ప్రజల హక్కుల భావన ని పటిష్టపరచిన హక్కుల ఉద్యమ ధ్రువతార ప్రొఫెసర్ శేపూరి శేషయ్యకి హక్కుల ఉద్యమ జోహార్లు
పౌర హక్కుల సంఘ CLC ఉ భయ తెలుగు రాష్ట్రాల కన్వీనర్, CDRO జాతీయ నాయకులు, సహచర ఉద్యమ మిత్రులు ప్రొఫెసర్ శేషయ్య సర్ అక్టోబర్ 10,2020 కోవిడ్ కారణం గా హైద్రాబాద్ ఏఐజీ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ రాత్రి 8.30 ని మరణించారు. ఆయన మరణ వార్త రాష్ట్ర ప్రధాన కార్యదార్శి చిలుకా చంద్రశేఖర్ ద్వారా తెలిసింది. దిగ్భ్రాంతికి గురైనాను.మా ఇంట్లో మల్లిక కి,పిల్లలకు చెప్పాను. చాలా భాధపడ్డారూ. మా కుటుంభం తో పరిచయం ఉన్న మిత్రులు. వ్యక్తి గతంగా మా కుటుంబం అంటే ఆయనకు చాలా ఇష్టం. పౌర హక్కుల సంఘం మహాసభలకు,కార్యక్రమాలకు పిల్లలతో సహా హాజరు అవుతుంటే ఎంతో సంతోశించేవారు. మన సభ్యులు అంత నీలా,మదనపల్లి నాగేశ్వరరావు ల కుటుంబాలతో వస్తే మనకు సభ్యులు సమస్య ఉండదు అని నవ్వుతూ మా కుటుంబం తో మాట్లాడేవారు. శశికళ గార్కి నెల్లూరు సభల్లో మల్లికను ,పిల్లలను ఆయనే స్వయం గా పరిచయం చేశారు.ఎంతో స్నేహశీలి. మృదుభాషి. ప్రొఫెసర్ శేపూరి శేషయ్య గారు ఆయన ఆలోచనలతో నామనస్సు ఆయన మరణం సంస్థ గురించి కొంత కలవరపాటు కి గురయింది.
దిశ,దశ నిర్దేశం చేసే పెద్ద దిక్కు ని శేషయ్య గారి మరణం తో పౌర హక్కుల సంఘం కోల్పోయింది. ఎవరు ఏమి అనుకున్నా ఇది వాస్తవం. ఐతే సంస్థ వ్యక్తుల పై ఆధారపడి లేదని మనసుని కుదుట పరుచుకున్నాను. అంత్యక్రియలు కి హాజరై కడసారి చూడాలని ప్రయాణం ఏర్పాట్లు చిట్టిబాబు,నేను,నక్కవెంకట రత్నం, కాకినాడ నుండి గంగరాజు తీసుకు వచ్చిన ఇన్నోవా కారు లో భల్దేరినాము.కాపవరం సెంటర్ వద్ద ఆగివున్న టిప్పర్ ని గుద్దినది. కొద్దిగా స్లో లో వెళ్లి గుద్దటం వలన మేము అందరం ఆప్రమాదం నుండి బయట పడ్డాము. రాష్ట్ర అధ్యక్షుడు చిట్టిబాబు, పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు, PDM గంగరాజు(డ్రైవింగ్) కాకినాడ, నేను కారులో ఉన్నాము. కారు బాయినెట్ దెబ్బతిన్నది. మా ప్రయాణం రద్దు అయింది. చాలా బాధ గా అందరం వెనక్కి వచ్చాము. వాస్తవానికి నేను హాస్పిటల్ నుండి డిశ్చార్జి అయిన రెండో రోజునే శేషయ్య గారి మరణం మాప్రయాణం. నేను తణుకు హాస్పిటల్ కి వెళ్లేముందు సర్, నేను ఫోన్ లో మాట్లాడుకున్నాము. చంద్ర శేఖర్ సర్ కి జ్వరం వచ్చింది అని చేప్పితే నేను ఫోన్ చేసి జ్వరం అంట ఎలా ఉన్నారు సర్ అని పలకరించాను.నాది జనరల్ ఫీవర్ నీవు జాగ్రత్త డెంగ్యూ ఫీవర్ అని అన్నారు.నాకు పర్లేదు మీరు కోవిడ్ టెస్ట్ చేయించండి సర్ అన్నాను.నీరసం గా ఉంది ఉంటాను అన్నారు.జాగ్రత్త సర్ అన్నాను ఆ మాటలే నాకు, ఆయనకు ఆఖరి మాటలు అవుతాయి అని ఊహించలేదు. నేను తణుకు హాస్పిటలకి వెళ్ళటానికి ముందు జరిగిన ఆఖరి ఫోన్ సంభాషణ.
ప్రొఫెసర్ శేషయ్య గారిని మొదటిసారి కరీంనగర్ లో జరిగిన ఉమ్మడి ఆంద్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం మహాసభలు లో మొదటిసారి చూశాను.ఆ మహాసభల్లో చురుకైన పాత్ర శేషయ్య గారు పోషించారు. 1991 అయి ఉండవచును. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నుండి ప్రతినిధులు గా 5గురము హాజరైనాము.Nvs, bv, నున్నా,నేను, కె వి నాగరాజులం హాజరైనాము. ఆ సభలలో నే పౌర హక్కుల సంఘానికి కాబోయే నేత గా కనిపించారు. ఆ తర్వాత 1998 లో హైదరాబాద్ మహాసభలో సంక్షోభ పరిస్తితుల్లో పౌర హక్కుల సంఘానికి ప్రధాన కార్యదర్శి గా భాద్యత లు చేపట్టినారు. ఆనాటి సభలో మానవ హక్కుల భావనతో బాల గోపాల్ గారు తదితర ముఖ్యులు సంస్థ నుండి విడిపోయారు.పౌర,ప్రజాస్వామిక హక్కుల కోసం ప్రజలు హక్కుల కేంద్రం గా పని చేయడానికి బాల గోపాల్ సంస్థ నుండి విడిపడిన తర్వాత మిగిలినవారమంత అమరుడు శేషయ్య నాయకత్వం లో పని చేయటానికి సిద్ధమయ్యాము. బాలగోపాల్ తదితరులు మానవుడు కేంద్రం గా హక్కుల ఉద్యమం నిర్మాణానికి మానవ హక్కుల సంస్థ ను ఏర్పాటు చేసుకున్నారు. 1.పౌర హక్కులు 2.మానవ హక్కులు 3.ప్రజాస్వామిక హక్కులకు ఉన్న తేడాను ప్రజలకు వివరించి చైతన్య పరచి పౌర హక్కుల అవగాహన ని విస్తృతంగా ప్రచారం చేయాలని ఆనాటి మా రాష్ట్ర కమిటీ తీవ్రంగా చర్చించి నిర్ణయించడం జరిగింది. ఆ నిర్ణయం అమలుకు సంస్థ శ్రేణులు తో అన్ని జిల్లాల్లో అధ్యయన తరగతులు పేరుతో ప్రొఫెసర్ శేషయ్య గారు అమలుచేయించారు.
ఎంతో పట్టుదలతో అదే సమయంలో రాష్ట్రం అంతా తిరిగి జిల్లాల నిర్మాణం పైన దృష్టి పెట్టి కొత్తజిల్లా నిర్మాణాలను చేశారు. బాల గోపాల్ తదితరులు సంఘం నుండి వెళ్లిపోయిన తర్వాత సమిష్టిగా సంస్థ కార్యాచరణ ని రూపొందించి అమలు చేయించడం లో శేషయ్య గారు సంస్థ భాద్యులు గా సఫలీకృతం అయ్యారు. దానితో సంస్థ పైన ప్రజల్లో విశ్వాసం,ఆదరణ పెరిగింది. అంతే కాక ఆయన నాయకత్వం లో సంస్థ హక్కుల దృక్పధం అవగాహనని ప్రజల్లోకి విస్తృతంగా రాష్ట్ర కమిటీ తీసుకుని వెళ్లకలిగింది. సంస్థ పని ఐ పోయింది అనిఅనుకున్న వాళ్లందరికీ ఆచరణ తో ఆయాన సమాధానం చెప్పారు.
1998 లో శేషయ్య గారు భాద్యతలు చేపట్టిన తర్వాత సంస్థ లో కార్యకర్తలు కి హక్కులు అవగాహన పెంపొందించటానికి ప్రణాళిక బద్దం గా, సమిష్టి పని విధానం అమలుకు చేసిన కృషి మరువ లేనిది. ప్రతి విషయం రాష్ట్ర కమిటీ దృష్టి కి తీసుకుని వచ్చేవారు. ఆయన పని విధానం,విశ్లేషణ ఒక ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉండేది. స్వతహాగా ప్రొఫెసర్ కావటం వలన మెరుగైన పని పద్ధతుల కోసం నిత్యం ఆలోచించేవారు. ఆయన భాద్యతలు చేపట్టేనాటికి రాజకీయ పరిభాష సంస్థ క్యాడర్ లో ఎక్కువగా ఉండేది. దాన్ని సరిచేయటానికి హక్కుల పరిభాషలో నే మాట్లాలని క్యాడర్ ని ఆదేశించేవారు.హక్కుల కార్యకర్తలు హక్కుల దృక్పధంతో హక్కుల పరిభాషలో నే మాట్లాడాలి. రాయాలి అని బలం గా పట్టుపట్టేవారు. ఒక్కొక్కసారి బుచ్చారెడ్డి గారి లాంటి వారిని మీరు ఎక్కడ ఉంటారో తేల్చుకోండి అని అనేవారు. అమరుడు పురుషోత్తం మాటను గౌరవించేవారు. ప్రొఫెసర్ హరగోపాల్ గారి సూచనలను పాటించేవారు. ప్రొఫెసర్ ఖాన్ గారు అంటే చాలా ఇష్టం. ఆనాటి మా రాష్ట్ర,జిల్లా కమిటీలు ప్రజల హక్కుల కోసం పనిచేయటానికి మెరికలు లాంటి శ్రేణులతో నిర్మితమైనది. నిర్మాణం,సంస్థ కార్యక్రమాలు 2సంవత్సరాల లలోనే వేగవంతమైనవి.సంస్థ ఉన్నతి భారీ గా పెరిగింది. ప్రజలకు మరింత చేరువ అయింది. శేషయ్య గారి నాయకత్వం విజయవంతం అయ్యింది. సహజం గానే రాజ్యం నిర్బంధాన్ని, అణచివేత ను ప్రశ్నిస్తూ పోరాడే ఏ సంఘం మీద అయిన రాజ్యం డేగ కళ్ళు పడతాయి. Apclc మీద రాజ్యం రా కసి చూపు పడింది. హక్కుల ఉద్యమ ముద్దుబిడ్డ పురుషోత్తం ని బలిగొంది.కిరాయి హంతక ముఠాలు ని ఉపయోగించి వేటకొడవళ్ళతో నరికించి పురుషోత్తం ని రాజ్యం చంపించింది. అప్పటికి మిత్రుడు పురుషోత్తం హైదరాబాద్ లో హైకోర్టు న్యాయవాది గా పని చేస్తున్నాడు.తక్కువ వ్యవధి లొనే డజనునుకి పైగా బూటకపు ఎన్కౌంటర్ కేసుల్లో రాజ్యాన్ని ప్రశ్నిస్తూ కేసులు వేశారు.ఆ కేసులు ఫైల్ చేయటం లో అమరుడు శేషయ్య గారి కృషి ఉన్నది.
నెల వ్యవధిలోనే పురుషోత్తం సభ నిర్వహిస్తున్న ఉపాద్యాయుడు మిత్రుడు ఆజం ఆలీ ని రాజ్యం చంపేసింది. నయీమ్ గ్యాంగ్ ని ఉపయోగించింది.పౌర హక్కుల ఉద్యమాన్ని భయబ్రాంతులకు రాజ్యం గురిచేసింది.అయిన సంస్థ నాయకుడు శేషయ్య గారు ధైర్యం కోల్పోకుండా నిలబడ్డారు. పౌర హక్కుల ఉద్యమాన్ని నిలబెట్టినారు. మా రాష్ట్ర కమిటీ మొత్తం ఆయనకు వెన్నంటి నిలబడడం జరిగింది. నిలబడి ఆనాడు రాజ్యాన్ని ప్రశ్నించాము.అలా ప్రశ్నించటం లో అమరుడు శేషయ్య ముందుపీఠిన నిలబడ్డారు. అదే ఈ రోజున పౌర హక్కుల సంఘం ప్రత్యేక కతను,విశిష్టత లను సమాజం ముందు గర్వంగా తలెత్తుకునేటట్లు చేసింది. ఎన్నిసార్లు తెగ్గోసిన పౌరహక్కుల ఉద్యమం చిగురిస్తూనే ఉంటుంది అన్న అమరుడు ఆజం అలీ మాటలు మా చెవుల్లో ఎప్పటికి మారుమ్రోగుతూనే ఉంటాయి.ఆ తర్వాత శేషయ్య సర్ ఏ మీటింగ్లో మాట్లాడిన ఆజం అలీ ఈ కొటేషన్ తోనే మాట్లాడేవారు. జీవించే హక్కు కోసం మరింత బలం గా ఉద్యమించే చైతన్యాన్ని పురుషోత్తం, ఆజం అలీ ల అమరత్వం నుండి ఆనాటి పౌర హక్కుల ఉద్యమం పొందింది. మరో వైపు ప్రజా ఉద్యమం పై రాజ్యం అణచివేత పెరిగింది. ప్రశ్నించే ప్రతి వారి పైన రాజ్యం నిర్బంధం ముమ్మరమైనది. కొయ్యురులో నల్లా ఆదిరెడ్డి,శ్యాం ,నల్లమలలో మాధవన్న బూటకపు ఎన్కౌంటర్ తదితరులు రాజ్యం హత్యలు చేయటం శేషయ్య గారు సంస్థ భాద్యులు గా ఉన్నపుడే జరిగాయి.ఈ ఎన్కౌంటర్లు గుట్టువిప్పి ఈ బూటకపు ఎన్కౌంటర్ల పోలీస్ కహానీల ను సమాజం ముందు కు తీసుకు రావడంలో శేషయ్య గారి పాత్ర మరువలేనిది. మాధవన్ ఎన్కౌంటర్ లో జమ్మి చెట్టుకు నోరుంటే అనే పుస్తకం ప్రచురణలో శేషయ్య గారు కీలకపాత్ర పోషించారు.గ్రీన్ టైగర్,పల్నాడు టైగర్ పేరుతో ఆయన్ని హతమారుస్తాం అని బెదిరించిన లొంగలేదు. ఆయన పైన ,ఆయన ఇంటి పైన దాడిచేసి కారునితగలపెట్టిన,ఇంటికి నిప్పు పెట్టిన బెదరలేదు.
ప్రజలకు చట్టబద్ద పాలన కావాలని, రాజ్యాంగ హక్కులను,చట్టబద్ద హక్కులను ప్రజల పక్షాన నిలబడి గొంతులేని వారికోసం గొంతు కై ఆయన రాజ్యాన్ని మరింత పదునైన కలమనే ఆయుధం తో ప్రశ్నించేవాడు. ఆయన ప్రధాన కార్యదర్శి గా పనిచేసిన 12 సంవత్సరాలు చాలా కీలకమైన సమయం. ఆయన పొర హక్కుల ఉద్యమ అభివృద్ధి కి చాలా క్రియాశీలక పాత్ర పోషించారు.
అవి.1సంస్థ కార్యక్రమాలు రూపొందించడం లో 2 సంస్థ నిర్మాణం, 3.హక్కులు దృక్పధం, అవగాహన పెంపొందించడం.4.CDRO నిర్మాణం, APCLC ను జాతీయ స్థాయిలో కి తీసుకుని వెళ్లడం. CDRO ఆవిర్భావ సమావేశం కి, కార్యవర్గ సమావేశాలకు మమ్మల్ని ఆఫీస్ బేరర్స్ తీసుకుని వెళ్లి భాగస్వాములను చేయటం 5.సంస్థ లో మైనారిటీ ల అభిప్రాయాలను హక్కుల అవగాహన పరస్పరం పెంపొందించే విధం గా ప్రజాస్వామిక దృక్పధం తో అంతర్గతచర్చను సుదీర్ఘ కాలం కొసాగించటం ప్రధానం గా చెప్పుకొనవచ్చును.
ఈ కాలం లొనే ప్రజలు జీవించే హక్కుల కోసం పౌరహక్కుల కోసం సంస్థ విస్తృతం గా పని చేసింది. ఉద్యమకారులు ఎన్కౌంటర్ అయినప్పుడు మాత్రమే కాకుండా పోలీస్ కస్టడీ, జైలు మరణాలు, అనారోగ్యమరణాలు పైనఆయన భాద్యుడు గా ఉన్న కాలం లొనే ఎక్కువ కార్యక్రమాలు చేయటం జరిగింది.రాయల సీమ ప్రజల హక్కుల కోసం, కరువు సమస్య పైన, రాయల సీమకు జలవనరుల కావాలని,త్రాగునీరు, సాగునీరు కోసం జరిగిన అన్ని రకాల ఉద్యమా లలోను ఆయన భాగస్వామ్యం ఆయినారు. రాయల సీమ అంటే ఆయనకు ప్రాణం.అమితమైన ప్రేమ, మమకారం ఉండేది. ప్రజాస్వామిక తెలంగాణ కి మద్ద తు గా సంస్థ నిలబడి పనిచేసింది. తెలంగాణ ఏర్పాటు ఉద్యమ విషయం లో ఆయన చొరవ ను విస్మరించ లేము. ఆయన దళితులు పై దాడులు ఘటనలలో, ఆపరేషన్ గ్రీన్ హంట్ పేరు తో ఆదివాసీల ఊచ కోతకు వ్యతిరేఖంగా , స్త్రీలపై హత్యలు, అత్యాచారాలు ఘటనల్లో, మైనార్టీ ల పై దాడులు నిరసిస్తూ, సోంపేట,కాకరపల్లి,కొవ్వాడ అను విద్యుత్, పోలవరం ప్రాజెక్ట్, కొల్లేరు పర్యావరణం లాంటి సమస్యల పైన,గుత్తి కోయల సమస్యల పైన, జాతుల సమస్య పైన కశ్మీర్ లో యువత ఊచకోత పైన ప్రజలు జీవించే హక్కుల కోసం ఆయన హయాంలో, ఆయన దిశా నిర్ధేశం లో విస్తృతం గా ప్రజల హక్కుల కోసం పౌర హక్కుల కోసం మారాష్ట్ర కమిటీ పని చేయటం జరిగింది. ఒక్క సమస్య పైన కాదు రాజ్యం చర్యలు వలన ప్రజలు జీవించే హక్కులు కి విఘాతం కలిగించే ప్రతి అంశం పైన సంస్థ కార్యాచరణను విస్తృతపరచటం జరిగింది.
ఒక్క ముక్కలో చెప్పాలంటే విశాలమైన బలమైన పౌరహక్కుల ఉద్యమ కర్తవ్యం గా ఆయన భాద్యుడు గా ఉన్న కాలంలో పౌరహక్కుల సంఘంగా పని చేశాము. ఆయన మరణం పౌరహక్కుల ఉద్యమానికి, ప్రజాస్వామిక ఉద్యమాలకు తీరని లోటు. నష్టం.హక్కులనేత, మిత్రులు ,ఉద్యమ సహచరులు, పౌర,ప్రజాస్వామిక హక్కుల భావనకు ఇండియన్ సివిల్ రైట్స్ లెజెండ్ ప్రొఫెసర్ శేషయ్య గార్కి భాధతప్త హృదయంతో కన్నీటి జోహార్లు.వారికి ప్రగాఢమైన సంతాపాన్ని, శశికళ అక్కకు, ఆయన కుమారుడు అరుణ్ కి సానుభూతిని నా తరపున,మాకుటుంబం తరుపున,పౌరహక్కుల సంఘం తరపున తెలియచేస్తున్నాను.
జోహార్ హక్కుల ఉద్యమ నేత
ప్రొఫెసర్ శేషయ్య.
పౌరహక్కుల సంఘం CLC
ఆంధ్రప్రదేశ్ కమిటీ
ఉపాధ్యక్షుడు
నంబూరి. శ్రీమన్నారాయణ.
Comments
Post a Comment