షికారీ చినబాబుది కులహత్యే

 చిత్తూరు జిల్లాలో దారుణం.. భూమి కోసం ...

స్వాతంత్య్రం వచ్చి 7 దశాబ్దాలు గడుస్తున్నా భూమి లేని నిరుపేదలు 60 శాతానికి పైగా దేశంలో వున్నారు. కొంతమంది దళితులు భూమిని సాగుచేసుకుంటున్నా దళారీలు వారి భూమిని కబ్జా చేస్తున్నారు. వాళ్లను వారి స్వంత భూముల నుండే వెళ్లగొడుతున్నారు. చివరకు దళారీలు, ప్రభుత్వం అండతో దళితులను చంపివేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. చిత్తూరు జిల్లాలోను అదే జరిగింది. 

నేపధ్యం

భూమి కోసం గిరిజనుడిని దారుణంగా హత్య చేశారు. చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం చింతలపాళెం  పంచాయతీ మరాఠీపురానికి చెందిన 112 షికారీ కుటుంబాలకు ప్రభుత్వం భూములు కేటాయించింది. 1971 నుంచి మూడు విడతలుగా సుమారు 560 ఎకరాలను ప్రభుత్వం పంపిణీ చేసింది. షికారీలకు చదువు రాకపోవడాన్ని ఆసరాగా చేసుకొని చింతలపాళేనికి చెందిన కొంతమంది ఆ 560 ఎకరాల భూమిని కాజేశారు. ఏకంగా వారి పలుకుబడితో పట్టాలు సంపాదించారు. తర్వాత విషయం తెలుసుకున్న షికారీలు లబోదిబో మంటూ ప్రభుత్వ అధికారులు చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. దీంతో 2006 నుంచి షికారీలు తమ భూమి కోసం పోరాటం చేస్తున్నారు.  ఆగస్టు 7న షికారీలు గ్రామ సమీపంలోని పొలాల్లో గుడిసెలు వేశారు. దీన్ని సహించలేని అగ్రకులాల వారు దాడి చేయడంతో 23 మంది షికారీలు గాయపడ్డారు. పోలీసులు ఈ సంఘటనను పట్టించుకోలేదు. 

ప్రజాసంఘాలు ఆందోళన చేయడంతో చివరకు పోలీసులు ఆ ఘటనలో 28 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును  నమోదు చేశారు. దీంతో షికారీలపై అగ్రకులస్ధులు కక్ష కట్టారు.  భూ పోరాటంలో కీలక పాత్ర పోషిస్తున్నడబ్బా చినబాబు అలియాస్  బాబ్లీ(36)ని చింతలపాళెంవాసులు లక్ష్యంగా చేసుకున్నారు. ఆగస్టు 11 రాత్రి 7 గంటల ప్రాంతంలో బాబ్లీ బహిర్భూమికని బయటకు వచ్చాడు. అప్పటికే అతని కోసం వేచివున్న చింతలపాళెం గ్రామ అగ్ర కులస్ధులు అతన్ని హతమార్చారు. పక్కనే ఉన్న చిన్న నీటి గుంతలో పడేశారు. బాబ్లీ సోదరుడు పరుశురామ్‌ ఫిర్యాదు మేరకు 30మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిలో అధికార పార్టీ వైసీపీ నాయకుడు మరియు మాజీ ఎంపీటీసీ సభ్యుడు రమణయ్యయాదవ్‌ను ప్రథమ నిందితుడి(ఎ1)గా పోలీసులు పేర్కొన్నారు.

మోసంతో భూమిని కాజేశారు

 ఏర్పేడు మండలం , చింతలపాళెం పంచాయితీ , మరాఠీపురం గ్రామంలో  112 కుటుంబాలు ఎస్టీ షికారులు నివసిస్తున్నారు.  1971లో 560 ఎకరాల భూమిని ప్రభుత్వం వారికి పంచి పట్టాలు కూడా  ఇచ్చింది. భూమి మంచి వ్యాపార వస్తువుగా మారడం, రియల్ ఎస్టేటు పుంజుకోవడంతో ఆ భూముల ధరలకు రెక్కలొచ్చాయి.   ఆ ప్రాంతంలో ఎయిర్ పోర్టు, మన్నవరం సెజ్ కూడా వుండటంతో  ఆ భూముల విలువ వందల కోట్లకు పెరిగింది. దాంతో చింతలపాళెం అగ్రకులాల వారు ఆ భూమిని ఎలాగైనా లాక్కోవాలని పథకాలు రంచించారు. వాళ్ల ఉద్దేశ్యం ఏంటంటే షికారీలు మరాఠి రాష్ట్రం నుండి వలస వచ్చారు. ఈ ప్రాంతం వారు కాదు. వారికి తెలుగు, ఇంగ్లీషు చదవడం, రాయడంరాదు. కాబట్టి ప్రాంతీయ విబేధాలను రెచ్చగొట్టారు. చుట్టుపక్కల గ్రామాలలోని ఆగ్రకులస్ధులను తమకు మద్దతుగా కలుపుకున్నారు. 14సంవత్సరాల నుండి అనేక విధాల ప్రయత్నం చేస్తున్నారు. ఆ భూములపై హక్కుదారులను మేమేనని షికారీలు చూపిస్తున్న పత్రాలు, మాటలను ప్రభుత్వ అధికారులు పెడచెవిన పెట్టారు.  

విసిగిపోయిన  ఎస్టీలు 2014లో హైకోర్టులో కేసు వేశారు.  కోర్టులోనే కేసు వేసే ధైర్యం షికారీలకు వచ్చిందా అని అగ్రకులస్ధులు మరింత రెచ్చిపోయారు. షికారీలను ఇబ్బంది పెట్టడం, వారిపై అడపా దడపా దాడులు చేయడం ప్రారంభించారు. అయినా వారు లొంగలేదు. దీంతో మరింత రెచ్చిపోయిన అగ్రకులస్ధులు  2017లో దాదాపు 200 మందిని కూడగట్టుకుని ఎస్టీ కాలనీపై దాడి చేశారు. ఈ దాడిలో  25 మంది షికారీలకు బాగా దెబ్బలు తగిలాయి.  చివరకి ప్రజాసంఘాలు చొరవతో  ఏర్పేడు పోలీసు స్టేషన్లో కేసు పెట్టటం జరిగింది. ఎస్సీ, ఎస్టీ చట్టప్రకారం కేసు కట్టారు. అయినా  పోలీసులు ఇప్పటివరకు నిందితులను అరెస్టు చేయలేదు. వారంతా బహిరంగంగా తిరుగుతూ షికారీలపై దాడులు చేస్తూనే వున్నారు. నిందితులు అగ్రకులానికి  చెందినవారు.   పైపెచ్చు అధికార పార్టీ అండదండలు వుండటంతో పోలీసులు తమ నిస్సహాయితను పరోక్షంగా వ్యక్తం చేశారు. 

అరెస్టు చేయని పోలీసులు

 ఇప్పటికి  వారిని అరెస్టు చేయకపోవడం వలన చట్టంపై గౌరవం , భయం లేని అగ్రకులాల వారు మరింత రెచ్చిపోయారు.  పోలీసులు అప్పడే వారిని అరెస్టు చేసి వుంటే బాబ్లీ హత్య జరిగి వుండేది కాదు.  దీంతో షికారీలు మరింత భయ్రభాంతులకు గురయ్యారు. విధిలేని పరిస్థితుల్లో అమరావతిలో 2019లో ధర్నా చేసారు. ముఖ్యమంత్రి  జగన్ మోహన్ రెడ్డి గారి దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లారు. వినతిపత్రం సమర్పించారు.  వెంటనే ముఖ్యమంత్రి స్పందించి నాయ్యం చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు.   ప్రభుత్వ అధికార యంత్రాంగం కూడా వెంటనే స్పందించింది.  దీనిపై తక్షణం స్పందించాల్సిందిగా  13/1/2020 న చిత్తూరు కలెక్టరును రాష్ట్రప్రభుత్వం ఆదేశించింది. ఈ ఆదేశాలను కలెక్టరు ఎమ్ఆర్ ఓ కు పంపించారు.  కాని ఎమ్ఆర్ ఓ బాధితులకు న్యాయం చేయలేదు. పైపెచ్చు నిందితులకు అనుకూలంగా వ్యవహరించారు.  ఇప్పటికి 8 నెలలు అయినా నిందితులైన  అగ్రకులాల వారికి కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదు. 

సమస్యపై ఎంత పోరాటం చేస్తున్నా సమస్య మరింత జఠిలం అవుతోంది. కాని షికారీల భూములపై వారికి హక్కులు రాలేదు. అయినా వారు ప్రజాస్వామ్య బద్దంగా, న్యాయబద్దంగా పోరాటం చేస్తూనే వున్నారు.  భయపడిన షికారీలను చూసి అగ్రకులాల వారు ఎలాగైనా షికారీలపై భౌతిక దాడులు మళ్లీ చేయాలని తీర్మానించుకున్నారు.   9/8/2020 శనివారం దాదాపు 250 మంది అగ్రకులాల వారు ఎస్టీలపై దాడికి వ్యూహం రచించారు.   చింతలపాళెం చెక్ పోస్టు వద్ద ఆటోలలో వస్తున్న ఎస్టీలను ఆపి వారిపై భౌతిక దాడికి దిగారు. ఈ దాడిలో దాదాపు 23 మందికి తీవ్రంగా దెబ్బలు తగిలాయి. రక్తపు గాయాలతోనే పోలీసు స్టేషన్ కు వెళ్లారు.  మళ్లీ కేసు పెట్టారు. పాత కేసుకే దిక్కు లేదు. అయినా మళ్లీ కేసు పెట్టారు. షికారీలు ఎక్కడా చట్టాన్ని తమ చేతుల్లో తీసుకోలేదు. రాజ్యాంగాన్ని, చట్టాన్ని గౌరవిస్తూనే వున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్ధపై అత్యంత విశ్వాసాన్ని, నమ్మకాన్ని వుంచారు. అయినా ప్రభుత్వం ఇక్కడ ప్రజాస్వామ్యం లేదు, నిరంకుశత్వం, కులపెత్తనం మాత్రమే వుందని మరోమారు రుజువుచేసింది. కేసు రిజిస్టరు చేసినా నిందితులను ఎవ్వరినీ పోలీసులు అరెస్టు చేయలేదు.  ఇంత జరిగినా షికారీలకు రక్షణను కలిపించలేదు.

డెడ్ లైను ఇచ్చి మరీ చంపారు 

 అగ్రకులాల వారు షికారీలను తీవ్రంగా బెదిరింపులకు గురిచేశారు. 48 గంటలలోపు ఊరు విడిచి పారిపోవాలని ఆదేశించారు. భూములను ఉన్నపళంగా విడిచి పోవాలని, లేనిపక్షంలో అందర్నీ చంపేస్తామని బెదిరించారు. అయినా పోలీసులపై, ప్రభుత్వంపై నమ్మకాన్నికోల్పోలేదు. పోలీసులను తమ రక్షణకు రమ్మన్నారు. పోలీసులు పట్టించుకోలేదు. 48 గంటలు గడిచిన వెంటనే అగ్రకులాలు తమ బెదిరింపులకు కార్యరూపం ఇచ్చారు.   11/8/2020 సాయంత్రం అతికిరాతకంగా ఎస్టీ షికారి గిరిజనుడు డబ్బా చినబాబును దారుణంగా నరికి చంపారు. మరాఠీపురం సమీపంలో ఉన్న సోమశిల స్వర్ణముఖి కాల్వ పక్కన ఈ హత్య జరిగింది. 

ప్రశ్నార్ధకమవుతున్న ప్రజాస్వామ్యం

రాష్ట్రంలో దళితులపై దాడులు జరుగుతూనే వున్నాయి. పేదలైన దళితులకు ప్రభుత్వం ఇచ్చిన భూమూలను దళారీలు లాక్కుంటున్నారు. ప్రశ్నిస్తే, దళితులకు భూములెందుకని ఎద్దేవా చేస్తున్నారు. లక్ష్మింపేటలోను ఇదే జరిగింది. శిరోముడంనం కేసులో దళితుడు తనకు న్యాయం జరగలేదని, తాను మావోయిస్టుల్లో చేరడానికి అనుమతి ఇవ్వాలని రాష్ట్రపతికి లేఖ రాశారు. అమరావతిలో రైతులు తమకు అన్యాయం చేశారని, తీవ్రవాదుల్లో చేరతామని లేఖలు రాస్తున్నారు. వీటన్నిటిపై ప్రభుత్వాలు తగిన విధంగా స్పందిచడం లేదు. ఇటువంటి పరిస్ధితుల్లో షికారీలకు న్యాయం జరుగుతుందా అనే ప్రశ్నకు లేదనే జవాబు చెప్పాలి. ప్రజాసంఘాలు ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఉద్యమిస్తున్నా పాలకులకు చీమ కుట్టినట్టు లేదు. హైకోర్టునే ధిక్కరిస్తున్న ప్రభుత్వానికి ఈ అంశం చాలా చిన్నది. కాని ప్రజల దృష్టిల్లో ప్రజాస్వామ్య మనుగడకు సంబంధించిన విశ్వాసం క్రమంగా సన్నగిల్లడానికి ప్రభుత్వపు పేక్షక పాత్ర ఊతమిస్తుంది. 

ప్రజాసంఘాల వాదన

 సర్వే నంబర్‌ 377లో మూడు విడతలుగా ప్రభుత్వం 112 మంది షికారీ కుటుంబాలకు డికేటి పట్టాలు ఇచ్చింది. మొత్తం 560 ఎకరాలు ఇచ్చారు. చింతలపాళెం మాజీ ఎంపిటిసి రమణయ్యయాదవ్‌ అనుచరులు, ఇతర పెత్తందారులు ఆ భూములను కబ్జా చేసేశారు. తప్పుడు రికార్డులు సృష్టించి అమ్ముకున్నారు. అగ్రకులాల దాష్టీకం వల్లే షికారీ బాబ్లీ దారుణ హత్యకు గురయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపి, హంతకులను అరెస్టు చేయాలని దళిత, ప్రజాసంఘాలు డిమాండ్‌ చేశాయి.   ఎస్టీ యువకుడు దారుణ హత్యకు గురైతే కలెక్టర్‌ గానీ, ఎస్పీ గాని ఎందుకు రాలేదు. అదే అగ్రకులాల వారికి జరిగి ఉంటే ఆగమేఘాలపై వచ్చి అండగా ప్రభుత్వం నిలుస్తుంది.  ఈ భూములకు సంబంధించి కలెక్టర్‌ ఆగస్టు 13న ఆర్డర్‌ ఇచ్చారు.  ఇంతవరకు రెవెన్యూ వారు ఎందుకు స్పందించలేదని సంఘాలు ప్రశ్నించాయి.   గత కొన్ని సంవత్సరాలుగా షికారీలపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నా పోలీసులు ఎందుకు పట్టించుకోలేదన్నారు. అగ్రసులస్ధులు దాడి చేసి బాబ్లీని చంపేస్తే, పోలీసులు దాన్ని షికారీల మధ్య గొడవులుగా చీత్రీకరించడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

నిందితుల వాదన

ప్రభుత్వం షికారీలకు భూములు 1980లో ఇచ్చింది. అయితే ప్రభుత్వమే వాటిని తిరిగి రద్దు చేసింది. ఆ రద్దు చేసిన భూములను యూదవులైన రైతులకు ఇచ్చింది. దాన్ని కొంతమంది అమ్ముకున్నారు. మరి కొంతమంది సాగుచేసుకున్నారు. అయినా షికారీలు ఆ భూములు మాదే అంటున్నారు. 1975 ప్రాంతంలో షికారీలు ఈ ప్రాంతానికి వచ్చారు. వారిని ఆదిరించింది, మా ముందరి తరం వారే. కొన్ని వందల సంవత్సరాలుగా మేము చితంలపాళెం లోనే నివసిస్తున్నాం. మా తాతల నాటి నుండి వ్యవసాయం చేసుకుంటున్నాం. అయినా షికారీలతో మేము సఖ్యతతోనే వున్నాం. షికారీల భూములను ప్రభుత్వం వెనక్కి తీసుకంది. అయినా వారు హైకోర్టుకు పోయారు. తీర్పు ఇంకా రావలసి వుంది. మేము హైకోర్టు తీర్పుకు కట్టుబడి వుంటాం. 

ప్రభుత్వం వాదన

 షికారీలకు ప్రభుత్వం 1980లో భూములు ఇచ్చింది వాస్తవమేనని ప్రభుత్వ అధికారులు చెప్పారు.  అనంతరం ఈ భూములను రద్దు చేసి చింతపాళెంకు చెందిన యాదవులకు (రైతులకు) ప్రభుత్వం పంపిణీ చేసింది. హత్య భూవివాదంలో జరిగిందా, లేక షికారీల మధ్య గొడవలతో జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తారు. మృతుని తలకు బలమైన గాయాలున్నట్లు తెలుస్తోంది.     మృతదేహాన్ని తీసేది లేదని షికారీలు ఆర్డీవోను అడ్డుకుంటే భూములిచ్చేట్టు చూస్తామని ప్రభుత్వం చెప్పింది. ఆర్ డి ఓ, కలెక్టర్‌ నారాయణ భరత్‌గుప్తా ఆదేశాల మేరకు ఆగస్టు 17వ తేదీ రెవెన్యూ అధికారులను భూములను పరిశీలిస్తారని  చెప్పారు. కాని చేయలేదు. హత్యకు భూ వివాదం కారణమా, ఇరు వర్గాల మధ్య వున్న ఘర్షణలు కారణమా అనే అంశం దర్యాప్తులో తేలవలసి వుంది.

చినబాబుది కులహత్యే

అసలు సమస్యకు కార‌ణం భూమి అని రూపంలో కనిపిస్తుంది. పేదలకు వ్యవసాయ భూమి లేదు. మరోవైపు ప్రభుత్వమే ల్యాండ్ బ్యాంకులను ఏర్పాటు చేస్తోంది. చిత్తూరు జిల్లాలో ఇప్పటికే 3 లక్షల ఎకరాలను ప్రభుత్వం సేకరించింది. వీటిలో కొంత భాగాన్ని ప్రభుత్వం వైఎస్ ఆర్ హౌసింగం స్కీము కింది పేదలకు ఉచితంగా ఇవ్వాలను కుంటోంది. ఇది కూడా వివాదాస్పద మవుతోంది. ఇక ఏర్పేడు చట్టుపక్కల ప్రాంతంలో మన్నవరం సెజ్ వుంది. అంతర్జాతీయ ఎయిరు పోర్టు వుంది. ఏర్పేడులోనే రెండు జాతీయ విద్యా సంస్ధలను కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ నేపధ్యంలో అక్కడ భూముల రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. వున్నభూమంతా రియల్ ఎస్టేటు వ్యాపారులు, ప్రభుత్వం లాక్కున్నారు. ఇంక పేదలకు భూములు లేవు. సాగు చేసుకోవడం సంగతి అటుంచితే, నివాసానికే భూములు లేని పరిస్ధితి నెలకొంది.  ఇంక మిగిలింది షికారీల భూములైన 560 ఎకరాలు. మార్కెట్లో దీని విలువ వందల కోట్లు.  అందుకే అధికారపార్టీ అండదండలతో ఈ భూములను కాజేయలని బీసీలైన యాదవులు కుట్రలు పన్నారు. అట్లనీ ఈ ప్రాంత బీసీలందరు భూములు కాజేయాలని అనుకోలేదు. వారిలో చాలా మంది పేదలున్నారు. 

బిసీల్లోని ధనికవర్గం ఈ కుట్రలకు పాల్పడింది. బిసీలందరిలో ప్రాంతీయ తత్వాన్ని, కుల తత్వాన్ని రెచ్చగొట్టి సుమారు 250 మందిని పోగు చేయగలిగారు. ఈ కులతత్వమే ఎస్టీలపై దాడులు చేయగలిగింది. అంటే ఇక్కడ భూమిపై పట్టుకోసం కన్నా కులతత్వమే ఎక్కువ పనిచేసింది. దీన్ని కులహత్యగానే పరిగణించాలి. కాని ప్రభుత్వం దీన్ని భూతగాదాగా చూడటం లేదు. కేవలం ఘర్షణగానే చూస్తోంది. అదే బిసీలకు ఈ భూములు ఇచ్చివుంటే, వారిపై ఎవరైనా దాడులు చేసేవారా. ప్రభుత్వ భూములు తీసుకున్న వారు ఎస్టీ షికారులు కాబట్టే ఈ దాడులు జరిగాయి. చివరకి అగ్రకులస్ధులు మారణ హామాన్ని జరిపారు. 50 సంవత్సరాలకు పైగా నివసిస్ధున్న షికారీలు భయంతో, అభద్రతా భావంతో తమ స్వంత స్ధలాలోనే నివసించాల్సి వస్తోంది. దీనికి పూర్తి కారణం ప్రభుత్వే కులతత్వాన్ని ప్రోత్సహించడం. మరోవైపు కేంద్రం సిఎఎ, పిఎన్ఆర్ లాంటి చట్టాలతో షికారీల వాంటి వారిని ఏకంగా విదేశీయులనే చేసే కుట్రలు పన్నుతోంది. 

ముగింపు

భూ సంస్కరణలు అమలు కాకపోవడం వల్ల పేదల హత్యలు జరుగుతున్నాయి. ఈ హత్యలకు ప్రభుత్వాలు బాధ్యత వహించాలి. భూమిలేని నిరుపేదలైన దళితులను ఏకంగా అగ్రకులస్ధులు కులదురహంకారంతో ఏకంగా చంపేస్తున్నారు. ప్రభుత్వమే దళితులకు భూములు ఇచ్చినా, వారిని చంపి మరీ అగ్రకులస్ధులు భూములు లాక్కుంటున్నారు. 101.4 మిలియన్ల గ్రామీణ భారతీయ కుటుంబాలకు వ్యవసాయ భూమి లేదు. భారతీయ రైతులలో 95.1% మందిని దిగువ మధ్యతరగతి, సన్నకారు, పేద రైతులు అని పిలుస్తారు. అంటే వారు వరుసగా 2.47, 4.94, 9.88 శాతం ఎకరాల భూమిని కలిగి ఉన్నారు. ఈ రైతులు 68.2% సాగు భూమిని కలిగి వున్నారు. 4.9% మంది ధనిక రైతులు 24.71 శాతం సాగు భూమిని కలిగి వున్నారు.  2011-12 వ్యవసాయ జనాభా లెక్కల ప్రకారం రైతులు 31.8% సాగు భూమిని మాత్రమే కలిగి ఉన్నారు. 2011-12 వ్యవసాయ జనాభా లెక్కలు, 2011 సామాజిక-ఆర్థిక కుల జనాభా లెక్కల నుండి సేకరించిన వివరాలు ఈ విధంగా వున్నాయి. భారతదేశ వ్యవసాయ భూములలో 32% రైతులు 4.9% కంటే ఎక్కువ కాదు. భారతదేశంలో ఒక ధనిక రైతుకు పేద రైతు కంటే 45 రెట్లు ఎక్కువ భూమి ఉంది. 

101.4 మిలియన్లు  (56.4%)  గ్రామీణ కుటుంబాలకు వ్యవసాయ భూమి లేదు.  గ్రామీణ భారతంలో భూమిలేనివారికి ఇచ్చిన సగటు భూమి 2002 లో 0.95 ఎకరాల నుండి 2015 లో 0.88 ఎకరాలకు పడిపోయింది. ఇది 13 సంవత్సరాలలో 7.4% కు పడిపోయింది. డిసెంబర్ 2015 నాటికి, భారతదేశం అంతటా “మిగులు” (అంటే భూస్వాముల నుండి తీసుకోవాల్సిన) అని ప్రకటించిన భూమి 6.7 మిలియన్ ఎకరాలలో ఉంది. ప్రభుత్వం 6.1 మిలియన్ ఎకరాలను స్వాధీనం చేసుకుంది.  5.1 మిలియన్ ఎకరాలను-హర్యానాలో సగం కంటే తక్కువ లేదా గోవా విస్తీర్ణంలో ఐదున్నర రెట్లు 5.78 మిలియన్ల ప్రజలకు పంపిణీ చేసింది. అదేవిధంగా, ప్రకటించిన భూమి మిగులు సంవత్సరాలుగా పడిపోయింది. 1973 మరియు 2002 మధ్య, సగటున 150,000 ఎకరాలు మిగులు భూములుగా ప్రకటించబడ్డాయి.  ప్రతి సంవత్సరం సగటున 140,000 ఎకరాలు పంపిణీ చేయబడ్డాయి. దీనికి విరుద్ధంగా, 2002 మరియు 2015 మధ్య, ప్రతి సంవత్సరం మిగులు 4,000 ఎకరాలుగా ప్రకటించారు. ప్రభుత్వ ఆధీనంలో వున్న, పంపిణీ చేయబడిన భూమి వరుసగా 29,000 ఎకరాలు(2002), సంవత్సరానికి 24,000 ఎకరాలు (2015)కు క్షీణించింది

2007 మరియు 2009 మధ్య 920,000 ఎకరాల నుండి 1.14 మిలియన్ ఎకరాలకు వ్యాజ్యం కింద ఉన్న మిగులు భూమి 23.4% పెరిగింది. కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్ మరియు మహారాష్ట్ర వంటి కొన్ని రాష్ట్రాలు ఇటువంటి కేసులను త్వరగా పరిష్కరించడానికి భూ ట్రిబ్యునళ్లను ఏర్పరిచాయి. కాని వాటి పనితీరు పేలవంగా వుంది. హెచ్చుతగ్గులతో సంబంధం లేకుండా, 2015 వరకు ప్రకటించిన భూమి 51.9 మిలియన్ ఎకరాలలో 12.9% దాదాపు గుజరాత్ రాష్ట్ర పరిమాణమంత వుంటుంది. ఇది భూస్వాముల నుండి తీసుకోవలసిన భూమి.  మిగులుగా ప్రకటించాల్సిన 51.9 మిలియన్ ఎకరాలలో  ప్రభుత్వ ఆధీనంలో  పంపిణీ చేయబడిన భూమి కేవలం 9.8% మాత్రమే.  

భూమి లేకపోవడం వల్లే పేదలు హత్యలకు గురౌతున్నారు. ఈ హత్యలకు గురైన వాళ్లల్లో దళితులు, గిరిజనులు 90 శాతం మంది వున్నారు. భారతదేశంలో కులతత్వం ఎక్కవుగా వుంది. అందువల్ల కులతత్వ హత్యలు ఎక్కువ పెరుగుతున్నాయి. అయితే వీటిని భూ, ఆస్ధి తగాదాల ఘర్షణలో జరిగిన హత్యలుగా ప్రభుత్వం చిత్రీకరిస్తోంది. ఈ నేపధ్యంలో ప్రభుత్వం పేదలందరికీ సాగు భూములను కేటాయించాలి. భూస్వాముల దగ్గర చ్టట్ట వ్యతిరేకంగా వున్న భూములను లాక్కోవాలి. చినబాబు హంతకులపై ఎస్సీఎస్టీ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి చట్ట ప్రకారం శిక్షించాలి.  కబ్జాకు గురికాబడ్డ షికారీ భూములు తిరిగి వారికి ఇప్పించాలి.  మృతుని కుటుంబానికి నష్టపరిహారం కింద కోటి రూపాయలు ఇవ్వాలి.   మృతుని పిల్లలకు చదువుకు అయ్యే ఖర్చులను ప్రభుత్వమే భరించాలి. సంఘటనపై హైకోర్టు సిట్టింగ్ జడ్జిచే న్యాయ విచారణ జరిపించాలి.  ఈ సంఘటనలో నిర్లక్ష్యం వహించిన పోలీసు, ప్రభుత్వ ఉన్నతాధికారులను విధులల నుండి తొలగించాలి. లేనిపక్షంలో జరుగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వుంటుంది. 

Comments