వరవరరావు ను విడుదల చేయాలి

Jailed poet and activist Varavara Rao tests positive for COVID-19

పత్రికా ప్రకటన జూలై 31, 2020
ఇవాళ వరవరరావుతో మాట్లాడాం 
ఆయనను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం 

వరవరరావు కుటుంబ సభ్యులను ఆయనను చూడడానికి అనుమతించాలని నానావతి ఆస్పత్రిని జూలై 28న బొంబాయి హైకోర్టు ఆదేశించింది. కాకపోతే కొవిడ్ వ్యాధిగ్రస్తులను కలిసే విషయంలో ఆస్పత్రి నిబంధనలకు, ప్రభుత్వ నిబంధనలకు లోబడి అది జరగాలని కూడ ఆదేశించింది. కొవిడ్ వ్యాధిగ్రస్తులను వ్యక్తిగతంగా కలవడానికి నిబంధనలు అనుమతించబోవని, అందువల్ల వీడియో కాన్ఫరెన్స్ లో కుటుంబ సభ్యులు మాట్లాడవచ్చునని ఆస్పత్రి అధికారులు జూలై 30న తెలియజేశారు. 

అలా మేం, వరవరరావు కుటుంబ సభ్యులం ఇవాళ, జూలై 31, శుక్రవారం మధ్యాహ్నం దాదాపు ఇరవై నిమిషాల పాటు వీడియో కాన్ఫరెన్సులో ఆయనతో సంభాషించగలిగాం. ఆయన చాల బలహీనంగా, దుర్బలంగా కనిపించారు. ఆయన శారీరక స్థితి ఏమీ బాగులేనట్టు కనబడింది. అంతకన్న విచారకరమైన అంశం ఆయన మానసిక స్థితి. ఆయన ఆరోగ్యం గురించి మేం నేరుగా అడిగిన ప్రశ్నల్లో చాల వాటికి ఆయన జవాబు చెప్పలేకపోయారు. అసలు మేం ఆందోళనతో వేసిన ప్రశ్నలను ఆయన అర్థం చేసుకున్నారా లేదా తెలియదు. 

ఆయన మాట్లాడదలచుకున్నది మాత్రమే మాట్లాడారు. ఆయన మాటల్లో చాల భాగం ఆయన సుప్తచేతనలో ఉన్న దశాబ్దాల కిందటి జ్ఞాపకాలే తప్ప, ప్రస్తుతానికి సంబంధించినవి కావు. అంటే ఆయనలో పరాకు, గందరగోళం, మతిమరుపు, వర్తమానాన్ని గ్రహించలేకపోవడం, పొంతన లేకపోవడం ఇంకా కొనసాగుతున్నాయని తేలింది. అరవై సంవత్సరాలుగా ఆయన జన మేధావిగా ఉన్నారు. ధారాళమైన వాగ్ధార గల, జనాకర్షకమైన వక్తగా ఉన్నారు. అద్భుతమైన జ్ఞాపకశక్తి ఆయన సొంతం. అటువంటి మనిషిని ఇవాళ మాటల కోసం వెతుక్కునేవాడిలా, పొంతన లేకుండా మాట్లాడేవాడిలా దిగజార్చారు. ఆయన ఎప్పుడూ మందిలో ఉండే మనిషి. విపరీతంగా చదివే మనిషి. విస్తారంగా రాసిన మనిషి. ఇవాళ వీడియో కాన్ఫరెన్సు తర్వాత మేం గట్టిగా నమ్ముతున్నదేమంటే ఆయన చుట్టూ మనుషులు లేకపోవడం, చదువుకోవడానికి పత్రికలు, పుస్తకాలు లేకపోవడం, రాసుకునే సౌకర్యాలు లేకపోవడం ఆయన శారీరక, మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఆయనను విడుదల చేసి, తన సొంత మనుషుల మధ్య ఉంచడమే ఇవాళ ఆయనకు కావలసిన ఔషధం.

అందువల్ల, ఇవాళ్టి సంభాషణ తర్వాత, మరింత ఆందోళనతో, తక్షణ వ్యగ్రతతో మేం

1. ఆయన ఆరోగ్యం మెరుగు పడేందుకు ఆయనను వెంటనే విడుదల చేయాలని, బెయిల్ ఇవ్వడానికి ఉన్న అడ్డంకులన్నిటినీ తొలగించాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. 

2. కోవిడ్ కూ, మానసిక సమస్యలకూ మాత్రమే కాక ఇతర ఆరోగ్య సమస్యలన్నిటికీ కూడ మెరుగైన చికిత్స, వైద్య సహాయం అందించాలని ఆస్పత్రి అధికారులను కోరుతున్నాం. 

3. వరవరరావు గారిని కనీసం బెయిల్ మీదనైనా వీలయినంత తొందరగా విడుదల చేసి, ఆయన ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి వీలుగా కుటుంబ సభ్యుల పర్యవేక్షణలో ఉంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయవలసిందిగా ప్రజలందరికీ, రచయితలకు, మేధావులకు, పౌరసమాజానికి విజ్ఞప్తి చేస్తున్నాం. 

పి. హేమలత, సహచరి 
పి. సహజ, పి. అనల, పి. పవన, కూతుళ్లు 
జూలై 31, 2020

Comments

  1. వరవరరావు గారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాము

    ReplyDelete

Post a Comment