టీపీఎఫ్ వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు జి. ప్రవీణ్ కుమార్ ను మళ్లీ ఈరోజు అరెస్ట్ చేసిన పోలీసులు.
వెంటనే విడుదల చేయాలని పౌర హక్కుల సంఘం తెలంగాణ డిమాండ్.
కరీంనగర్ జైలు నుండి నిన్న 10,జూన్,2020 విడుదలై రాత్రి 9 గంటలకు వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం మాణిక్యపూర్ గ్రామం లోని తన నివాసానికి చేరుకున్న టీపీఎఫ్ జిల్లా అధ్యక్షుడు జి.ప్రవీణ్ కుమార్ ను 10 గంటలు గడవకముందే మళ్లీ ఈ రోజు11 జూన్,2020 న అరెస్టు చేయడాన్ని పౌర హక్కుల సంఘం తెలంగాణ కమిటీ ఖండిస్తోంది. ఎందుకు అరెస్టు చేస్తున్నారో, ఎక్కడికి తీసుకెళ్తున్నారు, అరెస్ట్ మెమో ఇవ్వడం... లాంటి చట్టపరమైన పద్ధతులు ఏమీ పాటించకుండా మఫ్టీ లో ఉన్న పోలీసులు ఇంటిపై ఉదయమే 6 గంటలకు దాడి చేసి తీసుకెళ్లారు. దీనితో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తర్వాత వాకబు చేస్తే చర్ల పోలీసులని, పాత కేసులో అరెస్టు చేశామని చెబుతున్నారు.
ప్రశ్నించే గొంతులను అణిచివేయడంలో భాగంగా ప్రజాసంఘాల కార్యకర్తలను ఇదే పద్ధతిలో అరెస్ట్ చేసి, అక్రమ కేసులు బనాయించడం తెలంగాణ రాష్ట్రంలో ఆనవాయితీగా మారింది. ఈనెల జూన్ 6న సరిగ్గా ఇదేవిధంగా అక్రమంగా ప్రవీణ్ కుమార్, శేఖర్ మరియు ఇంద్రసేనలను అరెస్ట్ చేశారు.ఒక రోజు హుస్నాబాద్ పోలీసుస్టేషన్, రెండు రోజులు కరీంనగర్ జైల్లో నిర్బంధించబడ్డ ప్రవీణ్ కుమార్, శేఖర్ మరియు ఇంద్రసేన లు నిన్ననే బెయిలుపై విడుదల అయ్యారు. తిరిగి ఈరోజు ప్రభుత్వం...మళ్ళీ ఏదో నెపం మోపి జైల్లో కొంతకాలము ఉండేట్లు చేసే కుట్ర లో భాగంగానే ఈ అరెస్టు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో రాజీలేని పాత్ర పోషించిన తెలంగాణ ప్రజా ఫ్రంట్ కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయిస్తూ, కనీస ప్రజాస్వామ్య, రాజ్యాంగబద్ధ హక్కులను హరిస్తున్నది ఈ ప్రభుత్వం.
ప్రవీణ్ కుమార్ ఆచూకీ వెంటనే తెలపాలని, అక్రమ కేసులు మోపే ఆలోచనను విరమించుకొని, తక్షణమే విడుదల చేయాలని పౌర హక్కుల సంఘం తెలంగాణ డిమాండ్ చేస్తున్నది.
1.ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ ,అధ్యక్షులు పౌరహక్కుల సంఘం,తెలంగాణ
2.ఎన్. నారాయణ రావు, ప్రధాన కార్యదర్శి పౌరహక్కుల సంఘం,తెలంగాణ
సాయంత్రం 4:00గంటలు,11-6-2020
హైదరాబాద్..
Comments
Post a Comment