దార్శనికుడు పురుషోత్తం

 Tekuri Karnam Purushottam Rao – HRD Memorial

 1991 మే నెలలో నేను గుంటూరు జిల్లా పౌర హక్కుల సంఘం ఉపాధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించాను. అప్పటికీ పురుషోత్తం పౌరహక్కుల సంఘం మహబూబ్ నగర్ జిల్లా యూనిట్ లో ఉండేవాడేమో గానీ రాష్ట్ర బాధ్యతల్లోకి  రాలేదు. పురుషోత్తం సంస్థలోకి వచ్చేనాటికి సంస్థ అనేక సవాళ్లను ఎదుర్కుంటోంది.

07-12 -1991వతేదీ  పౌరహక్కుల సంఘం వరంగల్ జిల్లా కన్వీనర్ ప్రభాకర్ రెడ్డిని, అతని ఇంటిలోనే గుర్తు తెలియని పోలీసులు తుపాకులతో కాల్చి చంపారు.  హయగ్రీవాభారీ అనే కాంగ్రెస్ నాయకున్ని పీపుల్సు వార్ పార్టీ కార్యకర్తలు తుపాకులతో కాల్చి చంపారు.  దానికి ప్రతీకారంగా ప్రభుత్వం ఈ హత్య చేయించింది. తర్వాత 1998 ప్రారంభంలో ఖమ్మంలో పౌరహక్కుల సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది.  నక్సలైట్ హింసాత్మక చర్యలకు హక్కుల సంఘ కార్యకర్తలు బలవుతున్నారు అనే ఉద్దేశం సమావేశంలో కొంతమంది వ్యక్తీకరించడం జరిగింది. అప్పటి పరిస్ధితుల్లో పీపుల్స్ వార్ పార్టీ హింసాత్మక చర్యలన్నింటిని పౌరహక్కుల సంఘం ఖండించాలనే తీర్మానం సమావేశంలో చేశారు. నిజానికి   ఇది  పౌరహక్కుల సంఘం విధానపరమైన నిర్ణయం. దీన్ని రాష్ట్ర మహాసభల్లో మాత్రమే నిర్ణయించాల్సి ఉంది. ఆ సమయంలో కన్నాభిరాన్ అధ్యక్షులు గానూ, బాలగోపాల్ కార్యదర్శిగా ఉన్నారు. 1998వ సంవత్సరంలో బాలగోపాల్ పౌరహక్కుల సంఘం నుండి విడిపోయారు. తర్వాత మానవ హక్కల వేదికను ఏర్పాటు చేశారు.  బాలగోపాల్ తో పాటు వెళ్ళిపోయిన ప్రధానమైన వ్యక్తులంతా "ఖమ్మం"  తీర్మానానికి అనుకూలంగా  ఉన్నారు. 1992 నుండి 1998 వరకు ప్రభుత్వేతర  హింస పై చాలా ప్రజాస్వామ్యయుతంగా అంతర్గత చర్చ జరిగింది. సంస్థ స్వయంగా చర్చలకు సంబంధించిన వ్యాసాలతో కూడిన పుస్తకాన్నివేసింది. జిల్లాల వారీగా చర్చ జరిపింది. ఈ చర్చలో దాదాపు అన్ని జిల్లా యూనిట్లకు పురుషోత్తం హాజరయ్యారు. ఈ కాలంలోనే పూర్తికాలం పౌరహక్కుల సంఘం కార్యాచరణలో పురుషోత్తం నిమగ్నమయ్యాడు. 

ఉమ్మడి రాష్ట్రంలో పౌరహక్కుల సంఘం అన్ని యూనిట్లను బలపరచడానికి పురుషోత్తం కార్యాచరణ ఎంతో దోహదం చేసింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల భాద్యులు, ముఖ్య కార్యకర్తలతో నిరంతరం ఫోన్ సంబంధాలు పురుషోత్తం నెరిపేవారు. ప్రత్యక్ష సంబంధాలులో ఉంటూ నెలవారి జిల్లా కార్యక్రమాలు అమలు కావడం గురించి కూడా శ్రద్ధ పెట్టేవారు. కనీసం 15 రోజులకు ఒకసారైనా అన్ని జిల్లాల వారితో సంఘ  కార్యక్రమాల గురించి మాట్లాడేవారు. సంఘ బాధ్యులను   ప్రోత్సహించేవారు. ప్రతి కార్యకర్త,  బాధ్యుడు కూడా పురుషోత్తం నుండే చాలా స్ఫూర్తి పొందారు.  పురుషోత్తం వివాద రహితుడు. పురుషోత్తం లోని అంకితభావం,  నిర్మాణాత్మక కార్యాచరణ,  పూర్తికాలం సంఘం కోసం చేసే చొరవ, ధైర్యం పౌరహక్కుల సంఘ నిర్మాణానికి చోదకశక్తిగా పని చేసింది.

1993 నుండి 1998 మధ్యకాలంలో పురుషోత్తం తన కార్యాచరణను మరింత విస్తృుత పరిచాడు. 1994 కర్నూల్ రాష్ట్ర మహాసభలు,  1996 మహబూబ్ నగర్ రాష్ట్ర మహాసభలు, 1998  రాష్ట్ర మహాసభల్లో పురుషోత్తం కార్యాచరణను దగ్గరగా పరిశీలించిన వారందరు అతన్ని చూసి స్ఫూర్తి పొందారు. 1998 అక్టోబర్ లో హైదరాబాద్ లో జరిగిన రాష్ట్ర మహాసభలలో బాలగోపాల్ ప్రస్తుత మానవహక్కుల వేదిక బాధ్యులంతా సంఘ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. పురుషోత్తమే రాష్ట్ర సహాయ కార్యదర్శిగా బాధ్యతల్రోకి  వచ్చారు. నేను ఉపాధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించాను. పురుషోత్తమే స్వయంగా  ప్రతి  బాధ్యుడి , కార్యకర్త గురించి ఎంత నిశితంగా ఆలోచించే వాడే చెప్పడానికి ఒక ఉదాహరణ  చెప్తాను.

1998 అక్టోబర్, రాష్ట్ర మహాసభల కోసం హైదరాబాదుకు వారం రోజులు ముందుగానే వచ్చి మేమంతా అన్ని కార్యక్రమాల్లో భాగస్వాములు అయ్యాము. పురుషోత్తం అన్నీ తానే అయి అన్ని కార్యక్రమాల్లో భాగస్వామి అయ్యాడు.  సభలు విజయవంతంగా ముగిసాయి. అదే రోజు రాత్రి ఇంటికి వెళదామని నేను బ్యాగు సర్దుకుంటున్నాను. పురుషోత్తం వెతుక్కుంటూ  నా దగ్గరకు వచ్చి అన్నా ఈరోజు రాత్రి నీతో మాట్లాడాలి అన్నారు. అప్పటికే వచ్చిన వారం అయింది నాకేమో వెళ్లాలనే ఉంది. కానీ పురుషోత్తం అడిగితే కాదు అనలేక ఆగిపోయాను. అప్పట్లో నేను గుంటూరు కు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న వినుకొండలో న్యాయవాదిగా  ప్రాక్టీస్ చేసేవాడిని. అన్నీ కార్యకలాపాలు ముగించుకుని రాత్రి సుమారు 11 గంటల 30 నిమిషాలకు పురుషోత్తం నా దగ్గరకు వచ్చాడు.  అన్నా నీవు రాష్ట్ర బాధ్యత లోకి వచ్చావు. నీ ప్రాక్టీస్ గుంటూరు జిల్లా కోర్టుకు మార్చితే బాగుంటుందని కోరాడు. ఈ ఆలోచన నాకు ఎప్పుడూ రాలేదు. మా రాష్ట్ర బాద్యుల్లో మరెవ్వరికీ రాలేదు.  ఆ ఆలోచన ఒక పురుషోత్తంకి వచ్చింది. అది కూడా మహాసభల పని ఒత్తిడి ముగియకముందే.  నేను ఆలోచించుకుని చెబుతానని పురుషోత్తంతో చెప్పి ఉదయమే వినుకొండ  బస్సు ఎక్కాను.  వినుకొండలో పెద్ద న్యాయవాదిగా నాకు పేరుంది. మంచి ప్రాక్టీసు వుంది. అలాంటిది, పురుషోత్తం మాటతో నెల రోజుల్లో మొత్తం ప్రాక్టీసు వదిలి గుంటూరు లో ఆఫీసు ప్రారంభించాను. నిజానికి ఆ నిర్ణయం నా జీవితంలో చాలా ముఖ్యమైన మలుపుకు దారితీసింది.  పురుషోత్తం పరిశీలన ఎంత నిశితంగా ఉంటుందో చెప్పడానికే మచ్చుకు ఇది ఒక ఉదాహరణ మాత్రమే. 

  23 -11 -2000 ఉదయం గుంటూరులో మా ఇంట్లోనే వున్నా. శేషయ్య  కూడా మా ఇంట్లోనే ఉన్నారు. అప్పడు సెల్ ఫోన్లు మా దగ్గర లేవు. శేషయ్య, నేను పురుషోత్తంతో మాట్లాడానికి  ఎస్టీడి భూత్ కి వెళ్లి అతనితో ఇద్దరం మాట్లాడాము.  తర్వాత శేషయ్య విజయవాడ వెళ్లారు. నేను కోర్ట్ కి వెళ్లాను. మధ్యాహ్నం తిరిగి ఇంటికి వచ్చేసరికి పురుషోత్తం కిరాయి హంతక ముఠాలచే చంపబడ్డాడనే వార్త వినాల్సి వచ్చంది.   "పురుషోత్తం హత్య" ద్వారా హక్కుల ఉద్యమాన్ని రాజ్యం అణచలేకపోయింది. అయితే పురుషోత్తం లేని లోటు ఇప్పటికీ సంఘంలో కనిపిస్తూనే వుంది. 

- రాజారావు, అడ్వకేటు, గుంటూరు

Comments

  1. పురుషోత్తం కృషి సంఘ నిర్మాణానికి ఎంతో తోడ్పడింది. అతన్ని గురించి సంఘంలో తెలిసిన వారు ఇంకా రాస్తే బాగుంటుంది.

    కార్యకర్తలకు ఉత్సాహపూరితంగా ఉంటుంది.

    ఎం. కె. కుమార్

    ReplyDelete
  2. మంచి సమాచారం ఇచ్చారు ...🙏🙏...అన్న తో కలిసి తిరిగి నడిచిన వారు చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా రాస్తే. బాగుంది. ముఖ్యంగా. పాలమూరు జిల్లాకు చెందిన వారు. అన్నతో కలిసి వారు చాలా మంది ఉన్నారు. నేను కొంతమంది వ్యక్తు మాటలు విన్న. కాని వారు రాస్తే. బాగుంటుంది. ఎందుకంటే .ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఇలాంటి వారి చరిత్ర

    ReplyDelete

Post a Comment