1993లో కర్నూలులో జరిగిన ఆంధ్ర ప్రదేశ్ పౌర హక్కుల సంఘం రాష్ట్ర మహాసభలలో పురుషోత్తం పరిచయం అయ్యాడు. అప్పటికీ ఆయన మహబూబ్ నగర్ జిల్లా శాఖ బాద్యుడు. 1994 జనవరిలో నేను పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి వున్నాను. అప్పుడు పురుషోత్తం మహబూబ్ నగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి గా ఉన్నారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో కలిసినప్పుడు నవ్వుతూ మాట్లాడేవాడు. రాష్ట్రంలో ఆనాటి నిర్బంధ పరిస్థితులపై చర్చించే వాళ్ళం. ఎప్పుడు మాట్లాడినా ముందు నవ్వుతూ పలకరించేవాడు. 1996 మహబూబ్ నగర్ లో ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం రాష్ట్ర మహాసభలు నిర్వహించడం లో క్రియాశీలక పాత్ర వహించాడు. ఆ మహాసభలోనే రాష్ట్ర సహాయ కార్యదర్శి బాధ్యతలు తీసుకున్నాడు. మహబూబ్ నగర్ జిల్లాలో ఆయన, పశ్చిమ గోదావరి జిల్లాలో నేను పోటా పోటీగా కార్యక్రమాలు నిర్వహించే వాళ్ళం. ఆ విధంగా మరింత దగ్గరయ్యాం. నన్ను అన్నా అని పిలిచేవాడు, నేను కూడా ఆయనను అన్నా అని పిలిచేవాడిని.
1996 లో కరీంనగర్ జిల్లా పాలకుర్తిలో ఎన్ కౌంటర్ పైన మరికొన్ని ఎన్ కౌంటర్లపై నిజనిర్ధారణ చేయాలని రాష్ట్ర కార్యవర్గం నిర్ణయించింది. హైదరాబాదులో కార్యవర్గ సమావేశం అయిన తరువాత బాలగోపాల్ సార్, పురుషోత్తం, ఆ జిల్లా బాద్యులు, నేను కలిసి వెళ్ళాము. పాలకుర్తి ఎన్ కౌంటర్ నిజనిర్ధారణ పూర్తి అయిన తరువాత అక్కడి నుండి బీర్పూల్ కొండల్లో జరిగిన ఎన్ కౌంటర్ పై నిజనిర్దారణకు వెళ్ళాము. బీర్పూల్ లో ఆ గ్రామ సర్పంచ్ తో బాలగోపాల్ సార్ మాట్లాడే క్రమంలో ఆయన ఒక విషయం చెప్పారు. పీపుల్సు వార్ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి ముప్పాళ్ల లక్ష్మణరావు( గణపతి) ఇల్లు ఇక్కడే వుందని సర్పంచ్ చెప్పాడు. వెంటనే పురుషోత్తం చొరవతో మేమంతా ఆ ఇంటికి వెళ్లి చూశాం. మట్టి గోడలతో పాడైపోయి పై కప్పు కూడా లేకుండా ఆ ఇల్లు ఉంది.
నల్లమల అడవుల్లో ఎన్ కౌంటర్, చెంచుల పై పోలీసుల నిర్బంధం పైన కూడా విషయసేకరణకు వెళ్ళాము. ఎన్ కౌంటర్ నిజనిర్ధారణ చేసిన తర్వాత రెండు గ్రూపులుగా విడిపోయాం. రెండవ గ్రూపులో పురుషోత్తం, అజాం ఆలీ, నేను ముగ్గురం వెళ్ళాము. ఆ అడవిలో మాకు గైడ్ చేయడానికి ఇద్దరు చెంచు యువకులు వచ్చారు. అడవుల్లో మధ్యాహ్నం 3 గంటలకు నడక ప్రారంభించడం మొదలు పెట్టి రాత్రంతా జంతువుల మధ్యన నడిచి ఉదయం 6 గంటలకు చెంచుల గూడాలకు వెళ్లాం. నిజనిర్దారణ జరిగి రోడ్డుపైకి వచ్చేటప్పటకి ఉదయం 10 గంటలకు అయింది. సుమారు 18 గంటలు నడిచాం. పురషోత్తం మాటల వల్ల మాకు అలసట తెలియలేదు. పురుషోత్తం పోలీసుల హింసకు వ్యతిరేకంగా పని చేసే క్రమంలో గుర్తుతెలియని పోలీసులు మహబూబ్ నగర్ లో అతనిపై దాడి చేసి, తీవ్రంగా గాయపరిచారు. అయినా అతను దాడికి భయపడలేదు. ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం అంతర్గత సంక్షోభంలో ఉన్నప్పుడు ధైర్యంగా సంస్థను ముందుకు నడిపించడంలో పురుషోత్తం ముందున్నాడు. 1998 అక్టోబర్ లో హైదరాబాదులో ఏ పి సి ఎల్ సి 9 వ రాష్ట్ర మహాసభల్లో రెండోతరం వ్యక్తులకు నాయకత్వం వచ్చింది. తీవ్ర నిర్బంధ కాలంలో ప్రకటనలు ఇవ్వడానికే భయపడే రోజుల్లో హక్కుల ఉద్యమాన్ని రాష్ట్ర కార్యవర్గం సమిష్టిగా నడిపించింది. అందులో పురుషోత్తం పాత్ర ప్రముఖమైనది.
1999 వ సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ ఎన్ కౌంటర్లకు పాల్పడింది. ప్రజా సంఘాలతో బూటకపు ఎన్ కౌంటర్ల పోరాట కమిటీ ని ఏర్పాటు చేయడంలోను పురుషోత్తం కృషి వుంది. ఎన్ కౌంటర్లన్నీ రాజకీయ హత్యలేననే నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు జరిగాయి. ఈ పోరాట కమిటీని అధ్యక్షులు రత్నమాల, ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ శేషయ్య, సహాయ కార్యదర్శి పురుషోత్తం నడిపించారు. పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలనే డిమాండ్ తో వామపక్ష పార్టీలు, నాయకులు, కార్యకర్తలు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని చేశారు. అసెంబ్లీ ముట్టడి ఉద్యమంలో పురుషోత్తం, పౌరహక్కుల సంఘం కార్యకర్తలు, క్రియాశీలకంగా పాల్గొన్నారు. పౌరహక్కుల ఉద్యమం ఊపందుకోవడానికి పురుషోత్తం పాత్ర చెప్పుకోదగ్గది. చంద్రబాబు ప్రభుత్వం అసెంబ్లీని ముట్టడించిన ప్రజలపై కాల్పులు జరిపింది. పోలీసుల కాల్పుల్లో రామకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వామి చనిపోయారు. ఈ కాల్పుల ను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా పౌరహక్కుల సంఘం ప్రచారం చేసింది. పురుషోత్తం చొరవతోనే వామపక్షాలతో కలిసి పౌరహక్కుల సంఘం రాష్ట్రవ్యాప్త నిరసనలకు పాల్పడింది.
పురుషోత్తం ఏది చెప్పాడో అది ఆచరించిన వ్యక్తి. తీవ్ర నిర్బంధ కాలంలో ప్రాణానికి భయపడకుండా రాజ్య హింసకు వ్యతిరేకంగా నియమ నిబద్ధతతో పనిచేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తులు అరుదుగా ఉంటారు. 23- 11- 2000 న సర్కారీ హంతక ముఠాలు దిల్ సుఖ్ నగర్ లో పురుషోత్తాన్ని కత్తులతో దాడి చేసి నరికి చంపారు. పురుషోత్తం మృతి హక్కుల ఉద్యమానికి తీరని లోటు. పురుషోత్తం బ్రతికి ఉన్నంతకాలం అణగారిన ప్రజల, దళిత, ఆదివాసీ, మహిళల హక్కుల కోసం నిరంతరం పోరాడిన వ్యక్తి. పురుషోత్తం స్పూర్తితో పనిచేసిననాడే అతనికి మనం నిజమైన నివాళులు అర్పించినవారమౌతాం.
వేడంగి చిట్టిబాబు
రాష్ట్ర అధ్యక్షులు
పౌర హక్కుల సంఘం
ఆంధ్ర ప్రదేశ్.
తేదీ:- 2-9-2020.
Comments
Post a Comment