ట్రంలో కొత్తగా నమోదు చేసిన రెండు కేసులను రద్దుచేసి, అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.. ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. కావున పూర్తిగా ఈ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో భవిష్యత్తులో ఈ ఉద్యమం మరింత ఉధృతమవుతుందని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఐ.ఎఫ్.టి.యు నాయకులు అప్పారావు, జి.రాంబాబు,వీరినాయుడు, కె.ఎన్.పి.యస్. నాయకులు రవీంద్ర, తదితరులు పాల్గొన్నారు.
ఎఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు, వేమన ఫౌండేషన్ నాయకులు ప్రసాద్ ఎమ్మార్పీఎస్ నాయకులు సిద్ధూ తదితరులు సంఘీభావం తెలియజేశారు.
Comments
Post a Comment