మాస్కు లేదని కిరణ్‌కుమార్‌(26)ను దారుణంగా కొట్టారు (ప్రకాశం జిల్లా)


మాస్కు లేదని దారుణంగా కొట్టారు

పోలీసులపై మృతుడి తండ్రి ఫిర్యాదు

ఎస్సైపై అట్రాసిటీ, హత్యానేరం కేసులు నమోదు చేయాలి

రూ.కోటి పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి
 - పౌరహక్కుల సంఘం

చీరాల(ప్రకాశం): పోలీసుల దాడిలో గాయపడ్డ దళిత యువకుడు చికిత్స పొందుతూ మృతిచెందాడు. దీన్ని పౌరహక్కుల సంఘం తీవ్రంగా ఖండించింది. ప్రజాసంఘాలు, దళిత సంఘాలు, వివిధ పార్టీలు కూడా ఖండించాయి. గత శనివారం కొత్తపేట పంచాయతీ సమీపంలోని పోలీస్‌ చెక్‌పోస్టు వద్ద  కిరణ్‌కుమార్‌(26), షైనీలను పోలీసులు ఆపారు. మాస్కు లేకపోవటంతో ప్రశ్నించారు. ఆ క్రమంలో వారిమధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. టూటౌన్‌ ఎస్సై విజయ్‌కుమార్‌ సిబ్బందితో కలిసి కిరణ్‌కుమార్‌ను కొట్టగా గాయాలు కావడంతో చీరాల ఏరియా వైద్యశాలలో చేర్చారు. పరిస్థితి సీరియ్‌సగా ఉందని వైద్యులు చెప్పటంతో కుటుంబసభ్యులు గుంటూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ కిరణ్‌కుమార్‌ మృతిచెందాడు. దీనికి పోలీసులే కారణమని మృతుని తండ్రి మోహనరావు ఆరోపిస్తున్నారు. ఒకవేళ పోలీసులు చెప్పినట్లు మద్యం సేవించి జీపు నుంచి దూకాడన్నా వారి కస్టడీలో ఉన్నాడు కాబట్టి అందుకు వారే బాధ్యులన్నారు. 

ఈ విషయమై చీరాల టూటౌన్‌ ఎస్సై విజయ్‌కుమార్‌ కొట్టిన దెబ్బలకే తన కుమారుడు మృతిచెందాడని మృతుని తండ్రి మోహనరావు ఫిర్యాదుచేశారు. విధి నిర్వహణకు ఆటంకం కలిగించారని కిరణ్‌కుమార్‌, అబ్రహం షైనీలపై కానిస్టేబుల్‌ రామిరెడ్డి ఫిర్యాదు చేశారు. జీపులో స్టేషన్‌కు తీసుకెళ్లే క్రమంలో కిరణ్‌కుమార్‌ పారిపోయేందుకు జీపు నుంచి దూకటంతో తలకు గాయమైందని పోలీసులు పేర్కొన్నారు. ఆ రెండు కేసులను వేర్వేరుగా నమోదు చేశారు. ఘటనా స్థలాన్ని ఆర్డీఓ ప్రభాకరరెడ్డి పరిశీలించారు. మృతుని కుటుంబసభ్యులకు సీఎం జగన్‌ రూ.10లక్షలు ఆర్థికసాయం ప్రకటించారు. సమగ్ర దర్యాప్తు జరపాలని ఆదేశించారు. 

దళితులపై దాడులు పెరిగాయి - పౌరహక్కుల సంఘం

రాష్ట్రంలో దళితులపై దాడులు పెరిగాయి. అందుకు ప్రభుత్వం బాధ్యత వహించాలి. కిరణ్‌కుమార్‌ టూటౌన్‌ ఎస్సై విజయ్‌కుమార్‌ కొట్టిన దెబ్బలకే మృతిచెందాడు. అతనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, హత్యానేరం కింద కేసులు నమోదు చేయటంతో పాటు అతన్ని ఉద్యోగం నుంచి తొలగించాలి.  అలాగే ఎస్సైపై అట్రాసిటీ, హత్యానేరం కేసులు నమోదు చేయాలి. రూ.కోటి పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి అని పౌరహక్కుల సంఘం డిమాండ్ చేసింది.




Comments