నాగేశ్వరరావుపై తప్పుడు ప్రచారాన్ని ఆపండి - ప్రజాసంఘాలు

Sonu Sood: ఆయన ఆదేశించారు.. నేను ...

పేద దళిత రైతు నాగేశ్వరరావుపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఆపండి

 - దళిత, ప్రజా, హక్కుల సంఘాల ఐక్యవేదిక డిమాండ్

పౌరహక్కుల కార్యకర్త, పేద దళిత కుటుంబానికి చెందిన  వి. నాగేశ్వరరావు పేద రైతు కాదని, సినీ నటుడు సోనూసూద్ నుండి ట్రాక్టర్ పొందే అర్హత లేదని, ధనవంతుడైన రాజకీయ నాయకుడని   సోషల్ మీడియా, ప్రింట్ , ఎలక్ట్రాన్ మీడియా లో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఆపాలి.  అదేవిధంగా ప్రభుత్వ అధికార యంత్రాంగం చేస్తున్న విచారణ అర్ధరహితమని దళిత, ప్రజాసంఘాల ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు.

ఈ రోజు ఉదయం(28.7.20) చిత్తూర్ జిల్లా, మదనపల్లె టౌన్, మిషన్ కాంపౌండ్ లో జరిగిన ప్రెస్ మీట్ లో దళిత ప్రజా సంఘాల ఐక్యవేదిక లోని BSP , MRPS, మాలమహానాడు,CPI, RDS స్వచ్చంధ సంస్థ, పౌరహక్కుల సంఘం, గిరిజన సంఘం నాయకులు ఈ విషయంపై మాట్లాడారు.

చిత్తూరు జిల్లా, పీలేరు నియోజకవర్గం, కె.వి.పల్లి మండలం, మహల్ రాజు పల్లికి చెందిన రెండెకరాల నిరుపేద దళిత కుటుంబానికి చెందిన వ్యక్తి వి. నాగేశ్వరరావు.  బ్రతుకు తెరువు కోసం 15 సంవత్సరాల ముందు మదనపల్లెకి వచ్చి టీ కొట్టు పెట్టుకొని జీవనం సాగిస్తున్నాడు. పలు సామాజిక సమస్యల పైన తక్షణమే స్పందించే వ్యక్తిగా అతను ప్రజాసంఘాలకు, మదనపల్లి ప్రజలకు సుపరిచితుడు.  పౌరహక్కుల జిల్లా కార్యదర్శిగా అతను ప్రస్తుతం పనిచేస్తున్నాడు. ఇప్పటికీ రెండు గదుల అద్దె ఇంటిలో వుంటూ ఇద్దరు ఆడబిడ్డలను పోషించుకొంటున్నాడు. అతనిది సగటు నిరుపేద కుటుంబమని వారు పేర్కొన్నారు. కరోనా వల్ల అతని టీ కొట్టు మార్చి, 2020లో మూతపడింది. విధిలేని పరిస్ధితిలో, పొట్టకూటి కోసం అతను తన స్వ్రగామానికి కుటుంబంతో వెళ్లాడు. 

సొంతగ్రామంలో పొలం దున్నడానికి ఆర్థిక స్తోమత లేక తన ఆడబిడ్డల ఆసరతో మడక దున్నాడు. దాన్ని చూసిన తోటి గ్రామస్ధులు వీడియో తీసి, తమకు తెలిసిన వారికి పంపారు. అది కాస్తా సోషల్ మీడియోలో వైరల్ అయింది. ఆ వీడియోను సినీనటుడు సోను సూద్ కూడా చూశాడు.  అతను చలించి రు.8 లక్షల విలువైన కొత్త ట్రాక్టర్ ను నాగేశ్వరరావుకు తన మిత్రుల ద్వారా అందించాడు. ఈలాంటి సంఘటన పట్ల సంతోషం వ్యక్తం చేయవలసింది పోయి, కొంతమంది రాజకీయం చేయడం తగదని విమర్శించారు.

కొంతమంది పని గట్టుకొని నాగేశ్వరరావు MLA గా పోటీ చేసినాడని చెప్పారు. అతను ధనవంతుడని, అతినికి రైతు భరోసా, అమ్మ వడి పథకాల నుండి ఎన్నో వేల రూపాయల డబ్బులు వచ్చాయని చెపుతున్నారు. వారి ఆడవాళ్ళ మెడలో బంగారు గొలుసులు ఉన్నాయని ప్రచారం చేశారు. ఈలాంటి  తప్పుడు ప్రచారాన్ని చేయడం చాలా బాధాకరమని ప్రజాసంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. తెల్లరేషను కార్డే ఇనకమ్ సర్టిఫికేట్ అని  జగన్ ప్రభుత్వం ప్రకటించింది.  ఈ లెక్కన తెల్లరేషను కార్డు కలిగి వున్న నాగేశ్వరరావు కుటుంబం పేద కుటుంబమే కదా. తెల్లరేషను కార్డు అతని కుటుంబం కలిగి వుండటం వల్లే అమ్మ ఒడి పథకం వచ్చింది. 

కొట్ల డబ్బులు వెదజల్లే వారికే టిక్కెట్లు ఇచ్చే టీడీపీ, బిజేపి, వైఎస్ ఆర్ కాంగ్రెస్, కాంగ్రెస్ లాంటి పార్టీల తరపున కాకుండా  లోకసత్తా పార్టీ తరుపున నాగేశ్వరరావు మదనపల్లె నియోజకవర్గ అసెంబ్లీ స్ధానానికి పోటీ చేసి, ఓడిపోయాడు.  2వేల కరపత్రాల ఖర్చుతో 1054 ఓట్లు తెచ్చుకున్న ప్రజాస్వామికవాది అని వారు తెలిపారు.

ప్రభుత్వ అధికారులు హడావుడిగా వారి గ్రామంలోనూ, మదనపల్లెలోనూ నాగేశ్వరరావు కుటుంబం పై రంధ్రాన్వేషణ  చేయడం అర్ధరహితమని విమర్శించారు. నాగేశ్వరరావు ఆర్థిక ఇబ్బందులు చూసి ట్రాక్టర్ ను బహుకరించిన సోనూసూద్ కు నాయకులు ధన్యవాదాలు తెలిపారు. ఈ విషయం ప్రభుత్వానికి సంబంధం లేనప్పుడు, ప్రభుత్వం డబ్బుతో ట్రాక్టర్ ను కొననప్పుడు ప్రభుత్వం విచారణ చేయాల్సిన అవసరమేముందని విమర్శించారు.

ఎవరెన్ని విమర్శలు, తప్పుడు ప్రచారాలు చేసిన నాగేశ్వరరావు ముమ్మాటికి నిరుపేద దళితుడన్న విషయం యావత్ సమాజానికి తెలుసని చెప్పారు. 

ఈ కార్యక్రమంలో మాలమహానాడు జాతీయ ప్రధాన కార్యదర్శి యమలా సుదర్శనం, ఎమ్ ఆర్ పిఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి యస్.నరేంద్ర బాబు , బిఎస్పి రాష్ట్ర ఉపాధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్, సిపిఐ నాయకుడు  కృష్ణప్ప, సాంబశివ, ఆర్డిఎస్  సంస్థ రామన, పౌరహక్కుల సంఘం కార్యవర్గ సభ్యులు సిద్దేశ్వర్, గిరిజన సంఘం నాయకుడు మహేష్, ఎమ్ఆర్పిఎస్  నాయకులు వాసు, రాజా, మాలమహానాడు నాయకులు మనోహర్, మోహన్, బిఎస్పి నాయకులు  పునీత్,  కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Comments