రాయలసీమ వెనుకబాటుతనం తెలిసినవాడుగా ప్రొ. శేషయ్య తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి పూర్తి మద్దతు ప్రకటించాడు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గౌరవించడం పౌరహక్కుల ఉద్యమ ప్రజాస్వామిక స్వభావానికి నిదర్శనమని భావించేవాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రెండు ప్రాంతాల ఉద్యమానికి శేషయ్యను సమన్వయకర్తగా ఎన్నుకోవడంలోనే ఆయన విశిష్ట వ్యక్తిత్వం చూడవచ్చు.
కరోనా మహమ్మారి ప్రపంచంలో ఒక విలయాన్ని సృష్టించి విలువైన మనుషుల ప్రాణాలను హరిస్తున్నది. అలాంటి చాలా విలువైన మనిషి, పౌరహక్కుల ఉద్యమ నేత, భారత రాజ్యాంగం మీద లోతైన అవగాహన ఉన్న న్యాయశాస్త్ర కోవిదుడు ప్రొఫెసర్ శేషయ్య. రాజ్యాంగంపై ఆయన ప్రామాణిక పరిశోధనలు చేశారు. న్యాయశాస్త్ర జ్ఞానం, సామాజిక చైతన్యం ద్వారా సమాజ జీవిత ప్రజాస్వామ్యీకరణకు దాదాపు నాలుగున్నర దశాబ్దాల కాలం విరామం లేకుండా కృషి చేసిన మేధావి ప్రొ. శేషయ్య. ఇప్పుడు ఆయన మన మధ్యన లేకపోవడం వ్యక్తిగతంగానే కాక, పౌరహక్కుల ఉద్యమానికి, మొత్తం తెలుగు సమాజానికి తీరని లోటు.
న్యాయశాస్త్ర పరిశోధన వలన, హక్కుల ఆచరణ వల్ల పెరిగిన లోచూపుతో రాజ్యాంగంలోని సంక్లిష్ట అంశాలను వివరిస్తూ, సమాజాన్ని నిరంతరం ఎడ్యుకేట్ చేసే కృషిని శేషయ్య అలసిపోకుండా చేసాడు. ఆరోగ్యం సహకరించకున్నా పట్టువదలకుండ పని చేసాడు. హైదరాబాద్ విశ్వవిద్యాలయంలోని మానవ హక్కుల అధ్యయన కేంద్రానికి ప్రతి సంవత్సరం అతిథి ప్రొఫెసర్‌గా వచ్చి ‘రాజ్యాంగం: బలహీన వర్గాలు’ అనే అంశమే కాక గత ఏడు దశాబ్దాలుగా వచ్చిన కొత్త చట్టాలను చాలా లోతుగా విమర్శనాత్మకంగా వివరించేవాడు. ఆయనకు సామాజిక సంక్లిష్టతపై అలాగే వ్యవస్థాగత పరిమితులు, వైరుధ్యాలపై సమగ్ర అవగాహన ఉండడం వలన విద్యార్థులను చాలా లోతైన చర్చలోకి తీసుకు వెళ్లేవాడు. అలాగే ఈ పాఠ్యాంశాల మీద మేము విద్యార్థుల కొరకై ప్రచురించిన స్టడీ మెటీరియల్‌లో విలువైన వ్యాసాలు వ్రాసారు. ఇప్పటికీ ఆయన వ్రాసిన పాఠాలే ఈ కేంద్రం ఉపయోగిస్తున్నది. బహుశా భారతదేశంలో రాజ్యాంగం మీద ఇంత విమర్శనాత్మక అవగాహన ఉన్న లా ప్రొఫెసర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు.
ప్రొ. శేషయ్యకి మార్క్సిజం తాత్విక, చారిత్రక లోతులు తెలుసు. పౌరహక్కుల సంఘం దాదాపు దశాబ్ద కాలం జరిపిన వాడి, వేడి చర్చల్లో ఆయన కీలకపాత్ర నిర్వహించాడు. మార్క్సిస్టు దృష్టిలో మానవ హక్కులు, మానవ హక్కుల దృష్టిలో మార్క్సిజం అనే చర్చ జరిగినప్పుడు మార్క్సిస్టు దృక్కోణం నుండి హక్కులు అనే పంథా వైపు చాలా దృఢంగా నిలబడ్డాడు. ఆ దృక్పథం తీసుకున్న కార్యకర్తలకు కొత్త విశ్వాసాన్ని, ఆత్మస్థైర్యాన్ని ఇచ్చాడు. తన వ్యక్తిగత మంచితనం వలన చర్చ సుహృద్భావ వాతావరణంలో జరిగేలా చూసాడు. బహుశా ప్రపంచంలో ఏ హక్కుల ఉద్యమంలో కూడా ఇంత సమగ్ర చర్చ నాకు తెలిసినంత వరకు జరగలేదు. చర్చ చాలా కాలం జరిగినా ఒక ఆరోగ్యగకర వాతా వరణంలో సాగింది. దృక్పథాలలో ఎన్ని విబేధాలున్నా వ్యక్తిగత మానవ సంబంధాలు ఆత్మీయతతో కొనసాగాయి. సంస్థ విడిపోయినా మానవ హక్కుల వేదికకు పౌరహక్కుల సంఘానికి ఎక్కడ బహిరంగ సభ జరిగినా సభ్యులందరూ సంయమనం పాటించేలా ఒక వైపు బాలగోపాల్ మరొక వైపు శేషయ్య చాలా కృషి చేసారు. మా ఇద్దరి మధ్య దృక్పథాలలో కొంత తేడా ఉన్నా నేను పౌరహక్కుల సంఘంలో కొనసాగడానికే నిశ్చయించుకున్నాను. సంస్థ విడిపోయిన తర్వాత పౌరహక్కుల సంఘానికి శేషయ్య అధ్యక్షుడుగా, అమరుడు పురుషోత్తం సెక్రటరీగా బాధ్యతలు తీసుకుంటే సంస్థ చాలా చురుకుగా పని చేస్తుందని బాలగోపాల్ ఒక స్నేహపూరిత సలహా ఇచ్చారంటే శేషయ్య పట్ల బాలగోపాల్ గౌరవం, అలాగే సంస్థ బాగా పనిచేయాలనే ఆకాంక్ష ఎంత బలంగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు.
రాయలసీమ వెనుకబాటుతనం తెలిసినవాడుగా శేషయ్య తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి తన పూర్తి మద్దతు ప్రకటించాడు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గౌరవించడం పౌరహక్కుల ఉద్యమ ప్రజాస్వామిక స్వభావానికి నిదర్శనమని భావించేవాడు. ఆంధ్ర ప్రదేశ్ పౌరహక్కుల ఉద్యమం ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ డిమాండ్ ఏకగ్రీవంగా మద్దతు ప్రకటించిన మొదటి సంస్థ. ఇలా రెండు ప్రాంతాలవారు అంగీకరించేలా చూడబట్టే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా రెండు ప్రాంతాల ఉద్యమానికి శేషయ్యను సమన్వయకర్తగా ఎన్నుకోవడంలోనే ఆయన విశిష్ట వ్యక్తిత్వం చూడవచ్చు.
ప్రొ. శేషయ్యకు ఉన్న ప్రతిష్ఠ వలన శాంతిచర్చలలో ఆయన ఒక మధ్యవర్తి పాత్ర నిర్వహించారు. చర్చల సందర్భంలో భూసంస్కరణల గురించి, అలాగే పౌర ప్రజాస్వామిక హక్కులకు సంబంధించిన చర్చకు ఆయన చాలా దోహదపడ్డారు. మిగతా మధ్యవర్తుల్లాగే ప్రజా సమస్యలకు చర్చలు ఏ మేరకు ఉపయోగపడినా ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుందని భావించాడు. హింస ప్రతిహింస వలయం నుండి బయటపడి ఇటు రాజ్యం అటు విప్లవోద్యమంలో రాజకీయాల ప్రాధాన్యత పెరగాలనేది చర్చల లక్ష్యం. అయితే చర్చలు ఫలవంతంగా జరుగుతాయనే విశ్వాసం ఆయనకు ఎక్కువగా ఉండేది కాదు. అయినా ఆ ప్రయత్నానికి తన వంతు కృషి చేసారు.
శేషయ్య కేవలం రాజ్యాంగాన్ని విశ్లేషించడమేకాక రాజ్యాంగ నిబంధనలను ఎలా ప్రజల ప్రయోజనానికి ఉపయోగించాలని ఆలోచించబట్టే రాయలసీమ సమస్యల మీద ప్రత్యేక దృష్టి పెట్టి స్థానిక సమస్యలకు స్పందించి తన ప్రయత్నం తాను చేసేవారు. అనంతపురం జిల్లా కరువు గురించి, వెనకబాటుతనాన్ని గురించి, అస్తిత్వాన్ని గురించి పట్టించుకొని మాట్లాడాడు. అలాగే ప్రజల సమస్యలకు నిర్దిష్ట పరిష్కారాల కొరకు ఆయన చేసిన కృషికి సంబంధించిన చాలా సంఘటనలు ఉన్నా రెండు సంఘటనలు ఇక్కడ పేర్కొనాలి. అనంతపురంలో దాదాపు 150 కుటుంబాలు నిర్వాసితులైనప్పుడు వాళ్ల పునరావాసం గురించి తనకుండే పలుకుబడిని, హక్కుల అవగాహనను ఉపయోగించి వాళ్ళకు పునరావాసం జరిగే దాకా పోరాడి దాంట్లో విజయం సాధించాడు. ఇప్పుడు ఆ కుటుంబాలు తమకంటూ ఒక కాలనీ ఏర్పరుచుకొని అందులో జీవిస్తున్నారు. అలాగే స్పిన్నింగ్ మిల్ కార్మికులు సమ్మె చేస్తే మిల్లు మూసివేయకుండా చూడడమే కాక వాళ్ల సమస్య పరిష్కారానికి దోహదపడ్డాడు. ఇవి కేవలం మచ్చుకు ఉదాహరణలు మాత్రమే. తన దృష్టికి ఏ సమస్య వచ్చినా దానికొరకు తన వంతు పాత్ర నిర్వహించడం వలన, రాయలసీమ ప్రజలు శేషయ్య వైపు చూడడం వలన ఆయన వ్యక్తిగత ప్రతిష్ఠ పెరగడమే కాక పౌరహక్కుల ఉద్యమానికి పేద వర్గాలలో సాధికారత సాధించగలిగారు.
ఆయన నిర్వహించిన పాత్ర వల్ల రాజ్య ఆగ్రహానికి గురి అయ్యాడు. ఆయన ఇంటి మీద దాడి చేశారు. ఆయన వాహనాన్ని ధ్వంసం చేశారు. అలాగే ఉమ్మడి రాష్ట్రంలో పోలీసులు ప్రోత్సహించిన పులులు, వేటకుక్కల పేర అసాంఘిక శక్తులు ఆయనను బెదిరించేవారు. ఆ బెదిరింపులకు భయపడక అదే పట్టుదలతో చివరి శ్వాస వరకు ప్రజల పక్షాన నిలబడ్డారు. ప్రజాస్వామిక శక్తులు శేషయ్య స్ఫూర్తితో పని చేసి ఒక మానవీయ ప్రజాస్వామ్య సమాజ సౌధ నిర్మాణానికి రాళ్ళు మోయవలసిందే. అదే ఆయనకు సరైన నివాళి.
ప్రొ. జి. హరగోపాల్
Comments
Post a Comment