మనదేశం ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం అని చెపుతుంటారు. ప్రజాస్వామ్యంలో చట్టం అందరికీ సమానంగా వర్తించాలి. అందరికీ సమాన అవకాశాలుండాలి. మరి ఆచరణలో జరుగుతున్నదేమిటి?
రైతులు బ్యాంకుల నుండి పంటరుణాలు తీసుకుని తీర్చలేకపోతే బ్యాంకులు వారి ఆస్తులను బహిరంగంగా వేలం వేసి అయినా బాకీలు వసూలు చేసుకుంటాయి. కానీ కార్పొరేట్ సంస్థల యజమానులు వేల కోట్ల రూపాయల అప్పు ఎగ్గొడితే మాత్రం కనీసం వారి పేర్లను బహిరంగంగా ప్రకటించడానికి కూడా బ్యాంక్ లు సిద్ధపడవు. మరి చట్టం పేదరైతులు, కార్పొరేట్ సంస్థల యజమానులకు సమానంగా వర్తించదా? దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉండి ఒకవైపు కోట్లాది మంది ఉపాధి కోల్పోయి బ్రతుకులు ఛిద్రమైపోతూంటే మరొకవైపు అంబానీ అదానిల ఆస్తులు ఎగబ్రాకుతున్నాయి.
గ్రామాల్లో దళితులకు దేవాలయ ప్రవేశం లేదు. దళితులు వివాహ వేడుకలో భాగంగా గుర్రమెక్కినందుకు, పొరబాటున అగ్రకులాల పొలంలో మూత్ర విసర్జన చేసినందుకు, నాలుగు మామిడి పళ్లు కోసుకున్నందుకు, ఇలా అతి చిన్న విషయాలకు కూడా కిరాతకంగా హత్య కావించబడుతున్నారు. కులవివక్ష, లింగ వివక్షలను రాజ్యాంగంలో నిషేధించినప్పటికీ దళితులపైన, స్త్రీల పైన వివక్ష, దాడులు ఇంత విచ్చలవిడిగా ఎలా సాధ్యం అవుతున్నాయి? రాజ్యాంగం అమల్లోకి వచ్చిన ఏడు దశాబ్దాలతర్వాత కూడా సమాజంలో అసమానతలు, అణిచివేత పెరిగాయే కానీ తగ్గలేదు. ఈ పరిస్థితి మన దేశంలోనే కాదు. ప్రజాస్వామ్య దేశాలుగా చెప్పబడుతున్న ఇతర దేశాల్లో కూడా అసమానతలు అణిచివేతలు ఉన్నాయి. అసమానతలను నిర్మూలించడం కేవలం చట్టాలతోనే సాధ్యం కాదని వ్యవస్థ మూలాల్లోనే అసమానతలకు పునాది ఉందని అర్థమవుతుంది.
సమాజంలో అసమానతలకు, అణిచివేతకూ ఉండే మూలం ఏమిటో పరిశోధించి దానికి పరిష్కార మార్గాన్ని కూడా కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఎంగెల్స్ అనే ఇద్దరు మహనీయులు ప్రపంచానికి తెలియచేశారు. వారి సిద్ధాంతమే మార్క్సిజం లేదా కమ్యూనిజం. ఈ సిద్ధాంతాన్ని తరువాతి కాలంలో లెనిన్, మావో సెటుంగ్ లాంటి వారు వారి దేశ కాల పరిస్థితులకు తగినట్లుగా అభివృద్ధి చేశారు. మార్క్సిజం ప్రపంచ వ్యాప్తంగా జరిగిన విముక్తి ఉద్యమాలు, స్త్రీ విముక్తి ఉద్యమం, పర్యావరణ ఉద్యమం ఇలా అనేక ఉద్యమాలకు స్ఫూర్తినిచ్చింది. కళలు, సాహిత్యం, ఆర్థిక శాస్త్రం, తత్వ శాస్త్రం ఇలా సమాజంలోని అన్ని రంగాలపై ప్రభావం చూపింది.
అయితే రష్యా, చైనాల్లో నెలకొన్న పరిస్థితులు చూపి మార్క్సిజం చెప్పే సమసమాజం ఆచరణ సాధ్యంకాని విషయంగా కొట్టిపడేసే వారున్నారు. సమాజ గమనం సరళ రేఖలాగా ఒడిదుడుకులు లేకుండా సాగాలని ఆశించడంలో తప్పు లేదు. కానీ సమాజ గమనం ఒడిదుడుకులతోనే ముందుకు సాగుతుందనేది చరిత్ర నేర్పిన పాఠం. నిరంకుశ రాచరికానికి వ్యతిరేకంగా యూరప్ దేశాల్లో బూర్జువా ప్రజాస్వామిక విప్లవాలు జరిగాయి. ఇంగ్లండ్ లోను, ఫ్రాన్స్ లోను రాజులను హత్య చేశారు. అయినా కూడా ఆ విప్లవాల అనంతరం ప్రజలు తిరిగి రాచరికాలను తెచ్చుకున్నారు. అంతమాత్రాన బూర్జువా ప్రజాస్వామిక విప్లవాలు విఫలమైనాయని చెప్పగలమా? ఆ తరువాత కాలంలో రాచరికాలు అంతరించి ప్రజాస్వామిక రిపబ్లిక్ లు ఏర్పడటం చూసాం కదా.
రష్యా చైనా ప్రజలకు మార్క్సిజం పట్ల లోతైన అవగాహన లేకపోవడం వల్ల విప్లవానంతర కాలంలో విద్రోహ శక్తుల కుట్రలను అర్థం చేసుకోలేక మోసపోయారు. దోపిడీ, అణిచివేత లేని సమాజం సాధించుకోవడమైనా, సాధించుకున్నదాన్ని నిలబెట్టుకోవడమైనా కొద్దిమంది నాయకులకో లేదా సంస్థకో పరిమితమైన విషయం కాదు. ప్రజల జీవితాలకు సంబంధించిన విషయం. కాబట్టి మార్క్సిస్టు సిద్ధాంతం అశేష ప్రజల చేతుల్లో ఆయుధం కావాలి. అప్పుడు మాత్రమే ప్రగతి వ్యతిరేకుల కుట్రలను ఓడించి సమసమాజ నిర్మాణానికి బాటలు వేయగలరు. రష్యా చైనా అనుభవాల నుండి మనం నేర్చుకోవాల్సిన గుణపాఠం ఇదే.
మార్క్సిజం సామాజిక మార్పులను విశ్లేషించే శాస్త్రీయ సిద్ధాంతం. అది ఒక మతం లాగా జడాత్మకమయినది (dogma) కాదు. స్థల కాల పరిస్థితులను బట్టి ఆయా నిర్దిష్ట పరిస్థితులకు తగినట్లుగా మార్క్సిజాన్ని అన్వయించుకోవాల్సి ఉంటుంది. సిద్ధాంతం పట్ల స్పష్టమైన అవగాహన కలిగి వుండి, కార్యాచరణలో ఉన్నపుడే సరైన విధంగా అన్వయించుకోగలం. దోపిడీ అణిచివేతలు లేని సమాజం కోరుకునేవారు తప్పనిసరిగా మార్క్సిజం మూల సిద్ధాంతాన్ని లోతుగా అధ్యయనం చేయవలసిన అవసరం ఉంది. మార్క్సిస్టు మూల గ్రంధాలను చదవడానికి ముందుగా మార్క్సిజం స్థూల పరిచయం ఉంటే అధ్యయనం సులువవుతుందనే ఉద్దేశ్యంతో వ్యాసాలు మీ ముందు పెడుతున్నాను. వ్యాసాలు ఏ మేరకు ఉపయోగకరంగా ఉన్నాయో అవి చదివాక పాఠకులు చెప్పాలి.
నాగరికతకు ముందటి సమాజం
మార్క్సిజం సామాజిక పరివర్తనకు సంబంధించిన సిద్ధాంతం కనుక మన అధ్యయనం మానవ సమాజ పరిణామాన్ని తెలుసుకోవడంతో మొదలు పెడదాం. ఇతర జీవులతో పోల్చినపుడు మనిషి చాలా ప్రత్యేకత కలిగిన జీవి. పశువులు, పక్షులు ఇవన్నీ వాటి అవయవాలను ఉపయోగించి ప్రకృతినుండి తమ జీవన అవసరాలను సమకూర్చుకుంటాయి. కానీ మానవులు అలా కాదు. ముందుగా కొన్ని పనిముట్లను (పరికరాలను) తయారు చేసుకుని వాటిని ఉపయోగించడం ద్వారా ప్రకృతి వనరులనుండి తన జీవన అవసరాలను సమకూర్చుకుంటారు. పనిముట్లను తయారు చేసుకోవడానికన్నా ముందుగా వాటిని తమ ఆలోచనల్లో రూపకల్పన (design) చేసుకోగలరు. తయారు చేసిన పనిముట్లను ఉపయోగించే క్రమంలో వాటి లోపాలు గ్రహించి ఆ లోపాలను సరిదిద్ది మరింత మెరుగైన పనిముట్లను రూపొందించుకోగలరు.
మానవులు వాడే పనిముట్లలో వచ్చిన అభివృద్ధి వారి జీవన విధానంలోను, సామాజిక సంబంధాలలోను మార్పులు తెచ్చింది. మొదటి దశలో వారు వాడిన పరికరాలు చాలా ప్రాథమిక స్థాయికి చెందినవి. ఆ దశలో మానవులు గణాలుగా అంటే చిన్న చిన్న సమూహాలుగా జీవించే వారు. ఒక గణంలో ఆరోగ్యంతో ఉండి పని చేయగల స్త్రీ పురుషులందరూ తమ పనిముట్లతో వెళ్లి ఆహారం సేకరించుకుని వచ్చేవాళ్ళు. వేట, చేపలు పట్టడం, పళ్ళు దుంపలు సేకరించడం ద్వారా ఆహారాన్ని సేకరించేవారు. అలా సేకరించిన ఆహారంతో గణ సభ్యులందరూ కలసి తమ ఆకలి తీర్చుకునే వారు. సేకరించిన ఆహారం గణ సభ్యులు తినగా మిగిలితే దాన్ని సమీప భవిష్యత్తు అవసరాల కోసం భద్రపరచడంలో స్త్రీల పాత్ర ప్రధానంగా ఉండేది. పెళ్లి, కుటుంబం అప్పటికి ఇంకా ఉనికిలోకి రాలేదు కాబట్టి గణం లోని పిల్లలకు కేవలం తల్లి మాత్రమే తెలిసే పరిస్థితి ఉండేది. తమ తండ్రి ఎవరో తెలిసేది కాదు. పిల్లలు తల్లి సంరక్షణలోనే పెరిగేవారు. ఈ విధంగా గణసమాజంలో స్త్రీలు ముఖ్య పాత్ర పోషించారు. అందువల్ల ఆనాటి సమాజంలో స్త్రీలకు సముచిత హోదా ఉండేది. వారు తమ గణాలకు నాయకత్వం వహించేవారు కూడా. స్త్రీల నాయకత్వం కొనసాగిన సామాజిక దశను మాతృ స్వామ్య దశ అంటారు. గణం లోని వారందరూ సమిష్టి ప్రయోజనాల కోసం పరస్పర సహకారంతో జీవించే వారు. శ్రమ చేయగలిగే వారంతా శ్రమ చేసి వచ్చే ఫలితాన్ని శ్రమ చేయలేని వారితో సహా గణసభ్యులు అందరూ సమిష్టిగా అనుభవించే వారు. నాయకత్వం వహించింది స్త్రీలైనా, పురుషులైనా వారికి తమ సమూహ ప్రయోజనం తప్ప సొంత ప్రయోజనమేమీ ఉండేది కాదు. ఈ సామాజిక దశను మార్క్స్, ఎంగెల్స్ ఆదిమ కమ్యూనిస్టు సమాజం అన్నారు.
ఒక గణంలో జనం పెరిగేకొద్దీ దాన్నుండి మరికొన్ని క్రొత్త గణాలు ఏర్పడేవి. ఇలా ఒకే కుదురు నుండి ఏర్పడిన గణాల మధ్య ఉండే రక్త సంబంధం వల్ల ఆ గణాలన్ని సమన్వయంతో మెలిగేవి. ఇలాంటి గణసముదాయాన్ని ఒక తెగగా వ్యవహరిస్తారు. తెగనాయకుడు తెగ సమిష్టి ప్రయోజనాల కొరకు గణ పెద్దలతో కలిసి నిర్ణయాలు తీసుకునేవాడు. ఇతర తెగలతో ఘర్షణ వచ్చే సందర్భాల్లో తెగ సభ్యులంతా కలసి తమ తెగ గెలుపు కోసం పోరాడేవారు.
వివిధ తెగలు సంచార జీవనం గడుపుతూ క్రమంగా పశువులను మచ్చిక చేసి పశువుల మందలను కాయడం నేర్చుకున్నారు. పశువుల పెంపకంతో వారికి పాలు, మాంసం సమృద్ధిగా లభించాయి. పశువుల పెంపకంతో పాటే వ్యవసాయం కూడా నేర్చుకున్నారు. నాగలితో దున్నటం లాంటి శారీరక దారుఢ్యము అవసరమయ్యే పనుల కారణంగా వ్యవసాయంలో పురుషులు ప్రాధాన్యత వహించారు. మొదట్లో సంచార వ్యవసాయం చేసేవారు. కొన్నేళ్ళు ఒకే చోట వ్యవసాయం చేసాక అక్కడ భూసారం తగ్గగానే మళ్లీ కొత్త చోట వ్యవసాయం ప్రారంభించేవారు. పశువుల పేడ ఎరువుగా వాడడం నేర్చుకున్నాక ఒకచోట స్థిరపడి వ్యవసాయం చేయడం ప్రారంభమయ్యింది. ఈ విధంగా వారు ఆహార సేకరణ దశ నుండి క్రమంగా ఆహార ఉత్పత్తి దశకు చేరుకున్నారు. వారు తమ అవసరానికి మించి ఆహారం ఉత్పత్తి చేయగలిగారు. అంటే మానవ సమూహాలు మిగులు ఉత్పత్తి సాధించగలిగాయి. మానవులు గతంలో వాడిన రాతి పనిముట్లు, విల్లంబులు లాంటి పనిముట్ల కన్నా మెరుగైన నాగలి లాంటి పనిముట్లు తయారు చేసుకో గలిగారు కనుకనే మిగులు ఉత్పత్తి సాధ్యమయ్యింది.
మిగులు ఉత్పత్తి మానవ సమాజం లో ఒక ముఖ్యమైన మలుపు. ఈ మిగులు ఉత్పత్తిని ఎవరు సొంతం చేసుకోగల్గితే వారు శ్రమలో పాల్గొనాల్సిన అవసరం వుండదు. ఇతర తెగలతో జరిగే యుద్ధాలలో బందీలుగా చిక్కిన వారిని బానిసలుగా చేసుకొని వారితో శ్రమ చేయించి మిగులు ఉత్పత్తిని పిండుకోవడం మొదలయ్యింది. ఆ విధంగా యుద్ధంలో గెలిచిన వారు బానిస యజమానులయ్యారు. బానిసల శ్రమతో వారి యజమానులు వక్తిగత ఆస్తిని కూడబెట్టుకోవడం మొదలయ్యింది. శ్రమ చేయకుండా బానిసల శ్రమను దోచుకోవడం మీద ఆధారపడి బ్రతికే యజమాని వర్గం, బానిసలు అనే దోచుకోబడే వర్గం ఈ రెండు పరస్పర విరుద్ధ ప్రయోజనాలు గల వర్గాలు ఏర్పడటంతో మొట్టమొదటిసారి సమాజంలో వర్గ విభజన జరిగింది.
వ్యవసాయంలో ఉత్పాదకత పెరిగి మిగులు ఉత్పత్తి సాధించడం వల్ల కొంతమందికి వ్యవసాయం నుండి వెసులుబాటు దొరికింది. ఇది చేతివృత్తుల అభివృద్ధికి దోహదపడింది. సమాజంలో వివిధ వృత్తులు అభివృద్ధి కావడంతో పనివిభజన పెరిగింది. వివిధ రకాల వినియోగ వస్తువులు, సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ వస్తువులను వివిధ యజమానుల మధ్య మార్పిడి చేయడం కోసం దళారీలు -అంటే వ్యాపారస్తులు- పుట్టుకొచ్చారు. పట్టణాలు వాణిజ్య కేంద్రాలయ్యాయి. అయితే వ్యవసాయ కేంద్రాలైన గ్రామీణ ప్రాంతాలలోని మిగులు ఉత్పత్తి వల్లే పట్టణాలు అభివృద్ధి అయ్యాయి అనేది గమనించాల్సిన విషయం.
యజమానులకు తమ బానిసలపై సర్వ హక్కులు ఉండేవి. బానిసలతో రోజులో అధిక సమయం పని చేయించడానికి యజమానులు వారిని తీవ్రంగా హింసించే వారు. ఈ హింసను, కఠిన మైన పని వాతావరణాన్ని తట్టుకోలేక బానిసలు తిరగబడ్డమో, పారిపోవడమో చేసేవారు. యజమానుల కట్టుబాట్లను ధిక్కరించిన బానిసలను విచారించి శిక్షించడానికి యజమాని వర్గానికి ఒక యంత్రాంగం అవసరమైంది. ఆ దశలో యజమాని వర్గం తమ ప్రయోజనాల కోసం బానిసలపై అణిచివేతను ప్రయోగించేటందుకు సాయుధ భటులు, న్యాయస్థానాలు, జైళ్ళతో కూడిన యంత్రాంగం ఏర్పాటు చేశారు. ఒకప్పుడు తెగ సభ్యుల ఉమ్మడి ప్రయోజనాలకోసం ఉండిన సమిష్టి నాయకత్వం స్థానంలో యజమాని వర్గ ప్రయోజనాల కోసం ఒక అణిచివేత యంత్రాంగంగా రాజ్యం ఆవిర్భవించింది. సమాజంలో విరుద్ధ ప్రయోజనాలు గల వర్గాలు ఏర్పడినాకే రాజ్య యంత్రాంగం (అణిచివేత యంత్రాంగం) ఆవిర్భవించిందనేది ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం. అనగా రాజ్య యంత్రాంగ లక్ష్యం ఒక వర్గపు ప్రయోజనాల కోసం మరొక వర్గంపై అణిచివేత ప్రయోగించడమే. మెజారిటీ సంఖ్యలో ఉన్న వర్గాన్ని కేవలం భౌతిక హింసతోనే అణిచివేయడం సాధ్యం కాదు. అణిచివేతకు గురవుతున్న మెజారిటీ వర్గం మొత్తంగా తిరుగుబాటు చేసినపుడు దాన్ని అణిచివేయడం రాజ్య యంత్రాంగానికి శక్తికి మించిన పని. కాబట్టి దోపిడిని సమర్థించే భావజాలాన్ని దోపిడికి గురయ్యే ప్రజల ఆలోచనల్లో భాగం చేస్తుంది. తిరగబడాలన్న చైతన్యమే వారికి కలగకుండా ఉంచడానికి ప్రయత్నిస్తుంది. ఈ భౌతిక జీవితం తర్వాత శాశ్వతమైన జీవితం ఉంటుందని, దైవం మీద విశ్వాసంతో భౌతిక జీవితంలో కష్టాలు భరించినవారికి ఆ తర్వాత దైవం స్వర్గాన్ని ప్రసాదిస్తుందని మతాలు చేసే బోధనలు దోపిడీ వర్గ అనుకూల భావజాలంలో భాగమే.
ఇక్కడ మనం మరొక విషయాన్ని గుర్తుంచుకోవాలి. సమాజ పరిణామం ప్రపంచంలోని అన్ని మానవ నివాస ప్రాంతాల్లో ఓకేసారిగా ఒకే పద్ధతిలో జరగలేదు. ఒక ప్రాంతంలో మానవులు బానిస సమాజ దశకు చేరుకునే సమయానికి మరో ప్రాంతంలో ఇంకా ఆదిమ కమ్యూనిస్టు దశలో ఉన్నారు. బానిస సమాజం స్వరూపం కూడా అన్ని ప్రాంతాల్లో ఒకే విధంగా లేదు. ఉదాహరణకు మన దేశంలో బానిస సమాజం వర్ణవ్యవస్థ రూపం తీసుకున్నది. యజమాని వర్గం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణాలుగా (త్రివర్ణాలుగా) ఏర్పడగా బానిస వర్గం నాల్గవ వర్ణమైన శూద్రవర్ణం రూపం తీసుకున్నది. భవిష్యత్తులో మనదేశంలో జరగబోయే సామాజిక పరిణామాలు ఇతర ప్రాంతాలలో కన్నా భిన్నంగా జరగడానికి ఈ వర్ణవ్యవస్థే కారణమయ్యింది.
మానవ సమాజంలో వ్యక్తిగత ఆస్తి ఉనికిలోకి రావడం స్త్రీల సామాజిక స్థితిలో ముఖ్యమైన మార్పుకు కారణమైంది. సొంత ఆస్తి చేజిక్కించుకున్న వారు తమ ఆస్తి తమ సంతానానికే వారసత్వంగా దక్కాలనుకున్నారు. ఒక స్త్రీకి కలిగిన సంతానం తన వల్లే అని పురుషునికి భరోసా ఉన్నపుడే ఆ సంతానానికి తన ఆస్తిని వారసత్వంగా ఇవ్వగలడు. పురుషునికి ఈ భరోసానివ్వడానికే స్త్రీల లైంగిక స్వేచ్ఛపై కట్టుబాట్లు వచ్చాయి. ఇందులో భాగంగానే అంతకు మునుపు ఉనికిలోలేని దంపతీ వివాహ పద్ధతిని కొత్తగా ప్రవేశ పెట్టారు. ఆవిధంగా సొంత ఆస్థితో బాటు కుటుంబం ఉనికిలోకి వచ్చింది. దోపిడీ వర్గ కుటుంబంలో స్త్రీ ఉత్పత్తి ప్రక్రియకు దూరంగా ఉంచబడి పిల్లల్ని కని పెంచడానికి పరిమితం చేయ బడింది. ఈ విధంగా పురుషాధిపత్యంలో ఉండే కుటుంబం ఉనికిలోకి వచ్చింది. పురుషాధిపత్యం క్రింద ఉంటుంది కనుక దీన్ని పితృస్వామిక కుటుంబం అన్నారు. తమపై పితృస్వామిక కుటుంబ వ్యవస్థ విధించిన ఆంక్షలను స్త్రీలు ఆమోదించేలా చేయడానికి అవసరమైన భావజాలం కూడా సృష్టించబడింది. పాతివ్రత్యం పరమ పవిత్రమైనదనే భావన ఇందులో భాగమే.
సమాజం నిరంతరం మారుతూనే ఉంటుంది. సమాజమే కాదు ప్రకృతిలో ప్రతిదీ మారుతూనే ఉంటుంది. మారకుండా శాశ్వతంగా ఉండేదేమీ లేదని మార్క్సిజం చెపుతుంది. ప్రతి దానిలోనూ అంతర్గత వైరుధ్యాలుంటాయని ఈ వైరుధ్యాల మధ్య ఘర్షణే మార్పుకు కారణమవుతుందని ఇది ప్రకృతి నియమమని చెపుతుంది. మరి ఆదిమ కమ్యూనిస్టు సమాజం బానిస సమాజంగా మారడానికి దారితీసిన వైరుధ్యాలేమిటి అనే ప్రశ్న ఇక్కడ వస్తుంది. ఆదిమ కమ్యూనిస్టు సమాజంలో మానవులు ఉపయోగించిన పనిముట్లు ఆహార సేకరణకు ఉపయోగపడతాయే కానీ ఆహార ఉత్పత్తి కి పనికి రావు. వారికి ప్రతీరోజూ ఆహారం దొరికి తీరుతుందన్న హామీ లేదు. మానవ జాతి పెరిగేకొద్దీ వారు వాడుతున్న తక్కువ స్థాయి పనిముట్లు వారి అవసరాలను తీర్చలేని పరిస్థితి వచ్చింది. వారి అవసరాలకు, తక్కువ స్థాయిలో ఉన్న పనిముట్లకు మధ్య వైరుధ్యం ఏర్పడిన ఈ వైరుధ్యాన్ని పరిష్కరించుకునే క్రమంలో వారు నాగలి వంటి మెరుగైన పనిముట్లు తయారు చేసుకొని వ్యవసాయం చేసి ఆహార ఉత్పత్తి దశకు చేరుకున్నారు.
- ఆర్. షామీర్ బాషా
Very useful
ReplyDeleteThe article is thinkable
ReplyDeleteSir
ReplyDeleteIt is consolidated and generalised articel. It might be better to write on particular issue. The issue might be written on rights perspective.
It is my opinion sir
- M.k.kumar