ఎల్జీ పాలిమర్స్ పై చర్యలేవి







విశాఖ దుర్ఘటన జరిగి 40 రోజులైనా ప్రభుత్వం ఎల్జీ పాలిమర్స్ కంపెనీపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కోటి రూపాయలు నష్టపరిహారం బాధిత కుటుంబాలకు చెల్లించి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. సదరు కంపెనీపై వచ్చిన నిజనిర్దారణ నివేదికలన్నీ కంపెనీ అంతులేని నిర్లక్ష్యం వల్లే దుర్ఘటన జరిగిందని పేర్కొన్నాయి. హైకోర్టు సైతం పాలిమర్స్ కంపెనీ గుర్తింపును రద్దు చేయమని చెప్పినా ప్రభుత్వం పట్టించుకోలేదు. అయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ప్రభుత్వాలకు ప్రజల ప్రాణాల కన్నా కార్పొరేట్ల లబ్ది అవసరమని స్పష్టమైంది.  విశాఖలోని ప్రజాసంఘాలు, పార్టీలు ప్రభుత్వంపై వత్తిడి తేవాలని ఐక్య కార్యాచరణను నిర్మిస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఈ వ్యాసం రాయడం జరిగింది. 

విశాఖ దుర్ఘటన

పెట్రోల్ డాలర్లు ఉంటాయని ప్రజలకు తెలుసు.  కానీ ఆక్సీజన్ డాలర్లు కూడా వున్నాయి. గాలిలోని ఆక్సిజన్ని అమ్ముకుంటే వచ్చేదే ఆక్సిజన్ డాలర్లు. విశాఖ తీరం వెంబడి ఉన్న గాలిలోని ఆక్సిజన్ని ప్రభుత్వాలు, కాలుష్య నియంత్రణ బోర్డులు ఏనాడో బహుళ జాతి కంపెనీలకి  అమ్మేసాయి.  దాని స్థానంలో కావలసినంత పాదరసం, భాస్వరం , గందకం, ఇనుప రజను, బొగ్గుపులుసు వాయువు  మందుల ఫ్యాక్టరీల విసర్జకాలు,  హెచ్.పి.సి.ఎల్. పెట్రో రసాయనాలు గాలిలో దట్టించి ప్రజల శ్వాసనాళాలకి అప్పనంగా అందజేస్తున్నారు. వీటిని పీల్చుకోవడం  విశాఖ ప్రజలకు ఎప్పుడో అలవాటయిపోయింది. ఇప్పుడు సౌత్ కొరియన్ కంపెనీ ఎల్ జి పాలిమర్స్, వీటన్నిటితో పాటు కొత్తగా స్టేరీన్ అనే ప్లాస్టిక్ విష రసాయనాన్ని పీల్చి బతకమని, అలా బతక గలరని కోటి రూపాయల పందెం గాచి చెపుతోంది.

మే ఏడవ తారీకు తెల్లవారుజామున రెండు గంటలకు విశాఖపట్నంలోని వెంకటాపురం దగ్గర ఉన్న ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో దుర్ఘటన జరిగింది. అందులోని రెండు ట్యాంకుల నుండి స్టేరీన్ అనే ప్రాణాంతక రసాయనం ఆవిరి రూపంలో బయటికి వచ్చింది. దీనివల్ల  12 మంది చనిపోయారు. సుమారు 1000 మంది తీవ్ర అస్వస్థతకు గురై కేజీహెచ్ ఆసుపత్రిలో చేరారు. ఈ విష వాయువు మరో ఐదు వేల మంది పీల్చుకున్నారు. ఆ ప్రాంతంలో నేల, నీరు, గాలి స్టేరీన్  వాయువుతో కలుషిత మైంది. ఈ ఘటనకు కంపెనీ, ప్రభుత్వ సంస్ధలు బాధ్యత వహించాలి.

స్టేరీన్ అంటే ఏమిటి

దీన్ని ఇతనైల్ బెంజిన్, ఫినైల్ ఇథిలీన్, ఫీనైల్ ఎధిన్, సిన్నమొని లేదా స్టరిన్ మోనోమర్ అంటారు.  ఇది రంగులేని ద్రవ పదార్థం. తియ్యటి సుగంధ పూరిత వాసనతో వుంటుంది. అనేక కర్భన రసాయనాలతో కలుస్తుంది. సింథటిక్ రబ్బర్ తో బాగా కలిసే గుణం ఉంది. అందుకే దీన్ని అనేక ప్లాస్టిక్ ఇండస్ట్రీస్లో వాడతారు. ప్లాస్టిక్ టైర్లు, రబ్బర్ షీట్ల తయారీలోను, ఇంకా అనేక ప్లాస్టిక్ ఉత్పత్తులలో విరివిగా ఉపయోగిస్తారు.

ఇది నీటిలో అంత బాగా కరుగదు. నీటిలో తేలియాడే వాయువుగా (ఫ్లోటర్ ఇ వాపరేటర్ అని దీనిని పిలుస్తారు). దీనికి మండే గుణం ఉంది. కొద్ది సేపు పీలిస్తే శ్వాస సంబంధమైన వ్యాధులు వస్తాయి. గొంతులో నస, కంటి దురద వస్తుంది. నరాలమీద తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇది క్యాన్సర్ ను కలుగజేస్తుంది.  ఎక్కువ మోతాదులో పిలిస్తే శ్వాస ఆగిపోయి,  మరణం సంభవిస్తుంది. విశాఖ దుర్ఘటనలో అదే  జరిగింది.

ప్లాస్టిక్ ఉత్పత్తిలో వాడే ఈ ప్రధానమైన రసాయనం "స్టెరీన్" ను నిల్వ చేయటం ఎంతో కష్టం. ప్రమాద భరితం కూడా. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా నిల్వచేసిన ట్యాంక్ లో పాలిమరైజేషన్ జరిగుతుంది. ఉష్ణోగ్రత పెరిగి వాయు రూపంలో లీక్ అవుతుంది. ట్యాంకర్ పేలిపోయే ప్రమాదము వుంది.  

స్టైరీన్- వాడుకలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

అంతర్జాతీయ పాలిమర్ పరిశ్రమలు ముఖ్యంగా యూరోపియన్ పరిశ్రమలు  "అసోసియేషన్ ఆఫ్ ప్లాస్టిక్ మాన్యుఫ్యాక్చరర్స్ ప్లాస్టిక్ యూరోప్" గా ఏర్పడ్డాయి. స్టెరీన్ ను పాలిమర్ పరిశ్రమలలో ఉపయోగించడం, నిల్వచేయడం, రవాణా చేయడం వంటి ప్రక్రియలలో ప్రమాదాలను నివారించడానికి కొన్ని నిబంధనలను రూపొందించాయి. ఖచ్చితమైన నిర్దిష్టమైన తు.చ.తప్పకుండా పాటించవలసిన ఈ క్రింది భద్రత ప్రమాణాలను రూపొందించాయి.

1. స్టేరీన్ ఒక చోటి నుండి మరోచోటికి రవాణా చేస్తున్నప్పుడు లేదా దాన్ని నిల్వచేసి  ఉపయోగించేటప్పుడు తప్పనిసరిగా శిక్షణ పొందిన ప్రత్యేకంగా దానికై కేటాయించబడిన నిపుణులతో పని చేయించాలి.

2. స్టేరీన్ బదిలీ చేసే ట్యాంకర్ లలో అంతకుముందు  క్యా స్టి క్ సోడా కానీ, బెంజిన్,పైరాలసిస్ గ్యాసోలిన్ (పెట్రోల్ )ఇతర మండే ద్రవాలను గాని లూబ్రికేటింగ్(కందెన నూ నెలు) ఆయిల్స్ కానీ రవాణా చేసి ఉండకూడదు.

3. ఆఖరికి స్టేరీన్ తీసుకెళ్లే ట్యాంకర్ లోపలి భాగాన్ని స్టేరీన్ తో పాలిమరైజేషన్ జరిపే పెయింట్లతో కోటింగ్ వేయకూడదు.

4. దీన్ని ట్రాన్సపోర్ట్ చేసేటప్పుడు సబ్ కాంట్రాక్ట్ ఇవ్వకూడదు.  

5. 30 డిగ్రీల సెంటిగ్రేడ్ కన్నా ఎక్కువ ఉన్న ట్యాంకర్లలో స్టేరీన్ రవాణా చేయకూడదు. స్టేరీన్ పంపు చేసే పంపులు కూడా ప్రత్యేకంగా దీనికై కేటా యించినవై వుండాలి.

6.  స్టేరీన్  నిల్వచేసిన ట్యాంకర్ వద్ద ఎప్పుడు నీటి నురగను చిమ్మే వ్యవస్థ సిద్ధంగా ఉండాలి. అలాగే టాంకర్లో టెంపరేచర్ పెరిగే అవకాశం ఉండడంవల్ల టాంకర్ వద్ద శీతలీకరణ వ్యవస్థ సిద్ధంగా ఉండాలి.

7. నిల్వ ఉంచిన ట్యాంకర్లో ఉష్ణోగ్రత 50 డిగ్రీల సెంటిగ్రేడ్ దాటితే పెరుగుతున్న ప్రతి ఒక డిగ్రీ సెంటిగ్రేడ్ సమాచారాన్ని ప్రధాన నిర్వహణ అధికారికి తెలియజేయాలి.

8. టెంపరేచర్ 15 డిగ్రీల సెంటిగ్రేడ్ కన్నా తక్కువగా ఉంటే, వారానికి ఒకసారి నమూనా తీసుకొని పాలిమరైజేషన్ జరుగుతుందో లేదో పరీక్షించాలి. అదే 25 డిగ్రీలు దాటితే, ప్రతిరోజు నమూనాను పరీక్షించాలి.

9.  ట్యాంకర్ లోని స్టేరీన్ 20 డిగ్రీల నుండి 50 డిగ్రీలు పెరగడానికి 25 రోజులు పడుతుంది. అది 65 డిగ్రీలకు చేరుకుంటే అక్కడి నుండి 20 నిమిషాలలో ప్రమాదకరమైన ఉష్ణోగ్రతకు చేరుకుంటుంది.

10. రోజుకి మూడు డిగ్రీల సెంటిగ్రేడ్ టెంపరేచర్ పెరుగుతుంటే స్టేరీన్ రన్ వే టెంపరేచర్ కి, అనగా త్వరలో వేగంగా టెంపరేచర్ పెరిగి పాలిమరైజేషన్ ప్రక్రియకు సిద్ధమవుతోందని అర్థం.

11. ట్యాంకర్ 85 డిగ్రీలకు చేరుకుంటే 100 నిమిషాల్లో టాంకర్లో ఒత్తిడి పెరిగి పగుళ్లు రావడం జరుగుతుంది.  సేఫ్టీ వాల్ ఇతర వ్యవస్థలు నాశనం అవ్వడం జరుగుతుంది. ఒక్కొక్కసారి ట్యాంకర్ పేలి పోతుంది కుడా. ఈ లోపల అలారం మోగించడం,  దగ్గరిలోని ప్రజలకు హెచ్చరికలు జారీ చేయడం, ఇళ్లను ఖాళీ చేయించడం చేయాలి.

 యూరోపియన్ యూనియన్ ప్రకటించిన ప్రమాణాలను పాటించివుంచే విశాఖలోని ఎల్జి పాలిమర్స్ ఘటన జరిగి వుండేది కాదు. ఎందుకంటే ఎల్.జి. పా లి మర్స్, ఒక అంతర్జాతీయ సంస్థ.

ప్రభుత్వ నిర్లక్ష్యం

ప్రమాదం గురించి  ప్రభుత్వ అధికారులు మాట్లా డు తు, 43 రోజుల లాక్ డౌన్ తర్వాత ఎలాంటి  శిక్షణలేని సాధారణ సిబ్బంది ఫ్యాక్టరీనీ తెరవడం వల్ల ఈ ప్రమాదం సంభవించిందని చెప్పారు. నలభై మూడు రోజులు లాక్ డౌన్ లో ఎవరు లేకపోవటంవల్ల ట్యాంకర్ లో పాలిమరైజేషన్ జరిగిందని, టెంపరేచర్ పెగడంవల్ల సెఫ్టీవాల్వ్ ద్వారా గ్యాస్ లీక్ అయిందని యాజమాన్యం చెప్పింది.

ఇక్కడ ప్రశ్న ఏంటంటే లాక్ డౌన్ సమయంలో బ్యాంకులు పని చేశాయి. ఎన్నో అత్యవసర సర్వీసులు పనిచేశాయి. ప్రమాదకరమైన  స్టేరీన్ ట్యాంకులను పరిశీలించ కుండా ఎల్జీ పాలీమర్స్ యాజమాన్యం తెరిచింది.  స్టేరీన్ ట్యాంక్ దగ్గర ఎప్పుడు నిపుణుల బృందం ఉండాలి. ఎప్పటికప్పుడు టెంపరేచర్ గమనిస్తూ వుండాలి. ట్యాంకర్ లో పాలిమరైజేషన్ మొదలైతే ఆపటానికి, నిర్వీర్యం చేయడానికి కావలసిన రసాయనిక పదార్థాలు సిద్ధంగా ఉంచుకోవాలి. అలాంటి రసాయనిక పదార్థాలు కంపెనీ ఆవరణలోనే ఉండాలి. ఇవన్నీ కొరియన్ కంపెనీ కి తెలుసు. అయినా అంతర్జాతీయ భద్రతా ప్రమాణాలను కంపెనీ ఏ మాత్రం పాటించలేదు, ఇది ఘోర నిర్లక్ష్యం, తప్పిదం.

 ప్రభుత్వం, "స్టే రీన్" ను ప్రమాద రహితం చేసే 500 కిలోల రసాయనాన్ని నేషనల్ డిజాస్టర్ టీం మేనేజ్మెంట్ అథారిటీ (NDMA) గుజరాత్ నుండి  విమానంలో సంఘటనా స్ధలానికి హుటాహుటిన తరలించింది.అంటే భారత దేశంలో వున్న మిగతా కంపెనీల వద్ద ఇలాంటి రసాయనాలను సిద్ధంగా వుంచుకున్నా రాన్న మాట! ఆ విషయం కేంద్రానికి తెలుసు, కానీ ఎల్ జి పాలిమర్ లో ఇది వుందో లేదో తెలియదు.

 ఫ్యాక్టరీని తెరిచేటప్పుడే సుశిక్షితులైన సాంకేతిక నిపుణులతో కంపెనీ తెరవాలని ఆదేశించామని రాష్ట్ర పారిశ్రామిక మంత్రి అంజి రెడ్డి  విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అంటే ప్రభుత్వానికి ఫ్యాక్టరీలో ప్రమాదకరమైన స్టేరీన్ ఉన్నదని  ముందే తెలుసని అర్ధం అవుతోంది.



ఏ వాయువు అయినా జడత్వంలో స్థిరంగా 40 రోజులు ఉండదని ఇంటర్మీడియట్ కెమిస్ట్రీ చదివే విద్యార్థికి కూడా తెలు సు.  సంవత్సరానికి 20 వేల కోట్ల డాలర్ల వ్యాపారం నడుపుతూ 2500 కోట్ల డాలర్ల లాభాన్ని గ డిస్తున్నా ప్రపంచ ప్లాస్టిక్ దిగ్గజం ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యానికి ఈ విషయం తెలీకుండా వుండదు. కంపెనీ యాజమాన్యపు నిర్లక్ష్య దోరణి వల్లే దుర్ఘటన జరిగింది.

ప్రమాదం జరిగిన తరువాత ఫ్యాక్టరీని పరిశీలించిన నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ టీం (NDMA), ఫ్యాక్టరీలో స్టేరీన్ ను నిల్వ ఉంచిన ప్రదేశాలను పరిశీలించి నిర్ఘాంతపోయింది.  ఎందుకంటే ట్యాంకర్లు మరింత ప్రమాదకరమైన దారుణమైన రీతిలో నిల్వచేయబడి ఉన్నాయి. ఇక్కడే కాదు పోర్టులో నిల్వ ఉంచిన స్టేరీన్ ట్యాంకర్ల పరిస్థితి కూడా దారుణంగా ఉంది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం 13వేల టన్నుల రసాయనాన్ని లాక్‌డౌన్‌ సమయంలో దేశం ఆవలికి తరలించి వేయమని ఆదేశించింది.(ఇప్పుడు లాక్ డౌన్ నియమాలు వర్తించవా?) 8000 టన్నులు ఒక ఓడలోను, 5000 టన్నులు మరో ఓడలోను  ప్రభుత్వం విశాఖ నుండి తరలించింది.

ప్రమాదకరమైన వ్యర్ధాల నిర్వహణ వినియోగం బదిలీ ఎలా చేయాలో 1988 చట్టం చెపుతుంది. దీనిప్రకారం, ప్రమాదకర  రసాయనాల ఉత్పత్తి నిల్వచేయడం, దిగుమతి చేసుకోవడం,  వినియోగించడం లాంటి వివరాలను సంబంధిత అధికారులకు ప్రభుత్వాలకు తెలియజేయాలి.  స్టేరీన్ గురించి స్థానిక పర్యావరణ కాలుష్య నియంత్రణ  మండలికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కంపెనీ వారు తెలియజేయలేదు.

కంపెనీ నిర్లక్ష్యం

స్టోరేజీ ట్యకుల వద్ద అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా భద్రతా చర్యలు కంపెనీవారు చేపట్టలేదు. అసలు కేంద్రం నుంచి కంపెనీకి సరైన అనుమతులు లేవు . ఫ్యాక్టరీని పరిశీలించిన NDMA  టీం రసాయనాన్ని నిల్వ ఉంచే ట్యాంకుల నాణ్యత సరిగాలేదని చెప్పింది. అవి పాత వని ఆధునికమైన పరిజ్ఞానాన్ని అవి వినియోగించుకోలేవని చెప్పింది. వీటిలో రసాయనాన్ని పదిహేను రోజుల కన్నా  ఎక్కువ  నిల్వ ఉంచ లేమని  , అందువల్లే స్టేరీన్ పాలిమరైజేషన్ జరిగిందని చెప్పింది.

ఈ టీంకి డాక్టర్ అంజన్ రే, డైరెక్టర్,  ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ పెట్రోలియం, సెంతన్ గౌతీ,  పారిశ్రామిక నిపుణులు  నాయకత్వం వహించారు. పాడైపోయిన వాల్వ్ లీకేజీ కి కారణమని ట్యాంకులో పాలిమ రైజీషన్ జరిగి ఒత్తిడి పెరిగి లీక్ అయిందని కంపెనీ చెప్పింది. ఒకవేళ అలా లీక్ అవ్వకుండా వాల్ అడ్డుపడి ఉంటే మొత్తం ట్యాంక్ ఒత్తిడికి గురై పగుళ్లు వచ్చి ట్యాంకు పేలిపోయి వుండేది.  అప్పటికి ట్యాంక్ లో టెంపరేచర్ 180 డిగ్రీలు ఉంది. ఆ రోజు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా సుమారు నాలుగు టన్నుల రసాయనం ట్యాంకుల నుండి లీక్ అయింది.ఏడవ తారీకు  సాయంత్రం నలుగురు సభ్యులతో కూడిన కోర్ కమిటీ తొమ్మిది మంది సభ్యులతో కూడిన నిపుణుల టీం వచ్చి లీకేజీని ఆపింది. నిపుణుల బృందం అప్పటివరకు అక్కడ లేదని తెలుస్తోంది. అంటే పాలిమర్ కంపెనీకి నిపుణుల బృందం దరిదాపుల్లో లేదన్నమాట.

 వచ్చిన నిపుణుల బృందం (PTBC)  పేరా  టెరిటరీ బ్యుటైల్  కేదొడ్  రసాయనాన్ని గుజరాత్ నుండి విమానంలో తెచ్చి కలిపింది. దీని ద్వారా అన్ని ట్యాంక్లలో ఉన్న 50 శాతం స్టే రీన్ అనగా 18 వేల టన్నుల స్టే రీన్  ఘన పదార్థంగా మారిపోయింది. ఇంకా 18 వేల టన్నుల రసాయనం మిగిలే ఉంది . దీన్ని తరువాత రోజు మార్చారు. దీన్నిబట్టి చూస్తే మిగతా లీక్ అవని ట్యాంకుల లో రక్షణ వ్యవస్థ ఎంత డొల్ల గా వుందో తెలుస్తోంది. 

 పర్యావరణ అనుమతులు లేవు.

ఎల్ జి కంపెనీ ప్రతినిధి "చావో సాంగ్  కుయి" మాట్లాడుతూ విశాఖ కంపెనీ ఎల్లవేళలా చట్టాలను అనుసరిస్తూ కేంద్ర రాష్ట్ర అధికారుల ఆదేశాలను పాటిస్తూ ఉత్పత్తిని కొనసాగిస్తోందని నొక్కివక్కాణించారు. కానీ  ప్రాథమిక సమాచారం ప్రకారం 2019లో కంపెనీ క్లియరెన్స్ కోసం పెట్టిన అప్లికేషన్ తో పాటు ఒక అఫిడవిట్ ని (వాంగ్మూలాన్ని) సమర్పించింది. దాంట్లో  పర్యావరణ అనుమతి పత్రాన్ని  పొందలేదని తెలియజేసింది. 

నిజానికి భారతదేశంలో ఎన్నో కంపెనీలు సంవత్సరాల నుండి పర్యావరణ అనుమతులు లేకున్నా పని చేస్తూనే ఉన్నాయి. ఎల్జీ కంపెనీ 1997 లో టేక్ ఓవర్ చేసుకుని పని ప్రారంభించింది. 1997 నుండి  2006 వరకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 2006లో వచ్చిన కొత్త చట్టం ప్రకారం దేశంలోని ప్రతి కంపెనీ మెట్రో కంపెనీ లతో సహా వాళ్ల ఉత్పత్తి పరిమాణాన్ని పెంచినప్పుడు, ఉత్పత్తులను మార్చినప్పుడు,పరిశ్రమను విస్తరించినప్పుడు తప్పనిసరిగా కేంద్రం అనుమతి తీసుకోవాలి. ఎల్జి పాలిమర్స్ 2006 నుండి 2018 వరకు ఐదుసార్లు కంపెనీ సామర్థ్యాన్ని ఉత్పత్తిని పెంచింది. కానీ  అది ఎప్పుడూ ఎలాంటి పర్యావరణ అనుమతులు పొందలేదని 2019  మే లో ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొంది.

ఎల్జి పాలిమర్స్ ఎన్నడు పర్యావరణ అనుమతుల కోసం కేంద్ర కాలుష్య నియంత్రణ మండలిని సంప్రదించలేదు. కానీ 2017 లో రాష్ట్ర  పర్యావరణ కాలుష్య నియంత్రణ మండలిని మారిన ఉత్పత్తి సామర్థ్యానికి అనుగుణంగా అనుమతుల కోసం సంప్రదించింది. రాష్ట్ర పర్యావరణ సంఘం కేంద్రం నించి అనుమతులు తెచ్చుకోమందే తప్ప , కంపెనీని పరిశీలించడం గాని ఉత్పత్తిని లేదా కంపెనీ కార్యకలాపాలను నిలిపివేయమని ఆదేశించడం గాని జరగలేదు. 2018లో ప్లాస్టిక్ బాటిల్స్ ని ఇతర ప్లాస్టిక్ సామాగ్రిని తయారుచేయటానికి, ఉత్పత్తి పరిమాణాన్ని పెంచడానికి మొట్టమొదటిసారిగా ఎల్జీ కంపెనీ పర్యావరణ అనుమతుల కోసం కేంద్ర మంత్రిత్వ శాఖకు అర్జీ పెట్టుకున్నట్లు కంపెనీ డాక్యుమెంట్ల ద్వారా తెలుస్తోంది. అందుకు పర్యావరణ మంత్రిత్వ శాఖ జెండా పచ్చ జెండా ఊపి, ఎల్జీ కంపెనీ అప్లికేషన్ ని పరిశీలించింది.  దాంట్లో వాళ్లకి తెలిసిందేమిటంటే ఎల్జీ పాలిమర్స్ కి ఎలాంటి అనుమతులు లేకుండానే ఉత్పత్తులు కొనసాగిస్తోందని రికార్డులు చూసి అర్థం చేసుకున్నారు. దాంతో ఎల్ జి., కి అయాచితంగా ఒక అవకాశాన్ని ఇచ్చారు. అదేంటంటే ఇప్పటిదాకా అనుమతిలేకుండా, జరిగిన ఉత్పత్తికి క్షమించమని, ఒక పత్రం రసిస్తే, జరిగిన ఉత్పత్తికి జరగబోయే ఉత్పత్తికి అనుమతిని పరిశీలిస్తామని తెలియ జేసింది.ఎంజరిగిందో ఏమో గానీ ఐఎఎస్ వ్యవహారం అంతటితో ఆగిపోయింది.


 చివరకి జరిగింది ఏంటంటే కేంద్ర రాష్ట్ర  మంత్రిత్వ శాఖల అనుమతి లేకుండానే ఎప్పట్లాగే ఎల్జీ కంపెనీ ఉత్పత్తి కొనసాగిస్తోంది.  నిజానికి రాష్ట్ర ప్రభుత్వంరెండు విషయాలకు మాత్రమే అనుమతులు జారీ చేసింది. 1)  కొత్త వ్యాపారాన్ని మొదలు పెట్టడానికి 2) ఉత్పత్తిని నిర్వహించడానికి,  అనుమతులు ఇవ్వబడ్డాయి.

ఈ అనుమతిని ప్రతి ఐదు సంవత్సరాలకి రెన్యూవల్ చేసుకోవాలి.  కానీ అలాంటిది జరిగినట్లు దాఖలాలు లేవు. ఎల్జీ పాలిమర్స్ రెన్యువల్ కోసం వెళ్లిన ప్రతిసారి ఏపీపొల్యూషన్ అధికారులు కంపెనీకి జాతీయ చట్టాలను అనుసరించి జరిమానా విధించవచ్చు. కంపెనీని పరిశీలించి అనుమతించటం కానీ నిరాకరించటం గాని చేయవచ్చు. అయితే ఇవన్నీ కేంద్రం అనుమతులు అందిన తర్వాతే జరుగుతాయి.కేంద్ర   నించి ఎలాంటి సమాచారం లేదు. రాష్ట్ర శాఖ తనకు తానుగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. చివరికి జరిగిందేమిటి అంటే , ఎల్.జి.పాలి మార్స్  యధావిధిగా తన ఉత్పత్తిని కొనసాగిస్తోంది.

ఎల్ జి పాలిమర్స్ చరిత్ర

 ఎల్ జి పాలిమర్స్ ఫ్యాక్టరీ 1961  లో హిందుస్థాన్ పాలిమర్స్ చేత స్థాపించబడింది. అప్పట్లో ఇతర ప్లాస్టిక్ ఉత్పత్తులను హిందుస్థాన్ పాలిమర్స్ ఉత్పత్తి చేసేది. తరువాత 1978లో యునైటెడ్ బేవరేజెస్ యూనిట్ మెట్రో వర్క్ లిమిటెడ్ తో కలిసి ఉత్పత్తి కొనసాగించింది. 1997 లో నూతన ఆర్థిక విధానాల వల్ల,  దక్షిణ కొరియా కంపెనీ అయిన, ఎల్జీ పాలిమర్స్ దిగ్గజం భారతదేశం పాలిమర్స్ బిజినెస్ కి మంచి మార్కెట్ అని అంచనావేసి, దేశంలోకి ప్రవేశించింది. అందుకు పాత టెక్నాలజీ తో నడుస్తున్న హిందుస్థాన్ పాలిమర్స్ అనువైనదిగా ఎంచుకొని టేకోవర్ చేసింది. ఎల్జీ పాలిమర్స్ ప్రపంచంలోనే ఒక పెద్ద  బహుళజాతి సంస్థ. 1947లో దక్షిణ కొరియాలో స్థాపించబడింది. దీంట్లో 2015 నాటికి 20,000 ఉద్యోగులు పని చేస్తున్నారు. 2012  నాటికి దీని టర్నోవర్ 20.4 బిలియన్ డాలర్లు సంవత్సరానికి లాభం రెండువేల కోట్ల డాలర్లకు పైమాటే. దీని ప్రధాన ఉత్పత్తులు రసాయనాలు,  ఐ టి  మరియు ఎలక్ట్రానిక్ పరికరాల , విద్యుత్ పరికరాలు విద్యుత్ ఉత్పత్తి సామాగ్రి లు. దక్షిణ కొరియాలో ఈ కంపెనీ జాతీయ అంతర్జాతీయ పర్యావరణ చట్టాలను కాలుష్య నివారణ చట్టాలను అనుసరిస్తూ ఎప్పటికప్పుడు తన ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుంటోంది.ఎలాంటి కంపెనీ 1997లో భారతదేశంలోని పాలిమర్ ఇండస్ట్రీలో కాలు పెట్టింది.

చట్టాల ఉల్లంఘన

పర్యావరణ పరిరక్షణ చట్టం 1986, పబ్లిక్ లై ఫ్ ఇన్సూరెన్స్ యాక్ట్ 1991,  ప్రమాదకరరసాయనాల ఉత్పత్తి నిల్వ రవాణా మరియు దిగుమతి చట్టం 1989 లాంటి ఎన్నో చట్టాలు ఉన్నాయి. పటిష్టమైన చట్టాలు పర్యావరణ రక్షణ కోసం, ప్రజల రక్షణ కోసంచేశారు. ఎల్జి పాలిమర్స్ బహుళజాతి సంస్థ దేశంలోని ఈ చట్టాలు వేటిని అనుసరించలేదు.

 ఫ్యాక్టరీ అమెండ్మెంట్ యాక్ 1987 ప్రకారం  ఫ్యాక్టరీ ప్రమాదకర ఉత్పత్తి విభాగాలను వాటి నిర్మాణాలను వివరించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలి. ఫ్యాక్టరీ లోని కార్మికుల రక్షణ ఫ్యాక్టరీ దగ్గర  నివసించే ప్రజల రక్షణ కోసం తీసుకునే నివారణ చర్యలు ఆ యంత్రాంగం గురించి ఒక నివేదిక సమర్పించాలి. కానీ ఇలాంటివి  ఏవి జరగలేదు.

ఎల్జి పాలిమర్స్ బహుళజాతి సంస్థ, అంతర్జాతీయ ప్రమాణాలను అనుసరించి పర్యావరణ సూత్రాలను పాటించి భద్రతా చర్యలను తీసుకొని  ఉత్పత్తిని కొనసాగిస్తున్నాం  అని పదే పదే చెప్పుకుంటోంది . కానీ జాతీయ పర్యావరణ మరియు  అటవి వాతావరణ పరిరక్షణ మంత్రిత్వ శాఖ (యూనియన్ మినిస్టరీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్)కి సమర్పించిన అఫిడవిట్లో కంపెనీ,  ఎన్విరాన్మెంట్ అసెస్మెంట్ నోటిఫికేషన్ (EIA) 2006 చట్టం కింద ఎలాంటి అనుమతులు పొందలేదని స్పష్టమవుతోంది.

కేవలం ఆంధ్ర ప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నుండి కంపెనీ స్థాపించడానికి, కార్యక్రమాలు నిర్వహించడానికి మాత్రమే అనుమతులు పొందింది. ప్రమాదాన్ని పరిశీలిస్తే కంపెనీ ఎలాంటి  భద్రతా ప్రమాణాలను పాటించలేదని, స్టే రీన్ వినియోగానికి సంబంధించి తీసుకోవలసిన పర్యావరణ అనుమతులు భద్రతా చర్యలు వాటి వివరణలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు  అందజేయ లేదని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం చట్ట బాహ్యంగా కొనసాగుతున్న ఉత్పత్తిని పట్టించుకోలేదు. కానీ 1996 చట్టాన్ని అనుసరించి కేంద్రం ఏర్పరుచుకున్న  NDMA టీం ని సాయంత్రం కల్లా పంపింది. 
2017 మార్చిలో కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది.

 ఎవరైనా  కొత్తగా పరిశ్రమలు స్థాపిస్తున్నా, విస్తరణ చేస్తున్నా, అధునికరిస్తున్నాపర్యావరణ అనుమతులు వివిధ చట్టాలు కింద అ పర్యావరణ అనుమతులు లేకపోతే వెంటనే అప్లై చేసుకోమని ప్రకటించింది. ఆ రకంగా  దేశవ్యాప్తంగా కొన్ని వందల కంపెనీలు ఎలాంటి ప్రమాణాలు లేకపోయినా కేంద్రం నుంచి అనుమతులు పొందాయి.పర్యావరణ చట్టాలని భద్రత చట్టాలని కార్మిక చట్టాలను అనుసరించకుండా అభివృద్ధి పేరిట ఉత్పత్తిని కొనసాగిస్తున్నాయి. ఇలాంటి పరిశ్రమల పట్ల చర్యలు తీసుకోవాల్సింది పోయి , వారికి  అనుమతులు ఇస్తున్నారు. యూనియన్ మినిస్టరీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయిమెంట్ మార్చి 16న లోక్ సభలో  ఆంధ్రప్రదేశ్లో 2012 నుంచి 2017 వరకు పారిశ్రామిక ప్రమాదాలలో 383 మంది మరణించారని చెప్పింది. 1047 మంది కార్మికులు గాయపడ్డారని, కేవలం విశాఖపట్నంలో 2007 నుంచి 2017 వరకు జరిగిన జరిగిన ప్రమాదాలలో 54 మంది  మరణించారని తెలిపింది. ఇవన్నీ ఆయా కంపెనీలలో సరైన రక్షణ వ్యవస్థ లేకపోవడం వల్ల  జరిగినవే అని ప్రకటించింది.

స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోటోకాల్ అనగా నాణ్యమైన  ఉత్పత్తి ప్రమాణాలను అనుసరించకపోవడం, ప్రమాదకర రసాయనాలను నిర్లక్ష్యంగా నిర్వహించటం, ప్రమాదం జరగకుండా  నివారించగలిగే యంత్రాంగం,  సాంకేతిక నిర్మాణం ప్రణాళికలు కంపెనీ లో లేవు. చట్టాలున్నా వాటిని పటిష్టంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయడం లేదు. అభివృద్ధి పేరిట పరిశ్రమలకు సరైన ప్రమాణాలు లేకపోయినా అనుమతించటం వల్లనే ప్రజలు ప్రాణాలు కోల్పతున్నారని భోపాల్ నించి విశా ఖ వరకు జరిగిన ప్రమాదాలు రుజువు చేస్తున్నాయి.

వైజాగ్ సముద్రం తీరం వెంబడి ఎన్నో ఫార్మాస్యూటికల్ కంపెనీలు సరైన పర్యావరణ అనుమతులు లేకపోయినా,  భద్రతా చర్యలు పాటించకపోయునా అడ్డదారుల్లో ఉత్పత్తిని కొనసాగిస్తున్నాయి. వీటన్నిటిలో రసాయనిక చర్యలు జరపడానిక  ఎన్నో రియాక్టర్లు ఉన్నాయి. వీటిని తనిఖీ చేసే వాళ్ళు లేరు. ఇకనైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మేల్కొవాలి. రసాయనిక ఫ్యాక్టరీలను పట్టణాలకు దూరంగా తరలించాలి.  ప్రభుత్వాలు ప్రజలను పర్యావరణ కాలుష్యం నుండి, పారిశ్రామిక ప్రమాదాల నుండి  కాపాడాలి. డాలర్ల కన్నా గాలిలోని ఆక్సిజన్ విలువైనదని గుర్తించాలి. 

- గుడిమెళ్ల రఘురాం

Comments

  1. నాయకులు బతుకుతున్నదే పేదల ప్రాణాలని, భవిష్యత్తుని అమ్ముకుంటూ, కొనుక్కుంటూ. మనందరికన్నా వారికి బాగా తెలిసిన ప్రజల నైజం.... Public memory is short. ఇలాంటి అన్యాయాన్ని చూసి భరించలేని వారి ఆక్రోషం, అరుపులూ తమని ఏమీ చెయ్యవనీ, చెయ్యలేవని వారి ధీమా! కానీ రాజుకుంటున్న శ్రమజీవుల ఆక్రందన ఎలా పెల్లుబికి ముంచెత్తుతుందో యీ దోపిడీదారులు అంచనా వెయ్యలేరు.

    ReplyDelete

Post a Comment