ఆదివాసులపై ఊపా | ఎన్. నారాయణరావ్


ఆదివాసీల హక్కులను సంరక్షించడం పాలకుల నైతిక బాధ్యత. రాజ్యాంగం నిర్దేశించిన ఈ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించినప్పుడే తమకు ఆదివాసీల, సకల సామాజిక వర్గాల మద్దతు సమకూరగలదనే సత్యాన్ని అధికారంలో ఉన్న వారు విస్మరించకూడదు.

సమాజంలోని అన్యాయాలను, ప్రభుత్వాల బాధ్యతారాహిత్యాన్ని ప్రశ్నించడం నేరమా? ప్రశ్నిస్తున్నవారిని, ముఖ్యంగా ఆదివాసీలను నక్సలైట్లుగా, మావోయిస్టులుగా పరిగణించడం పాలకులకు ఒక ఆనవాయితీ అయిపోయింది. 

ప్రజాసంఘాలు, హక్కుల ఉద్యమాలలో పని చేస్తున్న కారణంగా పలువురు ఆదివాసీలు నిత్యం తీవ్ర నిర్బంధానికి గురవుతున్నారు. వారిపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. ఇటీవల ఆదిలాబాద్, ఆసిఫాబాద్, ఖమ్మం, భద్రాది కొత్త గూడెం, మంచిర్యాల జిల్లాలకు చెందిన 17 మంది ఆదివాసీలపై ఉపా కేసులు మోపారు. ఫలితంగా వారు అక్రమ నిర్బంధంలో మగ్గుతున్నారు. ఈ తప్పుడు కేసులు ఎత్తివేసి ఆదివాసీలను బేషరతుగా విడుదల చేయాలి. అడవిలో, అడవినానుకొని మైదాన ప్రాంతాల్లో జీవించడం, ఆదివాసుల నేరంగా భావిస్తున్నది ప్రభుత్వం. ఎన్నోసార్లు గూడాలు, గ్రామాలు ప్రభుత్వాల కాఠిన్యానికి ఆహుతైపోయాయి. నేటికీ ఆదివాసీలను అభద్రత వెన్నాడుతూనే ఉంది. 

అభయారణ్యాలకు ప్రభుత్వం అడవిని కేటాయిస్తున్నది కాని, ఆదివాసీ జీవితాలకు ఎలాంటి భద్రత కల్పించడం లేదు. ఆదివాసీ విద్యార్థి సంఘ నేతలుగా, గోండ్వానా సంఘర్షణ సమితి నాయకుడిగా, తెలంగాణ విద్యార్థి వేదిక నాయకులుగా, హక్కుల సంఘాల నేతలుగా, ఈ ఆదివాసీలు తమ తమ కార్యాచరణ కొనసాగిస్తున్నారు. ఈ ఆదివాసీలపై తప్పుడు కేసును బనాయించింది ప్రభుత్వం. పోలీసులు ప్రకటించిన ఈ 17 మందిలో ఒక్కరు మాత్రమే గైర్‌ ఆదివాసీ. మిగతా వాళ్ళందరూ ఆదివాసీలే. గత రెండు మూడు నెలలుగా ఆదివాసీ ప్రాంతాల్లో జరుగుతున్న బూటకపు ఎన్‌కౌంటర్లపై ఆదివాసులుగా ఎక్కడా స్పందిస్తారని భయపడి, ఆదివాసీ సంఘాల నాయకులను స్ధానిక పోలీసులు పోలీస్‌ స్టేషన్లకు పిలిపించుకొని తీవ్రస్ధాయిలో హెచ్చరికలకు గురిచేయడం జరిగింది. వీరిలో కొంత మంది బిజెపి ఎం.పి. సోయం బాపూరావుతో కూడా తమ బాధను చెప్పుకుంటూనే ఉన్నారు. గతంలో ఎం.ఎల్‌.ఏ. కోనేరు కోనప్ప అప్పటి హోంశాఖా మంత్రి నాయిని నరసింహారెడ్డిని కలిసి హక్కుల సంఘాల విజ్ఞాపన పత్రాన్ని ఇచ్చారు. ఆదివాసీల అక్రమ నిర్బంధాలను వ్యతిరేకిస్తూ ఆయన పలుమార్లు కాగజ్ నగర్ లో పత్రికా సమావేశాలు నిర్వహించారు.

నేడు ఆదివాసీ ప్రాంతాలన్నీ గులాబీమయం కావాలని ఆదివాసీ ప్రాంతాల్లో తీవ్రమైన నిర్భంధాన్ని కొనసాగిస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారులు ఆదివాసీ ప్రాంతాల్లో పర్యటించడంతో స్ధానికంగా ఆదివాసీలపై పూర్తి స్ధాయి నిర్బంధం అమలవుతున్న స్థితి ఏర్పడింది. ఇది కేవలం తెలంగాణలోని ఆదివాసీ ప్రాంతాలే కాదు, ఆంధ్రా ప్రాంతంలోని ఆదివాసి ప్రాంతాల్లో కూడా ఇలాంటి స్థితే కొనసాగుతున్నది. ఆదివాసీలంటే మావోయిస్టులని, వారితో కచ్చితంగా సంబంధాలు ఉంటాయనే నెపంతో వారిపై ఎంతటి నిర్బంధాన్నైనా అమలుచేసినా చెల్లుతుందని పాలకులు భావించడం దురదృష్టకరం. తెలుగు రాష్ట్రాల ప్రజలు నిర్బంధాలను కాకుండా శాంతిని కోరుకుంటున్నారు. ఆదివాసీ అడవీ ప్రాంతాల్లో నిత్యం ఏదో ఒక మిలటరీ ఆపరేషన్‌ కొనసాగుతూనే ఉంది. సల్వాజుడుం, ఆపరేషన్‌ గ్రీన్‌ హంట్‌, మిషన్‌- 2016, ఆపరేషన్‌ సమాధాన్‌, ఆపరేషన్‌ ప్రహార్‌లు కొనసాగాయి, కొనసాగుతూనే ఉన్నాయి. ‘జగ్‌లాగ్‌’ లాంటి యువ న్యాయవాదుల గ్రూపు కూడా న్యాయస్ధానాల్లో పనిచేయలేని స్థితిని ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి. వరంగల్‌ పోలీసులు తాడ్వాయిలో నమోదు చేసిన ఉపా కేసులో చాలా మంది హక్కుల సంఘాలతో ఉంటూ ఆదివాసి హక్కుల కోసం నిత్యం పోరాడుతున్న వాళ్ళే. ఆదిలాబాద్‌ జిల్లా కోలాంగోంది గ్రామాన్ని ప్రభుత్వం విధ్వంసం చేసినపుడు ఇందులో చాలా మంది వారికి మద్దతుగా నిలబడ్డవాళ్ళే.

ఏళ్ళు గడుస్తున్నా కోలాంగోంది ఆదివాసులకు న్యాయం జరగడంలేదు. తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర కలిగి ఉన్న ఈ ఆదివాసీలు సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో జీవితాలను మెరుగు పరచుకోవాలనుకుంటున్నారు. అయితే ప్రభుత్వం నిర్బంధం పేరుతో ఆదివాసీలకు జీవితమే లేకుండా చేస్తున్నది. ప్రత్యేక రాష్ట్ర సాధన ప్రతిఫలం కనబడక మళ్ళీ ఎన్నో అనుమానాలకు నిత్యం పోలీసు నిర్బంధాలకు గురయ్యే పరిస్థితిని తట్టుకోలేకపోతున్నారు. ఆదివాసీల హక్కులను సంరక్షించడం పాలకుల నైతిక బాధ్యత. రాజ్యాంగం నిర్దేశించిన ఈ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించినప్పుడే తమకు ఆదివాసీల, సకల సామాజిక వర్గాల మద్దతు సమకూరగలదనే సత్యాన్ని అధికారంలో ఉన్న వారు విస్మరించకూడదు. 

-ఎన్‌. నారాయణ రావు,
ప్రధాన కార్యదర్శి, పౌర హక్కుల సంఘం, తెలంగాణ

Comments