వరవరరావును జైళ్లోనే చంపాలని కుట్ర పన్నారా

Revolutionary poet Vara Vara Rao admitted in JJ hospital Mumbai

ఆవేదన చెందుతున్న వరవరరావు కుటుంబసభ్యులు.
ఆందోళన చెందుతున్న ప్రజాసంఘాలు 
అనారోగ్యంతో ఉన్నా ఆస్పత్రిలో చేర్చడం లేదు 
సీఎం కేసీఆర్‌ చొరవ తీసుకుని మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడాలి
పౌరహక్కుల సంఘం డిమాండ్

నవీ ముంబైలోని తలోజా జైలులో విచారణ ఖైదీగా నిర్బంధంలో ఉన్న ప్రముఖ విప్లవకవి పి.వరవరరావు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. తక్షణమే ఆస్పత్రికి తరలించి వైద్యం అందించాలని ఆయన సహచరి హేమలత, కుమార్తెలు సహజ, అనలా, పావన విజ్ఞప్తి చేశారు. 79 ఏళ్ల వరవరరావు తీవ్ర అనా రోగ్యంతో బాధపడుతున్నా చికిత్స అందించకుండా జైలులోనే చంపేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఆయన్ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించేలా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మహారాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలి.  

గత మే 28న జైలులో వరవరరావు స్పృహ కోల్పోవడంతో జేజే ఆస్పత్రికి తరలించారు. సోడి యం, పొటాషియం లెవల్స్‌ బాగా పడిపోయాయని కోర్టుకు ఆస్పత్రి అధికారులు నివేదించారు. 3 రోజులకే ఆయన్ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేసి ఎన్‌ఐఏ తిరిగి జైలుకు తరలించింది. ఇది చాలా అమానుషం.  జూన్‌ 24న, ఆ తర్వాత జూలై 2న వరవరరావు తన కుటుంబీకులతో జైలు నుంచి ఫోన్‌ చేసి బలహీనమైన గొంతుతో అసంబద్ధంగా హిందీలో మాట్లాడారు.   చివరిసారిగా శనివారం ఆయన తన కుటుంబీకులకు ఫోన్‌ చేసినా తీవ్ర అనారోగ్యం వల్ల సరిగ్గా మాట్లాడలేక పోయారని వారు తెలిపారు. ఆయన ఆరోగ్యం గురించి అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా, పొంతన లేకుండా మాట్లాడారని హేమలత, కుమార్తెలు ఆవేదనతో చెప్పారు.  

వరవరరావు 8 ఏళ్ల వయస్సులో తండ్రిని, 30 ఏళ్ల కింద తల్లిని కోల్పోయారు. అయితే తన తండ్రి, తల్లి అంత్యక్రియలకు వెళ్తున్నావు కదా అని ఫోన్లో తనను అడిగారని హేమలత ఆందోళన వ్యక్తం చేశారు. దశాబ్దాల నాటి ఘటనలకు సంబంధించిన భ్రమల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సోడియం, పొటాషియం లెవల్స్‌ పడిపోవడంతో మెదడు దెబ్బతింటుండడం వల్లే తమ తండ్రి మతిస్థిమితం కోల్పోయినట్టు వ్యవహరిస్తున్నారని ఆయన కుమార్తెలు ఆందోళన వ్యక్తం చేశారు.  ఆయన ఆరోగ్యం బాగా దెబ్బతిందని, నడవలేకపోతున్నారని, ఒకరి సహాయం లేకుండా మరుగుదొడ్డికి వెళ్లలేకపోతున్నారని, పళ్లు తోముకోవడం కూడా కష్టంగా ఉందని సహచర ఖైదీలు పేర్కొన్నట్టు కుటుంబీకులు తెలియజేశారు.  ఒకరి ప్రాణాలను తీసే హక్కు ప్రభుత్వాలకు రాజ్యాంగం కల్పించలేదు. 

Save Freedom Of Expression 
Bail is Right.
Jail is Exception 
భావ ప్రకటన మన హక్కు అని చాటి చెబుదాం. కరోనా తో ప్రపంచమే కుదేలయింది. వైరస్ బారిన పడిన వాళ్ళకు వైద్యం కరువయింది. వేలాది మంది ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. అన్ని వ్యవస్థలు మూత పడుతున్నాయి. కరోనా కాలం లో మొత్తంగా ఆర్థిక వ్యవస్థలు దెబ్బ తిని , బతుకు దెరువులు దెబ్బ తిని , జనం స్వియ నిర్భంధంలో పూట గడవక విలవిలలాడుతున్నారు. సమయ సందర్భాలతో నిమిత్తం లేకుండా ,  ప్రజలకోసం ప్రశ్నించే వాళ్ళే లక్ష్యంగా రాజ్యం మాత్రం ప్రజల అణిచివేత పని   చేసుకుపోతోంది.

" ప్రశ్న " అనేదిలేకుండా చేసే పనిలో  రాజ్యం  ఉంది. ఇది ఏ సమాజ ప్రగతికైనా విరుద్ధం, అవరోధం. మన జైళ్లు ఇప్పటికే ఖైదీలు  ఉండాల్సిన పరిమితికి  రెండు, మూడు రెట్ల ఖైదీలతో నిండిపోయి ఉన్నాయి.. కరోనా కు జైళ్లలో భౌతిక దూరం సాధ్యం కాని ఈ సమయం లో అరెస్టులకు పూనుకోవడం.. పరోక్షంగా ఖైదీలకు మరణ శిక్ష విధించడమే. సగానికిపైగా  మన జైళ్లు ఎటువంటి నేర నిరూపణ కాని నిందితులతోనే నిండిపోయాయని అనేక అధ్యయనాలు   చెబుతున్నాయి.

  ప్రజల  తరఫున అడిగే ఒక ప్రశ్నకూ అవకాశం లేకుండా , ప్రజల  తరఫున ప్రశ్నించే వారే లేకుండా చేద్దామనుకుంటున్న రాజ్య కుట్రలను ఖండిద్దాం. వాస్తవానికి కరోనా కాలం లో కిక్కిరిసిపోయిన జైళ్లలోని ఖైదీలను బెయిల్ పై విడుదల చేసి వారి జీవించే హక్కును కాపడమని డిమాండ్ చేద్దాం.. 

" Bail is Right- Jail is Exception "    బెయిల్ మన హక్కు- తప్పని స్థితిలోనే జైలు   - అన్న న్యాయ సూత్రాన్ని గుర్తు చేద్దాం.  ప్రజాస్వామికవాదుల, ఉద్యమకారుల, మానవతా వాదుల  అరెస్టులు నిలిపేయాలని డిమాండ్ చేద్దాం.

కామ్రేడ్ వరవరరావు సహా ఎటువంటి నేర నిరూపణ కాని రాజకీయ ఖైదీలను వెంటనే  బెయిల్ పై విడుదల చేయాలి.. ప్రజా సంఘాల కార్యకర్తలను, వారి కుటుంబ సభ్యులను   వేధించడం ఆపివేయాలి.. అని డిమాండ్ చేద్దాం.  కవి, కార్యకర్త, కళాకారుడు, పాత్రికేయుడు, విరసం కార్యవర్గ సభ్యుడు  క్రాంతి   సహా , ప్రజా సంఘాల కార్యకర్త ల అరెస్టు ప్రయత్నాలను ఆపేయాలని , వేధింపులను ఆపేయాలని డిమాండ్ చేస్తూ,   భావ ప్రకటన మన అందరి హక్కు అని చాటి చెబుదాం.

- పౌరహక్కుల సంఘం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్

Comments