"ఎవరి హక్కుల కోసం మరెవ్వరూ గొంతెత్తరో వారికోసం గళం విప్పేదే పౌరహక్కుల సంఘం" అని సంస్థ దశను, దిశను, నిర్దేశించిన పౌరహక్కుల ఉద్యమ సారథి, గొప్ప మేధావి, దార్శనికుడు ప్రొఫెసర్ శేషయ్య గారు. తెలుగునాట విశాలమైన, బలమైన పౌరహక్కుల ఉద్యమ నిర్మాణంలో ఆయన కృషి మరువలేనిది. ప్రజల జీవించే హక్కును విఘాతం కలిగించే ప్రతి అంశంపైనా సంస్థ కార్యాచరణను విస్తృత పరిచాడు. ప్రజలకు చట్టబద్ధ పాలన కావాలని , సామాన్య ప్రజల ప్రాథమిక హక్కుల పరిరక్షణ కోసం వారి పక్షాన నిలబడి గొంతు లేని వారి గొంతుకై రాజ్యాన్ని ప్రశ్నించాడు.
ప్రొఫెసర్ శేషయ్య గారు విద్యార్థి దశ నుండే ప్రత్యామ్నాయ రాజకీయాల పై ఆసక్తిని కనబరిచాడు. దానికి నేపథ్యం బహుశా తను పుట్టిన కర్నూలు జిల్లాలోని నందికొట్కూరు ప్రాంతంలోని అప్పటి సామాజిక, రాజకీయ, పరిస్థితులు కావచ్చు. ఎందుకంటే అప్పట్లో అక్కడ ఫ్యాక్షన్ రాజకీయాలు బలంగా ఉండేవి . విద్యార్థి దశలో రాడికల్ భావజాలం తో రాడికల్ విద్యార్థి సంఘం లో చురుకుగా పని చేశాడు. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ లో "మాస్టర్ ఆఫ్ లా" పూర్తి చేసుకున్న తర్వాత తన న్యాయ శాస్త్ర అధ్యాపక వృత్తిలో అడుగుపెట్టాడు. కృష్ణదేవరాయ యూనివర్సిటీలో దాదాపు మూడున్నర దశాబ్దాల పాటు న్యాయ శాస్త్రాన్ని బోధించాడు. భారత రాజ్యాంగం తనకు ఇష్టమైన సబ్జెక్ట్ .
హక్కుల కోణం నుండి భారత రాజ్యాంగాన్ని , న్యాయ వ్యవస్థని ,విశ్లేషించడం ద్వారా తద్వారా వందలాది మంది విద్యార్థుల పై హక్కుల స్పృహ ను కలిగించాడు. ప్రపంచవ్యాప్తంగా హక్కుల ఉద్యమాలపై వ్యక్తి కేంద్రంగా హక్కులను నిర్వచించే ఉదారవాద దృక్పథం పౌరహక్కుల సంఘం పై కూడా పడింది. ఆ ఉదారవాద దృక్పథానికి వ్యతిరేకంగా, వ్యక్తి రాజకీయ, ఆర్థిక ,సాంఘిక, హోదాను హక్కుల ఉల్లంఘనలో సమాజంలోని ఆదిపత్య వ్యవస్థలకు రాజ్యం ఏ విధంగా సహకరిస్తుందో పాతికేళ్ల క్రితమే సవివరణగా విశ్లేషించాడు. ఈ నాడు దేశ వ్యాప్తంగా దళితులపై దాడులు చేస్తున్న అగ్రవర్ణ పెత్తం దార్లను రాజ్యం ఏవిధంగా వెనకేసుకుని వస్తూన్నదో నిత్యం మనం చూస్తూనే ఉన్నాము.
హక్కులు వాటంతటకవే ఉనికిలోకి రావని, రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు కూడా తరతరాలుగా ప్రజా పోరాటాల ఫలితమేనని బలంగా ప్రచారం చేశాడు. పౌరహక్కుల ఉద్యమాలు రాజ్యాంగం , చట్టంబద్ద పాలన ప్రాతిపదికన పోరాటాలు చేసినా, ప్రజా పోరాటాల్లోని ఆకాంక్షలు వీటన్నిటికన్నా ఉన్నతమైనవని ఆ ఆకాంక్షల్నీ గుర్తించి , గౌరవించడం హక్కుల ఉద్యమాలు కర్తవ్యమని బలంగా విశ్వసించాడు. అందులో భాగంగానే అస్తిత్వ ఉద్యమాల్ని, ప్రాంతీయ ఉద్యమాల్ని , బలపరిచాడు .
ఏ రాజ్యాంగానికి కట్టుబడి పరిపాలన సాగిస్తామని ప్రమాణం చేసి అధికారం చేపట్టిన ప్రభుత్వాలు అదే రాజ్యాంగాన్ని అడ్డంపెట్టుకుని ఏవిధంగా సామాన్య ప్రజల ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగిస్తున్నాయో విశ్లేషణాత్మకంగా వివరించేవారు. స్త్రీలకు, దళితులకు, పీడిత ప్రజలకు చట్టాల్లో రాజ్యాంగం ఉన్న హక్కులు కనీసంగా అమలుకు నోచుకోకపోవడానికి కారణం సమాజంలోని పితృస్వామ్య అగ్రకుల పెత్తందారీ వ్యవస్థ లేనని, వాటికి రాజ్యం వత్తాసు పలకడమే కారణమని విశ్లేషించాడు. పోరాడే ప్రజల హక్కుల కోసం ఏర్పడ్డ పౌరహక్కుల సంఘం తన ఉద్యమ ప్రస్థానంలో సమాజం లోని ఆధిపత్య వ్యవస్థల వల్ల జరిగే అన్ని రకాల హక్కుల ఉల్లంఘనపై పనిచేయడం ప్రారంభించింది. పై సామాజిక నేపథ్యంలో తన అవగాహనను విస్తృత పరచుకునే దశలో పౌరహక్కుల దృక్పధానికి సంబంధించి సంస్థలో సుదీర్ఘమైన చర్చ జరిగింది. అప్పటి వరకు సంస్థకు ఉన్న హక్కుల దృక్పధానికి మార్పులు చేయాలనే వాదనను క్యాడర్ నుండి మద్దతు లభించకపోవడం తో5 అప్పటివరకు సంస్ధ నాయకత్వ భాద్యతల్లో ఉన్నవారు తప్పుకోవటంతో సంస్ధ ప్రణాళిక, లక్ష్య ప్రకటనలే భూమికగా మెజారిటీ అభిప్రాయాలకు అనుగుణంగా సంస్ధకు నాయకత్వం వహించి సంస్ధను ముందుకు నడిపించాడు.
వ్యక్తి కేంద్రంగా హక్కులను నిర్వచించే ఉదారవాద సిద్ధాంతాన్ని వ్యతిరేకించాడు. దానివల్ల సమాజంలో బలమైన వ్యక్తులే హుక్కుల్ని అనుభవించగలిగారని, బలహీనులకు అవి ఎండమావులే అవుతాయని అన్నాడు. చివరకు ఉన్నత న్యాయస్ధానాలు కూడా వ్యక్తి హక్కులకు ఇచ్చిన ప్రాధాన్యాన్ని, సామూహిక హక్కులకు ఇవ్వడం లేదనే వాస్తవాన్ని వివరించాడు. ఒక్క మాటలో చెప్పాలంటే తను వ్యక్తివాదం వైపున కాకుండా ప్రజాసమూహం హక్కుల వైపు నిలబడ్డాడు. రాజ్యాంగానికి లోబడే హక్కుల అమలుకు ప్రయత్నించడమే హక్కుల ఉద్యమం పరిధిగా వుండాలనే సూత్రీకరణను అంగీకరించాడు. అదే క్రమంలో రాజ్యాంగ పరిధి దాటి కూడా ప్రజా పోరాటాల్లో ప్రజాస్వామిక ఆకాంక్షలు ఉంటాయని, వాటిని రాజ్యాంగ పరిధికి కుదించడం ఆ ఉద్యమాల ప్రజాస్వామిక ఆకాంక్షలను అగౌరవ పరచడమేనని అభిప్రాయపడ్డాడు.
రాష్ట్రంలోనే కాక, ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న హక్కుల ఉల్లంఘనలపై కలసికట్టుగా పోరాటం చేయాల్సిన ఆవశ్యకతను గుర్తించాడు. దేశవ్యాప్తంగా వున్న హక్కుల సంఘాలను స్వమన్వయపరచి వాటిని ఒక సమాఖ్యగా, ఒకే గొడుగు క్రిందకు తీసుకురావడంలో శేషయ్య కీలక పాత్ర పోషించాడు. తద్వారా దేశంలోని ఇతర హక్కుల సంఘాలకు కూడా స్ఫూర్తిదాయక మార్గదర్శకునిగా నిలిచాడు.
ప్రొఫెసర్ శేషయ్య సంస్ధ కార్యదర్శిగా భాద్యతలు చేపట్టిన తరువాత పౌరహక్కుల సంఘం మునుపెన్నడూ ఎరగనటువంటి నిర్భంధాన్ని చవిచూసింది. ఓ వైపు రాజ్యం కిరాయి హంతక ముఠాల ద్వారా పురుషోత్తం, ఆజంఅలీలను చంపివేసింది. మరోవైపు పల్నాడు టైగర్స్, గ్రీన్‌టైగర్స్, నల్లమల కోబ్రాల పేరుతో బెదరింపులకు, ఇళ్లపై దాడులకు పాల్పడి నాయకత్వ ఆత్మస్ధైర్యాన్ని దెబ్బతీయడానికి తీవ్రంగా ప్రయత్నించింది. ఆ సంక్లిష్ట సమయంలో ద్వితీయశ్రేణి నాయకత్వం, కార్యకర్తలు మనోదైర్యం కోల్పోకుండా వారిని శేషయ్య ముందుండి నడిపించాడు. రాజ్యం తనమీద నిర్భందం ప్రయోగించినా, ఇంటిపై దాడులకు తెగబడి కారును దగ్ధం చేసినా, రాజ్యాన్ని ప్రశ్నించడంలో తను ఏ మాత్రం వెనగడుగు వేయలేదు.
హక్కుల ఉల్లంఘనకు రాజకీయ కోణంలో కాకుండా హక్కుల కోణం నుండి ఎలా చూడాలి, ఎలా స్పందించాలి, అనే చైతన్యాన్ని అందించాడు. హక్కుల పరిభాషను కార్యకర్తలకు అలవాటు చేయడానికి ఆయన చాలా కృషి చేశాడు. ప్రాధమిక హక్కుల పరిరక్షణలో న్యాయస్ధానాలు ముఖ్యంగా హైకోర్టులు, సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తున్నాయి, ఎవరికోసం స్పందిస్తున్నాయి అని విశ్లేషించి, వాటి ద్వంద వైఖరిని ఎండగట్టాడు. న్యాయస్ధానాలు చాలా సందర్భాల్లో సమాజంలో ఉన్నత స్ధాయిలోని వ్యక్తుల హక్కులకు భంగం కలిగినపుడే స్పందించాయని, అలాంటి సందర్భంలోనే ప్రాధమిక హక్కులకు విస్తృతమైన నిర్వచనాన్ని ఇచ్చాయని సవివరంగా విశ్లేషించాడు. సామాన్య ప్రజల హక్కుల్ని కాపాడటంలో ఉన్నత న్యాయస్ధానాలు విఫలమైనాయని స్పష్టంగా చెప్పాడు. అలాగని న్యాయస్ధావనాల్లో పౌరహక్కుల పరిరక్షణకు సంస్ధ చేస్తున్న పౌరాటాన్ని ఆపొద్దని కూడా హక్కుల న్యాయవాదులకు పిలుపు ఇచ్చాడు. ఎన్‌కౌంటర్లకు పాల్పడిన పౌలీసులపై హత్యానేరం కింద కేసు నమోదు చేయాలనే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెనుక శేషయ్య పాత్ర చాలా వుంది. చాలా సందర్భాల్లో హక్కుల పరిరక్షణకు ప్రజాపోరాటాలే అంతిమ పరిష్కారమని తేల్చి చెప్పాడు.
శేషయ్యగారికి రాయలసీమ అన్నా, ఇక్కడి ప్రజలన్నా చాలా మమకారం. రువు వల్ల, ఫ్యాక్షనిజం వల్ల ఇక్కడి ప్రజలు ఎలా తమ హక్కుల్ని ముఖ్యంగా జీవించే హక్కును కోల్పోతున్నారో క్షుణ్ణంగా అధ్యయనం చేసి పుస్తకాలు కూడా వ్రాశారు. రాయసీమ ఫ్యాక్షన్ సంస్కృతికి వ్యతిరేకంగా సంస్ధ చేసిన పోరాటంలో శేషయ్య పాత్ర చాలా కీలకమైనది.
హక్కుల ఉద్యమ నాయకుడిగా, మేధావిగా దాదాపు నాలుగు దశాబ్దాలపాటు హక్కుల ఉద్యమానికి దిక్సూచి అయినాడు. రాజ్యం ప్రజలపై, ప్రజాఉద్యమాలపై ఫాసిస్టు నిర్భందాన్ని ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రయోగిస్తూ సామాన్య ప్రజల హక్కుల్ని కాలరాస్తున్న సందర్భంలో హక్కుల సంఘాలు మరింత చురుకైన పాత్ర పోషించాల్నిన తరుణంలో శేషయ్య లేని లోటు పూడ్చలేనిది. శేషయ్య హక్కుల చైతన్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలోనే హక్కుల సంఘం శేషయ్యకు నిజమైన నివాళి అర్పించినట్టు అవుతుంది.
- కె. క్రాంతి చైతన్య
Comments
Post a Comment