హక్కుల యోధుడు శేషయ్య

 



శేషయ్యశ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయ న్యాయశాస్త్ర విశ్రాంత ఆచార్యులు, పౌరహక్కుల సంఘం తెలుగు ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ సేపూరి శేషయ్య కరోనా కాటుతో ఈ నెల 10న మరణించడం అత్యంత విచారకరం. ఆయన మరణం ప్రత్యామ్నాయ రాజకీయాలు కోరుకునే వారిని, ముఖ్యంగా హక్కుల ఉద్యమాలతో మమేకమైన వారిని తీవ్రంగా కలచివేసింది.

ఆంధ్రప్రదేశ్‌ పౌర హక్కుల సంఘంలో ప్రధాన భూమిక పోషించిన ప్రొఫెసర్‌ సేపూరి శేషయ్య 1954, సెప్టెంబర్‌ 20న కర్నూలు జిల్లా నంది కొట్కూరు గ్రామంలో జన్మించారు. విద్యార్థి దశ నుండే ప్రత్యామ్నాయ రాజాకీయాలపై ప్రత్యేక శ్రద్ధను కనబరిచారు. అనంతపురం లోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో న్యాయ విద్యను అభ్యసించారు. పిదప తిరుపతి లోని శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎల్‌.ఎల్‌.ఎం. న్యాయవిద్యని అభ్యసించారు.

శేషయ్య విద్యాభ్యాసానంతరం మొదటగా ఏలూరు లోని సి.ఆర్‌.రెడ్డిి కళాశాలలో అధ్యాపక వృత్తిలో కొనసాగారు. తదనంతరం 1983లో అనంతపురం లోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్ర ఆచార్యులుగా బాధ్యతలు చేపట్టి డీన్‌ గాను సేవలు అందించారు.

1985 నాటి నుండి ఆంధ్రప్రదేశ్‌ పౌర హక్కుల సంఘంలో క్రియాశీలంగా పనిచేయనారంభించారు. మొదటగా ఆంధ్రపదేశ్‌ పౌర హక్కుల సంఘంలో అనంతపురం జిల్షా కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. 1998 సెప్టెంబర్‌లో జరిగిన ఆంధ్రప్రదేశ్‌ పౌర హక్కుల సంఘం రాష్ట్ర మహాసభల్లో సంఘం రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు. తర్వాతి కాలంలో పౌరహక్కుల సంఘం అధ్యక్షులుగాను బాధ్యతలు నిర్వహంచారు.

రాజ్యహింస, ప్రైవేట్‌ హింస, ఎన్‌కౌంటర్లు, అక్రమ అరెస్టులు, లాకప్‌ మరణాలు, అక్రమ నిర్బంధాలు మొదలైన వాటికి వ్యతిరేకంగా స్పష్టమైన కార్యాచరణతో పౌర హక్కుల కార్యకర్తగా, నాయకుడుగా శేషయ్య ఉద్యమించారు. హక్కుల ఉల్లంఘన ఘటనలనూ ఆయన అంతే తీవ్రంగా ప్రతిఘటించారు. పలు నిజనిర్ధారణల్లోనూ ఆయన పాలుపంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ పౌర హక్కుల సంఘం అనుబంధ పత్రిక 'ప్రజా స్వేచ్ఛ' మాస పత్రికకు సంపాదకులుగా బాధ్యతలు నిర్వహించారు.

పౌర హక్కుల సంఘంలో ప్రజాహక్కుల గళం వినిపిస్తున శేషయ్య అనేకసార్లు దాడులకు గురయ్యారు. 2005, నవంబర్‌ 23న 'రాయలసీమ టైగర్స్‌' ఆయన ఇంటిపై దాడి చేసి కారుని కాల్చివేశారు. పౌర హక్కుల సంఘానికి రాజీనామా చేయాలంటూ అనేకసార్లు బెదిరింపులు ఎదుర్కొన్నప్పటికీ వాటిని ఏమాత్రం ఖాతరు చేయకుండా హక్కుల సంఘంలో మరింతగా మమేకమై కార్యాచరణతో ధైర్యంగా ముందుకు సాగారు తప్ప ఆయన ఏనాడూ వెనకడుగు వేయలేదు. 'ప్రజాస్వామిక ఉద్యమాలు మాత్రమే నూతన సమాజాన్ని ఆవిష్కరిస్తాయి' అని ఆయన బలంగా విశ్వసించారు.

రచయితగా, వక్తగా, పరిశోధకుడిగా, న్యాయశాస్త్ర అధ్యాపకుడిగా బహుముఖ ప్రజ్ఞాపాటవాలు కలిగిన వ్యక్తి ఆయన. హక్కుల ఉద్యమంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని పదిలపర్చుకొని 'చెరగని హక్కుల స్ఫూర్తి'గా ప్రజల హృదయాలలో చిరస్మరణీయుడిగా వెలుగొందుతూనే వుంటారు. ఆయన ఆకస్మిక మరణం హక్కుల ఉద్యమాలకు తీరని లోటు.
- జె.జె.సి.పి. బాబూరావు,
సెల్‌ : 94933 19690.

Comments