పురుషోత్తంతో ఇరవై నిమిషాలు

టి. పురుషోత్తం అసలు పేరు టేకురి కర్ణం పురుషోత్తం రావు. పౌరహక్కలు సంఘం రాష్ట్ర నాయుకుడు మరియి న్యాయవాది.   ఆంధ్రప్రదేశ్ లోని పాలమూరు జిల్లాలో పేద కుటుంబానికి చెందిన వ్యక్తి. చనిపోయేనాటికి ప్రముఖ పౌర హక్కుల సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్ సివిల్ లిబర్టీస్ కమిటీ ((ఏపీసీఎల్‌సీ) జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నాడు. టి. పురుషోత్తం అనేక మానవ హక్కుల ఉల్లంఘన కేసులలో బాధితులు తరపున ప్రభుత్వం, పోలీసులను ప్రశ్నించాడు.   ముఖ్యంగా పోలీసులు చేస్తున్న చట్టవిరుద్ధమైన ఎన్ కౌంటర్లకు వ్యతిరేకంగా పోరాడాడు.  అతను అనేక నిజనిర్ధారణ నివేదికలను వ్రాసాడు.  అనేక పౌర హక్కుల అవగాహనా కార్యక్రమాలను నిర్వహించాడు. 1993 లో, మహాబూబ్ నగర్ సమీపంలోని ఒక గ్రామంలో 30 మంది ఇటుక బట్టీలో వెట్టిచాకిరి చేస్తున్నారు. వారిని విడుదల చేయడానికి రుషోత్తం సహాయం చేశాడు.  

న్యాయవాదిగా అతను పోలీసు హింసకు వ్యతిరేకంగా న్యాయస్ధానాలలో అనేక పిటీషన్లను వేశాడు. 1994లో ఒక రిక్షా పుల్లర్  పోలీసు కస్టడీలో మరణించాడు. పోలీసులపై హత్యానేరం మోపాలని   కోర్టులో పురుషోత్తం పిటిషన్ దాఖలు చేశాడు.  ఇద్దరు పోలీసులకు న్యాయస్ధానం  శిక్షకూడా వేసింది.  రిక్షా పుల్లర్ భార్యకు నష్ట పరిహారం అందింది. 2000 లో,  విద్యుత్ సుంకం పెంపునకు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ప్రజలపై పోలీసులు కాల్పులు జరిపారు. ఆ కాల్పల్లో ముగ్గురు మరణించారు. అవి ప్రభుత్వ హత్యలను పురుషోత్తం ప్రకటించాడు. అంతేగాకుండా ఆ హత్యలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిపై కేసు పెట్టడానికి పురుషోత్తం ప్రయత్నించారు.

వెంటాడి చంపారు

23 నవంబర్ 2000 న, టి. పురుషోత్తం కిరాణా సామాగ్రి కొనడానికి తన ఇంటి నుండి బయటకు వచ్చాడు. అతనిపై నలుగురు వ్యక్తులు కత్తులు, గొడ్డలితో దాడి చేశారు. అతని శరీరం 17 సార్లు కత్తిపోటుకు గురైందని, అతన్ని తల మొండెం నుండి వేలాడుతుందని అతని భార్య తెలిపింది. సాక్ష్యాలను చెరిపివేయడానికి పోలీసులు క్రైమ్ సన్నివేశాన్ని దెబ్బతీశారని పలు రాజకీయ పార్టీలు ఆరోపించాయి. 

నిందితుల అరెస్టు

హైదరాబాద్-బెంగళూరు హైవేలోని తోండపల్లి గ్రామ సమీపంలో నవంబరు 29, 2000 ఉదయం 11 గంటలకు ప్రత్యేక పోలీసు బృందం నిందితులను బెంగళూరుకు బయలుదేరుతుండగా పట్టుకుందని,  హత్యకు ఉపయోగించిన వేట కొడవలిని కూడా స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు చెప్పారు.   

29, నవంబరు 2000 ఆంధ్రప్రదేశ్ సివిల్ లిబర్టీస్ కమిటీ (ఎపిసిఎల్‌సి) నాయకుడు టి. పురుషోత్తం హత్యకు సంబంధించి ప్రధాన నిందితుడు ఖాజా నయీముద్దీన్ తో సహా నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టు అయిన వారిలో నయీముద్దీన్, బయ్యపు సమ్మీ రెడ్డి, కొండా విజయ కుమార్, నోములా శ్రీనివాస్ వున్నారు. వీరంతా   పీపుల్సు వార్ పార్టీ మాజీ సభ్యలు. వీరు పురుషోత్తంను చంపినట్లు అంగీకరించారని పోలీసులు పత్రికలకు పేర్కొన్నారు. అయితే, ప్రజాస్వామ్య ఉద్యమాలను అణిచివేసేందుకు లొంగిపోయిన నక్సలైట్‌లతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక హంతక ముఠాను ఏర్పాటు చేసిందని ప్రజాసంఘాలు ఆరోపించాయి. 

హంతకముఠాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం

" ఎపిసిఎల్సి సంయుక్త కార్యదర్శి టి. పురుషోత్తం హత్య రాష్ట్ర కుట్ర" అని దాని సీనియర్ నాయకులు ఎం. రత్నమల, ఎం.టి. ఖాన్, ప్రొఫెసర్ హరగోపాల్,  పురుషోత్తం భార్య జ్యోతి  మీడియా సమావేశంలో పాత్రికేయులతో అన్నారు. ప్రజాస్వామ్య ఉద్యమాలను అణచివేయడానికి ప్రభుత్వం ప్రయతిస్తోంది. ప్రభుత్వ అణచివేత రూపాలలో ప్రశ్నించే వాళ్లను భౌతికంగా నిర్మూలించడం ఒకటిగా మారింది. 

నల్గోండ జిల్లాలోని భోంగీర్ కు చెందిన నయీముద్దీన్, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కె.ఎస్. వ్యాస్ ను 1993 జనవరిలో చంపాడు. ఆ కేసులో శిక్ష పడిన తర్వాత అతను బెయిల్ పై విడుదల అయ్యాడు. ఆ తర్వాత అతని సేవలను ప్రభుత్వం ఉపయోగించుకుంది. అతని నాయకత్వంలో ఒక కిరాయి హంతక ముఠాను ఏర్పర్చి ప్రజా సంఘాల నాయకులను తుదముట్టించే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది.   సమ్మీ రెడ్డి రెండేళ్లపాటు పీపుల్సు వార్ పార్టీ జిల్లా కమిటీ సభ్యుడిగా పనిచేసిన తరువాత కరీంనగర్‌లో పోలీసులకు లొంగిపోయాడు.

 ఆ రోజు ఉదయం దిల్సుఖ్‌నగర్‌లోని పురుషోత్తం నివాసం సమీపంలో పురుషోత్తం కోసం ఈ నలుగురు వేచి ఉన్నారని, అతను ఒక దుకాణం నుండి ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు అతన్ని అడ్డగించారని పోలీసు అధికారి సుకుమార్ చెప్పారు. నయీముద్దీన్, సమ్మీ రెడ్డి కాపలాగా ఉండగా, విజయ్ కుమార్ , శ్రీనివాస్ పురుషోత్తంను కొడవళ్లతో దారుణంగా హత్య చేశారు. ఆ తర్వాత నలుగురు టాటా సుమోలో తప్పించుకున్నారని పోలీసు అధికారి చెప్పారు. 

నిందితులు విడుదల

 సాక్ష్యాలు లేవని  2002 లో, నలుగురినీ నిర్దోషులుగా ప్రకటించారు. 2016 ఆగస్టులో ఆంధ్రప్రదేశ్‌లోని హైదరాబాద్ సమీపంలో పోలీసులు జరిపిన ఎన్‌కౌంటర్‌లో ప్రధాన నిందితుడు నయూముద్దీన్ చనిపోయాడు. పురుషోత్తంని చంపిన నయూముద్దీన్ ను పోలీసులు బూటకపు ఎన్కౌంటర్లలో హతమార్చిందని పౌరహక్కుల సంఘం ఆరోపించింది. బాధ్యులైన పోలీసులపై హత్యానేరం కింది కేసు నమోదు చేయాలని సంఘం డిమాండ్ చేసింది. 

బెదిరింపులు

పురుషోత్తం తరచూ పోలీసులచే నియమించబడిన కాంట్రాక్ట్ కిల్లర్స్ నుండి బెదిరింపులు అందుకున్నాడు. పలుసార్లు అతని హక్కుల కార్యాచరణను ఆపమని ముఠా సభ్యులు అతన్ని  హెచ్చరించారు.   పురుషోత్తం హత్య  సంఘటన జరిగిన కొద్ది రోజుల తరువాత, “గ్రీన్ టైగర్స్” ఈ దాడికి బాధ్యత వహిస్తున్నామని చెప్పింది. ఆంధ్రప్రదేశ్‌లోని  హక్కుల కార్యకర్తలకు “గ్రీన్ టైగర్సు” పోలీసులు ఏర్పాటు చేసిన కిరాయి హంతక బృందమని తెలుసు.  ఈ కేసులో సమర్థవంతమైన దర్యాప్తు జరగలేదు.  పురుషోత్తంకు తరుచూ బెదిరింపు ఫోన్ కాల్సు వచ్చేవని  పురుషోత్తం భార్య జ్యోతి కూడా
తెలిపారు. 

అప్పటి రాజకీయ పరిస్ధితులు

 పురుషోత్తం చనిపోయేనాటికి భారతదేశానికి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి వున్నారు. భారతీయ జనతా పార్టీ (బిజెపి) బహుళ పార్టీ సంకీర్ణానికి నాయకత్వం వహిస్తోంది. రాష్ట్రపతిగా   ఎ.పి.జె. అబ్దుల్ కలాం వున్నారు. బిజేపి హిందూమతోన్మాద పార్టీ కాదని చెప్పడానికి కలాంని రాష్ట్రపతిని చేశారని ప్రజా సంఘాలు ఆరోపించాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెదేపా పార్టీ చంద్రబాబు నాయకత్వంలో పనిచేస్తోంది. బిజేపి నయా ఫాసిస్టు పాలనకు కావలసిన బీజాలను వాజ్పాయ్  కాలంలోనే వేసింది. చంద్రబాబు అధికార మదంతో పోలీసు పరిపాలనను రాష్ట్రంలో నెలకొల్పాడు. ప్రజల హక్కులను అణచివేశాడు. ప్రశ్నించే పురుషోత్తం లాంటి చురుకైనా నాయకులను కిరాయి ముఠాలచే చంపించాడు. 

అదే చంద్రబాబు ఈ రోజు మానవహక్కులు ఆంధ్రప్రదేశ్ లో అడుగంటాయని చాలా బాధ పడుతున్నాడు. బిజేపి హిందూత్వ రాజకీయాలను ప్రోత్సహించి సంకీర్ణం నుండి స్వంతంగా అధికారాన్ని కైవసం చేసుకుంది. పెట్టుబడులు దేశంలోకి, రాష్ట్రంలోకి ఆహ్వానించబడాలంటే పోలీసు పరిపాలన వుండాలి. ఆందోళనలు, నిరసనలు వల్ల మార్కెట్ భయపడుతుంది. పెట్టుబడులు ప్రోగుపడటం తగ్గుతుంది. కాషాయి పరిపాలనకు ప్రజాసంఘాల నాయకులు అడ్డంకిగా వుంటున్నారు. ఈ నేపధ్యంలో చురుకైన ప్రజాసంఘాల నాయకుడిని హతమార్చడం ప్రభుత్వానికి, పెట్టుబడికి అవసరమైంది. పోలీసులు చేసిన ప్రతి ఎన్ కౌంటరు బూటకమని  పురుషోత్తం లాంటి నాయకులు నిజనిర్దారణలు చేసి మరీ నిరూపిస్తున్నారు.  అప్పిటికింగా దండకారణ్యంలో పెద్ద ఎత్తున ప్రభుత్వం సహజ నిక్షేపాలను పెట్టుబడిదారీలకు అప్పనంగా ఇవ్వవలసి వుంది.

కాషాయి పరిపాలనను ఊపందించడానికి, పెట్టుబడులను ఆహ్వానించడానికి, ప్రభుత్వ చట్టవ్యతిరేకమైన పాలనను ప్రశ్నించ కుండా వుండటానికి ప్రభుత్వం ప్రజలను, ప్రజాస్వామిక వాదులను భయ్రభాంతులకు గురిచేయ దలుచుకుంది. అందులో భాగంగా బలమైన ప్రజాదరణను కలిగిన నాయకుడైన పురుషోత్తాన్ని బలి ఇవ్వడం ద్వారా అప్పటి పాలకవర్గ పార్టీలు తమ దోపిడీని, దళారితనాన్ని మరింత వృధ్ది చేసుకున్నాయి. అందుకే పురుషోత్తం హత్యను కేవలం ఒక హత్యగా చేస్తే విషయాలు అర్థం కావు. ఇది రాజకీయ హత్య. బలంగా వున్న ప్రజా ఉద్యమాల దూకుడును తాత్కాలికంగా అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం పన్నిన ప్రణాళిక. ఈ రోజ వాస్తవాలను, రాజకీయ, సామాజిక పరిస్ధితులను గమనిస్తే పురుషోత్తం సమాధి నుండే పాలకవర్గాలు, పెట్టుబడి వర్గాలు తమ పునాదులను బలోపేతం చేశాయని తెలుస్తుంది. 
 
వాజ్ పాయ్ హయాంలో అసెంబ్లీ ఎన్నికలు ఉత్తర ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాంచల్, మణిపూర్,  గోవాలో  నిర్వహించబడ్డాయి. హిందూత్వం, అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఇవే  ఎన్నికల మేనిఫెస్టోలో వున్నాయి. గుజరాత్ ఎన్నికల్లో తీవ్రమైన హింస చెలరేగింది. పోలీసు హింసను మైనారిటీలపైన బిజేపి ఉపయోగించింది. 

 అల్లర్లను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందనే ఆరోపణలను  అన్ని పార్టీలు చేశాయి. గుజరాత్ ఎన్నికల్లో రిగ్గింగ్ కు, మత విభజనకు, ప్రభుత్వ అధికారులను ఉపయోగించడం లాంటి కుయిక్తులు  బిజేపికి లాభాన్ని చేకూర్చాయి. అటు తర్వాత బిజేపి అదే ఎన్నికల నమూానాను దేశవ్యాప్తం చేసింది. శాంతిభద్రతల నిర్వహణకు 28 రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రాథమిక బాధ్యత ఉన్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలపై పెత్తనం చేయసాగింది. దేశవ్యాప్తంగా పారా మిలటరీ దళాల ద్వారా,  కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పోలీసు పాలనను అందించ నారంభించింది.

రాష్ట్ర-వ్యవస్థీకృత పోలీసు దళాల సీనియర్  అధికారులను  కేంద్ర హోంశాఖ  తన నియంత్రణలో వుంచడానికి ప్రయత్నించింది. భద్రతా దళాలు దేెశవ్యాప్తంగా అనేక తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడ్డాయి. దేశం ప్రభుత్వ నియంత్రణలో నుండి ఎక్కువుగా  మార్కెట్ ఆధారిత ఆర్థిక వ్యవస్థకు మారుతోంది. ప్రైవేటు రంగం వేగంగా విస్తరించింది.

1991 లో ప్రారంభమైన ఆర్థిక సరళీకరణకు సంబంధించిన నిర్మాణాత్మక సంస్కరణలు వేగంగా కొనసాగాయి.  ఏటా 1.7 శాతం జనాభా వృద్ధి రేటు నమోదు అయింది. ఆదాయ పంపిణీ చాలా అసమానంగా ఉంది. జనాభాలో మొదటి 20 శాతం మంది జాతీయ ఆదాయంలో 34.4 శాతం పొందుతున్నారు.  దిగువ 20 శాతం 10 శాతం అందుకుంటుంది. ప్రభుత్వ సర్వే ప్రకారం, పట్టణ జనాభాలో 23.6 శాతం, గ్రామీణ జనాభాలో 27.1 శాతం మంది దారిద్య్ర స్థాయికి దిగువున నివసించారు. ప్రభుత్వం పేరుకు మాత్రమే  పౌరుల మానవ హక్కులను గౌరవిస్తుంది. 

గణనీయమైన మానవ హక్కుల ఉల్లంఘనలు ఈ కాలంలోనే నమోదయ్యాయి.  నకిలీ ఎన్‌కౌంటర్ హత్యలు పెరిగాయి. పోలీసులలో అవినీతి, లంచగొండితనం, ఆశ్రిత పక్షపాతం పెరిగింది. 
దేశవ్యాప్తంగా ప్రజలపై అదుపు కోసం ప్రభుత్వాలు ప్రయత్నించాయి.  జమ్మూలో చురుకైన తిరుగుబాట్లను ఎదుర్కోవటానికి భద్రతా దళాలు అధిక శక్తిని ఉపయోగించాయు. కాశ్మీర్,  అనేక ఈశాన్య రాష్ట్రాలు  పోలీసులు, ప్రభుత్వ అనధికార ముఠాల వల్ల ఇబ్బందులకు గురయ్యాయి.  పేలవమైన జైలు పరిస్థితులు, జమ్మూ కాశ్మీర్, ఈశాన్యంలో ఏకపక్ష అరెస్టులు, అప్రకటిత  నిర్బంధం, ప్రత్యేక భద్రతా చట్టాల దుర్వినియోగం వల్ల వేల మంది ప్రజాస్వామిక వాదులు అరెస్టులు అయ్యారు.  అరెస్టయిన వేలాది మంది దేశవ్యాప్తంగా  సుదీర్ఘ ట్రయిల్ ను ఎదుర్కోవడం జరిగింది. విచారణలో ఉన్నప్పుడు సుదీర్ఘ నిర్బంధం,  పత్రికా స్వేచ్ఛ, ఉద్యమ స్వేచ్ఛపై పరిమితులు,  వేధింపులు ఎక్కువయ్యాయి.

మానవ హక్కుల కార్యకర్తల అరెస్టు,  మహిళలపై విస్తృతమైన సామాజిక హింస,  బలవంతంగా వ్యభిచార కూపంలోకి నెట్టబడుతున్న మహిళలు,   ఆడ శిశుహత్య, ప్రాంతీయ విద్వేషాలు,  షెడ్యూల్డ్ కులాలు,  తెగల ప్రజలపై వివక్ష, విస్తృతమైన  మతతత్వ హింస,  ముస్లింలు, క్రైస్తవులపై ప్రేరేపించబడిన హింస,  బాల కార్మికుల వెట్టిచాకిరి లాంటి అశాంతి పరిస్ధితులు దేశంలోని రాష్ట్రాలలో నెలకొన్నాయి.  ఈ దుర్వినియోగాలు  చాలా సాంప్రదాయకంగా క్రమానుగత సామాజిక నిర్మాణం ద్వారా ఉత్పన్నమవుతూనే వున్నాయి.  దేశంలో లోతుగా పాతుకుపోయిన ఉద్రిక్తతలు అనేక జాతి, మత సమాజాలు, హింసాత్మక వేర్పాటువాద ఉద్యమాలను తీవ్రతరం చేశాయి. ప్రభుత్వం వీటిని కేవలం శాంతి భద్రతల సమస్యగా చూడడం అలవాటు చేసుకుంది. 

ప్రభుత్వపు భారీ ప్రతివాద నిరోధక వ్యూహాలు, కోర్టు ఆదేశాలను పాటించటానికి కూడా చాలా సందర్భాల్లో నిరాకరించాయి. ఇది న్యాయ వ్యవస్థను దెబ్బతీసింది. చాలా సాయిధ పార్టీలు ఎన్నికలు సజావుగా జరగడం లేదని ఎన్నికలను బహిష్కరించమని పిలుపు నిచ్చాయి. చాలా చోట్ల చాలా గ్రామాల ప్రజలు ఎన్నికలలో పాల్గొనడానికి నిరాకరించారు. పాలకులు తమ పాలనపై నమ్మకాన్ని కోల్పోయారు. ఓటమి భయంతో మరింత నిర్భంధాన్ని ప్రజలపై రుద్దడానికి ప్రయత్నించారు. దీనికి చంద్రబాబు ప్రభుత్వం అతీతం కాదు. ఆయన తన వంతు ఫాసిస్టు రాజకీయాలను  రాష్ట్రంలో నెలకొల్పాడు. అదే ఫాసిస్టు పాలన ఈరోజు అతని పార్టీని మరణశయ్యపై వుంచింది. 

పురుషోత్తంతో పరిచయం

1999లో చిత్తూరు జిల్లోని కాళహస్తిలో బూటకపు ఎన్ కౌంటర్ల వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో సభ నిర్వహించాలని ప్రజా సంఘాలు భావించాయి. సభాస్ధలి అయిన మహేష్ కళ్యాణ మండపం ఆ రోజు ఉదయం 8 గంటలకే పోలీసుల బలగాలతో దిగ్భంధం చేయబడివుంది. చిన్నపాటి వర్షం కురుస్తోంది. ఆ సభకు పురుషోత్తాన్ని వక్తగా పిలవడం జరిగింది. ప్యాంటు, షర్టును ఇన్ షర్టు చేసుకుని పొడుగ్గా వున్న వ్యక్తిని నాకు క్రాంతి చైతన్య పరిచయం చేశాడు. అతను నవ్వుతూ నాకు షేక్ హాండ్ ఇచ్చాడు. కొంత సంభాషణ తర్వాత నేను, పురుషోత్తం ఇద్దరమే ఒక టీ స్టాల్ దగ్గరకు వెళ్లాము. నేను ఒక సాధారణ కార్యకర్తను మాత్రమే. అయినా పురుషోత్తం నన్ను అన్నా అని సంభోధిస్తూ మాట్లాడాడు. 

"అన్నా ఈ నిర్భంధంలో మనం సభను జరపలేం కదా. మన వల్ల సభకు వచ్చిన జనాలు అరెస్టు అయితే మళ్లీ మన సభకు రారామో. మనమే వాళ్లని సభకు రావద్దని చెపితే బాగుంటుందేమో" నేనన్నాను.
" ఆ పని పోలీసులే చేస్తున్నారు కదే" పురుషోత్తం అన్నాడు. మళ్లీ ఆయనే " మనం అన్నా పక్కకు వచ్చి దాదాపుగా దాక్కున్నాం. కాని ప్రజలు నేరుగా సభాస్ధలికే వెళ్లి పోలీసులనే అడుగుతున్నారు చూడు" అంటూ పోలీసులతో ఘర్షణ పడుతున్న ప్రజలను పురుషోత్తం చూపించాడు. 

"మనం ప్రజలు వున్నారనే ధైర్యంతోనే మీటింగులు పెడుతున్నాం" అన్నాడు. 

కొంచెం సేపు మౌనంగా వున్న నేను ‌" అన్నా నిన్ను ఎప్పుడన్నా పోలీసులు కొట్టారా‌‌. నువ్వు ఎప్పుడన్నా పోలీసులకు భయపడ్డావా" అన్నా. నా మాటల్లో ఉత్సుకత కన్నా, వ్యంగ్యమే ఎక్కువుందని నాకే అనిపించింది. 
‌" సరిగ్గా నెలక్రితం హైదరాబాదులో ఒక  ధర్నా జరిపాం. ధర్నా జరిగేటప్పుడే పోలీసులు  మమ్మల్ని అరెస్టు చేశారు. పోలీసు స్టేషన్లో నిలబెట్టారు. అక్కడి సిఐ లాఠీ తిప్పుతూ నన్ను కొట్టడానికి మీదకి వచ్చాడు. నాకు కొడతాడనే భయం వేసి, మానసికంగా దెబ్బలు తినడానికి సిద్ధపడ్డా. అయినా మొండి ధైర్యంతో కొన్ని చట్టాలను చెపితే సిఐ వెనకకు జంకాడు." పురుషోత్తం నవ్వుతూ నా కళ్లలోకి చూస్తూ అన్నాడు.  ఆ తర్వాత పురుషోత్తంతో పాటు కొంతమంది నాయకులు కలిసి  ప్రెస్ మీట్ పెట్టారు. ఆ రోజు సభ జరగలేదు. సభ జరగిన దానికన్నా ఎక్కువ  పబ్లిసిటీ
మాత్రం వచ్చింది. 

పురుషోత్తంతో జరిగిన 20 నిమిషాల సంభాషణ నాకు మళ్ళీ 2003 లో గుర్తుకు వచ్చింది. 2003లో అలిపిరి సంఘటన జరిగింది. అందులో అప్పటి మఖ్యమంత్రి చంద్రబాబుపై బాంబు దాడి జరిగింది. అప్పుడు పోలీసులు అక్రమంగా నిర్భంధించారు. ఏ ఎస్పి స్థాయి అధికారి నా కణతిపై ఫిస్టల్ ని పెట్టాడు.  నాకు చెమటలు ప్రవాహంలా కారుతున్నాయి. కాళ్లు వణుకుతున్నాయి. శరీరం మొద్దుమారింది. ఆశ్చర్యకరంగా నాకు మా అమ్మ, నాన్న, స్నేహితులు ఎవ్వరూ గుర్తకురాలేదు. హఠాత్తుగా 1999లో నేను మొదట కలిసిన పురుషోత్తం సన్నని చిరునవ్వు రూపం కనిపించింది. నాకు తెలీకుండానే నా మొహం మీద చిన్న నవ్వు మెరిసింది. నా ముఖకవళికలను పసిగెెట్టిన ఏ ఎస్పీ ఫిస్టల్ను క్లిక్ మనిపిచ్చాడు. అతనే వెకిలిగా నవ్వూతూ "ఇందులో తూటాలు లేవు" అన్నాడు. నిజానికి వాళ్ళు పెట్టిన చిత్రహింసల కన్నా చనిపోవడం మేలని మాకు అనిపించేది. 

ఆయనే మళ్లీ ‌"ఏరా మీలో అందరూ పురుషోత్తం మాదిరి ఫీలైపోతార్రా‌, ఏవో ఘనకార్యాలు చేసినట్టు‌. అందుకే పురుషోత్తం తల నేలమీద పడింది‌" అంటూ లాగిపెట్టి చెంపమీద ఒక దెబ్బ కొట్టాడు. తూలి కిందపడబోయిన నేను ఆయన్నే పట్టుకుని నిలదొక్కుకున్నా.

ఆ సందర్భంలో పురుషోత్తం నాకు ఎందుకు గుర్తుకు వచ్చాడో  తెలీదు కాని,  నా చావు భయాన్ని కొంచెం తగ్గించాడు. అది తాత్కాలికమే కావచ్చు. భయానకమైన నిరంతర నిర్భంధాన్ని తట్టుకోవడానికి అతను ఉపయోగ పడ్డాడు. హక్కుల  సంఘంలో తిరిగి క్రియాశీలకంగా పనిచేయడానికి కూడా అతని త్యాగం ఉపయోగపడింది. అసలు సంఘంలో పనిచేయడమంటేనే చావుకు సిద్ధపడటమేనని నాకు అప్పుడే తెలిసింది. నాకు పురుషోత్తం చనిపోయిన తర్వాతే హీరో అయ్యాడు. అతని స్ధూప ఆవిష్కరణకు అతని వూరికి వెళ్లిపోయినపుడు వేల సంఖ్యలో వచ్చిన జనాలను చూసి నేను ఆశ్చర్యపోయాను. ప్రతి ఒక్కరితో పురుషోత్తానికి సన్నిహిత సంభదం వుంది. ప్రతి వ్యక్తి కష్ట సమయంలో అతను వారికి ధైర్యాన్ని ఇచ్చాడు. ఒక సమూహానికి సాధ్యమయ్యే పని ఒక్క వ్యక్తి ఎలా సాధించాడు అనే ప్రశ్న నేను ఇప్పటికీ వేసుకుంటాను. పురుషోత్తం పరిధిని దాటి పనిచేశాడు అని, అది అతనికి చావును పరిచయం చేసిందని చాలా మంది విమర్శించారు. అది నిజం కాదని నన్ను ఇప్పటికీ సంఘంలో నిలబెట్టిన అతని మాట, ఆచరణ చెప్పింది. 

- అమన్

Comments

  1. బాగుంది. కొంతమంది పరిచయం జీవితాలను మలుపు తిప్పుతుంది అనడంలో అతిశయోక్తి లేదు.

    ReplyDelete
  2. మరపురాని మనిషి పీడిత ప్రజల హక్కుల కోసం పరితపించి నిరంతరం పోరాడిన మన పురుషోత్తం గారికి జోహార్లు

    - వెంకటేశ్వర్లు, కడప

    ReplyDelete

Post a Comment