విచారణ లేకుండానే శిక్ష | ఎన్. వేణుగోపాల్

విచారణ లేకుండానే రెండేళ్ళ ‘శిక్ష కాని శిక్ష ’!
వి.వి. జైలు నిర్బంధానికి నేటితో రెండేళ్లు
ఎన్ వేణుగోపాల్

ఇన్ని వ్యవస్థలు ఇంత అమానుషంగా, అపసవ్యంగా వ్యవహరిస్తున్న ఈ కేసు అసలేమిటి? ఈ కేసులో ఇప్పటికి దాఖలైన పదిహేడువేల పేజీల చార్జిషీట్లు చదవడానికే నెలలో, సంవత్సరాలో పడుతుంది. సికిందరాబాద్ కుట్రకేసు, రాంనగర్ కుట్రకేసులాగ పద్నాలుగేళ్లు, పదిహేడేళ్లు విచారణ నడిచి చివరికి ప్రాసిక్యూషన్ ఏమీ రుజువు చేయలేక, కేసు కొట్టివేయబడి నిందితులు నిర్దోషులుగా విడుదల కావచ్చు. కాని ఈలోగా ఆరోపణలు రుజువు కాకుండానే, విచారణ లేకుండానే ప్రక్రియే శిక్షగా, శిక్ష కాని శిక్షగా, ఏళ్ల తరబడి ప్రజా మేధావులను నిర్బంధించి ఉంచడమే పాలకుల కోరిక.

వరవరరావును భీమా కోరేగాం కేసులో నిందితుడిగా చూపుతూ హైదరాబాద్ నుంచి మహారాష్ట్ర జైళ్లకు తరలించి నవంబర్ 17కు రెండు సంవత్సరాలు. ఆ కేసులో ఆయన కంటె ఆరు నెలల ముందు ఐదుగురిని, ఆయనతో పాటు నలుగురిని, ఆ తర్వాత మరొక ఏడుగురిని నిర్బంధించినా, కేసు మొదలై ముప్పై నాలుగు నెలలు, మొదటి అరెస్టులు జరిగి ముప్పై నెలలు, మొదటి చార్జిషీటు దాఖలు చేసి రెండు సంవత్సరాలు గడిచినా కేసు విచారణ అంగుళం కూడ ముందుకు జరగలేదు. మొదట పుణె యుఎపిఎ ప్రత్యేక కోర్టులో, ఆ తర్వాత ముంబాయి ఎన్ఐఎ ప్రత్యేక కోర్టులో అవే అవే అబద్ధాలు పదిహేడు వేల పేజీల చార్జిషీట్లు దాఖలయ్యాయి. బెయిల్ దరఖాస్తులు వరవరరావు విషయంలో ఐదు సార్లు, నిందితులందరినీ కలిపి చూస్తే కనీసం రెండు డజన్ల సార్లు నిరాకరణకు గురయ్యాయి. ‘జైలు అసాధారణ మినహాయింపు, బెయిల్ సాధారణ నియమం’ అనేది భారత న్యాయవ్యవస్థ మౌలిక సూత్రం అని 1977లో జస్టిస్ వి ఆర్ కృష్ణయ్యర్ ఇచ్చిన తీర్పును ఈ కేసులో ఒక్క న్యాయమూర్తి కూడ గౌరవించలేదు. ఈ కేసు భారత పాలనా వ్యవస్థల అపసవ్య వ్యవహారానికి ఒక ప్రతీక. 

వైద్య-, ఆరోగ్య వ్యవస్థ ఎంత అనారోగ్యంగా, జైలువ్యవస్థ ఎంత అమానుషంగా, న్యాయవ్యవస్థ ఎంత అన్యాయంగా నడుస్తున్నాయో వరవరరావు నిర్బంధమే చూపుతోంది. మొదట 2018 ఆగస్ట్ 28న అరెస్టు చేసి పుణె తీసుకుపోయినప్పటికీ, ఆ అరెస్టు చెల్లుతుందా లేదా అనే కేసులో సుప్రీంకోర్టు దాన్ని గృహనిర్బంధంగా మార్చి, కింది కోర్టులలో వ్యాజ్యాలు దాఖలు చేసుకొమ్మని ఆదేశించింది. అలా ట్రాన్సిట్ రిమాండును సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యంలో ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డా. బి శివశంకరరావు, అది అప్పటికే అమలయిపోయింది గనుక చెల్లుతుందా చెల్లదా అనే చర్చకు ఆస్కారం లేదని నవంబర్ 16న తీర్పు ఇచ్చారు. గాంధీ ఆస్పత్రి వైద్యుల బృందంతో వైద్యపరీక్షలు చేయించి, వరవరరావు ఏ ఆరోగ్య సమస్యలూ లేకుండా, తరలించడానికి తగిన సాధారణ ఆరోగ్య స్థితిలో ఉన్నారని, అది విచారణాంశం కాకపోయినా, తీర్పు చెప్పారు. 

ఆ తీర్పు ఫలితంగా ఆ మర్నాడు నవంబర్ 17న వరవరరావును పుణె తీసుకువెళ్లి, వారం రోజుల పోలీసు కస్టడీలో ఉంచగా ఆయనకు మొదటి ఆరోగ్య సమస్య వచ్చింది. ఊపిరి అందడం లేదనే సమస్యతో నవంబర్ 19న పుణెలో సాసూన్ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. తర్వాత నవంబర్ 26 నుంచి 2020 ఫిబ్రవరి 26 వరకు యరవాడ జైలులో గడిపిన పదిహేను నెలల కాలంలో ఎసిడిటీ, అజీర్ణ వ్యాధి, గుండె సంబంధమైన సమస్యలు మొదలయ్యాయి. రెండుసార్లు జైలు ఆస్పత్రిలో చికిత్స జరిగింది. ఒకసారి అత్యవసర పరిస్థితిలో సాసూన్ ఆస్పత్రిలో చేర్చారు. కనీసం నాలుగైదు సార్లు సాసూన్ ఆస్పత్రికి పరీక్షలకు తీసుకువెళ్లారు. కాని ఆ ఆస్పత్రి సూచనలను జైలు అధికారులు పాటించకపోవడంతో సమస్యలు మరింత జటిలమయ్యాయి. 

ఈ కేసులో సాక్ష్యాధారాలుగా చెపుతున్నవి రాజకీయ దురుద్దేశపూరిత కల్పనలు కావచ్చునని, పునర్విచారణ జరుపుతామని మహారాష్ట్రలో కొత్తగా అధికారానికి వచ్చిన ప్రభుత్వం ప్రకటించగానే హడావిడిగా కేంద్ర హోం మంత్రిత్వశాఖ జోక్యం చేసుకుని, కేసును నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఎ)కి బదలాయించింది. అలా ఆయనను, సహనిందితులను ఫిబ్రవరి 29న నవీ ముంబాయి లోని తలోజా జైలుకు మార్చారు. అప్పటి నుంచి ఆయన ఆరోగ్యస్థితి వేగంగా క్షీణించడం మొదలైంది. కిక్కిరిసిన ఖైదీలతో, అశుభ్రంగా, అనారోగ్యకరంగా ఉన్న ఈ జైలు వాతావరణం ఆయన ఆరోగ్యసమస్యలను పెచ్చరిల్లజేసింది. సరిగ్గా అదే సమయానికి కొవిడ్ లాక్‌డౌన్ వల్ల కుటుంబ ములాఖత్‌లు, న్యాయవాది ములాఖత్‌లు, ఉత్తరాలు, పత్రికలు, పుస్తకాలు, కోర్టు వాయిదాలు రద్దయ్యాయి. భౌతిక, శారీరక కారణాలతో పాటు మనుషులు కలవకపోవడం, చదువు, రాత లేకపోవడం ఆయన శారీరక, మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీశాయి. ఎసిడిటీ, పొత్తి కడుపులో నొప్పి, వాంతులు, అజీర్ణం పెరిగిపోయాయి. ఊపిరి అందకపోవడం, బలహీనత, మూత్ర విసర్జనలో ఇబ్బంది, ఒళ్లు వాపు మొదలయ్యాయి. శరీరంలో సోడియం, పొటాషియం తగ్గిపోయి, ఎలక్ట్రోలైట్ అసమతుల్యత వల్ల మతిమరపు, జ్ఞాపకశక్తి కోల్పోవడం, ఆలోచనాశక్తి సన్నగిల్లడం వంటి సమస్యలు తలెత్తాయి. 

చికిత్స కోసం బైటి ఆస్పత్రికి పంపినా, అర్ధాంతరంగా హడావిడిగా డిశ్చార్జి చేయించి మళ్లీ జైలుకు తరలించడంతో ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. రెండుమూడుసార్లు పడిపోవడం, సహఖైదీలను గుర్తు పట్టలేకపోవడం, తనంతట తాను నడవలేకపోవడం, తన పనులు తాను చేసుకోలేకపోవడం, అర్థరహితమైన గజిబిజి రాతలు రాయడం, ఎక్కడ ఉన్నారో స్పృహ లేకపోవడం, ఏవేవో ఊహించడం, మాట్లాడడం వంటివి సంభవించాయి. వీటిలో కొన్ని సంగతులు బైటపడి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆందోళన వ్యక్తమయ్యాక జూలై 13న ఆయనను జెజె ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షల్లో కొవిడ్ సోకిందని బైటపడి, నానావతి ఆస్పత్రికి తరలించారు. నలభై రోజుల తర్వాత, ఇంకా చికిత్స జరుగుతుండగానే డిశ్చార్జి చేయించి జైలుకు బదిలీ చేశారు. 

ఈ మొత్తం క్రమంలో 2018 నవంబర్ 26న యరవాడ జైలుకు వెళ్లినరోజు 68 కిలోలు ఉండిన మనిషి ఈ డిశ్చార్జి సమయానికి 50 కిలోలకు తగ్గిపోయారు. కొవిడ్ అనంతర బలహీనతలు, న్యూరోలాజికల్ సమస్యలతో పాటు మల మూత్ర విసర్జన మీద అదుపు లేకుండా పోయింది. డైపర్లు వాడాలని సూచించి, మూత్రనాళంలో కెథెటర్ పెట్టి, మూత్రం సంచి ఏర్పాటు చేశారు. ఆ స్థితిలో క్రమబద్ధమైన వైద్య పర్యవేక్షణ, కొన్నాళ్లకొకసారి నానావతిలో సమీక్ష జరగవలసి ఉండగా, అప్పటి నుంచి ఇవాళ్టి దాకా – అంటే 80 రోజుల దాకా, జైలు వైద్యులే చూస్తున్నారు తప్ప బైటి వైద్యుల దగ్గరికి తీసుకువెళ్లలేదు. మూత్రనాళంలో కెథెటర్ రెండు వారాల కన్నా ఎక్కువ ఉంటే ప్రాణాంతకమైన ఇన్ఫెక్షన్ వస్తుందని వైద్యశాస్త్ర పాఠ్యపుస్తకాలన్నీ చెపుతున్నప్పటికీ, 80 రోజుల దాకా కెథెటర్ మార్చలేదు. 

ఎనిమిదిన్నర నెలలుగా ఈ ఆరోగ్య స్థితికి జైలు అధికారులు, జైలు వైద్యులు, బైటి ఆస్పత్రుల వైద్యులు ప్రదర్శించిన నిర్లక్ష్యం కారణం కాగా, న్యాయవ్యవస్థ, ఎన్ఐఎ వ్యవహరించిన తీరు ప్రత్యేకంగా గమనించవలసినది. 

తలోజా జైలుకు వెళ్లేనాటికే ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తున్నది గనుక మార్చ్ 23న ముంబాయి అదనపు సెషన్స్ జడ్జి దగ్గర ఆరోగ్యం, వయసు, కొవిడ్ రాగల ప్రమాదం కారణాల మీద బెయిల్ దరఖాస్తు దాఖలయింది. ఆ దరఖాస్తును న్యాయమూర్తి మార్చ్ 30న కొట్టివేశారు. ఈ లోగా కిక్కిరిసిన జైళ్ల నుంచి కొవిడ్ ప్రమాదం ఉన్న ఖైదీలను విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. మహారాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికార కమిటీ నివేదిక 60 ఏళ్లు దాటినవారి విడుదలకు ఆంక్షలను సడలిస్తూ సిఫారసు చేసింది. ఆ సిఫారసు ఆధారంగా మే 15న మధ్యంతర బెయిల్ పిటిషన్ రెండోసారి దాఖలయింది. అది విచారణలో ఉండగానే మొదటిసారి జెజె ఆస్పత్రిలో చేర్చారు. కాని ఆయన ఆరోగ్యం బాగుందని కోర్టుకు చెప్పి బెయిల్ నిరాకరింపజేయడానికే హడావిడిగా డిశ్చార్జి చేశారు. అలాగే, ఆయన ఆరోగ్యం, కొవిడ్‌లను ‘స్వప్రయోజనం కొరకు వాడుకుంటున్నార’ని కూడ ఎన్ఐఎ వాదించింది. ఈసారి కూడ జూన్ 26న కోర్టు బెయిల్ నిరాకరించింది. 

ఆ నిరాకరణ మీద హైకోర్టుకు అప్పీలుకు వెళ్తే అది విచారణకు రావడానికే ఆరు వారాలు పట్టింది. ఈలోగా ఆరోగ్యం మరింత క్షీణించి ఆస్పత్రిలో చేరడం, నిజంగానే కొవిడ్ సోకడం కూడ జరిగాయి గాని హైకోర్టుకు ఇవేవీ పట్టలేదు. ఇద్దరు న్యాయమూర్తులు కేసు నుంచి విరమించుకున్నారు. వాయిదాల మీద వాయిదాలు పడ్డాయి. జూన్ 26న వేసిన పిటిషన్ అక్టోబర్ 13 దాకా విచారణకే రాలేదు. త్వరిత విచారణకు హైకోర్టునైనా అదేశించండి, లేదా మీరైనా బెయిల్ ఇవ్వండి అని సుప్రీంకోర్టుకు వెళితే, మళ్లీ హైకోర్టుకే వెళ్లమన్నారు. కొత్త పిటిషన్ వేసిన పది రోజులకు విచారణకు వచ్చి, వైద్య నివేదిక కోసం ఐదు రోజులు వాయిదా వేశారు.

ఇన్ని వ్యవస్థలు ఇంత అమానుషంగా, అపసవ్యంగా వ్యవహరిస్తున్న ఈ కేసు అసలేమిటి? ప్రచారసాధనాల్లో ఎన్నెన్ని అభూతకల్పనలు ప్రచారమైనప్పటికీ, చార్జిషీట్లలో చేసిన నేరారోపణలకు ‘నిస్సందేహమైన’ సాక్ష్యాధారాలుంటే మాత్రమే నిలుస్తాయి. ఈ కేసులో ఇప్పటికి 2018 నవంబర్ 15న ఐదువేల పేజీలు, 2019 ఫిబ్రవరి 21న రెండువేల పేజీలు, 2020 అక్టోబర్ 9న పదివేల పేజీల చొప్పున మూడు చార్జిషీట్లు దాఖలు చేశారు. మొదటి రెండు చార్జిషీట్లను పుణె పోలీసులు, మూడో చార్జిషీట్‌ను ఎన్ఐఎ తయారు చేశారు. ఈ పదిహేడువేల పేజీల చార్జిషీట్లు చదవడానికే నెలలో, సంవత్సరాలో పడుతుంది. ఇక సాక్షుల విచారణ, ప్రాసిక్యూషన్ వాదనలు, వాటికి డిఫెన్స్ ప్రతివాదనలు, మధ్యలో కోర్టు సెలవులు, చివరికి న్యాయమూర్తుల నిర్ధారణలతో తీర్పు వంటి సుదీర్ఘ ప్రక్రియ మరెన్ని సంవత్సరాలు తీసుకుంటుందో తెలియదు. సికిందరాబాద్ కుట్రకేసు, రాంనగర్ కుట్రకేసులాగ పధ్నాలుగేళ్లు, పదిహేడేళ్లు విచారణ నడిచి చివరికి ప్రాసిక్యూషన్ ఏమీ రుజువు చేయలేక, కేసు కొట్టివేయబడి నిందితులు నిర్దోషులుగా విడుదల కావచ్చు. కాని ఈలోగా ఆరోపణలు రుజువు కాకుండానే, విచారణ లేకుండానే ప్రక్రియే శిక్షగా, శిక్ష కాని శిక్షగా, ఏళ్ల తరబడి ప్రజా మేధావులను నిర్బంధించి ఉంచడమే పాలకుల కోరిక. 

చార్జిషీట్లు ఎంత హాస్యాస్పదంగా ఉన్నాయో చెప్పాలంటే ఒక గ్రంథం అవుతుంది. కొత్త చార్జిషీట్‌లో మార్కెట్‌లో దొరికే పుస్తకాలు, అరుణతార వంటి పత్రికలు, ఆంధ్రజ్యోతి వంటి పత్రికలలో అచ్చయిన వ్యాసాలు ఇంటర్నెట్‌లో దొరికే విప్లవోద్యమ పత్రికలు, పుస్తకాలు వేల పేజీలు కుప్పపోశారు. ‘తిలకాష్ఠ మహిషబంధనం’ చూపి భయపెట్టడానికే తప్ప అవి మరెందుకూ పనికిరావు. కాకతీయ విశ్వవిద్యాలయ తెలుగు శాఖలో చేసిన విస్తరణోపన్యాసం వంటి ఉపన్యాసాలు, సంస్మరణ వ్యాసాలు వంటివి తప్ప ఏదైనా ఒక నేరానికి సంబంధించిన సాక్ష్యాధారాలేమీ లేవు. ‘‘కుట్ర’’ సాక్ష్యంగా చూపుతున్న ఉత్తరాలు అసలైనవేనా, కల్పితమా అనేదానిపై ఇప్పటికే ఎందరో వ్యాఖ్యానించి ఉన్నారు. 

ఇది వరవరరావు అనే ఒక వ్యక్తి గురించి మాత్రమే కాదు, ఈ దేశంలో సాగుతున్న పాలనారీతి గురించి. పౌరుల నిరంతర జాగరూకత అనే మూల్యం ద్వారా మాత్రమే పరిరక్షించుకోగలమని చెప్పే ప్రజాస్వామ్యం గురించి.

Comments