ప్రఖ్యాత రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత కలువకొలను సదానంద (82) మంగళవారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన చిత్తూరు జిల్లా పాకాలలో సొంత ఇంటిలో తుదిశ్వాస విడిచారు. సదానందకు భార్య, ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. కథ, నవల, కవిత్వం, బాలసాహిత్యం వంటి విభిన్న సాహితీ ప్రక్రియల్లో అనేక రచనలు చేశారు. ‘బంగారు నడిచిన బాట’ నవలకు కేంద్రసాహిత్య అకాడమీ అవార్డును అందుకొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయనను హంస అవార్డుతో సత్కరించింది.
తెలుగు విశ్వవిద్యాలయం ధర్మనిధి పురస్కారం సహా లెక్కకు మిక్కిలి అవార్డులు ఆయనను వరించాయి. 50 ఏళ్లకుపైగా సదానంద సాహితీ వ్యాసంగంలో ఉన్నారు. పరాగభూమి, శివానందలహరి, అడవితల్లి, రాణిగారి కాసులపేరు, కథా స్రవంతి, కుందేళ్ల మహాసభ, వట్టిచేతులు, విందుభోజనం, చల్లనితల్లి, సాంబయ్య గుర్రం, తుస్సన్న మహిమలు, గందరగోళం, గాడిద బతుకులు, పైరుగాలి, రక్తయజ్ఞం, రంగురంగుల చీకటి, ఓండ్రింతలు, ఽఢంఢం, డబడబ, ఢమాఢమా, నీతి కథామంజరి మొదలగు రచనలు చేశారు.
సదానంద చిత్తూరు జిల్లా పాకాల లో శ్రీమతి నాగమ్మ, కృష్ణయ్య దంపతులకు తేది. ఫిబ్రవరి 22 1939 న జన్మించారు. ఎస్.ఎస్. ఎల్.సి చేసి టి.ఎస్.ఎల్.సి చదివారు. వృత్తిరీత్యా 36 సంవత్సరాలు ఉపాధ్యాయుడిగా పనిచేసి 1997లో పదవీ విరమణ పొంది పాకాల లోనే స్థిర పడ్డారు.ఆగస్టు 25, 2020న పాకాల లోని స్వగృహంలో స్వర్గస్థులైనారు.
సదానంద మొదటి రచన తన 18 ఏటనే ప్రచురితమైంది. చందమామ, బాలమిత్ర, బాలజ్యోతి, బాలరంజని, బొమ్మరిల్లు, బాలభారతి, బుజ్జాయిలాంటి బాలల మాస పత్రికలలో, ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక, ఆంధ్రభూమి వంటి వార, మాస పత్రికలలోని పిల్లల శీర్షికలలో వీరి రచనలు ప్రచురితమయ్యాయి. ప్రస్తుతం ఈనాడు దినపత్రిక ‘హాయ్‌బుజ్జి’ పేజీలో వీరికథలు ఎక్కువగా మనం గమనించవచ్చు. సదానంద బాలలకోసం ఇప్పటి వరకు 200కు పైగా కథలు, 2 నవలలు, 100 కి పైగా గేయాలు, కొన్ని గేయకథలు రాశారు. 8 కథా సంపుటాలు, 2 నవలలు ప్రచురించారు. తన 25 సంలో రాసిన పిల్లలనవల బాల రంజనిలో సీరియల్‌గా వచ్చింది.
1964లో మొదటి కథా సంపుటి ‘సాంబయ్య గుర్రం’ ప్రచురితమైంది. అదే సంవత్సరం ‘చల్లనితల్లి’, 1966లో నీతికథామంజరి, 1967లో విందుభోజనం, 1983లో శివానందలహరి ఇలా... మొత్తం 8 కథా సంపుటాలు ప్రచురించారు. 1965లో బాలల కోసం ‘బంగారు నడిచినబాట’ నవల ప్రచురించారు. ఈ నవలకు 1966లో ఉత్తమ బాల సాహిత్య గ్రంధంగా కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ వారి అవార్డు లభించింది. వీరి "నవ్వే పెదవులు - ఏడ్చేకళ్ళు" కథా సంపుటానికి 1976లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ అవార్డు లభించింది. తెలుగు కథాసాహిత్యంలో వంద ఆణిమ్యుత్యాలు పేరుతో వెలువడిన కథా సంకలనంలో వీరి కథ "తాత దిగిపోయిన బండి"కి స్థానం లభించింది. త్వరలో వీరి "పరాగభూమి కథలు" గ్రంథం వెలువడనుంది.
పెన్నేటి ప్రచురణలు, కడప వారు సదానంద పిల్లల నవల ‘అడవితల్లి’ 2007లో ప్రచురించారు. మహాభారతంలోని కొన్ని పద్యాల ఆధారంగా అల్లిన నవల. మొదట ఈ నవల ‘బాలరంజని’ పిల్లల మాసపత్రికలో ప్రచురితమై బాలలను అలరించింది.
సదానంద సమాజాన్ని జీవితాన్ని విపులంగ అధ్యయనం చేసినవారు. లోతుగా తరచి చూచినవారు. కనుకనే ఆయన కథల్లో కఠిన వాస్తవాలు కనిపిస్తాయి. సామాజిక అసమానతలపైన, రాజకీయ అవినీతిపైన కూడా కలం దూసిన కథా రచయిత. మధ్యతరగతి, క్రింది మధ్యతరగతి మానవుని జీవిత పరిశీలన మెండుగా ఉన్న రచయిత. పాత్రలు జీవ చైతన్యంతో నిండి పాఠకులకు సామాజిక చైతన్యం కలిగిస్తాయి.
అపారమైన భావనాశక్తి, విశేషమైన భౄషా వైదుష్యం కలిగిన రచయిత సదానంద. మానవనీయత, సామ్యవాద నిబద్ధతల సమన్వయ సమాహారంగా అనేక కధాసంపుటిలను ఆయన వెలువరించారు.
పౌరహక్కుల సంఘం ఆయనకు నివాళి అర్పిస్తున్నది.
Comments
Post a Comment