ఫేస్ బుక్ పేచీ

 అంకిదాస్ పై మరోసారి వాల్ స్ట్రీట్ జర్నల్ కధనం

మీరు ఫేస్ బుక్ ను వాడుతున్నారా. ఎప్పుడైనా మీరు పెట్టే పోస్టులు అభ్యంతరకరంగా వుందని ఫేస్ బుక్ నుండి మెసేజ్ వచ్చిందా.   అంతేగాకుండా కొన్ని సార్లు ఫేస్ బుక్ యాజమాన్యం  మీ అకొంటును బ్లాక్లో పెట్టిందా.  ఇటువంటి ఇబ్బందికరమైన పరిణామాన్ని ప్రతిఒక్కరు ఎదుర్కునే వుంటారు. తమాషా ఏంటంటే అదే ఫేస్ బుక్ లో పోర్ను చిత్రాలు, వీడియోలు, విద్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగాలు, వీడియోలు ప్రతి ఒక్కరు చూస్తూనే వుంటారు. వాటిపై ఫేస్ బుక్ ఎటువంటి చర్యలు చేపట్టదు. నిజంగా చర్యలు చేపట్టివుంటే అవి ప్రజలకు ఆ పోస్టులు కనబడకుండా వుండాలి కదా. ఫేస్ బుక్ పాటిస్తున్న ఈ ద్వంద్వ ప్రమాణాలకు కారణాన్ని అమెరికన్ పత్రిక  వెల్లడించింది. దీంతో ఫేస్ బుక్ పౌరుల హక్కులను కాలరాస్తుందని భారత ప్రజలు మండిపడుతున్నారు. నిషేధిత సాహిత్యం వుందనే భారత్లో చాలామందిపై ఊపా కేసులు పెడుతున్నారు. ప్రజాస్వామ్యబద్దంగా వుంటూ ప్రత్యామ్నాయ భావజాలాన్ని ప్రచారం చేస్తున్న చాలా సంస్ధల్ని భారత ప్రభుత్వం నిషేధించింది. 

అదే భారత ప్రభుత్వం ఫేస్ బుక్ పై అనేక ఆరోపణలు వచ్చినా, అవి రుజువైనా పేస్ బుక్ ను ఎందుకు నిషేధించడం లేదు. సమాధానం చాలా చిన్నది. ఎందుకంటే భారత్లో నడుస్తున్నది డిజిటల్ విప్లవాలు. ఒక వ్యక్తి రాత్రే హీరో అయిపోతాడు. పెద్ద సెలబ్రిటీ ఒక్కరోజులోనే అసాంఘీక శక్తిగా మారిపోతాడు. విజయ శిఖరాలను అధిరోహించడానికి దశాబ్దాలు పడితే సోషల్ మీడియా వల్ల అది 24 గంటల్లో జరిగిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా జాస్మిన్ ఉద్యమాలు, మీటూ, రెడ్ స్పాట్ లాంటి చాలా ఉద్యమాలు సోషల్ మీడియా ద్వారా జరిగినవే. అటువంటి సోషల్ మీడియాలో ప్రముఖమైన, ప్రధాన పాత్ర నిర్వహించేది ఫేస్ బుక్. సోనూసూద్ దేశ ప్రధాన మంత్రికన్నా ఎక్కవుగా మీడియాలో కనిపిస్తాడు. సెల్ బ్రిటీ సుశాంత్ రాజ్ ఫుట్ అనుమానాస్పద మృతి వద్దనా మీడియాలో కనిపిస్తుంది. 

ఫేస్ బుక్ పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని దొంగలించి అమ్ముకుంటుంది. ఇది పౌరుల గోప్యత హక్కుకు ‌విఘాతం కలిగిస్తుంది. పౌరుల వ్యక్తిగత అభీష్టాలు బహిర్గతం కావడం వల్ల పౌరుల ప్రాధమిక స్వేచ్ఛ దెబ్బతింటుంది. వారు అభద్రతా భావంలో గడపవలసి వస్తుంది. పేస్ బుక్ భారతదేశంలో బిజేపికి అనుకూలంగా వ్యవహరిస్తోంది. అంటే బిజేపి కార్యకర్తలు పెట్టే ఎటువంటి పోస్టులనైనా అది డిలీట్ చేయదు. అదే బిజేపికి వ్యతిరేకంగా పెట్టే ఏ పోస్టునైనా దేశభద్రత రీత్యా డిలీటు చేస్తున్నట్టు ప్రకటిస్తుంది. అంతేగాక సదరు యూజరు అక్కౌంటును బ్లాక్ లో పెడుతుంది. భారతదేశంలో బిజెపి నాయకులకు ఫేస్బుక్ తన ద్వేషపూరిత ప్రసంగ నియమాలను వర్తింపజేయడాన్ని విస్మరించిందని వాల్ స్ట్రీట్ జర్నల్ లో  ఒక నివేదిక వచ్చింది. ఈ నివేదిక అధికార బిజెపి,  ఫేస్బుక్ల మధ్య వున్న సంబంధాలపై మరోసారి చర్చను లేవనెత్తింది. 

  ద్వేషపూరిత ప్రచారంలో పాల్గొనే బిజెపి రాజకీయ నాయకులపై శిక్షాత్మక చర్యలను ప్రారంభించడం వల్ల భారతదేశంలో ఫేస్ బుక్  "వ్యాపార అవకాశాలను" దెబ్బతీస్తుందని  భారతదేశ ఫేస్‌బుక్  పబ్లిక్ పాలసీ డైరెక్టర్ అంకి దాస్ పేర్కొన్నట్టు భారతదేశంలో ఫేస్‌బుక్ కార్యకలాపాలపై  న్యాయమైన దర్యాప్తు జరపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఫేస్ బుక్ బిజేపి పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తుంది అనడానికి అనేక ఆధారాలు వున్నాయి. అందులో ముఖ్యమైన వాటిని పరిశీలిద్దాం. బిజేపి కార్యకర్తలు పెట్టే ముస్లిం వ్యతిరేక పోస్టులను ఫేస్ బుక్ అనుమతిస్తోంది. ఉదాహరణనికి కరోనా నేపధ్యంలో ఢిల్లీలోని మర్కజ్ మసీదులోని ముస్లీంల వల్లే భారత్లో కరోనా వేగంగా వ్యాప్తి చెందిందని పేస్ బుక్ లో విశృంఖలంగా పోస్టులు పెట్టారు. వాటిని ఫేస్ బుక్ అనుమతించింది.   భారత ప్రభుత్వంతో తన వాణిజ్య సంబంధాలన్ని  నాశనం చేయకుండా ఉండటానికి ఫేస్ బుక్ కంపెనీ అలా చేసిందని వాల్ స్రీట్ జనరల్ నివేదిక పేర్కొంది.

 కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ, ఓటర్లను ప్రభావితం చేయడానికి ఫేస్బుక్,  వాట్సాప్ ను బిజేపి ఉపయోగించుకుందని చెప్పాడు. బిజెపి, ఆర్ఎస్ఎస్ "నకిలీ వార్తలను" ఫేస్ బుక్ ద్వారా వ్యాప్తి చేశారని చాలా రాజకీయ పార్టీలు ఆరోపించాయి. "బిజెపి, ఆర్ఎస్ఎస్ భారతదేశంలో ఫేస్బుక్, వాట్సాప్ను నియంత్రిస్తాయి.  వారు దాని ద్వారా నకిలీ వార్తలను, ద్వేషాన్ని వ్యాప్తి చేసి ఓటర్లను ప్రభావితం చేయడానికి ఉపయోగిస్తున్నారని కాంగ్రేస్ ఆరోపించింది. ఈ నిజాలను వాల్ స్ట్రీట్ జనరల్ బయట పెట్టిందని ఆ పార్టీ పేర్కొంది.

 అయితే కాంగ్రెస్ కూడా ఎన్నికలకు ముందర  కేంబ్రిడ్జ్ అనలిటికాతో సంబంధాలను నెరిపింది.  "ఎన్నికలకు ముందు భారత ప్రజల  డేటాను తీసుకోవడానికి  కేంబ్రిడ్జ్ ఎనలిటికా, ఫేస్‌బుక్‌లతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుందని బిజేపి ఆరోపించింది.   ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో ఫేస్‌బుక్ వినియోగదారులు భారతదేశంలో ఉన్నారు.  ఫేస్‌బుక్  రిలయన్స్ జియోలో రూ .40,000 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టింది. 2017 డిసెంబర్‌లో బ్లూమ్‌బెర్గ్ ఫేస్‌బుక్ గురించి రాసింది. బ్లూమ్‌బెర్గ్ ప్రకారం, ఫేస్ బుక్ కమిటీ భారతదేశం, బ్రెజిల్, జర్మనీ, బ్రిటన్ వంటి  దేశాలలో కొన్ని రాజకీయ పార్టీలకు సహాయం చేస్తోంది.  2014 లో మోడీ విజయం సాధించిన తరువాత, అంకిదాస్ 'క్వార్ట్జ్' పత్రికలో  మోడీకి అనుకూలంగా వ్యాసం రాశాడు.   2018 లో ఫేస్‌బుక్ వాట్సాప్‌ను సుమారు రూ .1,50,000 కోట్లకు కొనుగోలు చేసింది. 

ముస్లిం కరోనా వైరస్ వ్యాప్తి, లవ్ జిహాద్ ప్రచారం లాంటి ద్వేషపూరిత ప్రచారాల కోసం ఫేస్ బుక్, వాట్సాప్ లను బిజేపి వాడుకుంటోంది. 2019 ఎన్నికలకు కొన్ని రోజుల ముందు, ఫేస్బుక్ "అధికారికంగా ధృవీకరించబడనందున పాకిస్తాన్ మిలిటరీతో సంబంధాలు ఉన్న కాంగ్రెస్ పార్టీ పోస్టులను నిలిపివేస్తున్నట్లు" ప్రకటించింది.  భారతీయ ముస్లింలు క్షీణించిన సమూహం అని అంకిదాస్ తన సొంత పేజీలో పోస్ట్ చేసారు. తెలంగాణకు చెందిన బిజెపి శాసనసభ్యుడు టి రాజసింగ్, కర్ణాటకకు చెందిన బిజెపి ఎంపి అనంతకుమార్ హెగ్డే, ఢిల్లీ బిజెపి ఎంపి కపిల్ మిశ్రా ద్వేషపూరిత ప్రసంగాన్ని స్పష్టంగా పోస్ట్ చేసినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ కనుగొంది. ఆవులను తిన్న ముస్లింలను చంపేస్తానని రాజసింగ్ బెదిరించాడు. రోహింగ్యాలను కాల్చి చంపాలని అనుకున్నానని రాజాసింగ్ పోస్టు చేశాడు. అరోంత్ హెగ్డే 'కరోనా జిహాద్' కార్టూన్లను ముస్లింలు కరోనా వ్యాప్తి చేస్తున్నట్లు చిత్రీకరించారు. ఢిల్లీ ఘర్షణలు చెలరేగడంలో కపిల్ మిశ్రా పాత్ర చాలామందికి తెలుసు.  

 గూగుల్, ఫేస్‌బుక్, అమెజాన్, ఆపిల్  మైక్రోసాఫ్ట్ వంటి డిజిటల్ సంస్ధలు ప్రభుత్వాల కన్నా ఎక్కువ శక్తిని కలిగి వున్నాయి. పెట్టుబడిదారీ సమాజంలో, ప్రకటనల ఆదాయం మీడియాను సజీవంగా ఉంచుతుంది.  వైరల్ పోస్టుల వల్ల ఫేస్‌బుక్ ప్రకటన ఆదాయం పెరుగుతుంది.  మీడియా వ్యాపారం  ప్రజాస్వామ్యాన్నితీవ్రంగా  ప్రభావితం చేస్తుంది.

గూగుల్, అమెజాన్, ఫేస్‌బుక్, ఆపిల్  కంపెనీల షేర్ల మార్కెట్ విలువ  300 లక్షల కోట్లు. ఇది జర్మనీ జిడిపి కన్నా ఎక్కువ. భారత జిడిపి కేవలం 200 లక్షల కోట్లు మాత్రమే. అందువల్లే వాళ్లు జాతీయ ప్రభుత్వాలను శాసించగలరు.  ఫేస్‌బుక్ ఆదాయంలో 98.5 శాతం ప్రకటనల ద్వారా వస్తుంది. ఫేస్‌బుక్‌ వ్యాపార ప్రయోజనాలు మాత్రం ఎక్కువగా వైరల్‌ అయ్యే పోస్టులతోనే ముడిపడి వున్నాయి.  గూగుల్‌, యూట్యూబ్‌ లు అంతే. అందుకే పోర్ను వీడియోలు మన దేశంలో నిషేధించిన అవి అన్ని సోషల్ మీడియోలో విచ్చలవిడగా కనిపిస్తాయి.  టి.వి చానెళ్ళలో ఫ్యాక్సు న్యూస్‌ (అమెరికా), రిపబ్లిక్‌ టి.వి (ఇండియా) పూర్తిగా అధికార పార్టీవే.  న్యూట్రల్ గా వున్నట్టు కనిపిస్తున్న ఫేస్ బుక్ అధికార పార్టీకి తొత్తుగా పనిచేస్తూ తన స్వ ప్రయోజానాలను నెరవేర్చుకుంటుంది.  

 సోెషల్ మీడియా కంపెనీల  గుత్తాధిపత్యాన్ని ప్రశ్నించాలి. అవి ప్రజల కోసం పనిచేసే సంస్ధలుగా మారాలి. అలా మారాలంటే వ్యవస్ధ మారాలి. పెట్టుబడిదారీ సమాజంలో సమాచారమే అత్యంత ఖరీదైన సరుకు. ఈ సరుకు మీద ఆధారపడి ప్రజల దైనందిన కార్యక్రమాలు నడుస్తాయి. అయితే ఇది కల్తీ సరుకును ఎక్కువుగా ప్రజలకు అందిస్తోంది. ప్రజలు జాగూరకతతో వుండాలి. వారి హక్కలను వారే కాపాడుకోవాలి. 


Comments