అసమాన సమాజంలో అసాధారణ వ్యక్తి - 1

 


పౌరహక్కుల సంఘం నాయకులు, ఆంధ్రప్రదేశ్‌  సివిల్‌ లిబర్టీస్‌ కమిటీ (సిఎల్‌సి),  తెలంగాణ సివిల్‌ లిబర్టీస్‌ కమిటీ సమన్వయ కమిటీ  కన్వీనరు ప్రొఫెసరు శేషయ్య (20.9.1954 - 10.10.2020)అక్టోబర్‌ 10,  2020 న  కోవిడ్‌ 19 తో రాత్రి 8 గంటలకు మరణించారు. పౌర హక్కుల నాయకుడు ,ప్రొఫెసర్‌ శేషయ్య గారు   తీవ్ర అనారోగ్యంతో ఎఐజి ఆసుపత్రి, హైదరాబాద్‌ లో మరణించడంతో పౌరహక్కల కార్యకర్తలు ధిగ్బ్రాంతికి గురయ్యారు.   24 సెప్టెంబర్‌,2020  నుండి అనంతపురం ఆసుపత్రిలో శేషయ్య గారు చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం మెరుగు కానందున అక్కడి డాక్టర్ల సలహా మేరకు, 4.10.20వ తేదీ అనంతపురం ఆసుపత్రి నుండి, హైదరాబాద్‌, గచ్చిబౌలి లోని ఎసియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ గాస్ట్రోఏంట్రాలజిలో ఆయన్ను కుటుంబ సభ్యులు, పౌరహక్కుల సంఘం నాయకులు చేర్పించారు. అప్పటి నుండి  ప్రొఫెసర్‌ శేషయ్య గారు  వెంటిలేటర్‌ పైనే ఉండి తర్వాత చనిపోయారు.  

ప్రగతిశీల ఆలోచనాపరుడు

నాలుగు దశాబ్దాలుగా, శేషయ్య ప్రగతిశీల రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్నారు.  ఒక వామపక్ష సామాజిక కార్యకర్తగా, పౌర హక్కుల రంగంలో  సివిల్‌ లిబర్టీస్‌ కమిటీ కార్యనిర్వాహకుడిగా విశేష సేవలు అందించారు. అనంతపూర్‌ లోని శ్రీ కష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో అనేక దశాబ్దాలుగా న్యాయశాస్త్రం బోధించారు. శేషయ్యగారు 1998 లో హక్కలు                   ఉద్యమం సైద్ధాంతిక సంక్షోభం ఎదుర్కుంటున్న సమయంలో ఎపిసిఎల్‌సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయ్యారు.

పౌరహక్కుల సంఘం ప్రముఖ నాయకులు టి. పురుషోత్తం, అజం అలీలను వెంటవెంటనే ప్రభుత్వ కిరాయి హంతక ముఠాలు చంపాయి. హైదరాబాదులో నవంబర్‌ 23, 2000న పురుషోత్తంను చంపేశారు. అలాగే   18 ఫిబ్రవరి, 2001 న   నల్గొండలో గ్రీన్‌ టైగర్సు పేరుతో ఆజంను చంపారు. శేషయ్యగారు కూడా పలుమార్లు ప్రభుత్వ ముఠాలచే బెదిరింపులకు గురయ్యారు.   నవంబర్‌ 11, 2005 రాత్రి అతని ఇంటిపై ప్రభుత్వం ఉసిగొల్పిన దుండగులు దాడి చేశారు. అతని కారును తగలబెట్టారు. ఈ పని మేమే చేశామని  రాయలసీమ టైగర్సు అనే సంస్ధ ప్రకటించుకుంది. అది ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రైవేటు ముఠా అని ప్రజలందరికి తెలుసు. 

ప్రొఫెసర్‌ శేషయ్య 1970 లలో తన విద్యార్థి రోజుల నుంచే రాజకీయాల్లో చురుకుగా పాల్గొనడం ప్రారంభించారు. అప్పటి అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా రాడికల్‌ స్టూడెంట్సు యూనియన్‌ రాష్ట్ర జాయింట్‌ సెక్రటరీగా ఉన్నారు. గుంటూరులోని నాగార్జున విశ్వవిద్యాలయంలో లా లెక్చరర్‌గా చేరారు. అతను 1986 లో ఆంధ్రప్రదేశ్‌ సివిల్‌ లిబర్టీస్‌ కమిటీ (ఎపిసిఎల్‌సి) లో చురుకుగా పనిచేశారు. పౌర హక్కుల ఉద్యమంలో అతని సుదీర్ఘ ప్రయాణం 1986 నుండే  ప్రారంభమైంది. 1990 లలో సాయుధ ప్రతిఘటనపై అనేక చర్చలు హక్కుల సంస్ధలలో జరిగాయి.  అయినప్పటికీ పౌరహక్కలు ఉద్యమం సైద్దాంతిక సంక్షోభాన్ని అధిగమించడంలో శేషయ్య గారు ప్రముఖ పాత్ర వహించారు.   1998-2005 వరకు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా యూనిట్లను ఏర్పాటు చేయడంలోను, వాటిని ప్రగతిశీలకంగా నడిపించడంలో  ప్రొఫెసర్‌ శేషయ్య విజయం సాధించారు.  

రాజ్య హింసకు సంబంధించిన విషయాలపై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో ఆయన పలు పిటీషన్లను వేశారు. ఎన్‌ కౌంటరులో పాల్గొన్న పోలీసులపై  కేసులు నమోదు చేయాలని హైకోర్టు  తీర్పు ఇవ్వడంలో ప్రొఫెసర్‌ శేషయ్య కీలక పాత్ర పోషించారు. అతను 2004 లో ప్రభుత్వం,  మావోయిస్టుల మధ్య శాంతి చర్చల కోసం జరిగిన  చర్చలకు తన వంతు సహకారాన్ని అందించారు.  అతను నిస్సందేహంగా హక్కల ఉద్యమం కోసం తన జీవితాన్ని  త్యాగం చేశారు.  2009 లో  ఎపి హైకోర్టు తీర్పు, ఎపిసిల్సి  వర్సెస్‌  ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కేసులో పౌరహక్కలు సంఘం  విజయం సాధించడానికి  వెనుక ఆయన          ఉన్నారు.  ఇది సెక్షన్‌ 302 (హత్య) కింద ఎన్‌ కౌంటర్లపై పాల్గొన్న పోలీసులపైన కూడా ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేయడం తప్పనిసరి చేసింది.  2014లో   తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సిఎల్సీ కమిటీలు ఏర్పడినపుడు,   ఏర్పడిన తరువాత, ప్రొఫెసర్‌ శేషయ్య తన సేవలను సమన్వయకర్తగా అందించారు. ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ తన క్రియాశీలతను హక్కుల ఉద్యమంలో కొనసాగించారు. చనిపోయేనాటికి సిఎల్‌సి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ కమిటీ కో-ఆర్డినేటర్‌గా వున్నారు.

అత్యంత ప్రజాదరణ పొందిన ఉపాధ్యాయుడు, ప్రొఫెసర్‌ శేషయ్య తన క్రియాశీలతను తన విద్యా విషయాలతో మిళితం చేశాడు. 2016 లో అనంతపూర్‌ లోని శ్రీ కష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నుండి లా ప్రొఫెసర్‌గా పదవీ విరమణ చేశారు. అక్కడ డీన్‌గా కూడా పనిచేశారు. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీ కోసం మానవ హక్కులపై సిలబస్‌ను అభివద్ధి చేయడంలో ఆయన ముఖ్యపాత్ర పోషించారు.  భారతదేశంలోని అనేక ఇతర న్యాయ విశ్వవిద్యాలయాలలో అతిథి అధ్యాపకులుగా ఉన్నారు.

ఎస్‌. శేషయ్య అంతర్జాతీయ పౌర హక్కుల ఉద్యమానికి ఒక ముఖ్యమైన కేంద్రంగా వున్నారు.  భారతదేశంలో వివిధ హక్కలు సంఘాలు కలిసి ఒక సంస్ధగా ఏర్పడటంలోను శేషయ్యగారి విశేష కషి వుంది. దానికోసం ఆయన అనేక సమావేశాలు ఏర్పాటు చేసి చర్చలు జరిపారు.  పౌర హక్కుల పటిష్టానికి  ప్రజాస్వామ్య హక్కుల సంస్థల సమన్వయ కమిటీ (సిడిఆర్‌ఓ)ని ఆయన నాయకత్వంలోనే ఏర్పాటు చేశారు. హక్కల సంఘాలు చేస్తున్న అనేక కార్యకలాపాలలో శేషయ్య గారు తన స్థిరమైన     ఉనికిని కొనసాగించారు.  ప్రజాస్వామ్య హక్కుల ఉద్యమానికి ప్రొఫెసర్‌ శేషయ్య ఇచ్చిన క్రియాశీల మద్దతు,  మార్గదర్శకత్వంలోనే దేశంలోని అనేక హక్కుల సంస్ధలు పనిచేస్తున్నాయనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. 

శాంతి చర్చల్లో హక్కుల డిమాండ్లు

 హింసాత్మక ఘటనలను ఆపాలని  ప్రభుత్వం,  మావోయిస్టుల మధ్య సంభాషణ కోసం విజ్ఞప్తి చేయాలని సిటిజెన్స్‌ పీస్‌ ఇనిషియేటివ్‌ విజ్డప్తి చేసింది.  ఈ చొరవను ముందుకు తీసుకెళ్లడానికి శేషయ్య ప్రయత్నించారు.  మావోయిస్టులపై ప్రభుత్వ దాడులు పెరిగాయి. మావోయిస్టుల పేరుతో సాధారణ ప్రజలను పోలీసులు చంపుతున్నారు.  గిరిజన ప్రాంతాల్లోని సామాన్య ప్రజలు ఎదుర్కుంటున్న పోలీసు హింసను దూరం చేయాలని శేషయ్య సంకల్పించారు. శాంతి చర్చల్లో ప్రజా హక్కులకు గ్యారంటీ ఇవ్వాలనే అంశాన్ని చేర్చడంలో ఆయన కృషి వుంది. అప్పటి డిమాండ్లు అన్నీ ప్రజా పక్షపాతానికి సంబంధించినవే. 1. పేదలకు భూమిని సమానంగా పంపిణీ చేయడం 2. ప్రపంచ బ్యాంక్‌ నిర్దేశించిన ఆర్థిక విధానాలను తిరస్కరించడం 3. ప్రజల ప్రజాస్వామ్య హక్కుల పునరుద్ధరణ 4. దళితులకు సామాజిక న్యాయం, మహిళలకు సమాన హక్కులు, మైనారిటీల హక్కుల పరిరక్షణ, స్వపరిపాలన 5. తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేక రాష్ట్రం 6. రాయలసీమ మరియు ఉత్తర తీర ప్రాంతాల వెనుకబడిన ప్రాంతాల అభివద్ధి 7. నిషేధాన్ని ఎత్తివేయడం 8. మెరుగైన నిధులు, విద్య, ఆరోగ్యం, ప్రజల సంక్షేమంపై దష్టి 9. అవినీతి నిర్మూలన 10. భూస్వాముల అణచివేత చర్యలను అరికట్టడం 11. ప్రజలపై సామ్రాజ్యవాద, పెట్టుబడిదారీ సంస్కతి  చెడు ప్రభావాల నివారణించడం. అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్‌ వై ఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి  తొమ్మిది మంది అధికారిక బందంతో సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, పీపుల్స్‌ వార్‌, జనశక్తి  అగ్ర నాయకుల మధ్య జరిగిన మొట్టమొదటి ప్రత్యక్ష చర్చ ఇది. ఇరుపక్షాల మధ్య కొనసాగుతున్న కాల్పుల విరమణ అమలును పర్యవేక్షించడానికి పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేశారు.

డిమాండ్లను పరిష్కరించడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని, అయితే ప్రజలపై అణచివేత కొంతకాలం పోస్టుఫోన్‌ మెంటు జరుగుతుందని ఆయన చెప్పాడు.  ఎన్‌కౌంటర్లు జరగకుండా వుండటం కోసం శాంతి చర్చలకు మద్దతు ఇవ్వాలని శేషయ్య అన్నారు. అయితే ప్రభుత్వం తన ఇంటలిజెన్సీ వ్యవస్ధ ద్వారా మావోయిస్టు ఉనికిని కనుగొనడానికి ఈ చర్చలు దోహదం చేసే ప్రమాదం లేకపోలేదని ఆయన ముందే హెచ్చరించారు. 


Comments