ఊసాకు జోహార్లు - పౌరహక్కుల సంఘం

Dalith Martyrs Commemoration Meeting - USA Sambasiva rao| DesiDisa ...

క‌రోనా వైర‌స్ బారినప‌డి సామాజిక కార్య‌క‌ర్త‌లు కూడా ప్రాణాలు వ‌దులుతున్నారు. దళిత, బహుజన హక్కుల కోసం పోరాడుతూ తెలంగాణ ఉద్యమంలో, ఉపాధ్యాయుల ఉద్య‌మంలో ప్ర‌తేక పాత్ర పోషించిన సామాజిక కార్యకర్త యు. సాంబశివరావు అలియాస్ ఊసా.. క‌రోనాసోకి మ‌ర‌ణించారు..బహుజన, దళిత మేధావిగా గుర్తింపు పొందిన ఊసా.. ఉపాధ్యాయుడిగా ప్రస్థానం ప్రారంభించి... సామాజిక కార్యకర్తగా సమాజంలో గుర్తింపు పొందారు. సమాజంలో జరుగుతున్న సామాజిక అణచివేతను వ్యతిరేకిస్తూ... అణగారిన వర్గాల ప్రజల హక్కుల కోసం నిరంతరం యుద్ధం చేసిన ఆయ‌న‌ను క‌రోనా బ‌లితీసుకుంది. 

తెలుగు రాష్ట్రాల్లోని దళిత-బహుజన ఉద్యమాలలో ప్రముఖుడైన యు సాంబశివరావు(ఊసా) శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు. కరోనా మహమ్మారితో పోరాడి తుదిశ్వాస విడిచారు. గత మూడు రోజులుగా హిమయత్‌నగర్‌లోని పప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించి తనువు చాలించారు. ఉసా మరణంపై దళిత బహుజన సంఘాలతో పాటు మేధావులు, హక్కుల కార్యకర్తలు తీవ్ర దిగ్భభ్రాంతి వ్యక్తం చేశారు. ఉద్యమాల ఉపాధ్యాయుడు ఊపిరి ఆగి పోయింది అంటూ కన్నీళ్లపర్యంతమవుతున్నారు.
అద్భుతమైన వక్త , విద్యావేత్త అయిన ఊసా కుల వ్యతిరేక, ఆత్మగౌరవరాటాల్లో ముందుండే వారు. భూమిపై హక్కు, దళితుల వనరులు, అట్టడుగు వర్గాలపై వివిధ రకాల అణచివేతలను నిరోధించడంలో ఆయన సమర్థవంతంగా పనిచేశారు. బ్రాహ్మణ హిందుత్వ ద్వేషాన్ని సమర్థవంతంగా ప్రతిఘటించడంలోనూ తనదైన పాత్ర పోషించారు. అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణ కోసం జీవితాన్ని ధారపోశారు. రోహిత్‌ వేముల తల్లి రాధికమ్మతో కలిసి ‘జస్టిస్ ఫర్ రోహిత్‌’ పోరాటాల్లో గళం వినిపించారు. దళిత-బహుజన హక్కుల పరిరక్షణ కోసం ఏర్పడిన బహుజన ప్రతిఘటన వేదిక (బిపివి)లోనూ ఆయన చురుగ్గా పనిచేశారు.

‘ప్రధాన స్రవంతి’ తెలుగు మీడియా చూపించని బహుజనుల వెతలను, అగ్రకులాల అరాచకాలను వెలుగులోకి తెచ్చేందుకు ‘దేశీదిశ’ పేరుతో ఆన్‌లైన్‌ పోర్టల్‌, యూట్యూబ్ చానల్‌ను ఆయన నిర్వహిస్తున్నారు. ఊసా మరణం వర్తమాన ప్రగతిశీల ఉద్యమాలకు తీరని నష్టమని ఉద్యమకారులు పేర్కొంటున్నారు. అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణకు తన జీవితాన్ని అంకింతం చేసిన పోరాట యోధుడని ప్రస్తుతిస్తూ జోహార్లు అర్పిస్తున్నారు.
“అమ్మను రమ్మని, పాలిచ్చి పొమ్మని, కాకితో కబురంపాను, ఆ కాకి చేరలేదో, కామందు పంపలేదో, మన అమ్మ రాలేదు, ఏడుపెక్కువయ్యే, అది వెక్కి వెక్కి ఏడ్చే…” లాంటి అజరామరమైన పాటలు రాసిన బహుజన సాహితీవేత్త సాంబశివరావు... అంతేకాదు.. ఆయ‌న సామాజిక, రాజకీయ అంశాలపై రాసిన వ్యాసాలు వివిధ పత్రికల్లో వ‌చ్చేవి.. ఆ పీడ‌త ప్ర‌జ‌ల గొంతుక..బహుజన, దళిత ఉద్యమ మేధావి ఊసా లేనిలోటు పూడ్చ‌లేనిదంటూ పౌరహక్కుల సంఘం నివాళి అర్పిస్తూ, జోహార్లు చెప్పింది.

Comments