
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా విధించిన లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించి అనుమతించిన సమయం కంటే ఎక్కువ సేపు షాపును తెరచి ఉంచాడని పోలీసులు జూన్ 19న జయరాజ్(59) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో తండ్రి అరెస్టును నిరసిస్తూ సత్తాన్‌కులం పోలీసు స్టేషన్‌కు వెళ్లిన అతడి కొడుకు బెనిక్స్(31)ను కూడా అరెస్టు చేశారు. వీరిద్దరిపై ఐపీసీ 188, 383,506(II)తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మెజిస్ట్రేట్ ఆదేశాలతో కోవిల్ పట్టి సబ్ జైలుకు తరలించారు.
ఈ నేపథ్యంలో జూన్ 23న తండ్రీకొడుకులు ఇద్దరు మరణించినట్లు పోలీసులు ప్రకటించారు. కాగా జయరాజ్, బెనిక్స్‌లను తీవ్రంగా కొట్టడం వల్లే వారు మరణించినట్లు పోస్ట్‌మార్టం నివేదికలో వెల్లడైంది. అమానుష ఘటనపై మండిపడ్డ మదురై ధర్మాసనం సుమోటోగా కేసును తీసుకుంది. మృతుల బంధువులు మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో కోర్టు జ్యుడిషియల్ విచారణకు ఆదేశించింది. ఈ ఘటనపై మరోసారి కోర్టు విచారణ చేపట్టింది. జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆదేశాలను సత్తాన్‌కులం పోలీసు స్టేషను అధికారులు ధిక్కరించిన నేపథ్యంలో ఈ విషయంపై 4 వారాల్లోగా వివరణ ఇవ్వాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించింది.
మద్రాసు హైకోర్టు కీలక వ్యాఖ్యలు
జ్యుడిషియల్ కస్టడీలో మృతి చెందిన జయరాజ్, బెనిక్స్‌లపై హేయమైన దాడి జరిగిందనడానికి తగిన ఆధారాలు ఉన్నట్లు రుజువైందని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. ‘‘తండ్రీకొడుకులపై దాడికి పాల్పడ్డారంటూ పోలీసులకు వ్యతిరేకంగా కేసు నమోదు చేసేందుకు తగిన ఆధారాలు లభించాయి’’అని పేర్కొంది. తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా కోవిల్ పట్టి సమీపంలోని సాత్తాన్‌కులానికి చెందిన తండ్రీకొడుకులు జయరాజ్(59), బెనిక్స్(31) పోలీసు కస్టడీలో ఒకరి తర్వాత ఒకరు మరణించడంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు పెల్లుబుకాయి.
ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మదురై ధర్మాసనం సుమోటోగా కేసు నమోదు చేసింది. మృతుల బంధువులు మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో వారి అభ్యర్థనను మన్నించిన న్యాయస్థానం, జయరాజ్, బెనిక్స్‌ల మృతదేహాలకు పోస్ట్‌మార్టం నిర్వహిస్తున్న సమయంలో వీడియో రికార్డింగ్ చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో జస్టిస్ పీఎన్ ప్రకాశ్, జస్టిస్ పుగళేందిలతో కూడిన ధర్మాసనం పోస్టుమార్టం నివేదికను మంగళవారం పరిశీలించింది. బాధితుల మృతదేహాలపై గాయాలు ఉన్నట్లు స్పష్టమైందని పేర్కొంది.
ఈ క్రమంలో కేసును సీబీఐకి అప్పగించే విషయం గురించి న్యాయమూర్తులు మాట్లాడుతూ..‘‘వారికి న్యాయం జరుగుతుందని జయరాం కుటుంబం నమ్ముతోంది. ఒక్క సెకన్ కూడా వృథా కావడానికి వీల్లేదు. సీబీఐ ఈ కేసును చేపట్టే లోపు తిరునల్వేలి డీఐజీ ఎందుకు విచారణ ప్రారంభించకూడదు’’అంటూ ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది. ఈ విషయంపై మధ్యాహ్నంలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అదే విధంగా ఈ కేసు విచారణకై నియమించిన జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆదేశాలను సత్తాన్‌కులం పోలీసు స్టేషను అధికారులు ధిక్కరించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంపై సంబంధిత జ్యుడిషియల్ పరిధిలోని అదనపు ఎస్పీ, డీఎస్పీ, ఇతర అధికారులు 4 వారాల్లోగా స్పందించాలని ఆదేశాలు జారీ చేసింది.
జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ నివేదికలో కీలక అంశాలు
పోలీసులు విచక్షణారహితంగా కొట్టినందు వల్లే సత్తాన్‌కులంకు చెందిన జయరాజ్, బెనిక్స్ మరణించినట్లు జ్యుడిషియల్ విచారణలో తేలింది. తమిళనాడులో సంచలనం సృష్టించిన తండ్రీకొడుకుల కస్టడీ డెత్‌పై మద్రాస్ హైకోర్టు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ విచారణకు ఆదేశించింది. ఘటనపై విచారణ జరిపిన మెజిస్ట్రేట్ ఇందుకు సంబంధించిన నివేదికను కోర్టుకు సమర్పించారు. ప్రత్యక్ష సాక్షుల కథనం, పోలీస్ స్టేషనులోని పరిస్థితులను బట్టి పోలీసులు దారుణంగా కొట్టడం వల్లే జయరాజ్, బెనిక్స్ మృతి చెందారని పేర్కొన్నారు.
ఈ మేరకు నాలుగు పేజీలతో కూడిన నివేదికలో ‘‘జూన్ 19 రాత్రంతా పోలీసు అధికారులు ఆ తండ్రీకొడుకులను కొట్టినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. బాధితులను కొట్టేందుకు ఉపయోగించిన లాఠీలు, వారిని పడుకోబెట్టిన బల్లపై రక్తపు మరకలు ఉన్నాయి. ఆ లాఠీలను హ్యాండోవర్ చేయాల్సిందిగా నేను ఆదేశించగా, సత్తాన్‌కులం పోలీసులు నా మాటలు వినబడనట్లు నటించారు. నేను గట్టిగా అడిగిన తర్వాత అయిష్టంగానే వాటిని ఇచ్చారు. మహరాజ్ అనే పోలీస్ కానిస్టేబుల్ నా వెనుక చేరి గొణగడం మొదలు పెట్టారు. విచారణతో నేనేమీ సాధించలేది లేదని అన్నారు. ఇక మరో పోలీసు అధికారి బాధితులను వేధిస్తున్న సమయంలో వీడియో తీసినట్లు తెలిసింది. అంతేకాదు పోలీస్ స్టేషన్‌లో ఉన్న సీసీటీవీ ఫుటేజీ 24 గంటల్లో ఆటోమేటిక్‌గా డిలీట్ అయ్యేలా సెట్టింగులు మార్చారు. ఇవే కాకుండా ఈ కేసులో ఉన్న ఇతర సాక్ష్యాధారాలను నాశనం చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వెంటనే వాటిని పరిరక్షించే ఏర్పాట్లు చేయాలి’’అంటూ విచారణలో వెల్లడైన అంశాలను పొందుపరిచారు.
సీసీ ఫూటేజీ ఏం చెపుతోంది
తమిళనాడులో తండ్రీకొడుకులు జయరాజ్, బెనిక్స్ కస్టడీ డెత్ కేసులో కీలక వీడియో వెలుగు చూసింది. దీని ప్రకారం పోలీసులు చెప్పిన ఎన్నో విషయాలు అబద్ధమని రుజువవుతోంది. ట్యుటికోరన్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లో జూన్ 19న వారు నిర్వహించే మొబైల్ దుకాణం ముందు రద్దీ ఉందని, దీంతో వారిపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేయగా తండ్రీకొడుకులు ఎదురు తిరిగినట్లు పేర్కొన్నారు. కానీ తాజాగా బయటపడ్డ సీసీటీవీ ఫుటేజీలో దుకాణం ముందు ఎలాంటి రద్దీ లేదు. సాధారణంగా ఫోన్‌లో మాట్లాడుతున్న జయరాజ్ పోలీసులు పిలవడంతో వారి దగ్గరకు వెళ్లాడు. అతని వెనకాలే కొడుకు కూడా వెళ్లాడు. పైగా పోలీసులు అహంకారంతో దురుసుగా మాట్లాడినట్లు స్థానికులు తెలిపారు. అయినప్పటికీ వాళ్లు పోలీసులకు సహకరించారే తప్ప ఎలాంటి బెదిరింపులకు పాల్పడలేదని సీసీటీవీలో స్పష్టమవుతోంది. అక్కడ ఘర్షణ జరిగిన ఆనవాళ్లు కూడా లేవు.
పోలీసులు బెనిక్స్ తండ్రిని వాహనంలో తీసుకు వెళుతుంటే అతడి కుమారుడు ఆ వాహనాన్ని అనుసరించాడు. సీసీటీవీలో వారు స్వంతంగా గాయపర్చుకున్నట్లు ఎక్కడా కనిపించకపోవడంతో వారికి వారే స్వతాహాగా గాయాలు చేసుకున్నారన్న వాదనలోనూ నిజం లేదని తేలింది. ఇక పోలీస్ స్టేషన్‌కు చేరుకునేసరికి పోలీసులు తన తండ్రిని దారుణంగా కొట్టడాన్ని బెనిక్స్ గమనించాడు. దీంతో అడ్డుకోబోయిన బెనిక్స్‌ను సైతం అదుపులోకి తీసుకుని దారుణంగా హింసించారు. దీంతో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న సమయంలోనే తండ్రీకొడుకులిద్దరూ ఒకరి తర్వాత మరొకరు మరణించారు. ఈ ఘటనపై ఇద్దరు సబ్ ఇన్‌స్పెక్టర్లు, ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేయగా మరో 15 మందిని బదిలీ చేశారు. ప్రస్తుతం సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపడుతున్నారు.
పోలీసుల అరెస్టుతో స్ధానికుల సంబరాలు
తండ్రీకొడుకులను తీవ్రంగా గాయపరిచి వారి మృతికి కారణమైన ప్రధాన నిందితుడు, సబ్ ఇన్స్‌పెక్టర్ రఘు గణేశ్‌తో పాటు మరో ఎస్సై బాలకృష్ణన్ సహా ఐదుగురు పోలీసులు అరెస్టయ్యారు. వీరిపై ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం హత్యానేరం కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు సీబీ-సీఐడీ వర్గాలు వెల్లడించాయి. జయరాజ్, బెనిక్స్‌ల కస్టడీ డెత్‌తో సంబంధం ఉన్నట్లుగా భావిస్తున్న ఇతర పోలీసులను కూడా విచారిస్తున్నట్లు తెలిపాయి. ఇందుకోసం 12 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నాయి. కాగా జయరాజ్, బెనిక్స్‌ల దారుణ మృతికి కారణమైన వారికి కఠిన శిక్షలు తప్పవంటూ తమిళనాడు న్యాయశాఖా మంత్రి సీ వీ షణ్ముగం ప్రకటించిన కొన్ని గంటల్లోనే నిందితులు అరెస్టు కావడం గమనార్హం.
కస్టడీ డెత్ నిందితులను పోలీసులు అరెస్టు చేయడంపై ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. విషయం తెలిసిన వెంటనే తూత్తుకుడిలో సంబరాలు మొదలయ్యాయి. టపాసులు పేలుస్తూ స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు సత్తాన్‌కుళం పోలీసు స్టేషన్‌లో పనిచేసే పోలీసులంతా ఈ కేసులో అరెస్టు అవుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఆ స్టేషన్ రెవెన్యూ విభాగం నియంత్రణలోకి వెళ్లింది.
ప్రైవేటు భాగాల్లోకి లాఠీలు దూర్చారు
19న రాత్రంతా పోలీసులు వీరిద్దరిని తీవ్రంగా హింసించారని ఈ ఘటనపై విచారణ చేపట్టిన అధికారులు చెప్పారు. వారి ప్రైవేటు భాగాల్లోకి లాఠీలు దూర్చారని తెలిపారు. తమిళనాడు పోలీసుల అమానుషత్వాన్ని అమెరికాలో నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్ ఉదంతంతో పోలుస్తూ గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవానీ ట్వీట్ చేశారు.
భారత్ ‘జార్జి ఫ్లాయిడ్’లు
తమిళనాడు పోలీసుల రాక్షసత్వంపై దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించారన్న కారణంతో తండ్రీకొడుకుల్ని హింసించి చంపడంపై జనం మండిపడుతున్నారు. వీరిని ఇండియన్ ‘జార్జ్ ఫ్లాయిడ్’లు అంటూ నెటిజన్లు సోషల్‌మీడియాలో వ్యాఖ్యాని స్తున్నారు. తమిళనాడులోని శాంతాకులం ప్రాంతానికి పి.జయరాజ్ (62) జూన్ 19న తన దుకాణాన్ని లాక్‌డౌన్ నిబంధనల ప్రకారం సాయంత్రం 7 గంటలకు మూసివేయకపోవడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తండ్రి గురించి కనుక్కోవడానికి వెళ్లిన జయరాజ్ కొడుకు బెనిక్స్‌నూ అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం తెలిసి వారి బంధువులు 20న స్టేషన్‌కెళ్లారు. అప్పుడే వారిద్దరి నడుము భాగాల కింద తీవ్రంగా రక్తస్రావం అవుతుండడాన్ని గుర్తించారు. 21న వీరిద్దరూ రిమాండ్‌లోనే కన్నుమూశారు.
- అమన్
Comments
Post a Comment