సాయిబాబా దీక్ష దేనికోసం | అమన్

డీల్లీ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ అయిన డాక్టర్ జి. ఎన్. సాయిబాబా 2014 నుండి క్రూరమైన యుఎపిఎ కింద జైలు శిక్ష అనుభవిస్తున్నారు.  నాగ్పూర్ జైలులో ఉన్నారు. అతను 90% వైకల్యం కలిగి ఉన్నాడు.  జైలులో ఉండటం వాళ్ళ, సరి అయిన వైద్యం అందక పోవడం వల్ల, వైద్యుల నిర్లక్ష్యం కారణంగా అతని చేతుల క్రమంగా పక్షవాతానికి గురి అయ్యాయి. ఈ సుదీర్ఘ అనారోగ్య కారణాలు, తీవ్రమైన శారీరక రుగ్మతలను సృష్టించింది. పెరోల్ లేదా మెడికల్ బెయిల్‌ను పదేపదే తిరస్కరించడం జరిగింది. అతని ఆరోగ్య పరిస్థితి సరిగా లేనప్పటికీ,  రద్దీగా ఉన్న నాగ్‌పూర్ జైలులో కరోనా మహమ్మారి ఎదుర్కొంటున్న తీవ్రమైన అనారోగ్య ప్రమాదాల నేపథ్యంలో, అతని జీవితానికి తీవ్ర ముప్పు ఉంది. తన తల్లి చివరి కర్మలలో పాల్గొనడానికి అతనికి పెరోల్ కూడా నిరాకరించబడింది.

జైలులో, డాక్టర్ సాయిబాబాకు అవసరమైన వైద్య సదుపాయాలు నిరాకరించబడ్డాయి. అతని భార్య వసంత కుమారి అదనపు డిజిపికి లేఖ రాశారు. అందులో అమాన వీయమైనప్రవర్తన, అధికారులు నిర్దేశించిన అన్యాయమైన ఆంక్షల కారణంగా అతను నాగ్‌పూర్ సెంట్రల్ జైలులో కష్టాలను, వేధింపులను ఎదుర్కొంటున్నట్లు తెలిపింది.  కొన్నిసార్లు అతని న్యాయవాదులు ఇచ్చిన మందులనను కూడా ఆయనకు ఇవ్వడం లేదు. అతనికి అనేక అనిరోగ్య సమస్యలు  ఉన్నాయి. 

  అతని ప్రాణాలను కాపాడటానికి ప్రతిరోజూ సూచించిన మందులు తీసుకోవాలి. అయినా ఆ మందులు వారికి అందడం లేదు అని ఆమె మీడియా కు తెలిపింది. డాక్టర్ సాయిబాబాకు అతని కుటుంబ సభ్యులు పంపిన లేఖలు,  వార్తాపత్రిక క్లిప్‌లతో పాటు పుస్తకాలను స్వీకరించే అవకాశం కూడా నిరాకరించబడింది. ఈ పుస్తకాలు ఆంగ్లంలో ఉన్నాయి.  అవి  మార్కెట్లో ఉచితంగా లభిస్తాయి. అయినా  వీటిని అనవసరంగా జప్తు చేసి ఉంచారు. జైలు అధికారులు  అతనికి వార్తాపత్రిక ఇవ్వడం మానేశారు.  ఫోన్ ద్వారా అతని కుటుంబ సభ్యులతో మాట్లాడటం నిరాకరించ బడింది. అతను  పరిమిత సంఖ్యలోనే ఫోన్ కాల్స్ చేయాల్సి వుంటుంది. ఆ కారణంగా తన కేసును తన న్యాయవాదులతో చర్చించే అవకాశం కూడా లేదు.

ఇందులో భాగంగానే  డాక్టర్ సాయిబాబా ఖైదీగా తన హక్కులను పునరుద్ధరించే ప్రయత్నంలో 2020 అక్టోబర్ 21 నుండి నిరాహార దీక్షను పాటించవలసి వచ్చింది. ఈ పరిస్థితి వలసరాజ్యాల పాలనలో భారత రాజకీయ ఖైదీల మల్లే అసాధారణమైన సారూప్యతను కలిగి ఉంది. ఇది విప్లవకారులు జతిన్ దాస్, భగత్ సింగ్,  ఇతరులు జైళ్ళలో బంధించబడిన తర్వాత, వారి నిరసనలతో సరిపోల్చ తగింది.

రాజకీయ ఖైదీల పట్ల పాలకులు అత్యంత నిరంకుశంగా ప్రవర్తిస్తున్నారు. పౌర, ప్రజాస్వామ్య హక్కుల సంస్థలు  డాక్టర్ సాయిబాబాకు కలిగిన ఈ భరించలేని ఇబ్బందిని ఖండించాయి. ఈ సందర్భంగా  పౌర, రాజకీయ హక్కులపై అంతర్జాతీయ ఒడంబడికలోని నిబంధనల గురించి ప్రభుత్వానికి హక్కుల సంఘాలు గుర్తు చేశాయి. అందులో  భారతదేశం సంతకం చేసింది.  ఈ ఒడంబడికలోని ఆర్టికల్ 10, క్లాజ్ 1 ప్రకారం, “ స్వేచ్ఛను కోల్పోయిన వారందరినీ మానవత్వంతో,
వ్యక్తి స్వాభావిక గౌరవానికి భంగం కలుగకుండా కాపాడాలి”.

నాగ్‌పూర్ సెంట్రల్ జైలు అధికారులు వెంటనే జోక్యం చేసుకుని డాక్టర్ సాయిబాబా హక్కులను పరిరక్షించాలి. అతనికి మందులు, పుస్తకాలు,  లేఖలు అందజేయాలి. అతని జీవితం ప్రమాదంలో పడకుండా చూసుకోవాలి.  రాజ్యం  అదుపులో ఉన్న డాక్టర్ సాయిబాబా హక్కులు ఉల్లంఘించబడకుండా చూసుకోవటానికి ప్రజాస్వామిక వాదులందరు కృషి చేయాలి. సాయిబాబా జైలులో చేయబోయే దీక్షకు అందరూ మద్దతు ఇవ్వాలి.

- అమన్
 

Comments