ప్రొఫెసర్ శేషయ్యకు నివాళి ( నిజామాబాద్ జిల్లా)

*ప్రెస్ నోట్*    పౌర హక్కుల సంఘం(సీ.ఎల్.సీ) జాతీయ కన్వీనర్ ప్రొఫెసర్ శేషయ్యకు నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కోటగల్లీలో సంతాప సభ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా *పౌరహక్కుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆల్గోట్ రవీందర్ మాట్లాడుతూ*  శేషయ్య గారు గత కొద్ది రోజులుగా కరోనా ఇతర ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ నిన్న రాత్రి(10.10.2020) మరణించారన్నారు. 

సార్ మరణం హక్కుల, ప్రజాస్వామ్య ఉద్యమాలకు తీరనిలోటన్నారు. ప్రొ. శేషయ్య సార్  ప్రజల హక్కుల హననాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ, స్త్రీల, దళితుల, ఆదివాసుల హక్కుల కోసం నిరంతరం పరితపించినవాడన్నారు. గత దశాబ్ద కాలంగా అనారోగ్యముగా ఉన్నప్పటికీ పౌర హక్కుల సంఘానికి మార్గనిర్దేశం చేసినవాడన్నారు. 

అంతేగాక, నిజ నిర్ధారణ బృందంలో ఇబ్బందిపడ్తూ కొండలు, వాగులు వంకలు దాటుతూ వాస్తవాలను సమాజానికి అందించినవాడు శేషయ్య సార్ అన్నారు. రాజ్యహింసను ఎండగట్టడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాడని, ఫోన్లో బెదిరింపులు, ఇంటిపైన రాళ్లు వేయడం, ఇంట్లో ఉన్న కారును దహనం చేసి సంఘానికి దూరం చేయాలని రాజ్యం ప్రయత్నిస్తే సంఘాన్ని ఇతర రాష్ట్రాలకు విస్తరింప చేయడానికి గొప్ప కృషి చేసినాడన్నారు. ఆల్ ఇండియా కోఆర్డినేషన్ కమిటీకి కన్వీనర్ బాధ్యతలు చేపట్టాడన్నారు. సంఘములో ఆరుగురు అమరులైనప్పటికీ మొక్కవోని దీక్షతో సంఘానికి దశ , దిశా నిర్దేశిస్తూ రెండు రాష్ట్రాలలో చురుకుగా పనిచేయడానికి తన వంతు కృషి చేసినవారు శేషయ్య సార్. ప్రజాతంత్ర విలువలు కలిగిన సార్ అంటే అందరికి ప్రేమ, ఇష్టం, గౌరవమన్నారు. అమరుడు పురుషోత్తంపై పుస్తకాన్ని తీసుకవచ్చే పనిలో ఉన్న క్రమములో కరోనా సోకి అమరుడైనాడని ఆవేదన వ్యక్తంచేశారు. 


ప్రజాస్వామిక ఉద్యమాన్ని బలోపేతం చేస్తూ అమరుడైన శేషయ్య సారుకు మా కన్నీటి జోహార్లన్నారు. హక్కుల కోసం ఉద్యమించడమే సారుకు మనమిచ్చే ఘన నివాళి అని అన్నారు.   ఈ కార్యక్రమంలో సీ.ఎల్.సీ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసరావు, జిల్లా సహాయ కార్యదర్శి జలెందర్, జిల్లా కోశాధికారి భాస్కరస్వామి, ఐ.ఎఫ్.టి.యు జిల్లా నాయకులు ఎం.సుధాకర్, డి. కిషన్, పీ.ఓ.డబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి సంధ్యారాణి, జిల్లా నాయకులు నర్సక్క, ఏ.ఐ.కే.ఎం.ఎస్ జిల్లా నాయకులు మురళి, తిరుపతి పీ.డీ.ఎస్.యూ జిల్లా ఉపాధ్యక్షుడు ప్రశాంత్, వివిధ ప్రజా సంఘాల నాయకులు పురుషోత్తం, రాజు, సందీప్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.

Comments